నవ్వుల రారాజు – రాజబాబు

కామెడీ ఆర్టిస్టుల్లో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది పాతతరం హాస్యనటుల్లో కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య తరువాత అంత వైభవాన్ని కళ్ల చూసింది ఆయనే. రాజబాబు తీసుకున్నంత పారితోషికం మరే ఇతర హాస్యనటుడు తీసుకోలేదేమో! ఆ రోజుల్లో కొంతమంది హీరోల పారితోషికానికి సమానంగా ఆ మొత్తం ఉండేది. ఒకచోట కుదరుగా ఉండకుండా వంకర్లు తిరిగిపోతూ వెరయిటీ మాడ్యులేషన్తో రాజబాబు డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయేవారు.

నవ్వుల రాజు రాజబాబు అక్టోబరు 20 పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

‘నేను కోట్ల రూపాయలు సంపాదించాను’ అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక హాస్యనటుడు కూడా బహుశా రాజబాబు ఒక్కరేనేమో! హాస్య నటులు చరిత్ర రాస్తే అందులో మొదటి పేజీల్లోనే ఉండే పేరు ఆయనదని చెప్పవచ్చు.

అయితే హాస్యనటుడిగా రాజబాబు ప్రస్థానం అంత తేలికగా మొదలవలేదు. పావలాతో మద్రాసుకు చేరుకున్న ఈ పున్యమూర్తుల అప్పలరాజు చాలాకాలం అన్నం లేక, సరైన బట్టలేక కార్పొరేషన్ నీళ్లతో ఏ రోజయినా కడుపునిండా అన్నం పెడితే దాంతో రెండు మూడు రోజులు బతికేవారు. అలా అప్పుడప్పుడు అన్నం పెట్టిన మహానుభావుడు ఆనాటి హీరోయిన్ రాజసులోచన ఇంటితోటమాలి. అవకాశాలు దొరక్క ట్యూషన్లు కూడా చెప్పేవాణ్ణి. నేను టూషన్ చెప్పే ఇంట్లో ఏదో మూల కుక్కపిల్లలా పడుకుని ఉంటే ఎవరో లేపి కాఫీయో, రెండు ఇడ్లీలో ఇచ్చేవారు’ అని ఆ రోజుల్లో రాజబాబు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ విన్నా ‘అయ్యో పాపం’ అనిపించకమానదు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి ‘సమాజం’ చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యారు.

అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించినా విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు.

హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. డా.దాసరి నారాయణరావు తొలి సినిమా ‘తాత-మనవడు’ చిత్రంలో ఆయనే హీరో, ముందు ఆ వేషం వేయడానికి వెనుకంజ వేసినా దాసరి ప్రోత్సాహంతో ఆ పాత్ర పోషించారు రాజబాబు. ఆ సినిమాకి ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఆ తరువాత దాసరి దర్శకత్వంలో రూపొందిన ‘తిరుపతి’లో కూడా ఆయనే హీరో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజబాబు నిర్మించిన తొలి సినిమా ‘ఎవరికి వారే యమునా తీరే’ కు దర్శకుడు దాసరి కావడం. ‘బావా… బావ” అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా మెలిగే వారిద్దరు. దాసరి రూపొందించిన చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు రాజబాబు.

పుట్టినరోజున మంచి కార్యక్రమాలు
తన బతుకు పుస్తకంలో పేజీలు తరిగిపోతుండడంతో , ఆఖరి పేజీ దగ్గర పడిపోతోందేమోనన్న భయం ఆవరించి ఆ లోపు కొన్ని మంచి పనులు చేయాలన్న తపనతో రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్ధికంగా సహాయంచేసేవారు. ముఖ్యంగా తన పుట్టినరోజు ఏ ప్రయోజనం లేకుండా జరగడం అసంతృప్తికరంగా అనిపించి ఆ రోజుని సీనియర్స్ ని సన్మానించేవారు రాజబాబు. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కొత్త నటీనటులు పరిశ్రమకి పరిచయం కావడానికి దోహదపడ్డారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ‘పాతాళభైరవి’ చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన రాజబాబుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని ఓ తొంభైసార్లు చూశారాయన. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్య నటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఞతలు వెల్లడించారు రాజబాబు.

నిర్మాతగా.. భవిష్యత్లో ఎప్పుడైనా కథ రాసుకుని స్వీయ దర్వకత్వంలో సినిమా తీయాలనే కోరిక రాజబాబుకి ఉ ండేది. ఆ ప్రయత్నంలో భాగంగా బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్ బేనరుపై ‘మనిషి రోడ్డున పడ్డాడు’ చిత్రాన్ని నిర్మించారు రాజబాబు. దీనికి కథకుడు ఆయనే. ఈ సినిమాలో ట్రాజెడీ వేషం వేశారు. ఎప్పుడు తమని నవ్వించే రాజబాబు తెరపై ఏడుస్తూ కనిపించే సరికి ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తనని చూసిన జనం మనసారా నవ్వుకోవాలి కానీ అలా ఏడవకూడదననుకున్న రాజబాబు ఇకపై ట్రాజెడీ వేషాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన తీయాలనుకున్న ‘సరస్వతి లక్ష్మి బ్రహ్మ; ‘సంఘం చేసి బొమ్మలు’ చిత్రాలు తీయలేకపోయారు.

మాటల్లో వేదాంతం, వైరాగ్యం
ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం ఏదైనా దాగి ఉందా అనిపించేది ఒక్కోసారి. ఆయన తాగిన మత్తులో ఉన్నా, లేకపోయినా వేదాంత వైరాగ్యాల గురించి సుదీర్ఘంగా మాట్లాడేవారు. అలాగే ఇంటర్వ్యూల సారాంశం వేదాంతపరంగానే ఉండేది. తెరపై అంతగా నవ్వించే రాజబాబు ఎంతో భావగర్భితంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచేది.

కెరీర్ ని దెబ్బతీసిన అలవాటు
అలవాట్లు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతాయో చెప్పలేం కానీ అంత బిజీగా ఉన్న రాజబాబు కెరీర్ కుదేలవడానికి ప్రధాన కారణం మద్యపానమే కారణమని చెబుతారు విపరీతంగా తాగి షూటింగ్ లకు గైరు హాజరయ్యేవారని అంటారు. రాజబాబుని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందనుకునే రోజులు పోయి ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని భావించే పరిస్థితి ఏర్పడటానికి కారణం ఇదేనంటారు. అయితే తను తాగి షూటింగ్ కి వచ్చేవాణ్ణనే అంటే రాజబాబు ఒప్పుకునేవారు కాదు. నేను తాగుతాను. పనిలేని రోజున మాత్రమే తాగుతాను. మేకప్ వేసుకున్న తరువాత తాగను. కానీ పరిశ్రమ నన్ను దూరం చేసింది. విష ప్రచారం చేసి పక్కన పెట్టింది. నిర్జీవమైన వస్తువులతో ఆడుకోండి. కానీ మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు’ అనేవారాయన ఆ రోజుల్లో నేను ఏ నిర్మాతకి, దర్శకుడికి అన్యాయం చేయలేదు. “అప్పలరాజుని రాజబాబుగా మార్చి మంచి పొజిషన్లో నిలబెట్టి చివరికి ముంచెయ్యడం పరిశ్రమకి భావ్యమా’ అని ఆయన ఆవేదనతో ప్రశ్నించినా దానికి చివరి రోజుల్లో స్పందన కరువైంది.

ఆయనకే దక్కిన గౌరవం
తన పుట్టిన ఊరికి, కన్నవారికి ఎంతో ప్రతిష్ఠలు తెచ్చిన రాజబాబు శిలా విగ్రహాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాజమండ్రిలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 70 మంది హాస్యనటీనటుల కలయికలో ‘హాస్యకుంభమేళ’ పేరుతో ఓ నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగు చిత్రపరిశ్రమ. ఇదే రాజబాబుకి మాత్రమే దక్కిన గౌరవం.

–మంతెన సుర్యనారాయణ రాజు

6 thoughts on “నవ్వుల రారాజు – రాజబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap