సంస్కృతిని బతికించేది చిత్రకారులే…

మన సంస్కృతీ, సంప్రదాయాలను తమ చిత్రాలలో రేపటి తరాలకు అందించే ప్రముఖ చిత్రకారులను నిత్యం స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ వి. మల్లికార్జునరావు ఆకాంక్షించారు. మంగళవారం (22-02-2022) మధ్యాహ్నం ఆయన రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రెండవ బ్లాక్ లో ఏర్పాటు చేసే చిత్రకారుల ప్రత్యేక విభాగాల ఏర్పాటును పరిశీలించారు. చిత్రాలను భధ్రపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమి వ్యవస్ధాపక కార్యదర్శి మాదేటి రవి ప్రకాష్ మల్లికార్జునరావుకి వివరించారు. చిత్రకారుల పేరుతో ఏర్పాటు చేసే ప్రత్యేక విభాగాలలో అమరావతిపై తాను గీసిన‌ పెద్ద తైలవర్ణ చిత్రాలను బహుకరిస్తానని ఆయన తెలిపారు. రెండవ బ్లాక్ లో మాదేటి రాజాజీ స్మారక చిత్రకళా విభాగం, ప్రముఖ చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు, కాళహస్తి పార్వతీశం, ప్రకృతి చిత్రకారుడు విజయకుమార్ ల చిత్ర విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు రవిప్రకాష్ తెలిపారు. ఇందులో 25 లక్షల రూపాయల విలువైన చిత్రాలను ఉచితంగా అందజేస్తున్నామని రవిప్రకాష్ తెలిపారు.

మల్లికార్జునరావును రవిప్రకాష్ శాలువాతో సత్కరించారు. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి జ్ఞాపిక‌ బహుకరించారు. దామెర్ల రామారావు జీవిత చరిత్ర పుస్తకాలను, గ్యాలరీ కేర్ టేకర్ అరిగెల సత్తిబాబు మల్లికార్జునరావుకు బహుకరించారు.

SA: