థియేటర్లలో బొమ్మ పడేదెప్పుడు?

“ఎంతోకొంత ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వండి. జనం నిదానంగా థియేటర్లకు వచ్చి సినిమా చూసేలా అలవాటు చేస్తాం. వారికి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం” అంటూ గత యేడాది కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పట్టగానే థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వాలకు మొరపెట్టుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ యేడాది జూన్ 20 నుండి నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోమని తెలంగాణ ప్రభుత్వం, జూలై 8 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయి. కానీ ఈ రెండు రాష్ట్రాలలోని ఎగ్జిబిటర్స్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. పైగా తెలంగాణ స్టేట్ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ఏకంగా ఏ నిర్మాత తన చిత్రాలను ఓటీటీకి అక్టోబర్ నెలాఖరు వరకూ ఇవ్వకూడదంటూ తీర్మానం చేసింది.

మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చాక సింగిల్ స్క్రీనింగ్ థియేటర్లు చాలా వరకూ కల్యాణమండపాలుగా, గోడౌన్స్గా మారిపోయాయి. అయితే, ఆ తర్వాత
ఊహించని విధంగా నగరాలతో పాటు పట్టణాలలోనూ మల్టీప్లెక్స్ కల్చర్ పెరగడంతో థియేటర్ల సంఖ్య మళ్లీ పెరిగింది. అయితే ఇప్పటికీ సింగిల్ స్క్రీనింగ్ థియేటర్లు చాలా చోట్ల కనుమరుగవు తూనే ఉన్నాయి. దానికి ప్రధానకారణంగా ప్రేక్షకులు కోరుకునే ఆహ్లాదకర వాతావరణాన్ని సింగిల్ స్క్రీన్స్ కల్పించక పోవడం. టిక్కెట్ రేటు ఎక్కువైనా మల్టీప్లెక్స్ కు వెళ్లి జనం సినిమా చూస్తున్నారు తప్పితే సింగిల్ స్క్రీను ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయితే ఇవాళ మొత్తంగా సినిమా థియేటర్లకు వెళ్లి జనం సినిమాలు చూడటం బాగా తగ్గిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎగ్జిబిటర్స్ మొండివైఖరి చూస్తుంటే వాళ్లు ఎక్కిన కొమ్మను వాళ్లే నరుక్కుంటున్నారేమో అనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే ఇక్కడ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆ మధ్య సంక్రాంతికి విడుదలైన చిత్రాలను జనం విరగబడి చూశారు. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలను ఆదరించారు. కాబట్టి థియేటర్లు తెరిస్తే ఏదో ఒక స్థాయిలో జనం రావడం ఖాయం. కానీ తెలంగాణలో థియేటర్ల యాజమాన్యం పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తెరుస్తామని మొండికేసి కూర్చుంది. అలానే జంట నగరాల్లోని థియేటర్ల యాజమాన్యం అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరెంట్ ఛార్జీలపై కేసిఆర్ ఇచ్చిన హామీనినిలబెట్టుకోమని కోరుతున్నాయి. నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తీసినా, కరోనా కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో తమకు తడిసి మోపెడు అవుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. అంతేకాకుండా… తాము థియేటర్లు తెరిచే వరకూ నిర్మాతలు వేచి ఉండాలని, కనీసం అక్టోబర్ నెలాఖరు వరకూ ఆగి, అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లమని నిర్మాతలను ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. దాదాపుగా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనూ పునరావృతమైంది. జగన్ ప్రభుత్వమైతే కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీతోనే రోజుకు మూడు ఆటల చొప్పున థియేటర్లను తెరచుకోమని చెప్పింది.

కానీ ఇది ఎంత మాత్రం తమకు ఉపయోగపడదని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పెద్దలు చెబుతున్నారు. పైగా పెద్ద సినిమాలు లేని ఈ సమయంలో థియేటర్లు తెరిచినా కలెక్షన్లు ఉండవని, కానీ స్క్రీనింగ్, కలెక్షన్లతో నిమిత్తం లేకుండా క్యూబ్ ఛార్జీలను సర్వీస్ ప్రొవైడర్స్ వసూలు చేస్తుంటారని అంటున్నారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో ఎగ్జిబిటర్స్ విసిగిపోయారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సందర్భంగా టిక్కెట్ రేట్లు పెంచుకుంటామని ఎగ్జిబిటర్స్ కోరితే, జగన్ ప్రభుత్వం ససేమిరా అంది. దాంతో కినుక వహించిన ఎగ్జిబిటర్స్ ఇప్పుడు ప్రభుత్వం థియేటర్లు తెరచుకోమని చెప్పినా, టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తెరుస్తామని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. పైకి మాత్రం నూరుశాతం ఆక్యుపెన్సీకి ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు తీస్తామని అంటున్నారు. ఆ రకంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ ప్రభుత్వాలతో వైరానికి దిగారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని భీష్మించుకుని కూర్చున్నారు. చిత్రం ఏమంటే… వీరి సమస్యలను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవడం లేదు. థియేటర్లు తెరవకపోతే వారికే నష్టం తప్పితే తమకేం ఇబ్బంది లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాయి. దాంతో ఎగ్జిబిటరు ఏం పాలుపోకుండా ఉంది.

ఇటు ఎగ్జిబిటర్స్, అటు ప్రభుత్వాల పట్టుదల కారణంగా మధ్యలో నిర్మాతలు నలిగిపోతున్నారన్నది వాస్తవం. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత చాలామంది నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా, థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే సినిమాలను విడుదల చేస్తామని చెప్పారు. అలా దాదాపు పది మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎగ్జిబిటర్స్ థియేటర్లు తెరవకపోవడంతో వాళ్లంతా ఇప్పుడు ఓటీటీ బాట పట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. దీంతో మిగిలిన వారు సైతం ఓటీటీ బాట పట్టడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే, ఎగ్జిబిటర్స్ పరిస్థితి పేనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. మరీ తెగేవరకూ లాక్కోకుండా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, వెంటనే థియేటర్లను తెరిస్తే వారికే మంచిది. ఎందుకంటే ‘తిమ్మరుసు’ లాంటి కొన్ని సినిమాల నిర్మాతలు ఈ నెలాఖరుకైనా థియేటర్లు తెరిస్తే వాటిలోనే తమ చిత్రాలు ప్రదర్శించాలని ఆశపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap