- కరోనాతో రెండేళ్లుగా సీజన్ గల్లంతు
- ఆఫ్ సెట్ యంత్రాలను అమ్మేస్తున్న ప్రింటర్స్
కరోనా నేపథ్యంలో అన్ని రంగాలకు మాదిరిగానే ముద్రణా రంగమూ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సీజన్ ఆధారంగా వచ్చే వ్యాపారం దెబ్బతినటంతో పాటు కోవిడ్ తో రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో దాని ప్రభావం ఈ రంగంపై పడింది. ఏటా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా సుమారు రూ.5 వేల కోట్ల వ్యాపారం ఉండేదని, కరోనాకు ముందుతో పోలిస్తే సుమారు 50 శాతం వరకు వ్యాపారం తగ్గిందని రాష్ట్ర ఆఫ్ సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ఇది ఈ రంగంపై ఆధారపడిన సుమారు లక్షన్నరమంది ఉపాధిపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు పేపర్ ధరలు కిలో రూ. 48 నుంచి రూ. 68 వరకు పెరిగాయి. ఫలితంగా నిర్వహణ వ్యయం పెరిగి, వ్యాపారం తగ్గింది. రాష్ట్రంలో ప్రముఖ వాణిజ్య కేంద్రాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాలతో పాటు చాలాచోట్ల ప్రింటింగ్ ప్రెస్లను మూసేస్తున్నారని అసోసియేషన్ నేతలు తెలిపారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ప్రముఖ ప్రింటింగ్ సంస్థకు గతంలో రెండుచోట్ల దుకాణాలు ఉంటే ఒక దాన్ని మూసేసి అందులో వినియోగిస్తున్న యంత్రాన్ని విక్రయించిందని, మరో ప్రముఖ సంస్థ ఒక కేంద్రాన్ని పూర్తిగా మూసేసి రుణాన్ని రీషెడ్యూల్ చేసుకుందని తెలిపారు.
రెండేళ్లుగా పని లేదు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని వివిధ వ్యాపార సంస్థలు వినియోగదారుల కోసం డైరీ, క్యాలెండర్ల ముద్రణకు ఆర్డర్లు ఇస్తాయి. జనవరి నుంచి మార్చి వరకు కొత్త విద్యా సంవత్సరానికి పుస్తకాల ముద్రణ.. మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో పెళ్లిళ్ల సీజన్లో ఆహ్వాన పత్రికల ముద్రణతో వ్యాపారం బాగుంటుంది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. పెళ్లిళ్లకు నిర్దేశిత సంఖ్యలోనే ఆహ్వానితుల్ని ప్రభుత్వం అనుమతించటంతో పెళ్లి పత్రికలను వాట్సప్ ద్వారానే పంపుతున్నారు.. ఆన్లైన్ తరగతుల వల్ల కూడా విద్యార్థులు టెక్ట్స్ బుక్స్, నోట్స్ బుక్స్ కూడా కొనడం తగ్గింది.
స్థిరాస్తి, ఇతర వ్యాపారాలు కూడా కరోనా వల్ల నెమ్మదించాయి. చాలా సంస్థలు వ్యాపార విస్తరణ ప్రతిపాదనలను నిలిపేశాయి. దీంతో ఆకర్షణీయమైన బ్రోచర్లు. విజిటింగ్ కార్డుల ముద్రణకోసం ఆర్డర్లు రావటం లేదు. వాణిజ్య సంస్థల బ్రోచర్ల ముద్రణ కూడా తగ్గి పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది.
ముద్రణా రంగానికి అనుబంధంగా ఉన్న డిజైనర్లు, లామినేషన్స్ ఫ్లెక్స్ బ్యానర్లు, డిజిటల్ ప్రింటర్లు, డై కట్టర్లు, కవర్ల తయారీ, ప్యాకింగ్ రంగాలపై కూడా ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి సుమారు 40 వేల యూనిట్లు ఉన్నాయని అసోసియేషన్ నేతలు చెప్పారు.
“జీఎస్టీ పోటు ముద్రణా రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పుస్తకాల ముద్రణ, బ్రోచర్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి, కార్టన్లు, చీరల ప్యాకింగ్, పిజ్జా, స్వీట్ ప్యాకింగ్ పెట్టెలపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచాలని ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల వినియోగదారుడిపై అదనపు భారం పడుతుంది. జీఎస్టీ ఇప్పుడు వారు తీసుకునే అవకాశం కూడా ఉండదు.”
-రాష్ట్ర ఆఫ్ సెట్ ప్రింటర్స్ అసోసియేషన్
కార్యనిర్వాహక కార్యదర్శి