ప్రేమగంతల ‘దాగుడు మూతలు’

చైతన్యం, ఉత్సాహం, వేగం, ఆనందం సినీదర్శకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. ఆ లక్షణాలు మూర్తీభవించిన ఆదుర్తి సుబ్బారావు సినిమాలు గంటకు గంటన్నర వేగంతో పరుగెడతాయి. నీరసంగా కూర్చున్న ప్రేక్షకుణ్ణి భుజంతట్టి నిటారుగా కూర్చోబెడతాయి. విషాద సన్నివేశాలు కూడా విసుగెత్త కుండా నడుస్తాయి. సెంటిమెంటు పండించడంలో, హాస్యాన్ని విరజిమ్మడంలో ఆదుర్తి తనకుతానే సాటి. ఆర్క్ లైట్లకు దూరంగా నటీనటులను అవుట్ డోరులో జనాల మధ్యకు తీసుకొచ్చి సహజ కాంతుల్లో, ప్రకృతి అందాలను సెల్యూలాయిడ్ మీదకెక్కించి, విషాదాంతమైన సినిమాలను కూడా విజయవంతం చేసిన దార్శనికుడాయన. అందుకే ఆదుర్తి సినిమాలకు ఒక బ్రాండ్ ఇమేజి వుంది. అక్కినేని చిత్రాల ఆస్థాన దర్శకునిగా ముద్రపడిన ఆదుర్తి చేత దినవాహి భాస్కర నారాయణ (డి.బి.ఎన్) ఆడించిన ‘దాగుడుమూతలు’లో నటరత్న ఎన్టీఆర్ తొలిసారి నటించడం విశేషం! మనిషికి మనసు కావాలి. మనసుకు శాంతి కావాలి. మనశ్శాంతి లభించని మనిషికి ఎంత డబ్బున్నా ఒకటే. ఆ డబ్బు మనిషి జీవితాలతో ఎలా దాగుడుమూతలు ఆడుతుందో తెలియజెప్పే ఇతివృత్తమే ఈ సినిమా కథాంశం. 1964 ఆగస్టు 21 న విడుదలై విజయతీరాలను చేరి 57 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు కొన్ని …

ముగ్గురు మిత్రుల సంగమం

డి.బి. నారాయణది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ. 1938-40 మధ్య కాలంలో ‘మైసూరు సౌండ్ స్టూడియోస్’ లో సౌండ్ అసిస్టెంట్ గా పనిచేసారు. తరవాత అక్కడే రంజిత్ వంటి సినిమా హాళ్ళు నిర్వహించారు. కొన్ని పంపిణీ సంస్థలకు మేనేజర్ గా వ్యవహరించాక మద్రాస్ వచ్చి ప్రకాష్ స్టూడియో లో జనరల్ మేనేజరుగా పనిచేసారు. అక్కడే నిర్మాణ శాఖలో పనిచేస్తున్న సరిదే భావనారాయణ తో డి.బి.ఎన్ కు పరిచయమై, స్నేహంగా మారింది. అదే స్టూడియోలో ఆదుర్తి సహాయ దర్శకుడిగా పనిచేస్తుండేవారు. ఇద్దరిదీ రాజమండ్రే! డి.బి.ఎన్, భావనారాయణలు 1953 నవంబరులో ‘సాహిణి ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించి తొలిప్రయత్నంగా ఆదుర్తి దర్శకత్వంలో హిందీ మ్యూజికల్ హిట్ ‘బైజు బావరా’ ఆధారంగా తెలుగులో ‘అమరసందేశం’ నిర్మించారు. నవంబరు 6, 1954 న విడుదలైన ఈ సినిమా గొప్పగా ఆడకపోయినా ఆదుర్తికి మంచి దర్శకుడనే పేరొచ్చింది. ఇద్దరు నిర్మాతలూ కలిసి మలి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో ‘పెంకి పెళ్ళాం’(1956), ‘బండరాముడు’(1959) సినిమాలు నిర్మించారు. తరవాత ఇద్దరూ విడిపోయి ఎవరికివారే స్వతంత్రంగా సినిమాల నిర్మాణం కొనసాగించారు. డి.బి.ఎన్ ఫిలిమ్స్ పతాకంకింద ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో నారాయణ ‘పెండ్లిపిలుపు’ (1961) సినిమా తీసారు. అన్నపూర్ణావారు ఎగరేసుకుపోయిన ఆదుర్తినే దర్శకుడిగా పెట్టి ఎన్టీఆర్ తో సాంఘిక చిత్రాన్ని నిర్మించాలని ఎదురు చూస్తున్న డి.బి.ఎన్ కి మూసకట్టు ఒరవడిని తోసిరాజని కొత్తరకంగా కలాన్ని పరిగెత్తించే మరో రాజమండ్రి కుర్రాడు ముళ్ళపూడి వెంకటరమణ రూపంలో రచయితగా దొరికాడు. తక్కువ డైలాగులతో హాయిగా కథనడిపే పద్ధతిని ప్రేక్షకులకు అలవాటుచేసిన మేధావి ముళ్ళపూడి. ఆయనకు‘దాగుడు మూతలు’ తొలి స్ట్రెయిట్ చిత్రం.

చిత్రకథ.. కమామీషూ…

సినీమాల్లోకి రావడం ముళ్ళపూడికి మొదట ఇష్టం లేకున్నా డి.బి.ఎన్ కు ఎదురు చెప్పలేక ‘దాగుడుమూతలు’ సినిమాకు కథ అల్లారు. పూర్తి స్క్రిప్టు తయారైతే కానీ షూటింగు షెడ్యూలు మొదలు పెట్టించే అలవాటులేని ముళ్ళపూడి, ఈ సినిమా కోసం గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించిన ‘డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్’ అనే అమెరికన్ స్క్రూ బాల్ కామెడీ సినిమాని ప్రేరణగా తీసుకొని కథ అల్లి సినేరియో సమకూర్చారు. ఈ హాలీవుడ్ సినిమాకి ఆధారమైన ‘ఒపేరా హ్యాట్’ అనే కథే దాగుడు మూతలు సినిమాకి కూడా మూలం. ఇంచుమించు దాగుడుమూతలు సినిమాకూడా అదే ధోరణిలో సాగుతుంది. దాగుడుమూతలు ముళ్ళపూడికి మొదటి సినిమానే అయినా, తొలుత విడులైన సినిమా మాత్రం ‘రక్తసంబంధం’ సినిమానే. ఇక దాగుడుమూతలు కథలోకి వెళ్తే, కోటీశ్వరుడు విశ్వసుందరరావు(గుమ్మడి) తన అభీష్టాన్ని వ్యతిరేకించి పెళ్లిచేసుకున్నందుకు కొడుకును ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. తనకి మనిషి విలువేమిటో తెలిసేసరికి కొడుకూ, కోడలూ చనిపోతారు. అనాధగా మిగిలిన మనవడిని (ఎన్‌టి‌ఆర్) దారినపోయే దానయ్య చేరదీసి పెంచుతాడు. మనవడికోసం దేశమంతా గాలించినా అతని ఆచూకీ తెలియదు. కానీ తనవూళ్ళోనే, తన మిల్లు ప్రాంగణంలోనే చిన్న హోటలు నడుపుకునే సుందయ్య తన మనవడేనని తెలుసుకోలేకపోతాడు జమీందారు. తనను పెంచిన దానయ్య బిడ్డల్ని సాకుతూ, పదిమందికీ సహాయపడుతూ హోటలు నడిపే సుందయ్య జీవితంలోకి ఇష్టంలేని పెళ్లినుంచి తప్పించుకుని పారిపోయివచ్చిన సుబ్బులు (బి.సరోజాదేవి) అనే చిన్నది ప్రవేశిస్తుంది. వారిద్దరి మనసులు కలిసి ప్రేమ చిగురిస్తుంది. జమీందారు ఆస్తి దక్కించు కోవాలని ఆయన అన్న అల్లుడు భూషణం(రమణారెడ్డి) తన కూతురు (శారద)తోనూ, జమీందారు తమ్ముని కోడలు సూరమ్మ (సూర్యకాంతం) తన కొడుకు (పద్మనాభం)తోనూ ఆ బంగళాలో తిష్టవేసి పోటీలుపడి సేవల పేరుతో జమీందారుని హింసిస్తూ వుంటారు. సుబ్బులు జమీందారు దివాణంలో సేవలుచేసే నర్సుగా చేరి, జమీందారు అభిమానం చూరగొని, ఆ బంగళాలో సెక్రెటరీ స్థాయికి ఎదిగి ఆ ఇంట్లో అధికారం సంపాదించుకుంటుంది. “నాకూతుర్ని నీ కోడలుగా చేసుకో: నీ కొడుకుని నేను జమీందారుకు దత్తు చేయిస్తాను” అని భూషణం సూరమ్మతో చెప్పి, జమీందారును దత్తతకు ఒప్పిస్తాడు. జమీందారు వద్దవున్న ఫోటో, సుందయ్యవద్ద వున్న అతని తల్లిదండ్రుల ఫోటో ఒక్కలాగే వుండడం గమనించిన సుబ్బులు సుందయ్యే జమీందారు మనవడని గ్రహించి ఆయనకు సుందయ్యను అప్పగిస్తుంది. సంతోషంతో సుందయ్యను వారసుడిగా ప్రకటించి జమీందారు కన్ను మూస్తాడు. సుందయ్య దానధర్మాలు చేస్తూవుండటం మింగుడుపడని భూషణం, తన కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని ఒక దొంగ వీలునామా సృష్టించి వలపన్నుతాడు. సుందయ్య భూషణం పన్నాగాన్ని పసికట్టి ఎత్తుకు పైఎత్తు వేసి శారదతో కూడపలుక్కొని పెళ్లి చేసుకునేందుకు సరేనంటాడు. ఈ నాటకం తెలియని సుబ్బులు సుందయ్యను అపార్ధం చేసుకొని వెళ్ళిపోతుంది. బంగాళాకు వచ్చిన సుందయ్య అక్కడ చేస్తున్న పెళ్లి ఏర్పాట్లను చూసి రెచ్చిపోయి ఆ ఏర్పాట్లను తన్నివేసి, అడ్డొచ్చిన వాళ్ళను తోసివేస్తాడు. దాంతో అతనికి పిచ్చెక్కిందని ప్రకటించి భూషణం సుందయ్యను పిచ్చాసుపత్రిలో చేరుస్తాడు. అసలు విషయం తెలుసుకొన్న సుబ్బులు సహాయంతో, భూషణం, సూరమ్మల డబ్బు పిచ్చి వదిలించి సుందయ్య సుబ్బుల్ని పెళ్ళాడటంతో సినిమాకి శుభం.. కాదు కాదు ‘జైహింద్’ కార్డు పడుతుంది.

ఆదుర్తి మార్క్ కదనం
ఆదుర్తి సుబ్బారావు సినిమాను నడిపే పధ్ధతి విలక్షణంగా వుంటుంది. ఆదుర్తి గొప్పతనం ఆయన తీర్చిదిద్దిన శిష్యుల పనితనంలో బయటపడుతుందనే మాట సత్యం. విక్టరీ మధుసూదనరావు, కళాతపస్వి విశ్వనాధ్, ఎడిటర్-డైరెక్టర్ టి.కృష్ణలు ఆదుర్తి స్కూలునుంచి వచ్చినవారే! ముళ్ళపూడి వెంకటరమణతోబాటు రచయిత సత్యానంద్ కు ఓనమాలు దిద్దించిందీ; సెల్వరాజ్ ని చాయాగ్రాహకుడిగా తీర్చి దిద్దిన ఘనత కూడా ఆదుర్తిదే. సాధారణంగా సౌండ్ ట్రాక్ చెకింగ్ కి మూవియోలా మీద ఫిలిం నడపటం అందరూ అనుసరించే పధ్ధతి. కానీ ఆదుర్తి మాత్రం ఫిలిం రీలుని కిటికీ వెలుతురులో చేత్తో తిప్పి సౌండ్ ట్రాక్ ఎక్కడ ఆగిందో చెప్పేవారు. పంటి బిగువున ఫిలిం ముక్కను అక్కడ తెంపి అతికించేవాడు. కచ్చితంగా శబ్దం సరిపోయేది. దాగుడుమూతలు సినిమా నిర్మాణం మాత్రం ఎందుకో చకచకా సాగలేదు. ఈ సినిమా రచన సాగుతున్న కాలంలోనే ‘మూగమనసులు’ సినిమాకి ముళ్ళపూడిని ట్రీట్మెంట్ రాయమన్నారు ఆదుర్తి. పాపం డి.బి.ఎన్ యేమీ అనేవాడు కాదు. ఈ సినిమా రచనాకాలంలో ముళ్ళపూడి పుచ్చుకున్న నెలజీతం నాలుగు వేలు! అప్పట్లో అదే పెద్ద పారితోషికం కింద లెక్ఖ. చివరకు వాహిని-విజయా స్టూడియోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా నడచిపోతుంది. అతితక్కువ డైలాగులతో ఎక్కడా విసుగు రానీయని రీతిలో చిత్రాన్ని నడిపించారు ఆదుర్తి. కొందరు అస్మదీయులైతే కావాలనే చిత్రనిర్మాణాన్ని ఆదుర్తి ఆలస్యం చేస్తున్నారనీ, అక్కినేని చిత్రాలు తీయడంలో వున్న శ్రద్ధ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం మీద ఆదుర్తికి లేదని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ గాని, ఆదుర్తి గాని వాటిని పట్టించుకోలేదు. రమణారెడ్డిని కామెడీ విలన్ గా, నాగయ్యను పోలీసు అధికారిగా చక్కగావాడుకున్నారు. ‘పెండ్లిపిలుపు’(1961) సినిమా విడుదలైన మూడేళ్ళకుగానీ దాగుడుమూతలు రిలీజు కాలేదంటే యెంత నిర్మాణజాప్యం జరిగిందో బోధపడుతుంది. విచిత్రమేమిటంటే, ‘డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్’ సినిమా తయారీ కూడా ఇలాగే ఆలస్యమేకావటం కొసమెరుపు!

Atreya, Dasarathi, Arudra and KV Mahadevan

సంగీత సాహిత్య సమలంకృతం:
ఆచార్య ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర రాసిన రసవత్తర గీతాలకు తేనెలూరు మట్లు కట్టి, సాహిత్య సమలంకృతం చేసిన ఘనత కె.వి. మహదేవన్ ది. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. “గోరొంక గూటికే చేరావు చిలకా”, “గోరొంక కెందుకో కొండంత అలక” అనే రెండు పాటలూ దాశరథి రాసినవే. ఇష్టంలేని పెళ్లి తప్పించడానికి ఇంట్లోంచి పారిపోయి ఎన్టీఆర్ గూటిలోకి చేరిన సరోజాదేవి ఆసరాకి భరోసా ఇస్తూ ఘంటసాల పాడేది మొదటి పాట కాగా, సరోజాదేవి మీద అలకబూని బెట్టుచేసే ఎన్టీఆర్ ని మచ్చికచేసుకొనే సందర్భంగా వచ్చేది సుశీల పాడిన రెండో పాట. ఈ రెండుపాటలూ శంకరాభరణం రాగంలోనే వున్నా, వాటి టెంపో మాత్రం భిన్నంగా వుంటుంది. “గోరొంక గూటికే చేరావు చిలకా”పాట టెంపో స్లోగా వుంటుంది. రాత్రివేళ సరోజాదేవికి భద్రతపై అభయమిస్తూ పాడే పాట కావడంతో మహదేవన్ ఈ పాటను స్లో టెంపోలో స్వరపరిచారు. “గోరొంక గూటికే చేరావు చిలకా” అన్నప్పుడు పంజరంలోకి చిలకను పంపటం, “భయమెందుకే నీకు బంగారు మొలక” అన్నప్పుడు ఆ పంజరం తలుపు మూయటం ఆదుర్తి చూపిన గొప్ప సింబాలిజం. రాత్రివేళ పాట కావడంతో ఎన్టీఆర్ ని కేవలం బనియను, తువ్వాలు మీద చూపడం ఆదుర్తి నేటివిటీకి ఎంత విలువ ఇస్తారో తెలుస్తుంది. “నిలవలేనికళ్ళు నిదరపొమ్మన్నాయి” చరణంలో సరోజాదేవి హావభావాలు వర్ణించనలవికాదు. అలాగే సరోజాదేవి పాడే పాటలో టెంపో వేగం పుంజుకుంటుంది. “మాటేమో పొమ్మంది- మనసేమో రమ్మంది, మాటకు మనసుకు మధ్యన తగువుందీ” ప్రయోగం అద్భుతమైతే, మరి సరోజాదేవి హావభావాలు మహాద్భుతంగా వుంటాయి. ఈ పాటలో సరోజాదేవికి బాల నటీమణులు బేబి, సుమ, లత, తార, అవంతి సహకరించారు.

తెరమీద ముద్దులపై ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంగా, ముద్దులంటే కేవలం లిప్-లాకే కాదు, మనంచూసే ప్రకృతిలో, ప్రవృత్తిలో అడుగడుగునా ముద్దులు మురిపిస్తాయని చెప్తూ ఆచార్య ఆత్రేయ రాసిన ముద్దుపాట ఆ రోజుల్లో విశేషంగా ఆకట్టుకుంది. నటభైరవి రాగంలో రూపుదిద్దుకున్న ఈ పాట చివరిదాకా సరోజాదేవి ఇచ్చే లిప్ మోవ్మెంట్ ఎంత ముద్దుగా వుంటుందో చెప్పలేం. వాహినీ గార్డెన్లో చిత్రీకరించిన ఈ పాట చరణం చివర్లో “నువ్వు నేనూ ముద్దుకు ముద్దు” అని ఆత్రేయ రాస్తే, సెన్సారు అధికారులు ఆ ప్రయోగానికి అభ్యంతరం చెప్పి తొలగించమన్నారు. అప్పటికే పాట చిత్రీకరణ పూర్తికావడంచేత “ముద్దుకు ముద్దు” అనే పదాల స్థానంలో “ఊహుహు ఊహూ” అని హమ్మింగ్ చేర్చి రీ-రికార్డింగు చేసారు. నిశితంగా పరీక్షిస్తే ఎన్టీఆర్, సరోజాదేవిల లిప్ మూవ్మెంట్ ‘ముద్దుకు ముద్దు”గానే కనిపిస్తుంది. “విరిసి విరియని పువ్వే ముద్దు” అన్నప్పుడు ఎన్టీఆర్ చేతిలో అరవిరిసిన పూల రెమ్మ వుండటం. “నడకలలో నాట్యంచేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు” అనే ప్రయోగం వచ్చినప్పుడు సరోజాదేవి వెనక్కి నడవటం మనం గమనిస్తాం. ఆ నడకలో హొయలు బ్యాక్ ప్రొజెక్షన్లో చిత్రీకరించడం ఆదుర్తి ప్రతిభకు గీటురాయి. “పచ్చనిచేలే కంటికి ముద్దు” అన్నప్పుడు ఎన్టీఆర్ పాలకంకి చేతిలో వూపటం కూడా పాట చిత్రీకరణలో ఆదుర్తి ఎంతశ్రద్ధ కనపరుస్తారో తెలియజేస్తుంది. ఇక “చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు” అనే చరణంలో సరోజాదేవి జడను ముందుకు వేసుకుంటూ నడుస్తుంటుందే కానీ, పిరుదుల చకచకలు మాత్రం కనిపించనీదు. “ఏదైనా గుప్పెట్లో ఉంటేనే అందం” అనే విషయాన్ని ఆదుర్తి తెలివిగా, విశేషణ పూర్వకంగా చూపించారు.

“అందలం ఎక్కాడమ్మా- అందకుండా పోయాడమ్మా” పాట ఆత్రేయ రచన. ఈ పాటను గుమ్మడి ఎన్టీఆర్ తన మనవడని తెలుసుకున్న సందర్భంగా వచ్చే వేడుకలో సరోజాదేవి చేసే స్టేజ్ డ్యాన్స్ సీక్వెన్స్ గా మలిచారు. పాటలో రెండో చరణం వచ్చేసరికి ఎన్టీఆర్ సరోజాదేవితో గళం కలుపుతాడు. “ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా”అనడంలో, కాఫీ హోటలు నడిపే ఎన్టీఆర్ ఒక్కసారి జమీందారు అయిపోతే తనని మరచిపోతాడేమోనని సంశయించే సరోజాదేవికి అభయం ఇవ్వడమే ఉద్దేశ్యం.

ఈ పాటతోబాటు “యెంకొచ్చిందోయ్ మావ ఎదురొచ్చిందోయ్” అనే ఆరుద్ర పాటలో సరోజాదేవి ఆహార్యం నండూరివారి ఎంకిని గుర్తుకు తెస్తుంది.

“మెల్లమెల్లమెల్లగా- ఆణువణువూ నీదెగా” అనే టైటిల్ సాంగ్ వెస్ట్రన్ బీట్ తో యెంతో హృద్యంగా సాగుతుంది. “నీదికానిదేది లేదు నాలో-నిజానికి నేనున్నది నీలో- ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో” అనే ఆత్రేయ ప్రయోగం ఇంకెవ్వరూ చెయ్యలేనిది. “నేనున్నది నీలో” అన్నప్పుడు ఇద్దరినీ నీటినీడలో పరోక్షంగా చూపించడం ఆదుర్తి ప్రతిభకు మచ్చుతునక. ఈ పాటలో ఎన్టీఆర్ పిల్లిగంతులేస్తూ యెంతో హుందాగా నటించారు. విగ్గులేని ఎన్టీఆర్ తలకట్టు ఈ సినిమాలో యెంతో బాగుంటుంది.

శంకరాభరణ రాగంలోనే స్వరపరచిన మరో ఆత్రేయ గీతం “దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం” విషాద సన్నివేశపు పాట. ఎన్టీఆర్ పాడే పల్లవి, చరణాలు నైట్ లైట్ డార్క్ షేడ్ లో, ఇండోర్లో చిత్రీకరిస్తే, సరోజాదేవి పాడే చరణాలను మూన్ లైట్ బ్యాక్ డ్రాప్ లో, పూదోటలో చిత్రీకరించారు. అలతి పదాలతో అనంతార్ధాన్ని చెప్పగల ప్రజ్ఞావంతుడు ఆత్రేయ. “తామునవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ: తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ: నేను నవ్వితే ఈలోకం చూడలేక ఏడ్చింది: నేనేడిస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది” వంటి లోతైన భావాలు స్పురించే పాటలు ఆత్రేయ కాక మరెవ్వరు రాయగలరు? ‘’డివ్వి డివ్వి డివ్విట్టం నూవ్వంటేనే నాకిష్టం’’ వినోద గీతం.

ఎన్టీఆర్, ఆదుర్తిల కలయికతో వచ్చిన దాగుడుమూతలు సినిమా నూరురోజుల పండగ జరుపుకొంది. వీరిద్దరి కాంబినేషన్ లో తరవాత సంవత్సరంలో వచ్చిన ‘తోడూ-నీడా’ సినిమాకూడా శతదినోత్సవం చేసుకుంది.

ఆచారం షణ్ముఖాచారి
____________________________________________________________________________

ఆచారం షణ్ముఖాచారిగారి పరిచయం:

Shanmukaachari

పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలిలో. కందుకూరు, తిరుపతి, పంత్ నగర్ (యు.పి)లో చదువులు. వ్యవసాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లో డిప్లొమాలు. 1971లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయాధికారిగా ఉద్యోగం చేరారు. 1977 లో ఆంధ్రా బ్యాంక్ లో చేరిక…వివిధ పదవుల నిర్వహించి, ఉన్నతాధికారిగా 2009లో ఉద్యోగ విరమణచేశారు. 11 సార్లు ఉత్తమ బ్యాంకర్ గా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు. ఉద్యోగ విరమణానంతరం స్వచ్ఛంద పాత్రికేయునిగా సితార సినీ పత్రిక, తెలుగు వెలుగు, చతుర లో పన్నెండేళ్లుగా సినిమా విశ్లేషణాత్మక వ్యాసాలు అందించారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా శ్రీ రావి కొండలరావుతో కలిసి ‘సాహిత్య సంగీత సమాఖ్య స్థాపన. వ్యవస్థాపక కార్యదర్శిగా పన్నెండు సినిమా పుస్తకాలకు ప్రకాశకులుగా వ్యవహరించారు. శ్రీ కొండలరావు మరణానంతరం ఆ సమాఖ్యకు ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నివాసం హైదరాబాద్ లో.

6 thoughts on “ప్రేమగంతల ‘దాగుడు మూతలు’

  1. చాలా మంచి సమాచారం. అదుర్తి ఎందుకనో ఎన్టీఆర్ తో సినిమా తీయలేదు. సంవత్సరానికి anr నాలుగైదు పిక్చర్లు యాక్ట్ చేస్తే, ఎన్టీఆర్ డజను సినిమాలు చేసేవాడు. దానికి కారణం – బ్యానర్, డైరెక్టర్, హీరోయిన్ పట్టింపు ఎన్టీఆర్ కి ఉండేది కాదంటారు.
    మరి అంత గొప్ప డైరెక్టర్ అదుర్తి గారు, ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు ఎందుకు చేయలేదో?
    కేవీ మహదేవన్ అంత అద్భుతమైన పాటలు ఎలా కూర్పు చేసేవాడో? అదీగాక తెలుగు రాని kvm సాహిత్యానికి ట్యూన్లు కట్టేవాడట.. ఇళయరాజా కూడా అలా చేయలేదు. ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ కి కూడా ట్యూన్ చేయగల సమర్థుడు మహదేవన్ అంటారు.

  2. చాలా చక్కటి వ్యాసం.ఇందులో పద్మనాభం కామెడీ బాగుంటుంది. “ఏమండీ మీ పువ్వు” అంటూ సరోజాదేవి వెనకాల పడితే,ఆమె ఎన్టీఆర్ ఇంటిలోకి వచ్చి దాక్కుంటుంది. పిల్లలు పద్మనాభం సైకిల్ టైర్ పంచర్ చేసేస్తే, టైర్ ను చూసుకుని “వచ్చేటప్పుడు పూరీ లా ఉండే టైర్,ఇప్పుడు చపాతీ అయిపోయిందేమిటే చెప్మా” అనుకుంటూ సైకిల్ తోసుకుంటూ వెళతాడు. బాల్యంలో బాగా ఎంజాయ్ చేసిన సినిమా అది.

  3. అద్భుతమైన వ్యాసం… మాకు పంచినందుకు ధన్యవాదాలు. కాలేజీ రోజుల్లో వరసగా ఐదు రోజులు చూసాము ఈరోజు చిత్రం.. దాగుడుమూతలు.

  4. తెలుగులో టాప్ 10 సాంగీక సినిమాల్లో మొదటి మూడు దాగుడు మూతలు మూగ మనసులు ముత్యాల ముగ్గు అని చెప్పవచ్చు.
    ఈ మూడు సినిమాల కి రైటర్ ముళ్ళపూడి గారు అవడం…మ్యూజిక్
    కె.వి మహదేవన్ కావడం అందులో 2 ఆదుర్తి ఒకటి బాపు డైరెక్ట్ చేయడం నిజాంగా గ్రేట్.దాగుడు మూతలు సినిమా అయితే నేను తెలుగులో అన్నిటి కంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా…నటీ నటులు
    కామెడీ….ఇక పాటలు అయితే అత్యద్భుతం. నాకు ఎంతో ఇష్టమైన ఈ సినిమా కి సం బంధించిన వ్యాసమ్ పబ్లిష్ చేసిన 64 కళలు పత్రికకు ధన్యవాదాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap