బాలీవుడ్ ‘అన్నాసాహెబ్’ శాంతారాం

(దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత, పద్మవిభూషణ్ వి. శాంతారాం వర్ధంతి సందర్భంగా)

బాలీవుడ్ చిత్రరంగానికే కాదు, భారతీయ చలనచిత్ర రంగానికి బాగా తెలిసిన పేరు వి. శాంతారాం. సినిమా పరిశ్రమ ద్వారా లాభాలు గడించేందుకే కొందరు సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ, శాంతారాం ఆలోచనా విధానం వేరు. ఆయనకు సినిమాలు తీయడం ఒక వృత్తి… సరదా. సినిమాలు నిర్మించడం కోసమే సినిమాలు తీశారు. తన జీవితకాలంలో 92 సినిమాలు నిర్మించారు, 55 సినిమాలకు దర్శకత్వం వహించారు, 25 సినిమాలలో నటించారు. లాభాపేక్షతో మాత్రం కాదు. తన చిత్రాలు తిరస్కరణకు గురైనప్పుడు అది తన వైఫల్యమేనని సరిపెట్టుకున్నారుగానీ, ప్రేక్షకులను యెప్పుడూ ఆయన తప్పుపట్టలేదు. ఇలాంటి ప్రత్యేక వ్యక్తిత్వం శాంతారాంకు సొంతం. ఆయన హిందీ వెండితెరకు యెన్నో కళాఖండాలను, కావ్యాలవంటి చిత్రాలను అందించారు. పదమూడేళ్ళ వయసులోనే ఒక సంచార నాటక సంస్థలో చేరి నటనతోబాటు నాట్యాన్ని, మిమిక్రీ కళను నేర్చుకున్నారు. అయితే తను నేర్చుకున్నది చాలా తక్కువని భావించి మరలా స్కూలుకు వెళ్లి చడువుకొనసాగించిన జ్ఞాని శాంతారాం. పందొమ్మిదేళ్ళకే మహారాష్ట్ర ఫిలిం కంపెనీ అధిపతి బాబూరావు పెయింటర్ వద్ద సహాయకుడిగా, నటుడుగా ‘సురేఖా హరణ్’ (1921) వంటి మూకీ చిత్రానికి పనిచేసిన ప్రజ్ఞాశాలి అతడు. భారతీయ చలనచిత్ర చరిత్రకు అతడొక లెజెండ్. బాలీవుడ్ అతణ్ణి ‘అన్నాసాహెబ్’ గా ‘శాంతారాం బాపు’ గా అభిమానంగా పిలుచుకుంటుంది. శాంతారాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చలనచిత్ర ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం…

నేపథ్యం…
శాంతారాం పుట్టింది నవంబరు 18, 1901 న మహరాష్ట్రలోని కొల్హాపూరులో. వారిది సామాన్య మరాఠి కుటుంబం. తండ్రి రాజారాం జైన మతస్తుడు కాగా తల్లి కమల హిందువు. శాంతారాం కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శాంతారాం రాజారాం వాంకుద్రే. చదువు మీదకన్నా శాంతారాం మనసు నాటకాల మీద వుండేది. తండ్రి వారించినా పదమూడేళ్ళ వయసులో గోవిందరావు టెంబే వద్దకు వెళ్లి ఆయన నడుపుతున్న ‘గంధర్వ నాటక మండలి’లో చేరారు. వారితో కలిసి వివిధ ప్రదేశాల్లో నాటకాలలో పాల్గొన్నారు. నటన తోబాటు నాట్యాన్ని అభ్యసించారు. అయితే ఆత్మవిమర్శ చేసుకొని, తను నేర్చుకున్నది అల్పమని భావించి మరలా చదువుమీద ధ్యాస పెట్టారు. సాహు మహారాజా 1919లో కొల్హాపూర్ లో ఒక పెద్ద స్టూడియో నిర్మించారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకనిర్మాత బాబూరావు పెయింటర్ ‘మహారాష్ట్ర ఫిలిం కంపెనీ’ అనే సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆ స్టూడియోలో మూకీ చిత్రాలు నిర్మిస్తూ వుండేవారు. తనకు పందొమ్మిదవ సంవత్సరం వచ్చాక పరిణితి చెందిన యువకునిగా శాంతారాం బాబూరావు పెయింటర్ ను కలిశారు. బాబురావు పెయింటర్ అందులో నిర్మించిన తొలి మూకీ సినిమా ‘సైరంధ్రి’ (1920). ఆ కంపెనీలో బాబురావు పెయింటర్ కు సహాయకుడిగా శాంతారాం ‘సురేఖా హరణ్’ (1921) సినిమాకు పనిచేశారు. అందులోనే శ్రీకృష్ణుడుగా నటించారు. తర్వాత 1922 నుంచి 1927 వరకు నిర్మించిన ‘వస్త్రాపహరణం’, ‘శ్రీకృష్ణ అవతార్’, ‘మాయాబజార్’, ‘భక్త ప్రహ్లాద్’, ‘మురళివాలా’, ‘సతి సావిత్రి’ వంటి మూకీ చిత్రాలకు శాంతారాం నటుడుగా, సహాయకుడు గా పనిచేస్తూ బాబురావు పెయింటర్ కు ఆప్తుడుగా మెలిగారు. 1927 లో ఛత్రపతి శివాజీ సేనాపతి పేరుతో ‘నేతాజీ పాల్కర్’ అనే సినిమాకు కేశవరావు ధాయిబర్ తో కలిసి శాంతారాం తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. బాలాసాహెబ్ యాదవ్, సుశీలాదేవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విజయవంతం కావడంతో మహారాష్ట్ర ఫిలిం కంపెనీ అప్పులనుంచి బయటపడింది. అయితే బాబురావు పెయింటర్ వ్యవహార సరళి నచ్చక శాంతారాం కొందరు మిత్రులతో కలిసి బయటకు వచ్చేశారు.

ప్రభాత్ ఫిలిం కంపెనీ ఆవిర్భావం…
ఛాయాగ్రాహకులు విష్ణుపంత్ గోవింద్ దంలె, కె.ఆర్. దైబర్, ఎస్. ఫతేలాల్, చిత్రనిర్మాణ దక్షుడు, నటుడు కేశవరావు థాయిబర్ లతో కలిసి స్థానిక నగల వ్యాపారి ఎస్.బి. కులకర్ణి ని కలుపుకొని శాంతారాం జూన్ 1, 1929 న కొల్హాపూర్ లోనే ‘ప్రభాత్ ఫిలిం కంపెనీ’ ని స్థాపించారు. తరవాత ఈ కంపెనీని పుణె కు తరలించి అక్కడ స్టూడియో నిర్మించారు. ప్రభాత్ ఫిలిం కంపెనీ బ్యానర్ మీద తొలి చిత్రంగా ‘గోపాలకృష్ణ’ అనే మూకీ సినిమా నిర్మించారు. శాంతారాం స్వతంత్రంగా దర్శకత్వం వహించిన సినిమా ఇదే. 1930 లో శాంతారాం దర్శకత్వంలోనే ‘ఉదయకల్’ (మరాఠి లో స్వరాజ్యచ తోరణ్) అనే చారిత్రాత్మక మూకీ సినిమా నిర్మించారు. అందులో హీరో శాంతారాం, హీరోయిన్ కమలాదేవి. తర్వాత ‘రాణి సాహెబా’ (1930) పేరుతో తొలి బాలల చిత్రం స్వీయ దర్శకత్వంలో, తనే హీరోగా నటిస్తూ నిర్మించారు. ఆ తర్వాత కేశవరావు ధాయిబర్ తో కలిసి ‘ఖూని ఖంజర్’ (1930), ‘చంద్రసేన’ (1930) సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఖూని ఖంజర్’ లో మన తెలుగు తేజం పైడి జైరాజ్ నటించారు. 1932 లో ‘మాయా మచ్చీంద్ర’ ను హిందీ, మరాఠి భాషల్లో నిర్మించి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం ‘జల్తి నిషాని’ (మరాఠిలో ‘అగ్నికంకణ్’) సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రభాత్ ఫిలిం కంపెనీ బ్యానర్ మీద మరాఠీ లో తొలి టాకీ సినిమా ‘అయోధ్యేచ రాజా’ (రాజా హరిశ్చంద్ర) సినిమాకు శాంతారాం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 23, 1932 న విడుదలైంది. ఇదే సినిమాను హిందీలో సమాంతరంగా ‘అయోధ్య కా రాజా’ పేరుతో శాంతారాం నిర్మించారు. ఈ జంట చిత్రాలలోని శబ్ద నాణ్యత, పాటల సరళి, సంభాషణల స్వచ్చత ప్రేక్షకులను ఆకట్టుకొని శాంతారాం కు సమర్పకునిగా, దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇందులో దుర్గాఖోటే ను చిత్రసీమకు శాంతారాం పరిచయం చేశారు. తరవాత ‘సింహగడ్’, ‘సైరంధ్రి’ సినిమాలను తన దర్శకత్వం లోనే నిర్మించారు. 1934 లో ద్విభాషా చిత్రంగా ‘అమృత మంథన్’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం నిర్మించడానికి ముందు శాంతారాం జర్మనీకి వెళ్లి చిత్రనిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జించి, లైట్ అండ్ షెడ్ టెక్నిక్ ని ఇందులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించారు. స్టూడియోలో సౌండ్ ప్రూఫ్ గదులు నిర్మించి రికార్దింగ్ చేశారు. ఇందులో చంద్రమోహన్ ను హీరోగా పరిచయం చేశారు. చలనచిత్ర చరిత్రలో 25 వారాలు ఆడి సిల్వర్ జూబిలీ జరుపుకున్న తొలి చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది. మరో ద్విభాషా చిత్రం ‘ధర్మాత్మా’ ను శాంతారాం 1935లో నిర్మించారు. ఇందులో ప్రఖ్యాత మరాఠీ రంగస్థల లెజెండ్ ‘బాలగంధర్వ’ సంత్ ఏకనాథ్ పాత్రను పోషించడం విశేషం. ఈ సినిమాలో క్లోజప్ షాట్లను ఎక్కువగా ప్రవేశపెట్టారు. ఈ సినిమాకు మాస్టర్ కృష్ణారావు పులంబ్రికర్ సంగీత దర్శకత్వం వహించగా బాలగంధర్వ ఆయనకు సహకరించారు. బాలగంధర్వ, వసంత దేశాయ్ ఇందులో పాటలు పాడడం మరో విశేషం. అదే సంవత్సరం నిర్మించిన మరో ద్విభాషా చిత్రం ‘చంద్రసేన’ లో తొలిసారి ‘ట్రాలీ షాట్’ నిచిత్రీకరించారు. హనుమంతుడు ఆకాశమంత ఎత్తుకు పెరగడం, ఆకాశంలో సంచరించడం, రామలక్ష్మణులు బాణాలను గాలిలోకి సంధించడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ను శాంతారాం ఈ సినిమాలో తొలిసారి ప్రయోగించి ఒక నూతన చిత్రీకరణ ఒరవడికి బీజం వేశారు. 1936లో దుర్గాఖోటే, చంద్రమోహన్ జంటగా ‘అమర్ జ్యోతి’ సినిమాను హిందీలో నిర్మించారు. దుర్గాఖోటే పోషించిన గొప్ప పాత్రల్లో ఇందులోని సౌదామిని పాత్రను ఒకటిగా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ఒక ‘అవుట్ స్టాండింగ్ చిత్రం’ గా సినీపండితులు వర్గీకరించారు. వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. కృష్ణారావు ఫులంబ్రికర్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ హిట్టయింది. 1937 లో శాంతారాం నిర్మించిన ‘దునియా న మానే’ (మరాఠీలో ‘కున్కు’) కూడా సూపర్ హిట్ గా నిలిచి వెనిస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకుంది. నటి శాంతాఆప్టే కు వరసగా ఇది మూడవ హిట్ సినిమా (అంతకు ముందు అమృత్ మంథన్, అమర్ జ్యోతి లో ఆమె నటించింది). ఇందులో శాంతాఆప్టే ఇంగ్లీష్ కవి హెన్రీ వడ్స్ వర్త్ లిఖించిన ‘ఎ సామ్ ఆఫ్ లైఫ్’ ను ఆలపించడం విశేషంగా చెప్పుకున్నారు. 1939లో మరాఠీలో ‘మనూస్’ పేరుతో శాంతారాం మరొక సినిమా నిర్మించారు. ఇదే సినిమాను హిందీలో ‘ఆద్మీ’ పేరుతో సమాంతరంగా నిర్మించారు. ఒక వెలయాలిని పోలీసు అధికారి ప్రేమించి ఆమెను సమాజంలోకి తీసుకరావడం ఈ సినిమా నేపథ్యం. ఈ సినిమాను చార్లీ చాప్లిన్ ప్రశంశించడం చెప్పుకోవలసిన విషయం. ఈ సినిమాకోసం బొంబాయిలోని రెడ్ లైట్ ప్రాంతానికి శాంతారాం స్వయంగా వెళ్లి పరిసరాలు పరీక్షించి, అక్కడ ఉన్నట్లే స్టూడియోలో సెట్టింగ్ వేసి సినిమా షూట్ చేశారు. కానీ అది సెట్టింగ్ అంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. పోలీసు అధికారిగా నటించిన మధోక్ కు ఒక ఆర్మీ అధికారి చేత శిక్షణ ఇప్పించడం శాంతారాం పాత్ర సహజత్వం కోసం యెంత శ్రమపడతారో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రభాత్ ఫిలిం కంపెనీ బ్యానర్ మీద శాంతారాం నిర్మించిన ఆఖరి సినిమా ‘పడోసి’ (1941-మరాఠీలో ‘షేజారి’) అనే ద్విభాషా చిత్రం. దీనిని ఒక క్లాసికల్ సినిమాగా సినీ పండితులు వర్గీకరించారు. ముస్లిం లీగ్ ఆవిర్భావం తరవాత హిందూ ముస్లిం సఖ్యత నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా ఇది. ప్రభాత్ ఫిలిం కంపెనీ తఫున శాంతారాం మొత్తం 45 సినిమాలను నిర్మించారు. వాటిలో 27 హిందీ సినిమాలు కాగా 18 సినిమాలు మరాఠీ భాషలో సమాంతరంగా నిర్మించినవి. శాంతారాం 1942లో బొంబాయికి తరలివెళ్లి రాజ్ కమల్ కళామందిర్ స్టూడియో నిర్మాణం చేపట్టి సినిమాలు తీయడం మొదలెట్టిన తరవాత ప్రభాత్ ఫిలిం కంపెనీ మూతపడింది. ప్రభాత్ ఫిలిం కంపెనీలో తయారైన చివరి సినిమా ‘రామ్ శాస్త్రి’ (1944). ప్రఖ్యాత దర్శక నిర్మాతలు గురుదత్, దేవానంద్ ల సినీ ప్రస్థానం మొదలైంది కూడా ఈ ఫిలిం కంపెనీ స్టూడియోలోనే. అందులో వున్న ఫిల్మ్ లు చాలావరకు అగ్నిప్రమాదంలో కాలిపోవడం దురదృష్టకరం. ఇప్పుడు అదే స్థలంలో ‘పూనా ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్’ నిర్వహింపబడుతోంది. ప్రభాత్ ఫిలిం కంపెనీ కి సంబంధించిన వివిధ వస్తువులతో అక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.

రాజ్ కమల్ కళా మందిర్ ఆవిర్భావం….
1933లో వాడియా మూవిటోన్ అనే సినిమా నిర్మాణ సంస్థ బొంబాయిలో స్టూడియో నిర్మించి హోమివాడియా బ్రదర్స్ పేరుతో ‘హంటర్ వాలీ’ (1935) చిత్రం నిర్మించి మంచి పేరు తెచ్చుకుంది. తరవాత అరేబియన్ నైట్స్ కథల నేపథ్యంలో అధిక వ్యయంతో చిత్రాలను నిర్మించి నష్టపోవడంతో ఆ స్టూడియోను 1941లో అమ్మకానికి పెట్టింది. విషయం తెలిసిన శాంతారాం ఆ స్టూడియోని కొని దానిని ‘రాజ్ కమల్ కళామందిర్’ గా మార్చారు. అలా శాంతారాం మకాం బొంబాయికి మారింది. తొలిసారి 1943లో రాజ్ కమల్ కళామందిర్ బ్యానర్ మీద ఆ స్టూడియోలో మహాకవి కాళిదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ప్రతిష్టాత్మక ‘శకుంతల’ సినిమా నిర్మించి విజయంసాధించారు. చంద్రమోహన్ దుష్యంతుడుగా నటించగా, తదనంతరకాలంలో శాంతారాం వివాహమాడిన జయశ్రీ అందులో శకుంతలగా నటించింది. ప్రియంవదుడుగా శాంతారాం నటించారు. అమెరికా దేశంలో ప్రదర్శనకు నోచుకున్న తొలి భారతీయ చిత్రం ‘శకుంతల’. గతంలో శాంతారాం సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించిన వసంత దేశాయి ఈ చిత్రానికి తొలిసారి పూర్తిస్థాయి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. శాంతారాం తో వసంత దేశాయి సాంగత్యం చాలా సినిమాలవరకు కొనసాగింది. 1947లో జరిగిన వెనిస్ ఫిలిం ఫెస్టివల్ కు ఈ చిత్రం నామినేట్ అయింది. ఏకంగా బొంబాయిలో 104 వారాలు ఆడి చరిత్ర సృష్టించింది. 1944లో శాంతారాం ‘పర్బత్ పే అపనా డేరా’ అనే సినిమా నిర్మించారు. వనమాల మీరాదేవి గా, మదన్ మోహన్ మంగళ్ గా నటించిన ఈ చిత్రం 25 వారాలు ఆడి సిల్వర్ జూబిలీ చేసుకుంది. సంగీత దర్శకుడు వసంత దేశాయి ఇందులో ‘ఎఖో’ ఎఫెక్టు తో పాటలు స్వరపరచగా అవి బాగా పాపులర్ అయ్యాయి.”ఆ నికల్ గయా మేరి గలీ సే” అనే పాటను నసీం అఖ్తర్ తో కలిసి వసంత దేశాయి పాడడం ఇందులో విశేషం. 1946లో శాంతారాం ‘డాక్టర్ కొట్నిస్ కి అమర్ కహాని’ పేరు ఒక అద్భుత చిత్రాన్ని నిర్మించారు. దీనిని ఇంగ్లీషులో ‘ది జర్నీ ఆఫ్ డాక్టర్ కొట్నిస్’ గా సమాంతరంగా నిర్మించారు. ఇందులో శాంతారాం టైటిల్ పాత్రను పోషించగా, జయశ్రీ చైనా కు చెందిన ‘చింగ్ లాన్’ గా నటించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ చైనా మీదకు దండెత్తినప్పుడు, భారత్ కు చెందిన డాక్టర్ ద్వారకానాథ్ కొట్నిస్ ఐదుగురు వైద్య బృందానికి నాయకత్వం వహిస్తూ చైనాకు వెళ్లి, గాయపడిన చైనా సైనికులకు చికిత్స అందిస్తూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నిజసంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. సినిమా గొప్పగా ఆడింది. 1947 లో నిర్మించిన ద్విభాషా మరాఠి బయోపిక్ ‘లోక్ షహిర్ రామ్ జోషి’ సినిమాకు బాబురావు పెయింటర్ ని దర్శకత్వం వహించమని శాంతారాం కోరారు. కొంత సినిమా నిర్మించాక అతడు అనారోగ్యం పాలవడంతో శాంతారామే ఆ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ కృష్ణ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయవంతమైంది. వసంత దేశాయి సమకూర్చిన సంగీతానికి మంచి పేరొచ్చింది. తెలుగులో పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘జయభేరి’ చిత్రానికి ఈ చిత్ర కథే ఆధారం. తరవాత నిర్మించిన ‘అప్నా దేశ్’ సినిమా ఫ్లాప్ చిత్రంగా ముద్రపడింది. 1950 లో వరకట్నం నేపథ్యంలో పృద్విరాజ్ కపూర్, జయశ్రీ, కరణ్ దేవన్ లతో ‘దహేజ్’ సినిమా నిర్మించారు. ఈ సినిమాకూడా యావరేజి గా ఆడింది. తరవాత నిర్మించిన ‘అమర్ భూపాలి’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఇందులో శాంతారాం ను వివాహమాడిన సంధ్య హీరోయిన్ గా పరిచయమైంది. 1952 తనే హీరోగా, జయశ్రీ హీరోయిన్ గా శాంతారాం ‘పర్చాయిన్’ అనే సినిమా నిర్మించారు. తొలిసారి సి. రామచంద్ర శాంతారాం సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేసిన సినిమా ఇది. వసంత దేశాయి నేపథ్య సంగీతం సమకూర్చుతూ ఇందులో కొన్ని పాటలు రాయడం విశేషం. సినీ పండితులు ఈ సినిమాను ‘అపూర్వ యోగ్యతా చిత్రం’ గా గుర్తించారు. తరవాత ‘తీన్ బత్తి చార్ రాస్తా’ (1953), ‘సురంగ్’ (1953) నిర్మించి, 1954 లో ’సుభ్ కా తారా’ చిత్రాన్ని నిర్మించారు. వితంతు వివాహం నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో శాంతారాం కూతురు రాజశ్రీ ని బాలతారగా పరిచయం చేస్తూ, ప్రదీప్ కుమార్ సరసన హీరోయిన్ గా జయశ్రీని చేర్చారు. ఈ సినిమాకు కూడా సి. రామచంద్ర సంగీతం, వసంత దేశాయ్ నేపథ్య సంగీతం సమకూర్చారు. “గయా అంధేరా హువా ఉజాలా చమక్ చమక్ శుభ్ కా తారా” అనే తలత్ మెహమూద్ పాడిన పాట నేటికీ వినపడుతూనే వుంటుంది. తరవాత ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (1955), ‘దో ఆంఖే బారా హాథ్’ (1958), ‘నవరంగ్’ (1959), ‘స్త్రీ’ (1961), ‘సెహరా’ (1963), ‘గీత్ గాయా పత్తరోం నే’ (1964), ‘బూంద్ జో బన్ గయీ మోతీ’ (1967) వంటి సూపర్ హిట్ సినిమాలను శాంతారాం నిర్మించారు. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ నృత్య ప్రధాన చిత్రం కావడంతో సంధ్య సరసన ప్రఖ్యాత నాట్యాచార్యుడు గోపికృష్ణ నటించారు. ఈ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. ఈ సూపర్ హిట్ చిత్రానికి వసంత దేశాయ్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. శాంతారాం కు ఉత్తమ దర్శకునిగా నే కాకుండా ఈ సినిమాకు నాలుగు ఫిలింఫేర్ బహుమతులు వచ్చాయి. ‘దో ఆంఖే బారా హాథ్’ సినిమాలో శాంతారాం విశ్వరూపం చూపించారు. ఇందులో హీరోగా నటిస్తూ ఒక ఎద్దుతో పోరాటం చేస్తున్నప్పుడు శాంతారాం కంటికి తీవ్ర గాయమైంది. చాలాకాలం తరవాతగానీ ఆ కంటికి మరలా చూపురాలేదు. (తెలుగులో ఈ చిత్రాన్ని ‘మాదైవం’ పేరుతో పునర్నిర్మించారు) టాప్ 25 హిందీ సినిమాల్లో ఈ చిత్రానికి చోటు దక్కింది. లతాజీ ఆలపించిన “ఏ మాలిక్ తేరే బందే హమ్” పాట నిత్యనూతనమే. ‘నవరంగ్’ సినిమాలో సంధ్య సరసన మహీపాల్ హీరోగా నటించారు. సి. రామచంద్ర స్వరపరచిన “ఆదా హై చంద్రమా రాత్ ఆధీ” పాటను ఆధారంగా చేసుకొని ఆత్రేయ నిర్మించిన ‘వాగ్దానం’ సినిమాలో “నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా” అనే దాశరథి పాటకు స్వరాలు కూర్చారు పెండ్యాల. ఈ చిత్రానికి రెండు ఫిలింఫేర్ బహుమతులు రాగా శాంతారాం పేరు ఉత్తమదర్శకునిగా నామినేట్ అయింది. శాంతారాం నటిస్తూ నిర్మించిన ‘స్త్రీ’ చిత్రం 34 వ ఆస్కార్ బహుమతి కోసం భారతీయ ఎంట్రీగా ఎంపికైంది. ఇందులో జయశ్రీ, రాజశ్రీ నటించారు. ‘గీత్ గాయా పత్తరోం నే’ సినిమాలో శాంతారాం జితేంద్రను హీరోగా పరిచయం చేశారు. రాజశ్రీ హీరోయిన్ గా నటించింది. ఇక ‘బూంద్ జో బన్ గయీ మోతీ’ లో జితేంద్ర, ముంతాజ్ నటించారు. రాజ్ కమల్ సంస్థలో వచ్చిన ఆఖరి సినిమా ‘ఝాంజిహార్’ (1987).’ శాంతారాం 85ఏళ్ళ వయసులో ఈ సినిమా నిర్మించారు. కమర్షియల్ గా విఫలమైన ఈ సినిమాతో 75 ఏళ్ళ శాంతారాం సినీ ప్రస్థానం తెరమరుగైంది. చలనచిత్ర సీమకు అత్యుత్తమ సేవలు అందించినవారికి భారత ప్రభుత్వం బహూకరించే ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని 1985 లో శాంతారాం కు ప్రదానంచేసి సత్కరించింది. 1992లో ఆయనకు భారత ప్రభుత్వం మరణానంతర ‘పద్మవిభూషణ్’ పురస్కారం ప్రకటించింది. భారత తపాలా శాఖ శాంతారాం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. శాంతారాం 30 అక్టోబరు 1990 న ముంబై లో మరణించారు. కొల్హాపూర్ లో శాంతారాం నివసించిన ఇంటిని ఇప్పుడు ‘వ్యాలీ వ్యూ’ హోటల్ గా మార్చారు.

పవిత్ర బంధాలు….
ఆరోజుల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. శాంతారాం అందుకు అతీతుడు కాదు. తన ఇరవయ్యో యేట విమలాబాయి అనే పన్నెండేళ్ళ బాలికను శాస్త్రోక్తంగా వివాహమాడారు. వీరి వివాహ బాంధవ్యం చివరిదాకా అరమరికలు లేకుండా సాగింది. విమలాబాయికి నలుగురు సంతానం. పెద్దకుమారుడు ప్రభాత్ కుమార్ పేరిటే శాంతారాం తన సినిమా కంపెనీ స్థాపించారు. మిగిలిన ముగ్గురూ కూతుళ్ళు సరోజ, మధుర, చారుశీల. శాంతారాం రెండవ కూతురు మధుర ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత నిధి పండిట్ జస్రాజ్ సతీమణి. చారుశీల ప్రసిద్ధ మరాఠి నటుడు సుశాంత్ రాయ్ తల్లి. 1941 లో శాంతారాం తన సహచర నటి జయశ్రీ ని వివాహమాడారు. ఆ వివాహానికి తొలి భార్య విమలాబాయి అభ్యంతరం తెలుపలేదు. (1957 వరకు మనదేశంలో బహుభార్యాత్వం న్యాయపరంగా చెల్లుబాటులో వుండేది). జయశ్రీ కి ముగ్గురు సంతానం. కుమారుడు కిరణ్ శాంతారాం మరాఠి సినిమాలకు దర్శకనిర్మాత. ఇద్దరు కూతుళ్ళలో ఒకరు ప్రఖ్యాత నటి రాజశ్రీ కాగా ఇంకొకరు తేజశ్రీ. ఇద్దరు భార్యలు కలిసిమెలిసి ఉండడమే కాకుండా వారి పిల్లలుకూడా కలిసిమెలిసే వుండేవారు. ‘దో ఆంఖే బారా హాత్’ సినిమా నిర్మాణ సమయంలో ఆర్ధిక విషయాల్లో జయశ్రీతో శాంతారాంకు విభేదాలు పొడచూపడంతో ఆమెకు విడాకులు ఇచ్చేశారు. భారతీయ పార్లమెంటు విడాకుల తంతును చట్టబద్ధం చేసిన తొలి రెండువారాల్లోనే నమోదైన విడాకుల కేసుగా దీనిని అభివర్ణిస్తుంటారు. తరవాత 1956 డిసెంబరు 22న శాంతారాం తన సహచర నటి సంధ్యను పెళ్ళిచేసుకున్నారు. హిందూ బహుభార్యాత్వాన్ని జనవరి 1, 1957 న భారత ప్రభుత్వం రద్దు చేసింది. అంతకు ముందే వీరి వివాహం జరగడంతో అది చట్టబద్ధమైంది. ఈ పెళ్లి కూడా తొలి భార్య విమలాబాయి అంగీకారంతోనే జరిగింది. సంధ్య వారి కుటుంబంతోనే కలిసి వుండేది. శాంతారాం చనిపోయిన తరవాత కూడా సంధ్య విమలాబాయితో కలిసి వుండడం విశేషం. సంధ్యకు విమలాబాయికి వయసులో చాలా తేడా ఉండడంతో సంధ్యను సవతిగా కంటే కన్న కూతురుగా చూసుకునేది. సంధ్యకు సంతానం లేరు. శాంతారాం పిల్లల్నే తన పిల్లలుగా భావించి బాగా చూసుకునేది. సంధ్య వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, ఆమె శాంతారాం నిర్మించిన సినిమాలలో తప్ప ఇతర నిర్మాతల సినిమాలలో నటించలేదు. శాంతారాం 1990 అక్టోబరు 30 న కాలంచేసినప్పుడు విడాకులు తీసుకున్న అతని రెండవ భార్య జయశ్రీ కర్మక్రతువులకు హాజవడమే కాకుండా వితంతు జీవనం సాగించి 2004 అక్టోబరు 19న చనిపోయింది. శాంతారాం, జయశ్రీ ల కుమారుడు కిరణ్ శాంతారాం బొంబాయి నగరానికి షరీఫ్ గా సేవలందించారు. విమలాబాయి కూడా శాంతారాం చనిపోయిన ఆరేళ్ళకు 1996 లో తనువు చాలించింది. శాంతారాం బయటనే కాదు ఇంట కూడా గెలిచిన గొప్ప మనిషి అని చెప్పేందుకు ఆయన వ్యక్తిగత జీవితం ఒక ప్రబల ఉదాహరణ.
-ఆచారం షణ్ముఖాచారి
(9492954256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap