మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ
సాంకేతిక శాఖలో ఇరుక్కుపోయి సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్న రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ని సాంస్కృతిక శాఖకు బదలాయించేందుకు కృషి చేస్తామని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ బిల్లులు కూడా చెల్లించలేని దుస్ధితిలో ఆర్ట్ గ్యాలరీ ఉండడం దురదృష్టకరమని వారిరువురూ వ్యాఖ్యానించారు.
6 జనవరి 2025 న సోమవారం ఉదయం దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో ప్రముఖ చిత్రకారులు వరదా వెంకటరత్నం విగ్రహాన్ని మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో, సి.పి. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో దుర్గేష్ మాట్లాడారు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ నిలబడడం వెనుక వరదా వెంకటరత్నం శ్రమ ఎంతో ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా తాను ఆర్ట్ గ్యాలరీ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు.
దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నందున ఎదుగూ బొదుగూ లేకుండా ఉందని, సభకు అధ్యక్షత వహించిన సన్నిధానం శాస్త్రి తెలిపారు. వరదా వెంకటరత్నం తన జీవితాన్ని ఆర్ట్ గ్యాలరీకి ధారపోశారని విగ్రహ స్ధాపకుడు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ పై వెలువడిన “సాహిత్య సంకీర్తకుడు” పుస్తకాన్ని మంత్రి దుర్గేష్ కి సన్నిధానం శాస్త్రి బహుకరించారు. అంతకు ముందు మాదేటీ రాజాజీ ఆర్ట్ అకాడమి దామెర్లరామారావు ఆర్ట్ గ్యాలరీకి బహుకరించిన రాజాజీ చిత్రాల విభాగాన్ని దుర్గేష్ సందర్శించి రవి ప్రకాష్ ని అభినందించారు.
ఇలాగే రాష్ట్రమంతటా కళాకారులకు సంబంధించిన సమస్యలను ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తూ వారి కృషికి అభ్యున్నతికి సమూలమైన సహకారం అందిస్తారని తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ సకల కళలు వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాను.
మంచి నిర్ణయం. కూటమి ప్రభుత్వం లో కళలు మంచి వైభవాన్ని పొందుతాయని ఆశిద్దాం. 👍🙏-బొమ్మన్ఆ ర్టిస్ట్ & కార్టూనిస్ట్, విజయవాడ