సుబ్బరాయ శాస్త్రిగారు అంటే అతి కొద్దిమందికే తెలుసును. అయితే అందరికీ పరిచయమయిన పేరు బుజ్జాయి గారు. మహాకవి, పరిచయం అక్కరలేని మహానుభావుడు, ప్రముఖ గేయ రచయిత, తనదంటూ ఒక ప్రత్యేక బాణీని నెలకొల్పిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు. వారు కొంతకాలం కాకినాడలో పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేసారు. అటు పిమ్మట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కొంతకాలం, పిమ్మట మద్రాస్ లో తెలుగు సినిమా రంగంలో గీత రచయితగా చాలాకాలం తమ సాహితీ వైదుష్యాన్ని సమాజంలోని పదిమందికీ పండువెన్నెలలా పంచి ఇచ్చారు.
దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి తనయుడు బుజ్జాయిగారు. సెప్టెంబర్ 11, 1931 న బుజ్జాయి గారు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురంలో జన్మించారు. చిన్ననాటి నుండి తండ్రిగారిని అనుసరించి తరచుగా సాహితీ సభలకు వెడుతూ ఉండడంతో, బుజ్జాయి గారికి సాహితీ గంధపరిమళాలు అబ్బాయి. చదువుల విషయానికి వస్తే, పెద్ద పెద్ద డిగ్రీ చదువులు లాంటివి చదువుకోకపోయినా బుజ్జాయిగారికి తండ్రిగారి సాహచర్యం లో తెలుగు భాష పట్ల ఆరాధనా భావం కలిగి ఆ దిశగా తన జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉండడం జరిగింది. కాగా, చిత్రకారునిగా ఆయన మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘పంచతంత్రం’ కామిక్ కథలలో వారు సృష్టించిన జంతువుల పాత్ర చిత్రణ ప్రత్యేకించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. తన తండ్రిగారితో తన అనుబంధాన్ని హైలైట్ చేస్తూ ఆయన వ్రాసిన “నాన్న- నేను” అన్న పుస్తకం ఆయనకు ఎంతో మన్ననని, గుర్తింపుని తెచ్చిపెట్టింది.
బుజ్జాయిగారి గురించి, ఆయన చిత్రకళా ప్రావీణ్యం గురించి విన్న నాకు ఆయనను ఎలాగైనా ఒకసారి కలుసుకోవాలన్న బలమైన కోరిక కలిగింది. సరే – ఆ కోరికకి ఊపిరులూదాలని తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయన చిరునామా వగైరాలను సేకరించాను. ఆయన వ్రాసిన పుస్తకాన్ని కొని చదవడంతో ఆ కోరిక మరింత బలీయమైంది. చెన్నై నుండి పుదుచ్చేరి వెళ్లి అక్కడ శ్రీ అరవిందాశ్రమంను దర్శించుకుని తిరుగుప్రయాణంలో ఈ.సి.ఆర్. రోడ్ మార్గాన చెన్నైకి వస్తూ తిరువాన్మియూర్ వద్ద బస్ దిగి ఆటోలో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న బుజ్జాయిగారి ఇంటికి వెళ్ళాను. నా రాక గురించి ముందుగా వారికి ఫోన్ చేసి చెప్పడం, వారు ఆనందం తో నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగాయి. ఆ విధంగా మా ముఖాముఖి తొలి కలయిక జరిగింది. ఈ సంఘటన జరిగిన తేదీ మే 19, 2017.. అంటే దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి అయిందన్నమాట. బుజ్జాయిగారు వారి అమ్మాయి వద్ద ఉంటున్నారు. బుజ్జాయిగారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి కృష్ణ శాస్త్రి ( తాత గారి పేరే) చెన్నై లోనే బీసెంట్ నగర్ లో ఉంటాడు. అమ్మాయి రేఖ తిరువాన్మియూర్ లోనూ, మరొక అమ్మాయి లలిత రామ్ అమెరికా లోనూ ఉంటారు. లలిత రామ్ రచయిత్రి. తాను వ్రాసిన అవంతి కళ్యాణం – నవలకి కవర్ డిజైన్ బుజ్జాయి గారు వేయడం మరొక విశేషం. ఈ సమావేశం అయి, ఫోటోలు తీసుకుని, నేను వీడ్కోలు చెప్పే సమయంలో కానుక గా వారి పుస్తకం : ” వీరేశలింగం – స్వీయ చరిత్ర ” ఆధారంగా బొమ్మల కథ నాకు సంతకం చేసి ఇచ్చారు.
బుజ్జాయిగారు, వీణ విద్వాన్ శ్రీ చల్లపల్లి చిట్టిబాబుగారు తోడల్లుళ్లు అన్న విషయం కూడా మా సంభాషణలలో నేను గ్రహించాను.
దగ్గరగా 90 సంవత్సరాల మునిమాపు వయసులో కూడా బుజ్జాయిగారి జ్ఞాపక శక్తి అమోఘం, అద్భుతం. ఇక ఆయన మాట్లాడే ప్రతీ మాట ఎంతో వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉంటుంది. ఆయన ను కదిలిస్తే చాలు.. ఆ నాటి విశేషాలు.. ఎన్నో.. ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. అవి వింటూ ఉంటె .. ఇక టైం ప్రస్తావన అంటూ ఉండదు. ఇంకా… ఇంకా వినాలని అనిపిస్తుంది.
ఇప్పటికీ, కనీసం వారం, పది రోజులకొకసారైనా ఫోన్ లో పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడతారు బుజ్జాయిగారు.
బుజ్జాయి గారు ఒక సందర్భంలో తన రచనలు, దేవులపల్లి వారి రచనలు కొన్ని కావాలని అడిగారు. నేను విజయవాడ బుక్ షాప్ లో ఆ పుస్తకాలను కొని వారికి పంపాను. అయితే వాటిని ఆయన వూరికే తీసుకోవడానికి ఇష్టపడలేదు. వాటి ధరను చెక్కు రూపేణా నాకు కొరియర్ లో పంపుతూ ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. దయచేసి చిత్తగించండి. ధన్యవాదాలు.
– ఓలేటి వెంకట సుబ్బారావు
మంచి వ్యాసం. బుజ్జాయి గారు దేవులపల్లి గారి కుమారుడని, వీణ చిట్టిబాబు గారు తోడల్లుడు అని మొదటిసారి తెలుసుకున్నాను. బుజ్జాయి గారి చిత్రాలు చిన్నపుడు చూశాను. ఇపుడోసారి చూడాలనిపిస్తుంది
ప్రముఖ చిత్రకారుడు శ్రీ బుజ్జాయి గారి గురించిన శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారి వ్యాసం ద్వారా వారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. శ్రీ వోలేటి గార్కి, మీకూ కృతజ్ఞతలు, అభినందనలు. –Bomman