(చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం)
భారతీయ సంస్కృతిని, ఆలోచనా దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి చాటిన ఆచార్యుడు, భారత రాష్ట్రపతి గా ఆ పదవికి తావి అద్దిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి మద్రాసులో విడిది చేశారు. చిత్తూరు.వి. నాగయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్ళారు. రాష్ట్రపతి ఎదురేగి నాగయ్యకు స్వాగతం పలికారు. కుశలప్రశ్నలు అవుతుండగా, ఒక రాజకీయ నాయకుడు వచ్చి రాధాకృష్ణన్ కు పాదాభివందనం చేశాడు. రాష్ట్రపతి అతణ్ణి వారిస్తూ “నాకాళ్ళమీద పడితే నీకేం పుణ్యమొస్తుంది! ఇక్కడ ఎదురుగా పూజ్యులు నాగయ్య గారున్నారు. వారి కాళ్ళు తాకండి… ఏదైనా పుణ్యమొస్తుంది” అన్నారు. మరొక సంఘటన… తిరుమల దేవస్థానం ప్రభుత్వ పరిధిలోకి రానప్పుడు ఆలయ ధర్మాధికారిగా వున్న మహంతు నాగయ్యకు రత్నకంబళి పరచి ఆలయంలోనికి ఆహ్వానించారు. తిరువాన్కూరు మహారాజు నాగయ్యకు కనకాభిషేకం చేశారు. మైసూరు మహారాజు నాగయ్యకు బంగారు పళ్ళెంలో కాళ్ళు కడిగి కనకాభిషేకం చేసి, ఏనుగు అంబారీ మీద ఊరేగించారు. ఆయన నటించిన ‘యోగి వేమన’, ‘భక్త పోతన’ సినిమాలను చూసి పశువులను కాసే ఒక బాలుడు ‘బాలయోగి’గా మారి సమాధిలోకి వెళ్ళారు. 1948లో జెమిని అధిపతి ఎస్.ఎస్. వాసన్ పాండురంగని భక్తుడు గోరా కుంభర్ జీవిత చరిత్రను ‘చక్రధారి’ పేరుతో తమిళం లో నిర్మిస్తే, నాగయ్య ఆ పాత్రలో జీవించి నటించారు. బాక్సాఫిస్ హిట్టయిన ఆ సినిమాలో నటించినందుకు ఆరోజుల్లోనే వాసన్ నాగయ్యకు అందించిన పారితోషికం లక్ష రూపాయలు! “ఈ మహానుభావుడు భగవంతుడు తనకు ప్రసాదించిన సంగీత జ్ఞానాన్ని ఆరాధించి సాధన చేసివుంటే త్యాగయ్య తరువాత నాగయ్య తెలుగువారికి వరప్రసాదంగా నిలిచిపోయేవారు” అని ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి నాగయ్యను కీర్తించడం సముచితమనిపించక మానదు. దక్షినాది చిత్రరంగంలో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న తొలి నటుడు నాగయ్య. ఆ ప్రదానం స్వీకరిస్తూ “పరిశ్రమలో నేను వయసులో పెద్దవాణ్ణి కాబట్టి నాకు ఈ పురస్కారం ఇచ్చారు. కానీ ఈపురస్కారం మన చిత్రసీమలో పనిచేస్తున్న కళాకారులలందరికీ చెందుతుంది” అనటం నాగయ్య సంస్కారానికి అద్దం పడుతుంది. అతంటి మహనీయులు చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు…
నాగయ్య బాల్యం, తొలిరోజులు…
ఉప్పలదడియం నాగయ్య మార్చి 28, 1907న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి రామలింగేశ్వర శర్మ అక్కడ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తల్లి వెంకట లక్ష్మాంబ. నాగయ్య పుట్టకముందు వారి తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారు. నాగదోషం వుందని జ్యోతిష్యులు చెప్పగా ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్లి నాగప్రతిష్ట చేసి పూజలు నిర్వహించారు. ఆ తరవాత పుట్టిన నాగయ్యకు ‘నాగేశ్వరం’ అని పేరు పెట్టుకున్నారు. సంవత్సరంలోపే నాగయ్యకు శునకగండం, సర్పగండం తప్పింది. అప్పట్లో చిత్తూరు వద్దగల గోగునూరు గ్రామంలో నాగయ్య గారి పూర్వీకులకు మంచి భూవసతి వుండేది. కానీ తండ్రి ఎదిగి వచ్చేనాటికి ఆస్తులు కరిగిపోయాయి. తండ్రి పదవీవిరమణ చేశాక నాగయ్య కుటుంబం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది. నాగయ్య ప్రాధమిక విద్యాభ్యాసం కుప్పంలోని జమీందారు గారి పాఠశాలలో సాగింది. తరవాత వారి కుటుంబం చిత్తూరుకు మకాం మార్చింది. అక్కడ తండ్రి సంగీత పాఠాలు చెప్పేవారు. ఆయన వయోలిన్ విద్వాంసులు కూడా. హైస్కూలులో చదువుకుంటున్నప్పుడే తండ్రి శిక్షణలో నాగయ్య సంగీత పాఠాలు నేర్చుకున్నారు. స్కూలులో ప్రదర్శించే నాటకాలలో ప్రహ్లాదుడుగా, శ్రీకృష్ణుడుగా వేషాలు వేసేవారు. ఒకసారి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తిరుచ్చి గోవిందరాజస్వామి పిళ్ళై సంగీత కచేరి జరిగింది. కచేరి చివరన నాగయ్య యధాలాపంగా కీర్తన పాడుతూ వుంటే, పిళ్ళై దగ్గరకు పిలిచి తను వయోలిన్ వాయిస్తూ నాగయ్య చేత మైకులో కీర్తన పాడించారు. నాగయ్య ఈ సంఘటనను ఎప్పుడూ గుర్తుచేసేవారు. తండ్రి నాగయ్యను వకీలు చేయాలని అభిలషిస్తే, తను మాత్రం సంగీతానికి, నటనకు అంకితమవ్వాలని కలలుకనేవారు. 1926లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తన పందొమ్మిదవ యేట ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాగయ్యకు పెళ్లయింది. ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నాగయ్య చిత్తూరు వచ్చి కలక్టరేటులో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. అక్కడే ‘శ్రీరామవిలాస సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, ఆనాటకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని బీద విద్యార్ధులకు సహాయం చేసేవారు. జిల్లాబోర్డు అధ్యక్షుడే నాగయ్య స్థాపించిన నాటక సమాజానికి ప్రెసిడెంటుగా ఉండడంతో నాగయ్యను బోర్డు కార్యాలయంలో ఉద్యోగంలో నియమించారు. ‘రామదాసు’ నాటకంలో నాగయ్య కబీరు పాత్ర పోషిస్తూ ఆలపించే శ్రావ్యమైన పాటలకు ప్రేక్షకులు ‘ఒన్సుమోర్లు’ కొట్టేవారు. అప్పుడే నాగయ్య గారి సంసారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అతని భార్య ఒక బిడ్డను ప్రసవించి మరణించింది. కొన్నాళ్ళకు ఆ పాప కూడా కాలం చేసింది. కొన్నాళ్ళ తరవాత తన నాటకాలు చూసి ప్రభావితులైన కుటుంబంలోని అమ్మాయిని నాగయ్య ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె వీణాపాణి, సంగీతప్రవీణ, తులసీ రామాయణంలోని కీర్తనలు శ్రావ్యంగా పాడేది. సంస్కృత పాండిత్యం ఆమెకు అదనపు ప్రయోజనకారిగా వుండేది. నాగయ్య గారికి కూడా ఆమె కీర్తనలు నేర్పేది. సంగీత కచేరీలలో నాగయ్య తండ్రి ఫిడేలు వాయిస్తే, భార్య వీణ వాయించేది. నాగయ్య గాత్రంతో ఆ కచేరీకి నిండుదనం చేకూరేది. జిల్లాబోర్డులో వుద్యోగం చేస్తూనే నాగయ్య హెచ్.ఎం.వి రికార్డింగ్ కంపెనీలో గాయకుడిగా పనిస్తుండేవారు. అప్పట్లో ఈ రికార్డింగు కంపెనీ బెంగుళూరులో వుండేది. రికార్డింగుకు వెళ్ళవలసివచ్చినప్పుడు నాగయ్య భార్యను వెంటపెట్టుకొని వెళ్ళేవారు. ఆంధ్రపత్రికకు స్థానిక విలేకరిగా కూడా ఆయన వ్యవహరించేవారు. ఇలావుండగా విధి మరొకసారి నాగయ్యను వంచించింది. వీరి సంసారం ఆనందంగా నడుస్తూవుండగా భార్య మరణించింది. నాగయ్యను సమాజం అదృష్టహీనుడిగా ముద్రవేసింది. మరికొద్ది రోజుల్లోనే … అంటే 1936లో తండ్రి కూడా చనిపోయారు. దాంతో నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. విషాదగ్రస్తుడై తిరుమలకు వెళ్ళారు. అక్కడ తన వూరివాళ్ళు తారసపడడంతో వారితో ఏమీచెప్పుకోలేక వ్యాకులత చెందారు. అంచెలంచలుగా తిరువణ్ణామలై చేరుకొని రమణ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. నాగయ్య స్నేహితులు ఆయన అన్వేషణలో పడ్డారు. ఈలోపు డ్రామా రికార్డింగ్ కోసం హెచ్.ఎం.వి కంపెనీ ప్రాధాన ప్రతినిధి గిరిధరిలాల్ నాగయ్య కోసం చిత్తూరు వచ్చారు. నాగయ్యకు సంభవించిన విపత్తు తెలుసుకొని విచారించాడు. బెంగుళూరు తిరిగి వెళుతూ రమణమహర్షి ఆశ్రమంలో దర్శనంకోసం ఆగాడు. అక్కడ నాగయ్యను చూసి బోరుమన్నాడు. అతనిని సముదాయించాడు. మహర్షి ఆజ్ఞతీసుకొని గిరిధరిలాల్ తో కలిసి నాగయ్య మద్రాసు చేరుకున్నారు.
నీడలా వెంటాడిన కష్టాలు…
గిరిధరిలాల్ నాగయ్యకు జార్జి టవున్ లో వున్న సర్దార్ భవన్ లో ఒక అద్దెగది ఇప్పించి, బట్టలు కుట్టించి ఖర్చుకు డబ్బులిచ్చి బెంగుళూరు వెళ్లివస్తానని సెలవుతీసుకున్నాడు. ఆంధ్రపత్రిక కార్యాలయంలో పనిచేసే మల్లెల శివరామకృష్ణతో అంతకుముందు నాగయ్యకు పరిచయంవుంది. ఒకరోజు ఆయన తారసపడి నాగయ్యను ఆంధ్రపత్రిక సంస్థాపకుడు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారికి పరిచయం చేశారు. అంతకుముందు చిత్తూరులో ప్రదర్శించిన నాటకానికి నాగేశ్వరరావు పంతులు హాజరై వేదికమీద నాగయ్యకు బహుమానం అందజేసిన సంఘటనను నాగయ్య గుర్తు చేశారు. పంతులుగారు వెంటనే ఐదువందల రూపాయలు తీసి నాగయ్య చేతిలో పెడుతూ, గుడివాడలో ‘రామదాసు’ నాటక ప్రదర్శన యేర్పాటు చేయమని కోరారు. ఈలోగా హెచ్.ఎం.వి కంపెనీ ప్రధాన కార్యాలయం మద్రాసు నగరానికి మారింది. గిరిధరిలాల్ డ్రామా రికార్డింగ్ మద్రాసు లోనే పూర్తి చేయించారు. ఒకసారి చిత్తూరు వెళితే తండ్రి చేసిన బీమా తాలూకు డబ్బు పదిహేను వేలు నాగయ్యకు అందింది. ఆ డబ్బుతో సినిమా తీయాలనే సంకల్పంలో వుండగా, తన గది ప్రక్కన ఉంటున్న రంగస్వామి మొదలియార్ నాగయ్య బలహీనతను స్వప్రయోజనానికి వాడుకున్నాడు. సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటానని చెప్పి నాగయ్య వద్ద వున్న డబ్బుతో ‘నరనారాయణ’ అనే సినిమా తీద్దామని, తను సిలోన్ నుంచి తీసుకొచ్చిన డబ్బంతా కోర్టు కర్చులకు అయిపోయిందని నమ్మించి, నాగయ్య చేత పదివేలు కర్చు పెట్టించాడు. మిగిలిన ఐదు వేలు తీసుకొని రంగూన్ లో తనకు వ్యాపారముందని నమ్మించి, పెట్టుబడి తీసుకొనివస్తానని ఉడాయించాడు.
జాతకం మార్చిన చెన్నపట్నం …
ఒకసారి నాగయ్యకు పానగల్ పార్కులో బి.ఎన్. రెడ్డి తారసపడ్డారు. నాగయ్యకు బి.ఎన్ బాల్యస్నేహితుడు. బి.ఎన్. రెడ్డి నాగయ్య ను హెచ్.ఎం. రెడ్డి కి పరిచయం చేసి అతని నేపథ్యం వివరించారు. నాగయ్య కంఠం విని హెచ్. ఎం. రెడ్డి ముగ్దుడయ్యారు. ఆప్పుడే హెచ్.ఎం. రెడ్డి, బి.ఎన్. రెడ్డి, రామనాథ్, శేఖర్, కన్నాంబ, పారుపల్లి శేషయ్య కలిసి ‘రోహిణి పిక్చర్స్’ అనే సంస్థను ప్రారంభించారు. తొలిప్రయత్నంగా ‘గృహలక్ష్మి’ సినిమా తీయాలనుకున్నప్పుడు బి.ఎన్. రెడ్డి అందులో ప్రధానమైన గోపీనాథ్ పాత్రను నాగయ్యకు ఇప్పించారు. బి.ఎన్ రెడ్డి, రామనాథ్ లు నాగయ్యకు సినిమా నటనలో మెళకువలు నేర్పారు. ఈ చిత్రం 12-03-1938 న విడుదలై విజయవంతమైంది. నాగయ్యకు రూ. 750 పారితోషికం లభించింది. రోహిణీ నుండి బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి తదితరులంతా విడిపోయి ‘వాహినీ’ సంస్థను నెలకొల్పారు. తాడిపత్రికి చెందిన మూలా నారాయణస్వామి, బి.ఎన్ సోదరుడు బి. నాగిరెడ్డి, సముద్రాల, శేఖర్, రామనాథ్, బి.ఎం. దాసు వాహిని సంస్థకు మూలస్తంబాలుగా నిలిచారు. వాహినీ బ్యానర్ మీద తొలిప్రయత్నంగా ‘వందేమాతరం’ (1939) చిత్రాన్ని నిర్మిస్తూ అందులో హీరోగా నాగయ్యను తీసుకున్నారు. కాంచనమాల హీరోయిన్ గా నటించింది. నాగయ్య సంగీతదర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. ‘వందేమాతరం’ సినిమా దిగ్విజయంగా ఆడింది. నాగయ్యకు మంచిపేరొచ్చింది. తరవాత నాగయ్య నటించిన చిత్రం వాహినీ వారి ‘సుమంగళి’. అందులో నాగయ్య సంఘసంస్కర్తగా ఒక ముసలిపాత్రలో నటించారు. సినిమా గొప్పగా ఆడకపోయినా నాగయ్య నటనకు అందరూ జేజేలు పలికారు. ఫిలిం ఇండియా పత్రికాధిపతి బాబురావు పటేల్ ‘సుమంగళి’ సినిమా మీద సమీక్షరాస్తూ నాగయ్యను ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు పాల్ మునితో పోలుస్తూ ‘పాల్ ముని ఆఫ్ ఇండియా’ గా కీర్తించాడు. బాబురావు పటేల్ సామాన్యంగా ఎవరినీ ప్రశంసించరు. అటువంటిది నాగయ్యను సైగల్ తో పోలుస్తూ తన పత్రికలోరాస్తే, ఒక పాఠకుడు “నాగయ్యకు సైగల్ కు తేడా లేదా” అని ప్రశ్నించాడు. దానికి బాబురావు పటేల్ “ఉంది. సైగల్ పాటలో మెలోడీ వుంది. నాగయ్య పాటలో మనోద్వేగంతో కూడిన మెలోడీ వుంది” అని జవాబిచ్చారు. త్యాగరాయ భాగవతార్ తన తమిళ చిత్రం ‘అశోక్ కుమార్’ లో నాగయ్యకు హీరో వేషం ఇచ్చారు. ఆ చిత్రం రజతోత్సవం చేసుకుంది. తరవాత మరో తమిళ చిత్రం ‘విశ్వమోహిని’ లో కూడా నాగయ్య నటించారు. వాహినీ వారు నిర్మించిన ‘దేవత’ (1941) చిత్రంలో కాస్త నెగటివ్ షేడ్ వున్న హీరోపాత్రను నాగయ్య పోషించారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు పుత్తూరు నుంచి కృష్ణస్వామినాయుడు అనే అటవీ అధికారి భార్య, ఇద్దరు కుమార్తెలను నాగయ్య వద్దకు తీసుకొచ్చారు. పెద్దమ్మాయి జయలక్ష్మి, రెండవ అమ్మాయి కమలాదేవి. ఆమె శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. ఓడియన్ గ్రామఫోను రికార్డింగు కంపెనీలో పాడేందుకు వచ్చింది. ఆమే తరవాతిరోజుల్లో ప్రఖ్యాత గాయనిగా, నటిగా రాణించిన టి.జి. కమలాదేవి. పెద్దమ్మాయిని నర్సు ట్రైనింగ్ లో చేర్చాలని కృష్ణస్వామినాయుడు కోరిక. నాగయ్య జయలక్ష్మిని అడయార్ లో వున్న అవ్వై నర్సింగ్ స్కూలులో చేర్చారు. ఆమెకు చదువు మీద శ్రద్ధ లేదు. అనుకోని సంఘటన దృష్ట్యా నాగయ్య జయలక్ష్మిని వడపళని దేవాలయంలో వివాహం చేసుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘దేవత’ సినిమా విజయవంతమై రజతోత్సవం జరుపుకుంది. కె.వి. రెడ్డి దర్శకత్వంలో వాహినీ సంస్థ ‘భక్తపోతన’(1943)చిత్రాన్ని నిర్మించారు. అందులో పోతన పాత్రకోసం నాగయ్య గుండు గీయించుకోవలసివచ్చింది. సంగీత దర్శకత్వం కూడా నాగయ్యే నిర్వహించారు. అయితే అదేసమయంలో నాగయ్య ‘రేణుకా పిక్చర్స్ ’అనే సొంత నిర్మాణ సంస్థ నెలకొల్పి ‘భాగ్యలక్ష్మి’ (1943) చిత్రాన్ని మొదలుపెట్టారు. పోతన కోసం గుండు చేయించుకోవడంతో ‘భాగ్యలక్ష్మి’ లో విగ్గుతో నటించారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో వుండగా మద్రాసుమీద రెండవ ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జపాన్ దేశం మద్రాసు నగరం మీద బాంబుల వర్షం కురిపించబోతుందని వార్తలు రావడంతో వాహినీ వాళ్ళు తాడిపత్రికి, నాగయ్య తిరుపతికి వెళ్ళిపోయారు. ‘భాగ్యలక్ష్మి’ చిత్రం అక్కడే పూర్తిచేశారు. ‘భక్త పోతన’ చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కోయంబత్తూరులో ఈ చిత్రం స్వర్ణోత్సవం జరుపుకుంది. పోతన పాత్రకోసమే నాగయ్య పుట్టారని పత్రికలు ప్రశంసించాయి. నాగయ్యకు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. తరవాత తమిళ సినిమా ‘మీరా’ లో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కి భర్తగా నాగయ్య నటించారు.
త్యాగయ్యగా…
పూర్ణా పిక్చర్స్ అధినేత మంగరాజు ప్రోద్బలంతో నాగయ్య రేణుకా పిక్చర్స్ పతాకం మీద ‘త్యాగయ్య’ (1946) సినిమా నిర్మించారు. అందుకోసం నాగయ్య తిర్తువయ్యూర్ వెళ్లి త్యాగయ్య సమాధి వద్ద కూర్చొని కథకు రూపమిచ్చారు. ఆ కథకు సముద్రాల, ముదిగొండ లింగమూర్తి తో కూర్చొని నాగయ్య స్క్రీన్ ప్లే తయారు చేశారు. రేణుకా ఆఫీసులో కూర్చొని మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు, అరియకుడి రామానుజ అయ్యంగార్, మణి అయ్యర్ వంటి నిష్ణాతుల సూచనలను తీసుకుంటూ ‘త్యాగయ్య’ సినిమాకు పాటలు స్వరపరచి సంగీత దర్శకత్వం తనే నిర్వహించారు. కథ, స్క్రీన్ ప్లే మీద బాగా అవగాహన ఉండడంతో దర్శకత్వ బాధ్యతలు కూడా నాగయ్యే నిర్వహించారు. అరయకుడి రామానుజ అయ్యంగార్ వంటి నిష్ణాతుల సూచన మేరకు త్యాగయ్య చిత్రాన్ని నిర్మిస్తున్న కాలంలోనే ‘త్యాగరాయ గానసభ’ పేరుతో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ సభలు జరిపేందుకు ప్రత్యేక మందిరం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనరాగా నాటి మద్రాసు కార్పోరేషన్ కమీషనరు ఓ. పుల్లారెడ్డి, ICS గారి సహకారంతో జి. ఎన్. చెట్టి వీధిలో సభాస్థలి నిర్మాణం చేపట్టారు. త్యాగయ్య చిత్రం తోబాటు ఆ సభాస్థలి నిర్మాణం కూడా పూర్తయింది. దానికి ‘నాగయ్య’ పేరు పెట్టమంటే ఆయన వారించి ‘వాణీ మహల్’ అని నామకరణం చేసి సర్ సి.పి. రామస్వామి అయ్యంగార్ చేతులమీదుగా ప్రారంభోత్సవం కావించారు. త్యాగయ్య చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. విజయా నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి ‘త్యాగయ్య’ ప్రత్యేక సంచికను ప్రచురించారు. ఈచిత్రం ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మైసూరు రాష్ట్రాలన్నిటిలోనూ విజయవంతంగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. బెంగుళూరులో రజతోత్సవం జరిగింది. త్యాగయ్య జన్మస్థలం తిరువయ్యూరు లో నాగయ్య సంగీత పాఠశాల నిర్మాణానికి పూనుకొని దానిని పూర్తి చేశారు. ఆ పాఠశాల ఇప్పుడు అద్భుతంగా నడుస్తోంది. పూర్ణా మంగరాజు నాగయ్యను ‘శంకరాచార్య’ చిత్రాన్ని తీయమని సలహా ఇచ్చారు కానీ ఎందుకో అది సాధ్యపడలేదు. తరవాత నాగయ్య ద్వారం వెంకటస్వామి నాయుడు మీద 500 అడుగుల డాక్యుమెంటరీ నిర్మించారు. కాలిఫోర్నియా నుంచి ఆ చిత్రానికి ప్రతిపాదన రాగా ప్రింట్లను అక్కడకు పంపించారు. తరవాత బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వాహినీ సంస్థ ‘స్వర్గసీమ’ (1946) చిత్రం నిర్మించింది. చక్రపాణి అల్లిన కథకు సముద్రాల మాటలు సమకూర్చారు. నాగయ్య హీరోగా నటించడమే కాకుండా ఓగిరాల రామచంద్రరావు సహకారంతో సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఇందులో జయమ్మ హీరోయిన్ పాత్ర పోషించగా భానుమతి వ్యాంప్ పాత్రలో రాణించింది. ఈ చిత్రం తొలిసారి వియత్నాం ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది. భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా ‘స్వర్గసీమ’. చక్రపాణిని సినీ రచయితగా, ఘంటసాలను నేపథ్యగాయకుడుగా పరిచయం చేసిన సినిమాకూడా ఇదే.
వేమన యోగిపాత్రలో జీవించి…
‘స్వర్గసీమ’ చిత్రం తరవాత కె.వి. రెడ్డి వేమన చరిత్ర సినిమాగా తీయాలని ఆలోచించారు. పోతన పాత్ర నిర్వహణకు అపూర్వ ఖ్యాతినార్జించిన నాగయ్య చేత వేమన పాత్ర చేయిస్తే అద్భుతంగా ఉంటుందని కె.వి. రెడ్డి ఆలోచన. అయితే పోతనకి చరిత్ర లేనట్టే వేమనకీ లేదు. నీతులతో శతకం రాసిన వేమన గురించి కొంతమాత్రమే తెలుసు. అతడు తొలుత భోగలాలసుడు. వేశ్యా సంపర్కుడై తిరుగుతూ ఉంటాడు. వేశ్య బంగారం కోరుకున్నదని మిత్రుడు అభిరాముని సాయంతో బంగారం చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. తరవాత యోగిగా మారతాడు. తెలిసిన కథ ఇంతే. అంతటి భోగిగా వున్నవాడు యోగిగా యెలా మారాడు? అనే ప్రశ్నకు ఆధారాలు దొరకలేదు. కె.వి. రెడ్డి బాగా ఆలోచించి పాత్రలు సృష్టించి సినిమా కథను రూపొందించారు. అన్నగారు దివాణం పాలకుడు. అతనికి ఒక జ్యోతి అనే కూతురు వుంటుంది. జ్యోతికి చిన్నాన్న అంటే ప్రేమ. వేమనకు కూడా జ్యోతి అంటే వల్లమాలిన అనురాగం. ఆ అమ్మాయి మరణిస్తుంది. జ్యోతి మరణంతో వేమనకు కనువిప్పు కలుగుతుంది. పరమ నాస్తికుడైన వేమన యోగసిద్ధి సాధించి ఆస్తికుడౌతాడు. నీతులు బోధిస్తూ సన్మార్గం సూచిస్తూ చివరకు యోగసమాదిలోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమాకి కె.వి. రెడ్డి, నాగయ్య, సముద్రాల ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 ఏప్రిల్ 1947 న ‘యోగి వేమన’ చిత్రం విడుదలైంది. సముద్రాల సంభాషణలు, నాగయ్య నటన, కె.వి. రెడ్డి అద్భుత దర్శకత్వం చిత్రానికి వన్నెతెచ్చి విజయాన్ని సాధించి పెట్టాయి. సినిమా క్లాసిక్ గా అత్యున్నత స్థాయిని అందుకుంది. ఉదాహరణకు, వేమన దర్శనం కలిగితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు ఎన్నో ఫలాలు, తినుబండారాలు తెస్తారు. వేమన వాటిని తృణీకరిస్తూ నడుస్తూ వుంటే అతని పాదాలు మాత్రం కనిపిస్తాయి. పాదాల ప్రక్కన తినుబండారాలు, ఫలాలు కనిపిస్తాయి. వేమన నడుచుకుంటూ గుడి గుమ్మం ముందు కూర్చున్న ఒక బిచ్చగత్తె వద్దకు వెళ్లి కూర్చొని “నాకూ ఒక కబళం పెడతావా అమ్మా” అని చేయి చాస్తాడు. భిచ్చగత్తె ఆశ్చర్యపోతూ అతని చేతిలో ఒక ముద్ద పెడుతుంది. హృదయాన్ని కదిలిచే ఇలాంటి సన్నివేశాలు కె.వి. రెడ్డి ఇందులో ఎన్నో చొప్పించారు. ఇందులో వేశ్య పాత్రను తమిళనటి ఎం.వి. రాజమ్మ పోషించింది. ఆమె గుడిలో నాట్యం చేస్తున్నప్పుడు నట్టువాంగం పాడుతూ ఘంటసాల కనిపిస్తారు. చివర్లో వేమన గుహలోకి నిష్క్రమించే సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ కె.వి. రెడ్డి కళ్ళు చేమర్చి ‘కట్’ చెప్పకుండా ఉండిపోయారట. సన్నివేశ చిత్రీకరణ జరుపుతున్న టెక్నీషియన్లు అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. ‘యోగి వేమన’ చిత్రంతో వాహినీ సంస్థ ప్రతిష్ట పెరిగింది. దర్శకుడిగా కె.వి. రెడ్డికి అఖండఖ్యాతి లభించింది. ఈ చిత్రం చూశాక ముమ్మడివరంలో ఒక బాలుడు యోగిగా మారి ‘బాలయోగి’ గా ప్రసిద్ధి చెందారు. తరవాత జెమిని వాసన్ ‘చక్రధారి’ సినిమాలో నాగయ్యను బుక్ చేశారు. ఆ చిత్రం తమిళ, కన్నడ,తెలుగు, మలయాళీ భాషల్లో అఖండ విజయం సాధించింది.
కలసిరాని కాలం…|
స్వంతంగా నాగయ్య దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘నాయిల్లు’ (1953) సినిమా బాగనే ఆడినా అతని భాగస్వామి మోసం చేసి నాగయ్యకు పైసా దక్కనివ్వలేదు. నైజాం నవాబు ప్రమేయంతో ‘రామదాసు’ చిత్రానికి కావలసిన కథ, స్క్రిప్టు తయారు చేసుకున్న తరవాత హైదరాబాదులో పోలీసు యాక్షన్ రావడంతో నాగయ్య ఆ సినిమాను సొంతగా తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1959లో ఆరంభించిన రామదాసు చిత్రం 1964లో కానీ విడుదలకు నోచుకోలేదు. సినిమా బాగా ఆడి శతదినోత్సవాలు చేసుకుంది. అవార్డులు తెచ్చుకుంది. కానీ పంపిణీ దారుల చేతివాటం వలన నాగయ్యకు అందులో చిల్లిగవ్వ రాలేదు. ‘త్యాగయ్య’ సినిమా తరవాత నాగయ్య కోడంబాకంలో 52 ఎకరాల పెద్ద తోట కొన్నారు. అందులో కొబ్బరి, మామిడి చెట్లుండేవి. ఫలసాయం బాగా వస్తుండేది. స్నేహితుల ప్రోద్బలంతో నాగయ్య అక్కడ స్టూడియో కట్టాలనుకున్నారు. చాలా డబ్బు వెచ్చించి పనులు ప్రారంభించి, స్టూడియోకి అవసరమైన పరికరాల కోసం అడ్వాన్సు చెల్లించారు. భాగస్వామిగా ఉంటానన్న ఓ జమీందారు తప్పుకోవడంతో నాగయ్య నష్టపోయారు. అడ్వాన్సు డబ్బు తిరిగిరాలేదు. తరవాత ఇబ్బందుల్లో వున్న ఓ స్నేహితునికి సాయపపడేందుకు ఆ తోటను తనఖా పెట్టారు. అతడు డబ్బు చెల్లించక పోవడంతో తోట వేలంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో ముఖ్యపాత్రలకు ప్రాణంపోసిన నాగయ్య చిన్నచిన్న వేషాల కోసం నిర్మాతలను అడుక్కోవలసిన స్థితి దాపురించింది. చివరికి అతిథి పాత్రలకు కూడా నాగయ్య సిద్ధపడ్డారు. ఆయన 330 చిత్రాలకు పైగా నటించారు. 1965లో భారత ప్రభుత్వం నాగయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాగయ్య అంత్యదశ చాలా విషాదంగా గడిచింది. 1973 డిసెంబరు 30 న నాగయ్య కాలంచేసే నాటికి ఆయనవద్ద చిల్లిగవ్వ కూడాలేదు. అతిగా స్నేహితుల్ని నమ్మి, అపాత్రదానాలు చేస్తే ఏమవుతుందో అని దానికి నాగయ్య జీవితం ఓ చక్కని ఉదాహరణ.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
నాగయ్య గారి గురించి చాలా విషయాలు చెప్పారు… ధన్యవాదాలు