అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

భారతీయ సినిమా రంగంలో విశేషమైన కృషి చేసి, సినిమా అభివృద్ధికి దోహదం చేసిన నిర్మాతలు, దర్శకులు, నటి నటులకు భారత ప్రభుత్వం 1969 నుంచి 17వ జాతీయ చలన చిత్ర అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే ” అవార్డును ప్రదానం చేస్తున్నది. మొదటి అవార్డును భారతీయ సినిమా తొలి కథానాయిక దేవికా రాణి కి ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రారంభించి ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ అవార్డును అందుకోబోతున్న అమితాబ్ 50వ సినిమారంగ ప్రముఖుడు. 66వ జాతీయ అవార్డులతో పాటు అమితాబ్ కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
1913లో భారతీయ సినిమా రంగంలో తొలి పూర్తి నిడివి “రాజా హారిశ్చంద్ర ” చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించారు. ఆయనను భారతీయ సినిమా రంగానికి పితామహుడు అంటారు. 1870లో జన్మించిన దాదా సాహెబ్ ఫాల్కే 1944లో చనిపోయారు. ఆయన స్మృతి నివాళిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అమితాబ్ బచ్చన్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1942లో హరి వంశరాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ కు అమితాబ్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ లో జన్మించారు. విద్యాభాసం పూర్తి అయిన తరువాత సినిమాల్లో నటించడానికి బొంబాయి వచ్చాడు. మొదట సునీల్ దత్ “రేష్మా ఔర్ షేరా చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత 1969లో మృణాల్ సేన్ ” భువన్ షోమ్ ” చిత్రంలో తీసుకున్నారు. అదే సంవత్సరం ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ ” సాత్ హిందుస్తానీ ” చిత్రంలో అమితాబ్ కు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అమితాబ్ కు పేరు తెచ్చిపెట్టింది. అక్కడ నుంచి అమితాబ్ సినిమా ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పటివరకు 255 చిత్రాల్లో నటించారు.
అమితాబ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్త్వం కలిగిన గొప్ప నటుడు, మానవతా మూర్తి అమితాబ్. ఆయనను నేను రెండు పర్యాయాలు కల్సి మాట్లాడటం, ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. ఆయన క్రమ శిక్షణ, నిరాడంబర తత్త్వం. చిన్న వారైనా ఎదుటి వారిని గౌరవించే పెద్ద మనసు చూసి ఆశ్చర్య పోయాను. ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు వున్నాయి కాబట్టే ఐదు దశాబ్దాల తరువాత కూడా భారతీయ సినిమా రంగంలో సూపర్ సస్టార్ గా కొనసాగుతున్నారు. విశేషం ఏమంటే అమితాబ్ సినిమా రంగంలో ప్రవేశించింది 1969లో. అదే సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రదానం చెయ్యడం మొదలు పెట్టారు. 50 సంవత్సరాల తరువాత అదే ఫాల్కే అవార్డు అమితాబ్ ను వరిస్తుంది … !

అమితాబ్ కు అభినందనలు.

-భగీరథ

1 thought on “అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap