పట్టణాల నుంచి పల్లెల వరకు సినీ ప్రేక్షకులను ఆకర్షించి వారిని సినిమా థియేటర్లకు నడిపించడంలో సినిమా పోస్టర్ల తర్వాత సినీ కటౌట్లు ప్రముఖపాత్ర వహించాయి ఒకప్పుడు. నేడు టీవీలను, సోషల్ మీడియాను సినిమా ప్రచారానికి ఉపయోగించుకోవడం వలన సినీ కటౌట్లు కనుమరుగయ్యాయి. అలాంటి భారీ సినీ కటౌట్లు వేయడంలోను, సినీమా బేనర్లు రాయడంలోనూ.. ప్రముఖుల రూప చిత్రాలు వేయడంలోనూ సిద్దహస్తులు చిత్రకారుడు “నాగేశ్వర్ “. గత 30 ఏళ్ళుగా అటు విజయవాడలో ఇటు హైదరాబాదు లోనూ ఈయన పేరు తెలియని వారుండరు. ఐదుగురు ముఖ్యమంత్రులచే సన్మానాలు అందుకున్న సీనియర్ చిత్రకారుడూ, అనేక మంది సినీ ప్రముఖులతో కలిసిపనిచేసిన అనుభవశాలి నాగేశ్వర్ గారు.
విజయవాడలో 1957 లో ఒకేసారి విడుదలయిన “మాయాబజార్ ” “సువర్ణసుందరి” సినిమాల పబ్లిసిటీ కటౌట్లు వ్రాసే సీనియర్ చిత్రకారులయిన సినీ ఆర్ట్స్ బుచ్చయ్యగారు, జయాఆర్ట్స్ బసవయ్యగారు, దుర్గాఆర్ట్స్ వేలాయుధంగార్ల దగ్గర శిష్యురికం చేసిన చిత్రకారుడు “నాగేశ్వర్ “… జిడగం నాగేశ్వరావు వీరి పూర్తి పేరు, పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. వీరి నాన్నగారు జిడగం ఆశీరయ్య గారు ఆ రోజుల్లో విజయవాడలో పేరొందిన తాపి మేస్త్రి. ఇప్పటికీ సూర్యారావుపేటలో వీరి ఇంటి పేరుతో ఒక వీధి కూడా వున్నది.
ఆ తర్వాత 1964 లో హైదరాబాదుకి ప్రయాణం. ఇంతకు ముందు చెప్పిన జయాఆర్ట్స్ బసవయ్యగారి కుమారులైన అడుసుమిల్లి నాగభూషణం గారు లక్ష్మీ ప్రసాద్ గార్లయిన తమగురువులతో 64 లో రిలీజయిన సినిమా “నర్తనశాల” కటౌట్స్ వ్రాయడానికి అడుగుపెట్టారు. అలామొదలయిన సినిమా ప్రపంచంలో 1987 వరకు ఎడతెరిపి లేకుండా (స్టుడియో ప్రసాద్-ఎడ్ వింగ్స్) అనే బొమ్మలు వ్రాసే ఫరమ్ లో ఈ అన్నదమ్మలైన గురువుల వద్ద చేసి విద్యలో ప్రావీణ్యం పొందారు. 1987 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రకారులకి ఓపోటి నిర్వహించింది . అదేమంటే ఆఏడాదిలోనే కృష్ణా జిల్లా దివిసీమ లో భయంకరమైన తుఫాను వచ్చి ఎన్నో ఊళ్ళని మింగేసింది. ఆ తుఫాను సబ్జెక్టు పై బొమ్మలువేయమని పోటీ పెట్టడం ఆ పోటిలో వీరు బహుమతి పొందడం (అలనాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావుగారి చేతులమీదుగా) జరిగింది.. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వంవారు అంటే నాటి గవర్నరయిన మేడమ్ కుముద్ బిన్ జోషి గారు వీరికి “స్వాతంత్ర సమరయోధుల రథం” అనే పెద్ద D.C.M. వ్యాను చుట్టూ అలనాడు తెల్లదొరలతో పోరాడిన పెద్దలు త్యాగధనుల ఫోటోలని ఆయిల్ పెయింట్స్ తో వ్రాయించి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆబొమ్మల రథాన్ని కొన్నినెలలు తిప్పారంట… ఆ విధంగా గవర్నర్ మేడం కుముద్ బిన్ జోషి గారిచే సన్మానం పొందారు.
అప్పటి నుండీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పనులు వరసగా టి.అంజయ్యగారు ముఖ్యమంత్రి గావున్నప్పుడు. ఒక పోట్రైట్ (మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యదేవర కాళేశ్వర్రావుగారి) ఆయిల్ పెయింటింగ్ చేయడం, అంజయ్యగారు సన్మానించడం.. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లో విజయభాస్కర రెడ్డిగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు..ఎలక్షన్స్ కమీషనర్ ఆఫీసులో పెట్టడానికి మహాత్మాగాంధీ నిలువెత్తు (7-3 అడుగుల) పోట్రైట్ ని వ్రాయించి వారే సన్మానించారు.. అది ఇప్పటికీ అక్కడేవుంది.. అలా రోశయ్యగారు. సి.ఎం. గా వుండగా, రామారావు గారు సి.ఎం. వుండగా. ఈమధ్య సి.ఎం.కె.సి.ఆర్. గారు .. ఇలా ఐదుగురు ముఖ్యమంత్రిలచే సన్మానించబడ్డ చిత్రకారునిగా కీర్తికెక్కారు. సుప్రీం కోర్ట్ ఛీప్ జస్టీస్ ఆదర్స్ ఆనంద్ గారిచే ఆవార్డ్ అందుకున్నారు. A.P. హైకోర్ట్ లో శ్రీ జీవన్ రెడ్డిగారి Portrait వేసినందుకుగాను…
మరో ముఖ్యవిషయం 40 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో చిత్రకారుడిగా వందల సినిమాలకి సెట్టింగ్స్(బొమ్మలెన్నో), R.K. స్టుడియోతో సహా చేసినందుకు వచ్చిన గుర్తింపుతో, అన్న రామారావు గారి పౌరాణిక జానపద వేషాలలో తొమ్మిదిటిని సెలక్ట్ చేసి వీరితో 8-4 అడుగుల ఆయిల్ కలర్ చిత్రాన్ని పది కాలాల పాటు వుండేలా వ్రాయించారు..(ఇప్పటికీ నాచారం స్టుడియోలో వుంది) అన్నిటికన్నా వీరికి Life Turning Point సినీ పరిశ్రమలో మహాదాత దానకర్ణుడని పేరుగాంచిన స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారి వల్ల తన జీవితం బాగుపడిందని చెప్పుకొంటారు. ఓ ఏడాది పాటు శ్రమించి.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప చిత్రకారుల బొమ్మల్ని పది రీకాపి చేశారు, 1983 లో ఆ పది పెయింటింగ్స్ ని రామానాయుడుగారు చూసి ఖరీదు చేసారు., ఆ బొమ్మలు ఓ 20 సినిమా సెట్టింగ్స్ లో ఉపయోగించడంతో తో ఇహ అక్కడనుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా ఎన్నో కుటుంబాలలో దీపాలు వెలిగించిన ధన్యమూర్తి రామానాయుడు గారంటారు.
మంచి వక్త, మనసున్న మనిషి అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టుడియోలో తనకు ఓదారి దొరికిందని.. ఎందరో ఆర్ట్ డైరెక్టర్స్ ఆ స్టుడియోకి పిల్చి ఎన్నో పనులిచ్చారని. వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటారు… అంతేకాదు… అక్కినేని గారి వల్ల నేను ప్రపంచ జ్ఞానం నేర్చుకున్నానని. ఆయన ఒక మహాగ్రంధం .. అది చదివానని.. ఆయన ఉపన్యాసాలు ఎన్నోవిన్నానని.. అదే స్టుడియోలో… ఆ తర్వాత మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకాలు ఇతర రచయితల పుస్తకాలు చదివి ఈ స్థితికి వచ్చానని.. జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదని… మానవతా విలువలు, మంచి నడవడిక ముఖ్యం అని తెలుసుకున్నానంటారు. మానవత్వంతో ఆపదలో వున్న సాటివారిని ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ జూన్-జూలైలో కరోనాతో కష్టాల్లో ఉన్న పేదలకు మన రెండు తెలుగు రాష్ట్రాలలో తనకున్న శిష్యబృందంతో కలిసి తన సొంత డబ్బులతో కొంత మంది పేదవారికి సహాయమందిస్తానంటున్నారు. డబ్బైయేళ్ళ వయస్సులో నున్న వీరి సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం.
-కళాసాగర్ యల్లపు
కళాసాగర్ గారు నేపుట్టి పెరిగిన వూళ్ళోనే నాగురించి శ్రమతీసుకోని ఇంత ఓపికగా మరువలేని జ్ఞాపకంగా నాకు బహుమతిగా ఇచ్చారు…
చాలాచాలా కృతజ్ఞతలు.
నాగేశ్వరరావు గారి పరిచయం చాల అవసరం, వ్యాసం కూడ బాగుంది
Great artist…. Introduce to in type of artists. Thanq sir