రజనీకి ఫాల్కే పురస్కారం ఎందుకు ఇవ్వకూడదు?

ఈరోజు (01-04-2021) భారత ప్రభుత్వం సూపర్ స్టార్ రజనీకాంత్ కు సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ఇచ్చి గౌరవించే దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం అందించిన తరవాత కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికీ ప్రకటించలేదు.

తమిళనాడులో శాసనసభకు సాధారణ ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో బి.జె.పి ప్రభుత్వం లబ్ది పొందేందుకే రజనీకాంత్ కు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని AIADMK సహా అన్నీ ప్రతిపక్షాలు గోలపెడుతున్నాయి. పైగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ప్రకటించి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ విషయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో, రజనీకాంత్ అభిమానులంతా AIADMK-BJP సంకీర్ణ భాగస్వామ్య పార్టీకి లబ్ది చేకూర్చుతారని భావిస్తూ, విమర్శలు కురిపిస్తున్నారు. రజనీకాంత్ ఈ పురస్కారానికి తగనివాడా? ఎందుకు రజనీకాంత్ కు ఈ పురస్కారం ఇవ్వకూడదు?? 2014లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా లో జరిగినప్పుడు రజనీకాంత్ కు సెంటెనరీ అవార్డ్ ఫర్ ఫిల్మ్ పర్సనాలిటీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. రజనీకాంత్ కు భారతప్రభుత్వం 2016 నే పద్మవిభూషన్ పురస్కారం అందించి గౌరవించింది. 2019లో గ్లోబల్ జూబిలీ అవార్డ్ ను మరొక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో బహూకరించారు. వ్యక్తిగతంగా అతని దాతృత్వ ధోరణిని రెండవ కంటికి తెలియనీయని వ్యక్తిత్వం రజనీకాంత్ ది. అన్నా హజారే ప్రకటించిన అవినీతి నిరోధక ఉద్యమానికి మద్దతు పలికి సహకరించినవాడు రజనీకాంత్. 2015లో వచ్చిన వరదలకు పారిశుద్ధ కార్మికులకు ఆశ్రమం కలిపించి వారి బాగోగులు నెలరోజులపాటు చూసుకున్న వ్యక్తి రజనీకాంత్. ఇక చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు రజనీకాంత్ చేసిన సేవలు అపారం. అప్పుడు ఇన్ని విమర్శలు రజనీకాంత్ మీద రాలేదే? సినిమా ప్రగతికి రజనీ చేసిన కృషితోబాటు, వ్యక్తిగతంగా అతడు ఎంతటి ఉన్నత సంస్కారం కలవాడో తెలియజేసేందుకే ఈ వ్యాసాన్ని అందిస్తున్నాను. దయచేసి ఈ విషయం మీద చర్చ కొనసాగించవలదని వేడుకోలు.

పూర్వాశ్రమంలో … అంటే 1969 ప్రాంతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (శివాజీరావ్ గైక్వాడ్) బెంగుళూరు శ్రీనగర్-మెజెస్టిక్ రూట్ సిటీ బస్సులో కండక్టర్ గా పనిచేసేవాడు. ఆ బస్ రూటుకు డ్రైవర్ రాజబహదూర్. ఇద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్ ప్రోత్సాహంతో రజనీకాంత్ బి.టి.ఎస్ (బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్)నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు వంటి మంచి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నాడు. రజనీ నటనలో వున్న ప్రత్యేకమైన శైలిని చూసి రాజబహదూర్ సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి ఇష్టపడని రజనీకాంత్ ని రాజబహదూర్ ఒప్పించాడు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తనకున్న పాల డెయిరీ లో పనిచేయవచ్చని ధైర్యం నూరిపోశాడు. అలా రజనీ చెన్నై వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. ప్రతి నెలా రెండు వందల రూపాయలు రాజబహదూర్ రజనీకి మనియార్డర్ చేసేవాడు. అంతేకాదు, ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే తాకట్టుకు వుపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టాడు. యాక్టింగ్ స్కూలులో తర్ఫీదు పూర్తయింది. రజనీ దశ తిరిగి బాలచందర్ చేతిలో పడ్డాడు. ‘అపూర్వ రాగంగళ్’ (తూర్పు పడమర), ‘మూణ్డ్రు ముడిచ్చు’ (ఓ సీత కథ) వంటి ప్రయోగాత్మక సినిమాలతో స్టార్దం అందుకున్నాడు. ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బు పంపి ఆదుకున్న రాజబహదూర్ ని మాత్రం మరవలేదు. ఇప్పటికీ తరచూ బెంగుళూరు వెళతాడు. రాజబహదూర్ తో కలిసి విద్యార్థి భవన్ లో నేతి దోశలు కట్టించుకొని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్ రోడ్లవెంట పబ్లిక్ గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్ స్టార్ అంత పబ్లిక్ గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు తలపించక మానదు. కానీ రజనీ సాధ్యం చేసి చూపాడు. బెంగుళూరు నడిబొడ్డున రజనీకి ఫ్లాట్ వుంది. ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరవై యేళ్ళ వృద్ధుడులాగానో లేక ఎనభై యేళ్ళ వృద్ధుడిలాగానో తన వేషం మార్చుకుంటాడు. తరవాత రాజబహదూర్ వచ్చి రజనీ ని కలుస్తాడు. ఇద్దరూ కలిసి రజనీ మొదట్లో వున్న ఆద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు కొని వాటిని పార్సిల్ కట్టించుకొని వెళ్ళి ఉమా థియేటర్ దగ్గరలోవున్న మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని ఆరగిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. తరవాత ఆ పక్కనే వుండే టీ పాకలో స్టాంగ్ కాఫీ తాగుతారు.

కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, మళ్ళీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్ లో బిరియాని పొట్లం కట్టించుకొని గంగాధర పార్కులో కూర్చొని ఆ బిరియానీ ఆరగిస్తారు. ఒకసారి అలా వెళుతూ వుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి యెత్తుకోలేక అవస్థ పడుతూ వుండడం రజనీ గమనించాడు. వెంటనే వెళ్ళి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చాడు. ఆమెవెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని రూఢి పరచుకున్న తరవాత జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్ళిన తరవాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్ తో అదృశ్యమయ్యాడు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం! అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు యేరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో వున్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చుకుంటూ పోతున్న రజనీ ని చూసి రాజబహదూర్ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. తరవాత రాజబహదూర్ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని అతని భార్యా బిడ్డలకు డబ్బు, బహుమతులు పంచి, రాజబహదూర్ తోడురాగా ఒక ఆటోలో తన ఫ్లాట్ కు చేరుకుంతాడు. మరుసటిరోజు చెన్నైకి కారులో వెళ్ళిపోతాడు. మెల్లగా లిఫ్టులోకి వెలుతున్న రజనీకాంత్ ని చూసి రాజబహదూర్… ‘’ఓహో రజనీ బెంగుళూరు వచ్చి రోడ్లవెంట, పార్కుల వెంట నాతో తిరిగేది ఇందుకనా’’ అనుకోవడం పసిగట్టిన రజనీ ‘’అవును మిత్రమా… నువ్వు నేర్పిన విద్యేగా నీరజాక్షా. బస్సును నువ్వు రోడ్లవెంట తిప్పుతుంటే టికెట్లు తెంచే కండక్టర్ గా ఆ మాత్రం నేను కూడా ఆస్వాదించొద్దూ! అన్నార్తులను ఆడుకోవడ్డూ!!’’ అని నవ్వుతూ బదులిస్తూ లిఫ్ట్ లోకి వెళ్తాడు స్నేహితుడికి గుడ్ బై చెబుతూ … ఎంత ఎత్తుకెదిగినా రజనీకాంత్ మాత్రం ఇసుమంత కూడా మారలేదు. అదే శివాజీరావ్ గైక్వాడ్… అదే… ఆ సూపర్ స్టార్… ‘మెజెస్టిక్’ అండ్ ‘మాగ్నానిమస్’!!*
ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap