ట్రిక్కులు చేస్తూ నవ్విస్తూ చిన్నారుల్లో కిక్ ఎక్కించే బాల సాహిత్య వైతాళిక..
“మేజిక్ చాప్లిన్” చొక్కాపు వెంకట రమణ.
కక్క ముక్క కుక్క… ఇలా ఆయన చెప్పే కథ చిన్నారులకే కాదు. పెద్దలు కూడా ఆసక్తికరంగా వింటారు. మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. ఆయన స్టోరీ టెల్లింగ్ లో కింగ్. మేజిక్ చేయడంలో మేటి! ఆయనకు ఆయనే సాటి! అయన మరెవరో కాదు క్రియేటివిటీ స్టార్…బాల సాహిత్య వైతాళిక…వెంకట రమణ చొక్కాపు! ఈనెల 26వ తేదీ వారి వివాహ 50వ గోల్డెన్ జూబ్లీ వేడుక హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో వైభవంగా జరగబోతోంది. మహామహులు, సాహితీవేత్తలు, కళాకారులు ప్రముఖులు పాల్గొంటున్నారు.
మేజిక్ చాప్లిన్ : చొక్కాపు వెంకట రమణ గారు ఏం చేసినా సరే, సృజనాత్మకత ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఆయనకు మాత్రమే సొంతమైన గొప్ప టాలెంట్! ఆయన ప్రదర్శించాక “ఓహో ఇలా కూడా చేయవచ్చా” అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతిదీ ఆయన కొత్తగా చూస్తారు, చూపిస్తారు. ఆయన భూమికి తక్కువ దూరంలో ఉండటం ఆయన అదృష్టం. అందుకే ఆయన నిత్య విద్యార్థి అయ్యారు. నిత్య కళాకారుడు. నిత్య సాహసికుడు! నిత్యం నవ్వులు పూయిస్తూనే చిన్నారుల్లో యమ కిక్ ఎక్కిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన మేజిక్ చాప్లిన్ గా గుర్తింపు పొందారు. మరెవ్వరికి దక్కని గుర్తింపు ఇది! బాలల సాహిత్యంలో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఆయన్ని కలసినప్పుడల్లా కొత్త విషయాలు చెబుతుంటారు. చాలా ఆసక్తికరంగా చెబుతారు. దాదాపు 30 ఏళ్ళ పరిచయం. బెజవాడ మ్యూజియం రోడ్డు పిట్టగోడఫై కూర్చుని షాడో నవలలు చదివిన నాటి రోజులు గుర్తు చేస్తారు. ఆయన బాల చంద్రిక ఎడిటర్ గా పనిచేశారు. చెకుముకి, చెలిమి పత్రికలకు సేవలు అందించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాలల కోసం అనేక రకాల “విన్యాసాలు” చేశారు. ఊయల పత్రిక నడిపించారు. నేను ఆంధ్రజ్యోతిలో వున్నప్పుడు ఆయనతో కిడ్స్ కార్నర్ కాలమ్ రాయించాను చాలా ఏళ్ళు. పిల్లలకు ఈజీ మేజిక్ క్లాసులు చెప్పించాను.
ఆయన మేజిక్ చేస్తారు. మైమ్ చేస్తారు. మిమిక్రీ చేస్తారు. యువ కళాకారులను ప్రోత్సహిస్తారు. ఎందరికో కొత్త కొత్త కళా ప్రక్రియలు నేర్పించారు. ఉపాధి బాట పట్టించారు. ఇక చిన్నారులకు రికార్డుల కిక్ ఎక్కించింది ఆయనే. ఆతరువాత అనేక రికార్డులు మార్కెట్లోకి రావడంతో ఆయన తప్పుకున్నారు. చాలా మంది చిన్నారులను లింకా బుక్ రికార్డ్స్ లోకి ఎక్కించారు. అనేక కథల పుస్తకాలు రచించారు, ప్రచురించారు. ఆయనకు రానిదంటూ ఏదీ లేదు. అయన చేయనిది ఏమి లేదు. ఇది రాదు, ఇది చేతకాదు అనే పదాలు అయన జీవితంలో దగ్గరకు రానివ్వరు. అందుకే అయన ఆల్ రౌండర్. అందుకే ఏడు పదులు దాటినా నిత్య విద్యార్థి. ఇప్పటికీ అదే హుషారు. అదే జోష్. అభినందనలు వెంకట రమణ వసంత లత దంపతులకు 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
–డా. మహ్మద్ రఫీ
