ప్రచురణా రంగానికి కరోనా కష్టాలు…!

• తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన చిన్న పత్రికలు ..
• ‘ప్రింట్’ భారాన్ని తగ్గించుకునేందుకు యత్నాలు మొదలు ..
• ‘డిజిటల్’ రూపు సంతరించుకుంటున్న ప్రధాన పత్రికలు ..
• ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ దీ అదే దారి …

• ఖర్చులను నియంత్రించే చర్యలు ప్రారంభం..
• తొలివేటు జర్నలిస్టులపైనే ..
• తాత్కాలికంగా కొన్ని ఎడిషన్ల మూసివేత ?
• అధిక వేతనాలు అందుకునే వారిని సాగనంపే చర్యలు..
• లాక్డౌన్ తో పుంజుకున్న వెబ్ మీడియా…
………………………………………………………………………………………
కరోనావైరస్ ప్రభావం విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలపైనా పడింది. కూలీ దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకూ అందరూ ఈ మహమ్మారి బారిన పడ్డ బాధితులే. నెల రోజుల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసిన ఈ అంటువ్యాధి ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ప్రయత్నిస్తోంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రింట్ మీడియా రంగంపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. మహమ్మారి తాకిడితో చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా దాదాపు ప్రచురణకర్తలంతా విలవిల్లాడుతున్నారు.

గణనీయంగా తగ్గిన వాణిజ్య ప్రకటనల ఆదాయంతో ఆర్ధికపరమైన అవస్థల్లో పడ్డ యాజమాన్యాలు అంతర్గతంగా అన్ని విభాగాలలో ఖర్చులు కుదించే పనిలో పడ్డాయి. అందులో భాగంగా పేజీల తగ్గింపు, సిబ్బంది కుదింపు, వేతనాల మదింపు, నిర్వహణ ఖర్చుల పరంగా భారమని భావిస్తున్న ఎడిషన్లు, కార్యాలయాల మూసివేత, జీతభత్యాల చెల్లింపుల పరంగా అధిక వేతనాలు తీసుకుంటున్న వర్కింగ్ జర్నలిస్టులను వదిలించుకోవడం, అవసరమైన మేరకే నాన్ జర్నలిస్టులను కొనసాగించడం, న్యూస్ప్రింట్ వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు నియంత్రించి దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా మెజారిటీ ప్రచురణకర్తలు వ్యూహరచన చేస్తున్నారు. ఇదే క్రమంలో మీడియాలో తమ ఉనికిని చాటుకునేందుకు ఆయా యాజమాన్యాలు ప్రింట్ ఎడిషన్ స్థానంలో ఆన్లైన్ ఎడిషన్ల ప్రాచుర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల చాలా వరకు పత్రికలు ‘డిజిటల్’ రూపు సంతరించుకున్నాయి.

‘ప్రింట్’ భారాన్ని తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే బహుళజాతి ప్రచురణ సంస్థలు సైతం ఆన్లైన్కే పరిమితం అవ్వాలని నిర్ణయించాయి. తగ్గిన ఆదాయం దృష్ట్యా దాదాపు అన్ని రకాల ఖర్చులను నియంత్రించే వ్యూహరచనలో ఉన్న ప్రచురణకర్తలు తమ తొలివేటుకు జర్నలిస్టులనే బలిచేస్తున్నారు. అవసరం లేదనుకునే ఎడిషన్ల మూసివేత పేరిట దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోనున్నారు. పాత్రికేయ సంఘాల వత్తిడి, పోరాటం ఫలితంగా ఆయా యాజమాన్యాలు కొంత వరకు చిన్న చిన్న వేతన జీవులను విడిచిపెట్టేందుకు సమ్మతిస్తున్నా పెద్దమొత్తంలో వేతనాలు అందుకునే వారిని మాత్రం సాగనంపాలనే చూస్తున్నాయి.

మరోవైపు, కొవిడ్-19 విపత్తు నేపథ్యంలో అంతర్జాతీయంగా వెబ్ మీడియా మరింత పుంజుకుంది. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా కూడా వెబ్ మీడియా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెబ్ మీడియాకు కూడా ప్రకటనల రూపంలో చేయూతనిందిస్తుండడంతో ఈ రంగంలో నిలదొక్కుకోవడం సరైన నిర్ణయంగా ఆయా మీడియా సంస్థలు భావిస్తున్నాయి. కరోనా విపత్తు నేపథ్యంలో నష్టపోయిన మీడియాను ఉద్దీపన ప్యాకేజీ ద్వారా మోదీ సర్కారు ఆదుకుంటుందని ఆశించిన మీడియా చివరికి ‘స్వీయ నియంత్రణ’ చర్యలపైనే దృష్టిపెట్టింది.

వాస్తవానికి, కరోనావైరస్తో సంబంధం లేకుండానే ఐదేళ్ల కిందట అంతర్జాతీయంగా న్యూస్ప్రింట్, ఇంకుల ధరలు పెరిగినప్పుడే పేజీలు తగ్గించి దశలవారీగా డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని బహుళజాతి మీడియా సంస్థలు ఆలోచన చేశాయి. అయితే, అప్పట్లో ప్రభుత్వాలు ప్రకటనల రూపంలో కొంత వరకు ఆదుకోవడం, వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా పుంజుకోవడంతో మెజారిటీ యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని సవరించుకుని ప్రింట్ ఎడిషన్లను కొనసాగిస్తూనే ఆన్లైన్ ఎడిషన్లను ప్రారంభిస్తూ వచ్చాయి.

భారతదేశం విషయానికి వస్తే, చిన్నాపెద్దా కలిపి ఆ సంఖ్య దాదాపు లక్షకు చేరువలో ఉన్నట్లు అంచనా. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్పేపర్స్ ఫర్ ఇండియా (RNI) లెక్కలను బట్టి చూస్తే, గత వందేళ్లలో (1920 జనవరి 1 నుంచి 2020 జనవరి 1 వరకు) దేశంలో మొత్తం 1,50,679 టైటిళ్లు నమోదు కాబడీ వున్నాయి.
కోవిడ్ -19 ప్రసారానికి భయపడి వార్తాపత్రిక డెలివరీ అబ్బాయిల ప్రవేశాన్ని హౌసింగ్ సొసైటీలు అనుమతించకపోవడంతో సంక్షోభం పెరిగిందని చాలా మంది చెప్పడంతో విక్రేతలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారు. కొనసాగుతున్న లాక్డౌన్ సమయంలో ముద్రణ, ఎలక్ట్రానిక్ మీడియా సజావుగా పనిచేయడానికి అనుమతించమని ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ఇంతకుముందు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది, ‘‘సమయానుసారంగా ప్రామాణికమైన సమాచార వ్యాప్తిని’’ నిర్ధారించడానికి పత్రికల ప్రాముఖ్యతని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయినా ఫలితం లేకుండాపోయింది.ప్రకటన ఆదాయాలు దెబ్బతిన్నాయి…
ప్రధానంగా ప్రకటనల ఆదాయాలు, అమ్మకాలు తగ్గడం వల్ల కూడా నస్టాలు పెరిగాయి. ‘‘లాక్డౌన్ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని మేము ఆశిస్తున్నాము, కానీ అఖిల భారత లాక్డౌన్తో, ఇది చాలా కాలం పాటు సాగుతుంది’’ అని ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక తన కథనంలో తెలిపింది. ‘‘పరిశ్రమను ఎక్కువగా దెబ్బతీసింది ఏమిటంటే ప్రస్తుతం ప్రకటన ప్రవాహాలు లేవు. సర్క్యులేషన్ లేనందున ఆ ఆదాయాలు కూడా తగ్గాయి.
ఇకపోతే, కరోనా విపత్తు నేపథ్యంలో ఉద్యోగాలు ఊడుతున్నాయనే ఆందోళన దేశవ్యాప్తంగా ప్రింట్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఆఫీసుల్లో పనిచేసే సబ్ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, టెక్నిషియన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకే పరిమితం కావడం లేదు, చివరకు కంట్రిబ్యూటర్ల వ్యవస్థ దాకా వ్యాపిస్తోంది.
తెలుగు పత్రికల్లో ఒకటి రెండు పెద్దవి మినహా మిగిలినవన్నీ గత రెండు నెలలుగా పూర్తిగా జీతాలు ఇవ్వడమే మానేశాయంటే ఆశ్చర్యమేస్తుంది. అంతకముందేదో ఇచ్చేవని కాదు గానీ, కనీసం తెచ్చిన యాడ్స్లో కమిషన్ రూపంలోనైనా ఆ మాత్రం, ఈ మాత్రం ఇస్తుండేవి. ఇప్పుడు ఆ ప్రకటనల ఆదాయం లేకుండాపోవడంతో ఎవరు కరోనా సాయం చేస్తారా? అని ఎదురుచూడడం నిజమైన జర్నలిస్టుల వంతయింది. ఏడెనిమిది వేల నుంచి పది వేల దాకా వేతనాలు పొందే పీసీ ఇన్చార్జులకే ఇప్పుడు 1500 నుంచి 2500 రూపాయలు చేతిలో పెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇంకోవైపు, పత్రికలు కంట్రిబ్యూటర్లనూ తొలగించే పనిలో పడ్డాయి. టాబ్లాయిడ్లకు మంగళం పాడినట్టే వాటి కోసం పనిచేసే మండల కంట్రీబ్యూటర్ల వ్యవస్థనూ క్రమంగా రద్దుచేయాలని యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలిసింది.
డిసెంబరు దాకా టాబ్లాయిడ్లు ఉండవు అని ప్రధాన పత్రికల్లో చెబుతున్నప్పటికీ ఆ తరువాత కూడా ఉండకపోవచ్చునని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి! ఇక సండే మ్యాగజైన్లు, ఫీచర్స్ పేజీలు ఎత్తేస్తే, ఆ సబ్ ఎడిటర్లకూ మూడినట్టే! ఈనాడు, డెక్కన్ క్రానికల్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలకు కూడా చాలా ఏళ్ల తరువాత తొలిసారిగా నష్టాలు మొదలయ్యాయట. ఎన్నడూ లేనిది నిర్ణీత టారిఫ్లో కూడా యాడ్స్కు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటానికి ముందుకొస్తున్నాయి ఆయా పత్రికలు. గతంలో తామెంత రేటు చెబితే అంత అన్నట్టుగా వ్యవహరించేవి.

ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ దీ అదే దారి … కరోనా కారణంగా పాటశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్తితిలో పాఠ్యపుస్తకాలు ముద్రించే ప్రచురణ సంస్థలు వున్నాయి. ప్రచురణ సంస్థలు, ప్రింటింగ్ ప్రెస్స్ లు అందులో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది.

-కె.యస్. 

2 thoughts on “ప్రచురణా రంగానికి కరోనా కష్టాలు…!

  1. ప్రింటుమీడియా దెబ్బ తినకూడదు అని మనసారా కోరుకునే వాళ్లలో నేనొకడి ని. మొబైళ్ళలో. కంప్యూటర్ లలో పేపర్లు పుస్తకాలు చదవడంఏమాత్రం ఆహ్లాదకరంగా ఉండదు. –బొమ్మన్ కార్టూనిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap