(మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాల వివరాలు ….)
తొలి తెలుగు చిత్రకారుడిగా గుర్తింపు పొందిన దామెర్ల రామారావు చిత్రాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చిత్రకళా పరిషత్ ప్రతినిధి సుంకర చలపతిరావు కోరారు. దామెర్ల 125వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జీవీఎంసీ పాఠశాలలో మంగళవారం దామెర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దామెర్ల చిత్రాలు నేటికీ సజీవంగా చిత్రకారులు, ఆయన అభిమానుల గుండెల్లో నిలుస్తాయన్నారు. ప్రముఖ న్యాయవాది జి.కె. విశ్వనాథరాజు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
దామెర్లను ఆదర్శంగా తీసుకోవాలి
ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావును యువ చిత్రకారులంతా ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. చిత్రకళ ఉన్నతికి ప్రభుత్వం పూనుకుని చిత్రకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మంగళవారం గోదావరి గట్టు మీద ఉన్న దామెర్ల విగ్రహం వద్ద ఆయన 125 వ జయంతి జరిగింది. సభకు సంస్థ ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ అధ్యక్షత వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితులు, సిపి బ్రౌన్ మందిరం నిర్వాహకులు సన్నిధానం శాస్త్రి, కామేశ్వర శాస్త్రి, కార్తికేయ, సాయి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.