తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

కళ ప్రకృతిని అనుసరిస్తుంది. ప్రకృతిసిద్ధమైనదే నిజమైన సినిమా. కళ లేనిదే సినిమా లేదు. సినిమాకు దర్శక నిర్మాతలు కర్తలైనట్లు కళాశాఖకు కర్త, భర్త కళాదర్శకుడు ” అన్నది సుప్రసిద్ధ కళాదర్శకుడు టి. వి. యస్. శర్మగారి నమ్మకం. దాదాపు నూరు చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన శర్మగారి జీవితం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చిత్రకళ ‘ను చేపట్టాలనిగాని, జీవ నాధారం చేసుకుందామని గాని అనుకోలేదు. ఆ కళాదేవతే ఆయనను వరించింది. లేకపోతే చిన్నతనంలో కీర్తనలు నేర్చుకుంటూ, నాటకాల్లో వేషాలు వేస్తూవుండే శర్మగారు కళాదర్శకుడెలా కాగలరు ?

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మూగచింతల అనే గ్రామంలో 1909 వ సంవత్సరంలో పుట్టారు శర్మగారు. పూర్తి పేరు తంగిరాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఆయన తండ్రిగారు వెంకటగిరి సంస్థానంలో పనిచేసేవారు. శర్మగారు నెల్లూరు వచ్చి వెంకయ్యగారనే సంగీతం మాస్టారు దగ్గర సంగీతం నేర్చుకోసాగారు. ఓపక్క నుంచి మామూలుగా బడికి వెళ్ళి చదువు కుంటూ వుండేవారు. శర్మగారి కుటుంబం – పెద్ద ఆస్తిపాస్తులున్న కుటుంబమేమీ కాదు. అలాగే ఆయన చదువూ సంగీతమూ నేర్చుకుంటూ వచ్చారు.
ఆ వయస్సులో ఆయన జీవితం ఇష్టమొచ్చినట్టు విహరించేది. ఒక పద్దతీ, నియమం కనిపించేవికావు. ఐతే, ఈ పూరు మనదా, ఇంకోటి కాకపోతుందా? అనే సిద్ధాంతం మీద నమ్మకం కలిగి, ఆయన పూరూరూ తిరిగేవారు. ” ఫలానపూల్లో మంచి సంగీతం మేష్టారున్నారు. ఉచితంగా విద్య నేర్పుతారు” అని ఎవరన్నా అంటే ఆయన ఆవూరు పరుగెత్తేవారు….. చేతిలో చిల్లి గవ్వయినా లేకుండా, ఆ సమయంలోనే ఆయన విజయనగరం చేరుకుని కట్టు సూర్యనారాయణగారింట్లో వుంటూ మధూకరం చేసుకుంటూ కీర్తనలు నేర్చుకున్నారు.

ఒక శిక్షణ, పెద్దవాళ్ళ మాట వినడంలాంటివి లేకపోవడంవల్ల శర్మ గారికి విజయనగరం నచ్చలేదు. బందరు చేరుకున్నారు. బందరు ఎందుకు? బందరులో ఏం చెయ్యాలి ? ఏం చదువుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఈ ప్రశ్నలేం కలగలేదాయనకు. ఒక వూర్లో రైలెక్కడం, ఇంకోపూర్లో దిగడం !
శర్మగారి పదో ఏట విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఏ అబ్బాయో చేసిన మందుగుండు సామగ్రిని అనుకోకుండా పట్టుకోగా అది చేతిలో పేలింది. చెయ్యి కాలింది. వేళ్లు కాస్త కాలాయనే ఉద్దేశంతో ఆయన నాటు వైద్యం చేశారు. ఆ నాటు వైద్యం పని చెయ్యలేదు. పెద్ద డాక్టర్లకు చూపాలంటే డబ్బులేదు. ఒక మూలనుంచి బాధపడుతూనే వున్నా ఆయన ఆ పుండు ను నిర్లక్ష్యం చేశారు. అది రానురాను చేతికి ఎక్కింది. కొన్నాళ్ళకు, పూర్తిగా ఆయన చేతిని తీసెయ్యవలసి వచ్చింది . అది ఎడమచెయ్యి : ” ఆ మందుగుండును నేను కుడిచేత్తోనే గనక పట్టుకుని వుంటే, ఉపయోగకరమైన కుడిచెయ్యే పోయేదేమో ! దైవం కొంత అనుకూలించాడు ” అనుకుంటూ వుంటారాయన.

రెండు చేతులూ వున్నవాళ్లే చదువు సంధ్యలున్నాసరే సంపాయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారే, చదువూ లేదు, సంధ్యా లేదు….. ఇంత చిన్న వయసులోనే ఇలా ఒంటిచేతిని పెట్టుకుని ఏం పని చెయ్యడం. ఎక్కడికి పోవడం అనే దిగులు ఆయనలో ప్రవేశించింది. ఐతే తన సంగీతానికి చేతికి సంబంధం లేదు : తనది వాద్య సంగీతమయితే ఇబ్బందే అయి వుండేది. గాత్ర సంగీతం కాబట్టి అది సాధిద్దాం అనే పట్టుదల శర్మగారిలో బయల్దేరింది. సంగీతంతోపాటు హరికధలు కూడా నేర్చుకున్నారు. కొన్ని చోట్ల హరికధలు చెప్పారు; నాటకాల్లో వేషాలు వేశారు.
ఈనాడు ఇంతటి కళాదర్శకుడు అనిపించుకుంటున్న శర్మగారిలో కళాదేవత చిన్నప్పుడే ప్రవేశించి ఏమూలో కూర్చుని వుండాలి ! పదిహేనో ఏటగాని అది బయటికి తొంగిచూడలేదు. చిన్నతనం నుంచీ ఆయన దృష్టి బొమ్మల మీదికి, మంచి కళానైపుణ్యం గల వస్తువుల మీదికి మరలేది. గంటల తరబడి వాటిని ఆయన పరిశీలిస్తూ కూచునేవారు.

ఒక రోజున ఆయన తీరిగ్గా కూచుని – పెన్సిలు తీసుకొని కాగితం మీద ఏదో గియ్యబోయారు. తను గీసిన గీత, అనుకున్న మలుపులు తిరిగి కనిపించింది. ఏదేనా ఒక బొమ్మ గియ్యాలనే ప్రయత్నంచేస్తే — గియ్యగలనా అనిపించింది. అనుకున్న బొమ్మకు రూపం సరిగా కుద రకపోయినా పరవాలేదనిపించింది. పోనీ, ఈ కళలో కృషిచేస్తే ? – ఏం లాభం, ఉన్న కళ ఇలా వుంది, ఇది మాత్రం ఏం ఉద్దరిస్తుంది ? అనుకున్నారు. తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసినప్పటికీ, ఆ తృష్ణ మాత్రం ఆయనలోంచి పోలేదు. బందరులో వుంటూనే ఆయన డి. వి. సుబ్బారావు, పింగళి నాగేంద్రరావుగార్లు ఆడుతున్న నాటకాల్లో పాల్గొనేవారు.

ఉన్నట్టుండి శర్మగారు ఒకనాడు మద్రాసుకు బండెక్కారు. మద్రాసులో ఏదైనా ఒక ఉద్యోగం చేదామనో, ఏ ళాశాల ‘లోనో చేరదామనో ఆయన వూహ ఐవుండవచ్చు. ఏమైనా, వేల్ పిక్చర్స్ స్టూడియోలో ఆయనకు ఒక చిన్న వుద్యోగం దొరికింది. సెట్టు మీద సామాన్లు పేర్చటం సర్దటంలాంటిది. అలా కొన్నాళ్ళు చెయ్యగా, దానిమీద ఉత్సాహం తగ్గింది. హచ్చిన్స్ గ్రామపోను కంపెనీకి “ఏరాజు వేసినాడో”  చిక్కితి నీ చేతిలోనే బావా ” అన్న కామిక్’ పాటలు రికార్డులు ఇచ్చారు. చిత్రకళా లేదు, సంగీతకళా లేదు ఆయన మళ్ళా బందరు చేరుకున్నారు. కర్ర మీద బొమ్మలు చెక్కడం మొదలైన పనులు చేసే చోట కొంతకాలం పని చేశారు. తీరిక దొరికినప్పుడు ఏవేవో బొమ్మల్లాంటివి గియ్యగా గియ్యగా చెయ్యి కాస్త తిరిగినట్టు కనిపించింది.
ఒకసారి గాంధీగారు బందరు వచ్చిన సందర్భాన్ని పురస్కరించు  కొని, శర్మగారు ఒక బొమ్మ వేశారు. ” గాంధీగారూ. మేకా ” ఆ బొమ్మ. అది వేలంపాటలో యాభై రూపాయలు ఆర్జించింది. కళ మీద కలిగిన మొట్టమొదటి సంపాదన అది ! తర్వాత ఆయన అక్కడ అక్కడ పత్రికల్లో ఏదైనా బొమ్మలు వెయ్యడం, అక్షరాలు రాయడం చేసేవారు. వాటి మీద నెలకు ఐదూ పదీ వచ్చేది.

ఒక రోజున నెల్లూరు వీధిలో ఒకాయన కనిపించి ఏంరోయ్ శర్మా ” అని పలకరించారు. శర్మగారు ఒక్క క్షణం తటపటాయించి ” ఎవరూ….” అన్నట్టు చూశారు.
” నేనురా— పుల్లయ్యని. మనం కలిసి చదువుకోలా !” అన్నాడాయన. శర్మగారికి అంతా గురొచ్చింది ఏదోలే, మనసు బాగుండక గుర్తు పట్టలేక పోయాను” అన్నారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. శర్మగారు ఏం చేస్తున్నదీ ఎలా వున్నదీ ఆయన తెలుసుకున్నారు. ” నీ బొమ్మలు దాగున్నాయి అబ్బాయ్, నిన్ను కళాదర్శకత్వ శాఖలో పడేస్తాను. నాతో కొల్లాపూర్ వస్తావా అక్కడ హరిశ్చంద్ర ‘డైరెక్టు చేస్తున్నాను. ”

శర్మగారు ఎగిరి గంతేసినంత పనిచేసి, ఆయనతో కొల్లాపూర్ బయల్దేరారు. “ఆ విధంగా పి. పుల్లయ్యగారే నన్నీ పరిశ్రమలో చేర్చారు” అన్నారు శర్మగారు ఆయనకు కృతజ్ఞతలు చూపుతూ. కొల్లాపూర్ వెళ్ళి అక్కడ బాబూరావు పెయింటర్ దగ్గర సహాయకుడిగా ‘హరిశ్చంద్ర’ చిత్రానికి కళాశాఖలో పనిచేశారు. సెట్సు వేనే పద్దతి, కిరీటాలు, ఆభరణాలు తయారుచేసే పద్దతులూ అన్నీ శర్మగారు బాబూరావు పెయింటర్ దగ్గర నేర్చుకొన్నారు. ఇది 1935 లో,
1936 లో ఆయన సతీతులసి’ చిత్రానికి ప్రధమంగా కళాదర్శకత్వం వహించారు. అప్పుడే ఆయన ‘ఫిలిం పబ్లి సిటీ’ కూడా చెయ్యడం ప్రారంభించారు.

అప్పటి సినిమాకళ ‘అంతా ‘కర్టెన్ ‘ ల మీదనే వుండేది. ఒక సింహాసనం వేస్తే, దానికి వెనక స్తంభాలుగాని, ఆర్చిలుగాని వుండేవికావు. మోల్డింగ్ ‘ పద్దతి అప్పటి కింకా అమలులోకి రాలేదు. అందుకని గుడ్డ మీద పెయింట్ చేసి ఫ్లాట్ ‘ ల లాగా అమర్చేవారు. 1938 వ సంవత్సరంలో – మోల్డింగ్ పద్దతిని పూనా ప్రభాత్ స్టూడి యోస్ వారు అమలు చేశారు. బాబూరావు పెయింటర్ మూలంగా.

‘మళ్ళీ పెళ్ళి ‘ సాంఘిక చిత్రం శర్మగారి మొదటి సాంఘిక చిత్రం. సెట్ లు వెయ్యడంలో కొంత సహజత్వం , సాంఘిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం, తెలుగుదనం గల పాత్రధారణ వంటి వన్నీ ఈ చిత్రంలో కనిపించాయి. ఆ రోజుల్లో ‘మైరావణ’ చిత్రం శర్మగారి నైపుణ్యానికి మచ్చుతునకగా చెప్పుకునేవారు. ఎందుచేతంటే, పాతాళలోకం సెట్టు వాతావరణం అద్భుతంగా రూపొందించారు. రామే శ్వరం నుంచి రకరకాల గవ్వలు, శంఖాలు తెచ్చి వాటితో కిరీటాలూ, లోలాకులు, గాజులూ, వడ్డాణాలూ లాంటివన్నీ తయారు చేయించారు. సెట్లో కనిపించిన ప్రతి ప్రాపర్టీ ‘ కూడా శంఖు ఆకారంలోనో, గవ్వ ఆకారంలోనో కనిపించేట్టు చేసి, అద్భుతమైన పాఠాళలోక వాతావరణాన్ని సృష్టించారు. అలాగే చంద్రసేన పాత్ర రూపకల్పనలో కూడా చాలా శ్రద్ధ కనిపిస్తుంది. ప్రభాత్ స్టూడియోవారు ఈ చిత్రం చూసి ” ఇంత సహజత్వాన్ని మేము మా చంద్రసేన చిత్రంలో తీసుకు రాలేకపోయాము ” అని ఆశ్చర్యపోయారు.

పాత్రలకు రూపకల్పన చెయ్యడంలో శర్మగారు దిట్ట. నారదుని పాత్రకు పక్కముడి, శరీరమంతటా చందనాలంకారాలూ, లతలూ మొదటి సారిగా ఏర్పాటు చేసింది శర్మగారే. ఇది ‘సత్యభామ ‘ చిత్రంలో జరిగింది. స్థానం నరసింహారావు నారదుడుగా నటించారు. ఆ చిత్రంలో కనిపించిన నారద వేషధారణే ఈనాడు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇటీవల వచ్చిన ‘నర్తనశాల ‘ చిత్రంలో ఆయన బృహన్నలకు చేసిన చూపకల్పన కూడా, అద్బుతమైనది. ఉత్తరాదివారు. దక్షిణాదివారూ కూడా ఆ వేషధారణను ప్రశంసించారు. ఈ ‘బృహన్నల’ పాత్రను కల్పించడంలో శర్మగారు చాలా పరిశోధనలు చేసి చాలా స్కెచ్ లు వేశారు. సీతారామ కల్యాణం ” లోని రావణపాత్ర, ‘శ్రీ కృష్ణపాండవీయం ‘లోని దుర్యోధన పాత్రా శర్మగారి రూపకల్పనకూ ‘లవకుశ ‘, శ్రీ కృష్ణ లీలలు ‘శ్రీ కృష్ణపాండవీయం ‘ మున్నగు చిత్రాలలోని “ సెట్స్’ అపూర్వంగా కనిపించడం ఆయన కళానైపుణ్యానికి నిదర్శనాలు. మామూలుగా ఉపయోగించే కాగితాన్నే ఉపయోగించి, ఆయన పాలరాతి ఎ ఫెక్ట్ ‘ తీసుకొచ్చారు కృష్ణపాండవీయంలో..


శర్మగారు నిరంతర పరిశోధకులు, పురాణ, చారిత్రాత్మక, సాంఘిక, జానపద వాతావరణాల్లో దీన్ని సృష్టించవలసినా ఆయన అంత జాగర్తా తీసుకుంటారు. ‘జకార్తా’లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘నర్తనశాల’ చిత్రానికి ఉత్తమ కళాదర్శకత్వ బహుమతి ఆయనకు లభించడం ఆయన కృషికీ, పరిశోధనకూ చిహ్నం !
శర్మగారి కళాదర్శకత్వంలో రానున్న భారీ వర్ణచిత్రం ‘రహస్యం’
” కథను రూపొందించే కవి హృదయం తెలుసుకుని దానికి రూపమివ్వడం, కథాకాలానికి సంబంధించిన వాతావరణంలో సూది మొదలు సౌధం వరకు సృష్టించడం కళాదర్శకుడి పని. దీనికి నిరంతర శ్రమ, జ్ఞానతృష్ణ, కాల్పనిక శక్తి, సర్వసమగ్ర విజ్ఞానాసక్తి, పరిశీలన, పరిశోధన ఎంతో అవసరం. నేనింకా నేర్చుకోవలసింది. ఎంతైనా ఉంది. విదేశాలు సందర్శించి, మన పురాణ చిత్రాల సెట్సు, మోల్డులు, దుస్తులు వాళ్ళ పరికరాలతో నిర్మించి, ఆ వ్యత్యాసాన్ని పరీక్షించాలని కలలు కంటున్నాను” అన్నారాయన.

(1939లో విడుదలైన మైరావణ ఈయన పనితనానికి ఒక గీటురాయి. ఆ చిత్రంలో పాతాళ లోక సృష్టి అందరినీ మెప్పించింది. సత్యభామ సినిమాలో నారద పాత్ర ఆహార్యం, నర్తనశాలలో “బృహన్నల” రూప సృష్టి , శ్రీకృష్ణపాండవీయం సినిమాలో దుర్యోధనుని రూపకల్పన వీరి ప్రతిభకు తార్కాణాలు. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నర్తనశాల చిత్రంలో కళాదర్శకత్వానికి శర్మ గారికి ఉత్తమ కళాదర్శక పురస్కారం లభించింది. శర్మ 1970, డిసెంబరు 7వ తేదీన కన్నుమూసారు.)

(విజయచిత్ర సినీమా మాస పత్రిక 1966 అక్టోబర్ సంచిక నుండి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap