నవంబరు 17న మాధవపెద్ది గోఖలే జన్మదిన సందర్భంగా…
స్వర్గీయ మాధవపెద్ది గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1917 నవంబరు 17న జన్మించారు. తండ్రి లక్ష్మీనరసయ్య స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ఆస్తిపాస్తులు హరించిపోయాయి. పదవ ఏటవరకు వీరు బ్రహ్మణ కోడూరులో చదువు కొనసాగించి, చిత్రలేఖనం నేర్చుకోవడానికి బందరు వెళ్లారు. బందరు జాతీయ కళాశాలలోనూ మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రకళలో ప్రథమ శ్రేణిలో డిప్లమో పొందారు. వీరి గురువులిద్దరూ బెంగాలీలే. ఒకరు ప్రమోద్ కుమార్ ఛటర్జీ, వేరొకరు దేవిరాయ్ ప్రసాద్ రాయ్ చౌదరి. గుర్రం మల్లయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, చందమామ మొదలగు పత్రికల్లో చిత్రకారునిగా పనిచేశారు. స్వర్గీయ గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో రైతుబిడ్డ చిత్రానికి కళా దర్శకత్వం వహించారు. కళాధర్ తో కలసి జంట కళాదర్శకులుగా చంద్రహారం, మాయాబజార్ పాతాళ భైరవి, మిస్సమ్మ, జగదేకవీరునికథ, వాగ్దానం, శ్రీకృష్ణ పాండవీయం, పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర లాంటి 50 చిత్రాలకు పనిచేసారు. గోఖలే గారు సహజత్వానికి దగ్గరలోనే ఫాంటసీ తీసుకు రాగలిగేవారు. అజంతా ఎల్లోరా, అమరావతి, హంపి శిల్పాలతో పాటు పల్నాడు చిత్రాలను కూడా ఎంతో గొప్పగా చిత్రించేవారు.
శ్రీ శ్రీ మహాప్రస్థానం, మల్లమదేవి ఉసురు, హంపి కథలకు వీరు వేసిన ముఖచిత్రాలు మర్చిపోలేనివి. నీటి రంగుల సంప్రదాయ చిత్రం బ్రహ్మనాయుడు కూడా మంచి చిత్రం. దాదాపు నలభై సంవత్సరాలు క్రిందట ప్రజాశక్తిలో వీరు వ్యంగ్య చిత్రాలు గీసేవారు. అవి అప్పటి రాజకీయ పరిస్థితి పై నిశిత వ్యాఖ్యానాలుగా పేర్కొనవచ్చు. 1948-50 ప్రాంతంలో విశాలాంధ్రలో ప్రచురించబడ్డ వీరి చిత్రం పోలీసు దమననీతి పెద్ద సంచలనానికి కారణం అయింది. కృష్ణాజిల్లా ఎలమర్రు కాటూరు గ్రామాల్లో పోలీసులు చేసిన పరమ దారుణ చర్యకు ప్రముఖ కవులు శ్రీ శ్రీ, కోకు, తాపీ ధర్మారావు, గోపీచంద్, ఆరుద్ర నిరసన ప్రకటన చేశారు. ప్రకటనలతోపాటు ప్రచురించిన వీరి రేఖాచిత్రాన్ని 1941 ఆగష్టు 1న విశాలాంధ్ర పక్షపత్రిక ప్రభుత్వం దమన కాండకు గురి అయింది. పోలీసులు గ్రామ ప్రజలను దిగంబరులుచేసి గాంధీ విగ్రహ ప్రదక్షణ దృశ్యాన్ని వీరు ఆ చిత్రంలో చిత్రించారు. 1930లో వీరు ఉ ప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. మాధవపెద్ది గోఖలే మా గోఖలే పేరుతో అనేక కథలు రాసారు. విశ్వవిఖ్యాత చిత్రకారులు ఎస్.వి. రామారావు వీరి శిష్యులే. 1981 అక్టోబరు 4 న వీరు పరమపదించారు.
తెలుగు సినీమా కళాదర్శకత్వానికి సంభంధించిన వివరాలతో వచ్చిన మొదటి పుస్తకం ‘సినిమా కళలో కళాధర్ ‘ . ఇందులో కళాధర్ గారు కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే గారితో వారికి గల అనుబంధాన్ని రాసుకున్నారు.
-సుంకర చలపతిరావు
చాలా గొప్ప కళాకారుల గురించి తెలుసుకొనే అవాశం కల్పిస్తున్నారు. ధన్యవాదాలు.