విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 13
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి కడపజిల్లాలో జన్మించారు. పొద్దుటూరులో కొంతకాలం చదివి మద్రాసు పచ్చ ప్పయ్య కాలేజీలో చేరి పట్టా పుచ్చుకోకుండానే బయటకు వచ్చేశారు. చెన్నపురి ఆంధ్రమహాసభ వారితో కలసి పలు నాటకాలలో నటించారు. ఈ సమయంలోనే ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవరెడ్డితో కలిసి నటించే అదృష్టం ఈయనకు కలిగింది. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రభావంతో సినీ నిర్మాణ, దర్శకత్వం వైపు తన శక్తియుక్తులను మళ్ళించారు. స్వాతంత్ర్యానికి ముందే స్వతంత్ర భావాలతో సామాజిక సమస్యలకు సమాధానంతో ముందుకు వచ్చిన సినీ సంఘ సంస్కర్త. ఈయన నిర్మించిన మల్లీశ్వరి, స్వర్గసీమ, బంగారుపాప మొదలైన మేటి చిత్రాలు వారి ఆశయాలకు అద్దం పడతాయి. 30 ఏళ్ళ – సినీ చరిత్రలో కేవలం 11 సినిమాలు నిర్మించి రాశి కన్నా వాసి మిన్న అని దర్శక నిర్మాతలకు, ప్రేక్షకులకు ఓ ఉదాహరణగా నిలిచారు. నటీనటులకు క్రమశిక్షణ, నటనలో శిక్షణ తప్పని సరి అని నమ్మి బి.ఎన్.రెడ్డి ఆరోగ్య కరమయిన సినిమాలు తీశారు. కనుకనే ఆయన సినిమాలు నేటికీ చిరాయువు లుగా బ్రతికున్నాయి. బ్రతికే ఉంటాయి. దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన బి.ఎన్.రెడ్డి ప్రతిభను మెచ్చిన మన ప్రభుత్వాలు దాదా ఫాల్కే, పద్మభూషణ్, డాక్టరేట్, పోస్టల్ స్టాంప్ వంటి బహుమానాలతో సత్కరించాయి. కనుకనే బి.ఎన్.రెడ్డి నేటికీ మన ధృవతార !
( బి.ఎన్.రెడ్డి జన్మదినం 02 డిశంబర్ 1908)