సినీ స్వర్ణయుగం దిగ్గజాలుగా పేరుపొందిన లెజెండ్స్ ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఆచార్య ఆత్రేయ, సాలూరి రాజేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తిగార్లను స్మరించుకుంటూ నిర్వహించిన వారి శత జయంతి ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. సోమవారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెండితెర వెలుగులు శీర్షికతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, సాయిరాం హాస్పిటల్స్ అధినేత కె.సత్యనారాయణ గౌడ్ సహకారం తో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ మహానుభావులు రచించి స్వరపరచిన ఆణిముత్యాల్లాంటి పాటలను ప్రవీణ్, చంద్రతేజ, సురేఖామూర్తి, పసుల లక్ష్మణ్, కుమారి సుజాత, కుమారి ఇందునయిన తదితరులు ఆలపించి సంగీత ప్రియులను ఓలలాడించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణలను ఘనంగా సత్కరించారు. డాక్టర్ మహ్మద్ రఫీ అధ్యక్షత వహించిన ఈ సభలో డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి, దైవజ్ఞ శర్మ, బిజెపి తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కె.గీతామూర్తి, ఆదాయపు పన్నుల అదనపు అధికారి ఎల్. మోహన్, కల్చరల్ టివి సిఇఓ ఎన్. పురుషోత్తం గౌడ్, గాయకుడు చింతలపాటి సురేష్, డిపిఆర్వో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్, శ్రీమతి పారిజాత దంపతులు సమన్వయం చేశారు.
ఫోటోలు: కంచె శ్రీనివాస్