ఆంధ్రచిత్రకళారంగం పునరుజ్జీవనానికి ఎంతో దోహదం చేసిన ఓ.జె. కూల్డ్రే విగ్రహాన్ని రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ప్రాంగణంలో స్ధాపిస్తున్నట్లు మాదేటి రాజాజీ మెమొరియల్ ఆర్ట్ అకాడమి వ్యవస్ధాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ వెల్లడించారు. కూల్డ్రే, మాదేటి రాజాజీ విగ్రహాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధం అవుతాయని ఆయన చెప్పారు. దామెర్ల రామారావుతో సహా అనేకమందిని చిత్రకారులుగా ప్రోత్సహించిన ఒకప్పటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కూల్డ్రే 63 వ వర్ధంతి ఆగష్ట్ 29, శనివారం ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షత వహించారు. కూల్డ్రే కేవలం విద్యాధికారే కాక, గొప్ప చిత్రకారుడని, అంతకు మించి గొప్ప సంస్కార హృదయుడని రవి ప్రకాష్ తెలిపారు. కేవలం దామెర్ల రామారావుకే కాక వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, కవికొండల వెంకటరావు, దామెర్ల వెంకటరావు వంటి పలువురికి కూల్డ్రే మార్గదర్శకుడని రవి ప్రకాష్ తెలిపారు. కూల్డ్రే చిత్రాలు ఎంతో పొందికగా, జీవం ఉట్టిపడుతూ, ఫోటోగ్రాఫిక్ ప్రెసిషన్ తో ఉంటాయని. పల్లె జీవితపు అందాలను తన రచనలలోనే కాక, చిత్రాలలో కూడా కూల్డ్రే అందంగా చూపించారని రవిప్రకాష్ పేర్కొన్నారు.
భారతదేశంలో ఉన్నంత కాలం ఆయన జాతీయ జీవనవిధానంతో మమేకం చెందాడని సన్నిధానం శాస్త్రి పేర్కొన్నారు.
ఇంగ్లండు తిరిగి వెళ్ళాక రచించిన సౌత్ ఇండియన్ అవర్స్ (దక్షిణభారత స్మృతులు) భారతదేశంలో గడిపిన తన కాలమంతా ఓ మధురస్మృతిగా మిగిలిపోయిందని కూల్డ్రే పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఆంధ్రదేశంలోని తోలుబొమ్మలాటను కూల్డ్రే సృజనాత్మక కళగా పేర్కొంటూ చరిత్రలో ఎంతో మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా, ఆదివారాలలో సెలవు రోజులలో కూల్డ్రే నిర్వహించిన అనేక సాహిత్య, చర్చలలో పాల్గొనే వారని సన్నిధానం శాస్త్రి తెలిపారు.
కార్యక్రమంలో చిత్రకారిణి ఎన్.వి.ఎస్.ఎస్. లక్ష్మి, మాదేటి రాజాజీ కుమార్తె, ఆర్ట్ గ్యాలరీ ఉద్యోగి, మాదేటి గౌరి, కాళహస్తి గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
