నిత్య సత్యాల చిత్ర దర్శకుడు – సత్యజిత్ రే

దృశ్య శ్రవణ స్థిత ప్రజ్ఞుడు, భారతీయ సమాంతర చిత్రాల దిగ్దర్శకుడు, ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ గా ఎన్నో ఎత్తులకు చేర్చిన సత్యజిత్ రే గారి జన్మదిన వ్యాసం.

దృశ్య శ్రవణ స్థితప్రజ్ఞుడు సత్యజిత్ రే శతజయంతి సంవత్సరంలో ప్రపంచమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్లోనయితే మరీ ఎక్కువ. సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యుట్ లో ఆయన విగ్రహావిష్కరణ చేసారు. సెమినార్లు ఫిలిం ఫెస్టివల్స్ ఇంకా ఎన్నో, అంతెందుకు ఇటీవలే ముగిసిన కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఈ మధ్యే Restore చేసిన ఆయన సినిమా ‘ప్రతిద్వంది’ ప్రదర్శించారు.

సత్యజిత్ రే మనల్ని విడిచి వెళ్లిన 31 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆయన సృజన ఎంతోమంది కళాకారులని ఉత్తేజ పరుస్తున్నది. ఆయన ఆవిష్కరించిన దృశ్య వాస్తవికతను ఇంకా అర్థం చేసుకోవాల్సివుంది, ముందుకు తీసుకేల్లాల్సి వుంది.

బెంగాలీ సినిమా, సినిమా ఆఫ్ ఇండియా, సమాంతర చిత్రాల పేరెత్తితే చాలు.. ఆయనే గుర్తుకు వస్తాడు. అసలు ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రలిప్పటికీ నిజజీవన చిత్రాలకు ప్రతిబింబాలై నిలుస్తాయి. భారతీయ జీవితంలోని అణువణువుకూ చిత్రణ పట్టిందాయన దర్శక ప్రతిభ. ఆయనే సత్యజిత్ రే. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన అరుదైన దర్శకుడు సత్యజిత్ రే. ఆయన సినిమా చూడకపోవడం ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో బతుకుతూ కూడా సూర్యచంద్రులను చూడకపోవడంతో సమానం అవుతుంది’ అంటాడు ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా. ‘పథేర్ పాంచాలీ’ చిత్రంలోని దుర్గ పాత్ర చనిపోయినప్పుడు నేనెందుకు ఏడవాలీ? అని ఎంత కఠినంగా వున్నా.. కళ్లు వాటంతటవి కన్నీళ్లు కార్చకుండా వుండవు. అపరాజితోలోనూ అంతే. ‘అపూర్ సంసార్’ గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో అపర్ణ చనిపోయినప్పుడు అపూ పడే బాధ వర్ణనాతీతం. కొడుకు దగ్గరకెళ్లమని స్నేహితుడు చెబితే.. “ఎవరికోసం వెళ్లాలి? వాడు పుట్టడంవల్లే కదా నా భార్య చనిపోయిందని” అంటాడు అపూ. ఆ దృశ్యం చూసి ద్రవించని హృదయం వుండదు. ఇక క్లైమాక్స్ సీన్ ఇప్పటికీ సజీవమే.

సత్యజిత్ రే.. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ గా ఎన్నో ఎత్తులకు చేర్చిన ప్రసిద్ధ దర్శకుడు. సున్నితమైన ప్రేమానుబంధాలను ఫ్రేముల్లో బంధించడంలో దిట్ట. గూడుకట్టుకున్న విషాదం, నిజ జీవితంలోని వెలుగుజిలుగులు, రాగద్వేషాలకుండే విలువలకు పట్టం కట్టడం.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన సినిమా చూడ్డం మొదలు పెడితే.. అది పూర్తయినా అందులోంచి బయట పడ్డం సాధ్యం కాదు. జీవితాంతం వెంటాడే దృశ్యాలను ఒక చోట ఏర్చీ కూర్చి.. సినిమాగా మలచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తొలినాళ్లలో.. ఇండియన్ సినిమాను శాసించిన అతి కొద్దిమందిలో సత్యజిత్ రే ఒకడు.

1921, మే 2న కలకత్తాలో జన్మించాడు. ఆయన కుటుంబం ఓ పెద్ద కళలకణాచి. సాహితీ నిలయం. తాతయ్య ఉపేంద్ర కిషోర్ రాయ్ సాహితీపరుడు. తండ్రి సుకుమార్ రాయ్ చిల్డ్రన్ లిటరేచర్ కం నాన్సెస్ రైమ్ రైటర్. వీరి ఫ్యామిలీకి ‘యు రే అండ్ సన్స్’ అనే ప్రింటింగ్ ప్రెస్ వుండేది.

ఫిక్షన్ రైటర్, పబ్లిషర్, ఇల్లస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్, ఫిల్మ్ క్రిటిగ్గా నూ సత్యజిత్ రే సుపరిచుతుడే. Feluda, sleuth, ప్రొఫెసర్ సుంకు.. వంటి పాత్రల సృష్టి చేశాడు. సైన్స్ ఫిక్షన్ రైటర్ గా రే సుప్రసిద్ధుడు. దర్శకుడిగా తొలిచిత్రం పథేర్ పాంచాలి.. రెండు నేషనల్ అవార్డులతో పాటు, పదకొండు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు సొతం చేసుకుంది. అందులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాధించిన బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంటరీ అవార్డు కూడా ఒకటి. అలా.. నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గానూ సత్యజిత్ రే సినీ కెరీర్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.

వైవిధ్యమైన అంశాలతో సినిమాలు….

రే మొత్తం 30 సినిమాలు తీశాడు. వాటిలో గ్రామీణులూ, మధ్యతరగతి జనాలు, మేధావులూ, జమీందార్లూ, రాజులూ, డిటెక్టివ్‌ల గురించి వివిధ ఇతివృత్తాలతో కథలున్నాయి. ఏదీ మరొక దానికి నకలు కాదు. వస్తువులోనూ, కథన విధానంలోనూ దేనికదే ప్రత్యేకం. ఆ సినిమాలన్నీ జీవితాన్ని స్పష్టంగా ప్రతిఫలించేవే!

37 ఏళ్ల తన కేరీర్‌లో ఒక శతాబ్దకాలపు చారిత్రక మార్పుల్ని అతడు తన సినిమాల్లో రికార్డు చేశాడు. ప్రేమ్‌చంద్‌ కథ ఆధారంగా వచ్చిన ‘షతరంజ్‌ కే ఖిలాడీ’ (1977) ఈస్టిండియా కంపెనీ దూసుకొస్తుంటే చదరంగం ఆటల్లో తలమునకలైన మొఘల్‌ రాజులను చూపుతుంది. జమీందారీ వ్యవస్థ పతనమౌతుంటే తన పాత రాజసాన్ని వదులుకోలేక, కొత్త ధనాఢ్యుల పొగరును జీర్ణించుకోలేని ఒక జమీందారు బాధను చూపుతుంది ‘జల్సాఘర్‌’ (1958).

ఆధునిక భారతంలో పేద బ్రాహ్మణ కుటుంబపు ఈతి బాధల్ని ‘అపూత్రయం’ చూపగా, మూఢనమ్మకాలతో కోడల్ని అమ్మవారుగా మార్చేస్తుంటే, ఆధునిక హేతువాద భావాలతో దాన్ని ఎదిరించేవాళ్లు తయారౌతున్న వైనాన్ని ‘దేవి’ (1960) సినిమా దర్శింపజేస్తుంది. ‘చారులత’, ‘మహానగర్‌’ (1963) సినిమాల్లో స్త్రీల విముక్తిని చిత్రిస్తే, ‘ప్రతిద్వంది’ (1970)లో నిరుద్యోగ సమస్యను వర్ణిస్తుంది. క్రమంగా దిగజారుతున్న లంచగొండి సమాజంలో మధ్యతరగతి నైతిక పతనాన్ని ‘జనారణ్య’ (1975) సాక్షాత్కరింపజేస్తుంది. ‘ప్రతిద్వంది’ – ‘సీమాబద్ధ’ (1971) – ‘జనారణ్య’ సినిమాలను కలిపి సత్యజిత్‌ రే ‘కలకత్తా త్రయం’ అని అంటారు. (మృణాల్‌ సేన్‌ ‘కలకత్తా త్రయం’ వేరే ఉంది.) ‘గోపీ గాయిన్‌ – బాగా బాయిన్‌’ (1968) సంగీతం, హాస్య రసాలతో ఆబాలగోపాలన్ని అలరించింది. ఇవే క్యారెక్టర్లతో ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీపై చురకలా పరోక్ష విమర్శతో ‘హిరక్‌ రాజార్‌ దేశే’ (హిరక్‌ రాజు దేశంలో) (1980) సినిమా వచ్చింది. ఇరవై లక్షల మందిని పొట్టన పెట్టుకున్న బెంగాల్‌ క్షామం మానవుల్ని ఎంత దయనీయ స్థితిలోకి నెడుతుందో చూపుతుంది ‘ఆశని సంకేత్‌’ (1973).సత్యజిత్‌ రే సినిమాల్లో అతడికి వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా ‘చారులత’. రవీంద్రుని ‘నష్టనీర్‌’ (చెడిన గూడు) కథ ఆధారంగా తీశాడు. ఈ చిత్రంలో ‘సున్నితత్వం, సరళత్వాల దోబూచులాట అద్భుతంగా వుంది’ అంటూ ఈ సినిమాకు కితాబునిచ్చింది రే మెచ్చే సినిమా పత్రిక ‘సైట్‌ అండ్‌ సౌండ్‌’ సంపాదకురాలు పినలోప్‌ హోస్టన్‌.

సాహిత్య సేవ…..

సత్యజిత్‌ రే తన తాతయ్య 1961లో ప్రారంభించిన ‘సందేశ్‌’ పత్రికను పునరుద్ధరించాడు. ‘సందేశ్‌’ అనే పదానికి ‘సందేశం’ (మెసేజ్‌) అనీ, ‘బెంగాల్లో దొరికే ఒక మిఠాయి’ అనీ రెండర్థాలు ఉన్నాయి. ఈ రెండర్థాలకూ న్యాయం చేస్తూ రే విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా ఉండే రచనలు పిల్లల కోసం రాసేవాడు. వేరే పత్రికలకూ రాస్తూ కొన్ని రూకలు పారితోషికంగా సంపాదించేవాడు. అపరాధ పరిశోధక నవలలు రాసినా, వాటిలో పిల్లలకు తగ్గట్టు శృంగారం గానీ, అతి హింస గానీ లేకుండా జాగ్రత్త పడేవాడు. షెర్లాక్‌ హోమ్స్‌ ప్రేరణతో సృష్టించిన డిటెక్టివ్‌ ఫెలూదా కథల కోసం పిల్లలు చెవి కోసుకుంటారు. పుస్తక ప్రదర్శనల్లో ఫెలూదా కథలు బాగా అమ్ముడు పోతుంటాయి.

బెంగాలీ సినిమా, సినిమా ఆఫ్ ఇండియా, సమాంతర చిత్రాల పేరెత్తితే చాలు.. ఆయనే గుర్తుకు వస్తాడు. భారతీయ జీవితంలోని అణువణువుకూ చిత్రణ పట్టిందాయన దర్శక ప్రతిభ. ఆయనే సత్యజిత్ రే. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన అరుదైన దర్శకుడు సత్యజిత్ రే.

ది అపూ ట్రయాలజీలోని అపరాజితో, అపూర్ సంసార్ చిత్రాలకుగానూ scripting, casting, scoring, and editing విభాగాలను ఒంటిచేత్తో నడిపించి ఖ్యాతి గడించాడు సత్యజిత్ రే. ఆయన కెరీన్ మొత్తంలో.. 32 నేషనల్ ఫిల్మ్ అవార్డులు కలుపుకుని ఆయన ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం సాధించాడు. ఆయన పొందిన అవార్డులలో 1992లో వచ్చిన ఆస్కార్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు, 1992లో వచ్చిన భారతరత్న లు అత్యంత ముఖ్యమైనవి.

రే సినిమాలు చూడ్డం ద్వారానే భారతీయ అంతరాత్మని అత్యంత లోతుగా అర్థం చేసుకోగాలిగానని’ మయిఖేలాన్జిలో అంటోనియోనీ అన్నాడు. రే సినిమాల్లో వాస్తవికత ఎదిగి కవిత్వ వాస్తవికతగా రూపుదిద్దుకుంటుంది అన్నాడు ఎం.ఎఫ్ హుసెన్. ‘గాంధీ’ పాత్రను పోషించిన బెన్ కింగ్స్లే రాస్తూ “I salute you, the greatest of our poets of our cinema “అన్నాడు. ఇలా ఒకరేమిటి లిండ్సే ఆండర్సన్, గోవింద్ నిహలానీ, అరవిందన్, అదూర్, గస్తాన్ రోబెర్గ్, సల్మాన్ రష్దీ, మ్రినాల్ సేన్, ఇలా ఎందరెందరో సత్యజిత్ రే పై తమ ప్రేమని అభిమానాన్నీ చాటుకున్నారు.

సత్యజిత్‌ రేని వర్ణించడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే చిన్నమాట సరిపోదు. తను పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వదిలాడు రే. వ్యక్తిగతంగానూ, వివిధ సినిమాలకూ, పుస్తకాలకుగానూ అతడు లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు. సత్యజిత్‌ సినిమాలు చాలా స్లోగా ఉంటాయనే వారు సినిమా గ్రామర్‌ గురించి తెలీనివారైనా అవ్వాలి లేదా సినిమాను ఒక సర్కస్‌గా మార్చిన వారైనా అయ్యుండాలి. రే భారత దేశపు పేదరికాన్ని విదేశాలకు అమ్మాడని ప్రఖ్యాత నటి నర్గిస్‌ ఓసారి విమర్శించారు. కానీ ‘తమరి ‘మదర్‌ ఇండియా’ భారతదేశ ఐశ్వర్యం చూపిందా?’ అంటూ ఉత్పల్‌ దత్తా చాలా ఘాటుగానే విమర్శించాడు. ఆనారోగ్యంతో ఉన్నా, చనిపోయే మునుపటి సంవత్సరం వరకూ రే చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నాడు. 1992లో ఆస్పత్రి బెడ్డు నుండి అకాడెమీ/ ఆస్కారు జీవనసాఫల్య గౌరవ పురస్కారం అందుకున్నాడు. సాటిలైట్‌ టెలివిజన్‌ ద్వారా ఆస్కారు అవార్డుల సభను సంబోధించాడు. ‘చలన చిత్రాల కళపై అతని అరుదైన పాండిత్యానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు, ప్రేక్షకులపై చెరగని ప్రభావాన్ని చూపిన అతని లోతైన మానవతా దృక్పథానికీ గుర్తింపుగా’ ఈ గౌరవం ఇస్తున్నట్టు అకాడమీ అవార్డు కమిటీ తన సైటేషన్లో పేర్కొంది.

సినిమాను సినిమా కోసం తీసిన దర్శకుడు సత్యజిత్ రే. భారతీయ దర్శక ప్రతిభను ఖండఖండాంతరాలకు వ్యాపింపచేసిన మేధావి. అందుకే మరే ఇతర దర్శకులకు సొంతం కాని ఎన్నో అవార్డులూ, రివార్డులూ ఆయన్ను వరించాయి. ఆయనపై భారతీయ దరిద్రాన్ని విదేశాలకు ఎగుమతి చేసి పేరు సాధించాడన్న విమర్శలున్నాయి. కానీ, తన కెరీర్లో ఏనాడూ భావదరిద్రానికి లోను కాని మహాదర్శకుడు సత్యజిత్ రే. తన 70వ ఏట అంటే, 1992 ఏప్రిల్ 23న రే మరణించినప్పుడు.. కలకత్తా నగరమంతా ఆయన ఇంటిముందు నివాళులర్పించడానికి నిలిచింది. భారతీయ జీవనచిత్రంలోని అణువణువూ తెరకెక్కించిన దర్శకుడిగా సత్యజిత్ రే తర్వాతే ఎవరైనా. ఆ మహనీయుడికి చిత్రాంజలి ఘటిస్తూ సెలవు.

-మహమ్మద్ గౌస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap