యస్.ఎన్. వెంటపల్లి ‘కరోనా కార్టూన్ల’ పుస్తక సమీక్ష.
కార్టూన్ అనేది ఒక ఉత్కృష్టమైన కళ. ఈ రోజు కార్టూని నిర్వచించడం అసాధ్యం అనే చెప్పొచ్చు. దాని అర్ధం విశ్వమంత… అది ఒక కవిత. ఒక పెయింటింగ్. ఒక నవల. ఒక కావ్యం. ఒక ఉపన్యాసం. ఒక మార్గదర్శి, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక విమర్శ, ఒక అస్త్రం, ఒక జర్నలిజం.
హాస్యం అనేది అందులోని ఒక చిన్న కోణం. అంతే.. ఇటువంటి కార్టూన్లు వేసే కార్టూనిస్టులు మనకు ఎంతో మంది ఉన్నారు. మంచి మంచి కార్టూన్లు వేసి పాఠకులని మెప్పించాలి అని వీళ్ళు ఎపుడో తపన పడుతుంటారు.
భార్యా భర్తల మధ్య చిలిపి గొడవలు చూసినా, చిన్న కారణాలకే అలిగి బుంగమూతి పెట్టుకున్న ప్రేమికులని చూసినా, అబద్దాలు చెప్పి తరువాత నవ్వుల పాలవుతున్న రాయకీయ నాయకులని చూసినా, ఒక పెళ్లి పూర్తి కాకుండానే మరో పెళ్ళికి సిద్ధమయ్యే సినిమా వాళ్ళని చూసినా, అలాగే మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసినా కార్టూనిస్టు కలం దానంతట అదే కదులుతుంది. ఒక కార్టూన్ ని సృష్టిస్తుంది. అది ఒక్క క్షణంలో చూసిన వారి గుండెల్లోకి దూసుకుపోతుంది. మెదడులో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో మార్పులకు కారణమవుతుంది.
అన్నీ అద్భుతాలని చేయగలిగే గుణం, దమ్ము ఈ ఒక్క కార్టూన్ కళకే ఉంది. అందుకే ప్రతీ ఒక్క కార్టూనిస్టు తానూ కార్టూనిస్టు అయినందుకు పొంగిపోతాడు. గర్వపడతాడు. అలాగే ప్రతీ కార్టూనిస్టు తన కార్టూన్లతో ఒక పుస్తకం రావాలనుకుంటాడు. అటువంటి ఆలోచనతోనే మా మిత్రుడు వెంటపల్లి సత్యనారాయణగారు తన కార్టూన్ల పుస్తకంతో మన ముందుకు రావడం జరిగింది.
వెంటపల్లి సత్యనారాయణగారితో నా పరిచయం 2 దశాబ్దాలకు పైమాటే. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో వుండి కూడా చిత్రకళ మరియు కార్టూన్ రంగాల్లో తన ఉత్సాహాన్ని చూపిస్తూ, ఎంతో విలువైన కాలాన్ని ఈ కళల కోసం వెచ్చిస్తున్నారంటేనే తెలుస్తుంది కళలపై తనకెంత మక్కువో. స్వతహాగా మంచి చిత్రకారుడైన వీరికి వేలకొద్దీ కార్టూన్లు వేసిన అనుభవం ఉంది. మన చుట్టూ జరిగే అనేక విషయాల పైన వీరు స్పందించి కార్టూన్లు వేయడం జరిగింది.
2020 సంవత్సరంలో Toonsmag అనే సంస్థ ద్వారా Cartoonist of the year అనే అవార్డుతో పాటు అనేక ప్రాంతీయ, జాతీయ కార్టూన్ల పోటీలలో అనేక బహుమతులందుకోవడం జరిగింది.
మనందరికీ తెలుసు. గత మూడు సంవత్సరాలలో కరోనా అనే పీడకల ప్రపంచం మొత్తాన్నీ ఎలా వణికించిందో.. కోట్లాది ప్రాణాలు చూస్తుండగానే గాల్లో కలసిపోయాయి. ఒక విషాద వాతావరణాన్ని నింపింది. ప్రతీ ఒక్కకుటుంబంలో కరోనా యొక్క విషాద ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి.
ముందు మాటలో “కార్టూనిస్ట్ నిత్య చైతన్య శీలి” అని కళాసాగర్ గారు అన్నట్లు… ఈ ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రపంచంలోని కార్టూనిస్టులందరూ తమ కార్టూన్ అస్త్రాలని సంధించి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ప్రజలని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టారు. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఏ ఏ విధంగా నడుచుకోవాలి అనే జాగ్రత్తలు చెబుతూ కార్టూన్ల ద్వారా ప్రజలకి వెన్ను దన్నుగా నిలిచారు.
అలాగే, మన వెంటపల్లిగారు కూడా ఆ విషాద పరిస్థితులకి చలించి, ఈ కరోనా రక్కసి పైన కార్టూన్లు వేయడం జరిగింది.
ఇందులో విషమ పరిస్థితులపై వేసిన వ్యంగ్యాస్త్రాలూ ఉన్నాయి.. తోటివారికి ఇతరులు చేసిన సహాయాలు ఉన్నాయి. ఈ కరోనా మన వ్యవస్థలలో చేసిన సమూలమైన మార్పులు, ఉదాహరణకి, మానవ సంబంధాలు, శుభ్రంగా ఉండడం, మాస్కులూ, హ్యాండ్ వాష్ లూ, క్వారంటైన్, నెలల తరబడీ ఇంట్లోనే మగ్గిపోవడం వలన ఏర్పడిన బద్ధకం, పెరిగిన భక్తి, డాక్టర్లు, వలసలు, పోషకరాలపై పెరిగిన శ్రద్ద మొదలైన వాటి మీద వ్యంగ్యాస్త్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
పుస్తకం లో ఉన్న కార్టూన్ల సంఖ్య తక్కువైనా అన్నీ మన జీవితాల్లో మన కళ్ళెదురుగా జరిగిన విశేషాలపై వేసినవే కనుక అందరికీ నచ్చుతాయి. అలాగే మొదట్లో చెప్పినట్లు వెంటపల్లిగారు చిత్రకారుడైనందువల్ల ఆ ఒరవడి తన కార్టూన్లలో కనిపించి తన కార్టూన్లకి ఒక ప్రత్యేకమైన శైలి కనబడుతుంది.
కార్టూన్లతో బాటు ఆయన శ్రేయోభిలాషుల అభినందనలెన్నో ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఈ పుస్తకాన్ని ఆర్ట్ పేపర్ పై రంగుల్లో ప్రచురించడం వలన మరింత చూడముచ్చటగా వుంది.
అలాగే వివిధ వార్తా పత్రికలలో ఆయన వేసిన కార్టూన్లపై వచ్చిన వార్తా కధనాలు కూడా ఎన్నో ఇందులో మనకు కనబడతాయి.
వెరసి వెంటపల్లి వారి ఈ “కరోనా కార్టూన్లు” పుస్తకం ఒక పరిపూర్ణమైన పుస్తకంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత మంచి పుస్తకాన్ని 64కళలు.కాం పత్రిక 12వ వార్షికోత్సవంలో ఆవిష్కరించడం మరో ప్రత్యేకత.
–నాగిశెట్టి
పేజీలు : 72, వెల : రూ. 140/-
ప్రతులకు: యస్.ఎన్. వెంటపల్లి (94913 78313), కళాసాగర్
Thank u so much NAGISETTI sir for giving your wonderful review on my CARONA CARTOONS book .AlsoThanks to Kalasagar garu for publishing this review
Very nice… Congratulations…
Very nice… Congratulations…నాగిశెట్టిగారి సమీక్ష బాగుంది.