అశోక్ కుమార్ రచన ప్రారంభం నుంచి నిర్మాణం, ముగింపు ఏది చేసినా అన్నీ విలక్షణంగానే వుంటాయ్. సాధారణంగా రచయితలు అలవాటుగా ఏ కార్యక్రమమం మొదలు పెట్టినా శ్రీకారం చుడుతుంటారు సింగంపల్లి మాత్రం శ్రీశ్రీ కారం చుడతాడు. కరోనా మీద చాలామంది కవితల్ని రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సంతృప్తి చెందితే, అసి తను రాసిన వాటిని ఒకసంపుటిగా ముద్రీకరించడం వెనుక ఒక సామాజిక ప్రయోజనం కనిపిస్తుంది. సంపుటిని వలసకార్మికుల రక్త పాదాలకు అంకితమివ్వడం, కరోనా రోగులకు వైద్యసేవలందించే డాక్టర్లు, నర్సులు, ఆయాలు వారి వెలలేని సేవలు లోకానికి చాటడం అశోక్ ప్రత్యేకత.
అందరు కవులులానే అశోక్ కూడా తన సంపుటాలకు ముందుమాటలు (చాలా వాటికి) రాయించుకున్నా ఈ కరోనా కవిత్వానికి మిత్రుడు జర్నలిస్ట్ కెవియస్ వర్మ చేసిన ఇంటర్వ్యూను ముందుమాటగా పొందు పరిచాడు. అది ఇంటర్ వ్యూనా అంటే అతని సహజలక్షణమైన మూఢ, మూర్ఖ, బాధ్యతారహిత పాలకులను ఎండగట్టిన విధం ఇందులో కనిపిస్తుంది. కరడుగట్టిన హేతువాదికి అభిమానం కొద్దీ కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు చేసిన వారినీ ఇందులో వదలలేదు. అలాగే రోగ తీవ్రత దానికి ఉపయోగించిన స్టెరాయిడ్స్, అవి రోగిలో రేపిన అసహనం వైద్యం తీసుకుంటున్న తండ్రి వ్యక్తంచేసినప్పుడు డాక్టరైన కూతురు జ్వలిత ప్రేమపూర్వక మందలింపులు.. అర్థం చేసుకుని కూతురు వృత్తిశుద్ధికి మురిసిపోవడం, నలుగురు మనమరాళ్ల ప్రేమలు, ఐర్లాండులో చిక్కుకుపోయిన కొడుకూ కోడళ్ల ఆందోళన, మిత్ర శ్రేయోభిలాషుల పలకరింపులు ఇందులో కనిపిస్తాయి.
కరోనాపై పుస్తకం తేవాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అన్న ప్రశ్నకు-మొదటి లాక్ డౌన్ ప్రకటించి, గిన్నెలు తపేళాలూ మ్రోగించమని, దీపాలార్పేసి కొవ్వొత్తులు వెలిగించమనడం-వంటి పాలకుల వెకిలి పిలుపులే కారణం అన్నాడు. అంతేకాదు మొదటి కవిత స్వగతంలో ‘ఈలలూ చప్పట్లూ / సాగనంపడం కాదు / స్వాగతించడం’ అంటూ ఎద్దేవా చేస్తాడు. –
అశోక్ కరోనా కష్టకాలాన్ని- జైలుపాలైన స్వాతంత్ర్య సమరయోధులు ఆ కాలాన్ని గ్రంథరచనలకు ఉపయోగించుకున్నట్టు, సమాజానికి కరోనా పెట్టిన పరీక్షను తెలియ జేయడానికి ఉపయోగించుకున్నాడు. కరోనా బాధితుడిగా, విజేతగా సందేశం కాదంటూనే మంచి సందేశం ఇచ్చాడు. అశోక్ కుమార్ శీర్షికలు, సంపుటాలు విలక్షణంగా వుంటాయి. లోకమంతా ‘మహమ్మారి’ అని స్త్రీలింగంగా పిలుస్తుంటే, ఔరా! కరోనా!! అని పుం లింగాన్ని చేశాడు.
పేరెత్తితేనే గడగడ వణికిపోయే కరోనా బాధితుడిగా దానిపై ఓ గ్రంథాన్ని తేవడం ధైర్యంతో కూడిన చర్య. రోగాన్ని ఏంచెయ్యలేక చేతులెత్తేసిన ప్రభుత్వాలు జనాలను వెర్రివాళ్లను చేసే ప్రయత్నాలను కవి సహించలేకపోయాడు.
‘కొవ్వొత్తుల్లా / కాలిపోతున్న జనాన్ని/ కొవ్వొత్తుల్ని వెలిగించమంటున్నావ్-ప్రభువులకు చెలగాటం, ప్రజలకు ప్రాణసంకటం’ అంటూ కన్నెర్రజేశాడు.
తన తొలి రచన ‘తల్లీ! ఎవరునువ్వు?’తో ప్రారంభించిన వ్యంగ్యవైభవాన్ని ఇందులో ‘మందిరం, చర్చి, మసీదులు/డోరులు వేసుకున్నాయ్/ పూజారి, ఫాదర్, మౌల్వీల నోరులు మూసుకున్నాయ్ / భళిరా కరోనా! / మనిషికి మనిషే దిక్కని/ దేవుడికి దిక్కులేకుండా చేశావు’ అన్న కవితను చదివితే వెక్కిరింతను వ్యంగ్యం స్థాయికి తీసుకెళ్లిన కవి ప్రతిభకు ఔరా! అనిపిస్తుంది.
కవితల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అందులో ‘మన చేతుల్లోనే వుంది కవిత ఆకట్టుకునేలా వుంది. ‘నువ్వూనేనూ రోడ్డుమీద కొస్తే కరోనా ఇంట్లో కొస్తుంది. ఇంట్లోనే వుంటే రోడ్డుమీదే చస్తుంది.’ గొప్ప సందేశం కదా! ‘అజేయుడు మానవుడు, యుద్ధ నీతి, మాస్కిజం, ప్రోగ్రెస్ రిపోర్ట్’ వంటి కవితలు కరోనా విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తాయ్. ‘గ్రీను, ఆరెంజి, రెడ్ జోన్లు-కోతవరకే / దేశమంతా వలసకార్మికుల బ్లడ్ జోన్లు’ అన్నప్పుడు వలసకార్మికుల పట్ల కవికిగల ఆర్టత కనిపిస్తుంది. ‘సోషల్ డిస్టెన్సింగ్’లో కవికి వలస కార్మికుల పట్ల సమాజం చూపిస్తున్న వివక్ష ద్యోతకమవుతుంది. డాక్టర్లను ‘సిరంజీవులు’ అని వారికి నమస్కరిస్తాడు.
అశోక్ కి వున్న కవితాశక్తి మినీ కవితలో దాగుంది. దానితో ఏదైనా అణువులా పేలుతుంది. కవి కోవిడ్ మాస్క్ తో సహా చిత్రకారుడు కళాసాగర్ బొమ్మలు ప్రాణం పోశాయి.
- గిడ్డి సుబ్బారావు, (99593 35876)
ప్రతులకు:
ఆలోచన, 305, ప్రగతి టవర్స్,
మారుతి నగర్, విజయవాడ-4,
చరవాణి- 92462 77375
వెల: రూ. 60/-