న్యూఇయర్ లో జనానికి ‘కరోనా ‘ వైరస్ ఓ ‘న్యూఫియర్ ‘
వాయు వేగంతో ఈ భూమండలాన్ని ఆక్రమించింది ఈ వైరస్…
కోవిడ్-19 కోట్లాదిమందిని కాటేసే కాలసర్పం
ఇప్పట్లో ‘కరోనా’ కాటుకు విరుగుడు లేదని దీని దర్పం…
దీని భయంతో ప్రపంచాన్ని ఒకటి గా చేసింది
దీని ‘విష’మ ప్రభావంతో ప్రపంచాన్ని ఒక ‘కాటి ‘గా చేసింది…
‘కరోనా’ ప్రతి దేశానా తన రూపం మార్చింది
తన ఉగ్రరూపంతో అగ్ర రాజ్యాలనూ మరణశయ్య పై చేర్చింది
ఈ కరోనా జగతి ప్రగతిని ఏమార్చింది
కరోనా… ఒక దేశానికో, ఓ ప్రదేశానికో కాలేదు పరిమితం
దీని పరిధి అపరిమితం…
జనం జాగ్రత్తగా వుండటమే హితం
అంతర్జాతీయంగా ఆలోచించాలి దీని అంతం
ఇది అజ్ఞాత శత్రువు, ఇది అజ్ఞాత మృత్యువు
జనాలు వారి వారి మధ్య దూరం పాటిస్తే… కరోనా వారి దరిచేరదు…
జనం దగ్గర దగ్గరగా వుంటే ఇది వారిని వదిలి పెట్టదు
ఇది మన ఇరుగు పొరుగును, ఇరుగు ‘పురుగు ‘ లా చేస్తుంది
కరోనా ని తప్పించుకోవటం మన చేతుల్లో… మన చేతల్లోనే వుంది…
తరచూ చేతులు కడుగుకోవటం చాలా మంచిది
జనాల్లో కలగలసి పోవటానికి, కరచాలనాలకు ఇక ఓ దండం పెట్టాలి…
కరోనా వ్యాక్సిన్ రాకకోసం ఓర్పుతో వేచివుండాలి
కరోనా ‘ఫియర్’ లేని ‘న్యూఇయర్స్’ జనం జరుపుకోవాలి…
ప్రపంచ దేశాలన్నీ ‘కరోనా’ ఫ్రీ కంట్రీలుగా ఆనందంగా వుండాలి…
-బి.ఎం.పి. సింగ్