
ప్రకృతికాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహరదృశ్యాలను వర్ణాలతో వర్ణించగల కుంచె కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆలోటు తీర్చేందుకు ఏ పరలోక దివ్యాత్మో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో! 1897వ సం॥ మార్చి 8వ తేదీన దామెర్ల రామారావు శ్రీ వెంకటరమణ రావు, లక్ష్మీదేవి దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు. శ్రీ రమణరావు అల్లోపతి వైద్యాన్ని ఎఱిగిన ఆయుర్వేద వైద్యులు. కందుకూరి అనుయాయి. నల్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు అతని సంతానం. రామారావు వీరికి ద్వీతీయ పుత్రుడు.
అవి జాతీయోద్యమ రోజులు, దిక్కులన్నీ ‘వందేమాతర’ నినాదంతో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. దేశభక్తి ఓ నదిలా ప్రతివొక్కరిలో ప్రవహిస్తూ ఉండేది. విదేశీ వస్తువులనే కాదు, విదేశీ విద్యాసంస్థలను కూడ బహిష్కరించి జాతీయ కళాశాలలు నేలనాలుగు చెరగులా వ్యాపిస్తున్న తరుణం. రాజమహేంద్రిలో నెలకొన్న ఒక జాతీయ కళాశాలలో రామారావు విద్యనభ్యసించారు. విద్యతోపాటు లలిత కళలకు ప్రాధాన్యత నిస్తూ పాఠ్యాంశాలుండేవి.
శ్రీ గాడిచర్ల రామ్మూర్తి అందులో చిత్రకళా అధ్యాపకులు. రామారావుకి మేనమామ చేతుల మీదుగానే చిత్రకళలో ఓనమాలు దిద్దే భాగ్యం దక్కింది. ఆ తరువాత మేనమామ గారికి పదోన్నతి కలగడంతో ఆ స్థానంలోకి వచ్చిన వారు సుశిక్షితులు కాకపోవటంతో సాధన మాత్రమే నడిచింది తప్ప నైపుణ్యాన్ని పెంపొందించలేకపోయారు.
కళలకు కాణాచి అయిన రాజమండ్రిలో ప్రముఖ నాటక కంపెనీలు పోటాపోటీగా నాటకాలు ఆడుతున్న రోజులవి, వాటికి కావలసిన స్క్రీనులను చిత్రించేందుకు ప్రసిద్ధ చిత్రకారుడు ఎ.ఎస్. రామ్ బెంగుళూరు నుండి రప్పించారు. శ్రీరామ్ నెల్లూరు ఆంధ్రుడు, మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ చిత్రకళలో శిక్షణ పూర్తిచేసి, బొంబాయి వెళ్ళి నాటక తెరలు చిత్రించడంలో ప్రసిద్ధుడైన కాదర్బక్ష్ శిశ్రూషలో నైపుణ్యాన్ని గడించిన దిట్ట. తన అపూర్వ ప్రతిభతో రూపొందించిన నాటక ప్రకటనలు చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడితే, ఆసక్తి కలిగిన వర్ధమాన చిత్రకారులకవి స్పూర్తి నిచ్చేవి.
శ్రీరామ్ చేతినుండి పూలురాలుతున్నాయా!? అనే దిగ్ర్బమ చిత్రిస్తున్నపుడు చూపరులకు కలిగేది. ఎంతో ప్రతిభావంతుడయిన ఈ చిత్రకారుడు కూటి కొరకు మరల చిన్న చిన్న హాస్య పాత్రలు పోషించక తప్పేది కాదు. శ్రీరామ్ నటించే నాటకాలంటే జనం విపరీతంగా ఆదరించే వారు. ఇతను గొప్ప ఫోటోగ్రాఫరు కూడా.
శ్రీరామ్ రాక రాజమండ్రికి వన్నె తెచ్చింది. ఎందరో యువకుల్లో కళాతృష్ణ, జిజ్ఞాసను, అభినివేశాన్ని కలిగించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో ఆయన వల్ల ప్రభావితులైనారు. ఇక మన బాలరాముని విషయం వేరే చెప్పనక్కరలేదు. చదువుపై శ్రద్ధ, ఆటలపై ఆసక్తిలేక ఎప్పుడు ఏదో బొమ్మలు గీస్తూ కూర్చునే రామారావును శ్రీరామ్ దగ్గర తీయడంతో బడి ఎగ్గొట్టి అతని చెంత చేరి ఉత్సుకతతో నిశితంగా ఆ కళా సృష్టిని పరికిస్తూ తను అలా చిత్రరచన చేయాలని తపన పడుతూఉండే వాడు. అప్పటికి అతనికి 10 సం॥లు,
కళకు ఆదరణ, కళాకారులకు గౌరవం కరువయిన రోజులవి. చిత్రం వెనుక చేవ్రాలు ఎవరిదో? చెక్కిన శిల్పంపై చిందిన రక్తం ఎవరిదో? పట్టని రోజులవి. రామారావు ఇంటా, బడిలో ఎప్పుడు చిత్రలేఖనమే. చూసిన చిత్రాన్నల్లా చిత్రించాలనే తపన, శిష్ఠకుటుంబంలో పుట్టి ఈ పాడు పనులేమిటని తండ్రి, చదువులో ధ్యాసలేదని పాఠాలు చెప్పే పంతుళ్ళు ఆగ్రహోదగ్రులయ్యేవాళ్ళు, “అన్న, అక్కలు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే నీకేం పాడుబుద్ధిరా!? కొరగాని చిత్రలేఖనంతో వంశానికే అప్రదిష్ట తెచ్చేలా ఉన్నాడ”ని వీరి నాన్నగారు విచారిస్తూ ఉండేవారు.
1909న దక్షిణ భారతంలో ప్రప్రథమంగా స్థాపించిన ఏకైక విద్యాలయం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి, దీనికి ప్రధానాచార్యుడుగా ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే నియమితులయ్యారు. వీరు కవి, చిత్ర, నట, గాయకులు. సంస్కరణాభిలాష కలిగిన వ్యక్తి, బ్రహ్మచారి. విశాల ధృక్పథంతో విద్యార్థులను నియమిత పాఠ్యాంశాలకే పరిమితం కానివ్వక, వారికి కళాసాహిత్యాభిరుచులను కలిగిస్తూ వారిని ఉత్తమ సంస్కారవంతులుగా, సృజన శీలురుగా తీర్చిదిద్దడానికి శ్రమించిన సద్గురువు. శెలవు దినాలల్లో యావద్భారతం తిరిగి, ఇచ్చటి కళాసంస్కృతులకు తన్మయుడై భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతుడు. తెలుగు గ్రామీణ సౌందర్యాన్ని తన చిత్రాల్లో నిబద్దంచేశారు. కాలేజీ విద్యార్థులను తమతమ జాతీయదుస్తుల్లో రావచ్చునని అనుమతిచ్చిన పాశ్చాత్యుడాయన.
1911 సం॥ కాలేజీలో చదువుతున్న దామెర్ల రామారావు అన్న వెంకటరావు కూల్డ్రే దొరవారికి రామారావుని పరిచయం చేశారు. ప్రథమ సమాగమనంలోనే ముక్కుపచ్చలారని ఈ బాలుడు గొప్ప చిత్రకారుడై దామెర్ల వంశాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పునీతం చేయగలడని ఊహించిన మహాద్రష్ట కూల్డ్రే. రామారావు చిత్ర కళానైపుణ్యాన్ని బిబ్బీస్ జర్నల్, రాయల్ ఎకాడమీ వార్షిక సంచికల్లోని కాపీ చిత్రాలను చూసి ముగ్ధుడై పోయారు. ఏనాటి బంధమో అన్నట్లు ప్రథమ పరిచయంలోనే రామారావును శిష్యునిగా స్వీకరించి, అతని యోగక్షేమాలను తనపై వేసుకొని పథనిర్దేశకుడైనాడు. ఆనాటి నుండి వారి సంబంధం ద్రోణార్జున బంధంగా వెల్లివిరిసింది.
కాపీ చిత్రాలు కూడదని, వస్తువులను, ప్రకృతిని చూసి లేదా ఊహించి చిత్రంచవలెనన్నది ఆయన ప్రథమోపదేశం, ఆ ఆదేశం మేరకే ఒకసారి గుడ్డగొడుగు, బూట్లను ఒకచోట నుంచి చూస్తూ రంగుల్లో చిత్రించిచూపగా, దొరగారు “వీటికంటే అందమైన మీ దేశపు తాటాకు గొడుగు, కిర్రుఓబీచప్పులు ఎందుకు చిత్రించరాద”ని ప్రశ్నించారు. ఆప్రశ్న ఆలేత మస్థిష్క కవాటాలను తట్టి తెరిచాయి. ప్రతీకళ దేశీయమై ఉండాలన్నది పెద్దల ఉవాచ.
ఆనాటి నుండి రామారావు కాపీ చిత్రాలకు స్వస్తి చెప్పి స్వంతంగా ప్రకృతి చిత్రాలను, వస్తురచన చేస్తుండేవాడు. మంచి చిత్రం చూపిస్తే దొరగారు ఇచ్చే ఓ మంచి బహుమతితో పాటు తేనీరు సేవనం, చిత్రకళలో మెళుకువలు వినేభాగ్యం కోసం పోటీపడుతూ ఉండేవాడు.
కూల్డ్రే గారి ఇతర శిష్యులుగా వరదా వెంకటరత్నం, భమిడిపాటి కామేశ్వరరావు, కవికొండల వెంకటరావు, అడవి బాపిరాజు మొ॥న వారున్నారు. వీరంతా ఆ తరువాత కాలంలో వివిధ కళారంగాలలో విశేష కృషి సలిపి అఖండ కీర్తి నార్జించిన వారే….
ఒకసారి రామరావుని వెంట తీసుకొని అజంతా, ఎల్లోరా గుహ సందర్శనానికి వెళ్ళారు కూల్డ్రే. అవి వర్షాకాలపు రోజులు, స్టేషనులో దిగిందే తడవుగా వర్షాన్ని కూడా లెక్కచేయక అజంతావైపు పరుగందుకొన్నారు ఇరువురు. కాని ఎంతని నడవడం?… అందులోను రామారావు అర్భకుడు, పైగా చిన్నవయస్సు, కొంత దూరం వెళ్ళాక రామారావు కాలుసాగక కూలబడి పోయాడు. బాలుని అవస్థ చూడలేని కూల్డ్రే భుజాలపై ఎక్కించుకొని అజంతా అంతా త్రిప్పి చూపారు.
ఒక ప్రభుత్వోద్యోగి పైగా బ్రిటిష్ వ్యక్తి ఏ విధమయిన భేషజం లేక ఒక సామాన్య భారతీయ బాలుణ్ణి తన భుజాలపై ఎక్కించుకొని తిరిగేడంటే అదొక అసామాన్య విషయం. ఆనాడు తాను మోసింది రామారావుని కాదు భావి భారత-కళాసాంస్కృతిక పునర్జీవన వైతాళికుడ్ని అన్న విషయం కూల్డ్రే గారికి స్పష్టంగా తెలుసు. ఈ ఒక్క విషయం చాలు ఆంధ్రదేశం మొత్తం ఆ మహానీయుని ఔన్నత్యానికి ఋణగ్రస్తమయ్యేందుకు. కూల్డ్రే లేకపోతే రామారావు భవిష్యత్తు ఎలా ఉండేదో ఊహించలేము.
కూల్డ్రే సాంగత్యంతో రామారావు చదువు పూర్తిగా అటకెక్కింది. చిత్రలేఖన గంధ సౌరభం పరిణతిని సంతరించుకొన్నది.
శిష్యాత్ ఇచ్చేత్ పరాజయం :
ఒకసారి కూల్డ్రే మిత్రుడు – దొరగారి కాశ్మీర్ చిత్రాన్నొకదాన్ని చూసి ముగ్ధుడై ఆ చిత్రాన్ని తనకీయమని కోరగా, ఆ చిత్రాన్ని వదలలేని కూల్డ్రే నకలు చేయించి ఇస్తానని వాగ్దానం చేశారు. గురువుగారి ఆదేశం మేరకు రామారావు మరునాటికే చిత్రప్రతిని సిద్ధంచేశారు. చిత్రాన్ని తీసుకెళ్ళిన మిత్రుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఆశ్చర్యం…?! ఒకదాన్ని పోలిన మరోచిత్రం- ఏది అసలు?! ఏది నకిలీ?! నీకు నచ్చింది తీసుకొనమని కూల్డ్రే వరమివ్వగా, రామారావు వేసిన చిత్రాన్నే ఆ మిత్రుడు ఎన్నుకొన్నాడు.
తన శిష్యుడు తనను మించిన ప్రజ్ఞావంతుడయ్యాడన్న విషయం కూల్డ్రేని ఆనందంలో ఓలలాడించింది.
1916వ సం॥ రామారావుది నూనుగు మీసాల నూత్నయవ్వనం. ఉత్తమశ్రేణి కళాకారునికి కావలసిన అన్ని లక్షణాలు సంతరించుకొని ఉన్నత శిక్షణకై గురువు ఆజ్ఞపై బొంబాయి పయనమవ్వాల్సిన సమయమానసన్నమయింది.
రామారావు తండ్రిగారిని ఒప్పించేందుకు కూల్డ్రే గారికి పెద్దపనే అయింది. బొంబాయి పంపి విద్యాభ్యాసానికి అయ్యే సమస్త వ్యయం తానే భరిస్తానని చెప్పగా – తన కొడుకుపై ఆ విదేశీయునికున్న శ్రద్ధానురాగం- శ్రేయః కాంక్షలకు తలవగ్గేలా చేశాయి. రామారావు ఆనందానికి వట్ట వగ్గాలులేవు. సహసాధకులంతా ప్రేమమీర వీడ్కోలు చెప్పగా, కూల్డ్రే ఇచ్చిన సిపార్సు లేఖ తీసుకొని బొంబాయి మహానగరం చేరాడు.
ఎందర్నో ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ఖ్యాతి నొందిన సంస్థ జె.జె స్కూలు ఆఫ్ ఆర్ట్స్ – ఆ కళాశాల డీన్ సిసిల్ ఎన్. బ్రర్న్స్. కూల్డ్రే మహాశయుని ఉత్తరం సాంతం చదివి కుశలమడిగి “ఏవైనా చిత్రాలు తెచ్చావా!?” అని సాధికారంగా ప్రధానాచార్యుని దర్జాలో అడిగాడు. లాంఛనంగా ఏవో రెండు మూడు చిత్రాలు చూద్దాం అనుకొన్న అతను ప్రథమ చిత్ర వీక్షణలోనే కూర్చున్న ఆసనం నుండి లేచి “ఛాయ చిత్రాలా!?” అన్న భ్రమగొల్పేట్లు ఉన్న ఆ చిత్రాలన్నీ చూసాక రామారావుని ప్రశంసించకుండా ఉండలేక పోయారు. వెన్నుతట్టి షేక్ హ్యాండ్ యిచ్చి “దక్షిణాన మద్రాస్ ప్రెసిడెన్సీలో మారుమూలనున్న రాజమహేంద్రవరంలో నా చిన్ననాటి మిత్రుడు కూల్డ్రే నిస్సంశయంగా నొక ఆర్గరత్నాన్ని కనుగొన్నాడు. సెబాష్!” అని మురిసిపోయారు.
రామారావుకు సరాసరి 3వ సం॥లో ప్రవేశం ఇచ్చారు. అసాధారణం!? ఎంట్రన్స్ పరీక్ష లేకుండా 5 సం॥ల డిప్లొమాకోర్సులో జాయినయ్యాడు. ఈ ఘటన చాలు రామారావు ప్రతిభకు దర్పణం పట్టేందుకు.
ఉపాధ్యాయుల శిక్షణ సిలబస్ ఆధారంగా కేలేజీలోను అంతకుమించిన సాధన ప్రకృతి వొడిలోను విరామ మెరుగక చేసారు. అది కొందరికి పిచ్చి తలపిస్తే మరికొందరికి ఈర్ష్యను పుట్టించింది. జూనియర్లకు, క్లాస్మేట్సుకు ఆరాధనప్రాయుడయ్యాడు. రామారావును అనుసరించిన ఎందరో భవిష్యత్తులో ప్రముఖ చిత్రకారులైనారు.
శరీర దర్భలత్వము చిత్రకళాశాధనకు ఆటంకంకారాదని వ్యాయామ సాధనతో దేహారోగ్యాన్ని పెంపొందించారు. వారాంతపు సెలవు దినాల్లో సమీపంలోని నాసిక్, లోనావాలా, కళ్యాణ-కార్లాబాంద్రా ప్రాంతాలకు వెళ్ళి స్కెచ్, దృశ్య చిత్రాలు చిత్రిస్తూ, రెండేసి రోజులు ఆప్రాంతాల్లో తిరుగుతూ ఆకలేసినప్పుడు తనవెంట తీసుకెళ్ళిన ఫలాలను తింటూ అనేక చిత్రాలను వేసి వెంట తెచ్చుకొనేవాడు.
శుధ్ధ ఖద్దరు పంచె లాల్చీ, భుజాన కండువా, నొసటన చిన్న తిలకం, నుదిటిపై బడిన ఉంగరాల జుట్టు ఆకర్షణీయమయిన విగ్రహం, అంతకుమించిన సచ్ఛీలము –కళాకౌశలం –దీక్ష -వినయం అందర్నీ ఆకట్టుకొనేవి. శ్రీ సిసిల్ బర్న్ పదవీ విరమణ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా రామారావుని ఆఫీసుకు పిల్చి ‘నీవు గొప్ప చిత్రకారుడవుతావని” ప్రేమతో ఆశీర్వదించారు. ఆ తరువాత డీన్గా వచ్చిన సాల్మన్ కూడా రామారావుపై ప్రత్యేకమైన ప్రేమ, వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు. రామారావుకు సంగీత, నాటకాలన్నా అభిరుచి అధికం. మిత్రుడు హరీన్ వద్ద హార్మోని నేర్చుకొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి పోటీలోను ప్రతీ బహుమతి అతన్నే వరించేవి, తన పురోభివృద్ధి ఎప్పటికప్పుడు కూల్డ్రే గారికి, తన స్నేహితుడు వరదావెంకటరత్నానికి ఉత్తరం ద్వారా తెలియజేసి ఆనందించేవాడు.
తరచు మన్య ప్రాంతాల్లో చిత్రరచనకై పర్యటించే కూల్డ్రే మహాశయుడు జ్వరపీడితుడవుతూ ఉండేవారు. జ్వరాన్ని అదుపులోనుంచేందుకు వాడిన క్వినైన్ ఆయన వినికిడి శక్తిని క్షీణింపచేసింది. చికిత్సకై 1919 సం॥ స్వదేశం వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ప్రియతమ శిష్యుని పురోభివృద్ధిని ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలుసుకుని ఆనందించేవారు.
ఆ సం॥రమే రామారావు వివాహం అయింది. వధువు శ్రీ దిగుమర్తి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రిక సత్యవాణి, ఆమెకు అప్పటికి 12 సం॥రాలు, 1920సం॥లో సర్ జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో సర్వ ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. తన ప్రతిభకు సన్మానపూర్వకంగా సం॥ పాటు ఫెలోగా ఆ కళాశాలలో పనిచేశారు.
రామారావు చిత్రకళా జీవితంలో గుజరాత్ పర్యటన ఓ మలుపు తిప్పింది. ఆ ఆరునెలల్లో అరవై ఏళ్ళ అనుభవాలను అందించింది. ‘బావిచెంత’ అనే పెద్ద సాముదాయక చిత్రాన్నీ ‘కథియవాడి’ గ్రామీణ స్త్రీల హొయలు, వాతావరణానికి దర్పణం పట్టేలా హృద్యంగా చిత్రించారు.
భావ్నగర్ రాజావారు వీరి ప్రజ్ఞాపాటవాలకు మురిసినవారై ఫ్యాలెస్కు ఆహ్వానించగా, వారి కోరికమేరకు చిత్రాలను చిత్రించి వారి మెప్పును, ఆశీస్సులను అందుకొన్నారు. ఆ సమయంలోనే వేసిన “కుంజవనం” చిత్రం లండన్లో ప్రదర్శింపబడి ఖండాంతర ఖ్యాతినొందారు.
వీరి కుంచె నుండి జాలువారిన చిత్రములు గొల్లభామలు, సిద్ధార్థరాగోదయ్, కృష్ణలీలలు, అజంతా విహార్, పుష్పాలంకారం, గ్రీష్మ చంద్రుడు, నందిపూజ, రామవివసం, కైకేయి దురాలోచన, కార్తీక పౌర్ణమి, అమాయక, అర్జున-ఊర్వశి, ద్రోణాచార్య, అభిమన్యు పతనం మొదలగాగలిగినవి – రామారావు ప్రాభవాన్ని ప్రపంచానికి చాటినవి.
గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడకు విచ్చేసిన రవీంద్రుని కలవటం కాకతాళీయంగా జరిగింది. తన చిత్రశైలికి ముగ్ధుడైన రవీంద్రుడు శాంతినికేతన్ ఆహ్వానించగా రామారావు కలకత్తా వెళ్ళటం జరిగింది. అక్కడ అవనీంద్రుని నాయకత్వంలో చిత్రకళ మహోద్యమంగా సాగుతున్న రోజులవి. ఆపర్యటన రావుగారి భావి కార్యక్రమానికి మార్గం చూపింది. తన అన్వేషణ ఫలించిందని దేశపర్యటన ముగించుకొని రాజమండ్రి చేరి ‘ఆంధ్ర చిత్రకళ పునరుజ్జీవోద్య’మానికి శంఖం పూరించారు.
గమ్యం సుదూరం – లక్ష్యసాధనకు అకుంటిత దీక్ష కఠోరశ్రమ అవసరం అని నిర్ణయించుకొని, అదే సమయంలో లక్నో స్కూలు వైస్ ప్రిన్సిపాల్ పదవికి ఆహ్వానం రాగా నిరాకరించారు. రామారావు ప్రాక్పశ్చిమ శైలులను మేళవించి ఓ నూతన శైలిని సృష్టించి, “ఆంధ్రాస్కూల్” అని పేరు పెట్టారు. “ఆంధ్రాసొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్సు” అనే సంస్థను స్థాపించి ప్రతి క్షణానికి ద్విగుణీకృత ఫలితాలు రాబట్టే శ్రామికుడిలా నిరంతరం శ్రమిస్తూ కాలంతో పోటీ బడ్డారు.
ఒకవైపు కళాసాధన – శిక్షణావ్యాసంగం మరో వైపు భార్యామనణితో వైవాహిక జీవన సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ దాంపత్య జీవన ఫలంగా నొక పుత్రునికి జన్మనిచ్చారు. తన ఆశలన్నీ ఆ బిడ్డ తీర్చగలడన్న నమ్మకంలో ఉన్న రామారావుకి ఆదుర్విధి ఆరునెలల్లోనే దుఃఖాన్ని మిగిల్చింది. పుత్రుణ్ణి కోల్పోయిన దుఃఖాన్ని గరళంగా మ్రింగి కళాసాధనను మరింత కఠోరపరిచారు. దెబ్బతిన్న వేలికే ఎదురుదెబ్బలన్నట్లు – అదే సమయంలో ఆత్మీయుల నెందర్నో పోగొట్టుకొని పెనుతుఫానులకు నిల్చారు.
1923 సం॥ అఖిల భారతస్థాయి చిత్రలేఖన ప్రదర్శన రాజమండ్రిలో ఏర్పాటు చేయగా దేశవ్యాప్తంగా ఉన్న చిత్రకారులు తమ చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతో రాజమహేంద్రవరం చైతన్యవంతమయింది. వీరికృషి, ప్రతిభ క్రమంగా వికసిస్తూ వచ్చాయి. భారత పటంలో రాజమండ్రికి నొక విశిష్టమైన స్థానం లభించింది.
1924 సం॥లోను అఖిలభారత 2వ చిత్రకళాప్రదర్శన నిర్వఘ్నంగా జరిగింది. రామారావుకు రోజూ చిత్రకళా సాధనలో సహకరించేందుకు ఓ మోడలు ఉండేది. అందము, అంగసౌష్టవము గల ఆ స్త్రీ మూర్తి అనేక నగ్న చిత్రాలకు వివిధ భంగిమలలో ప్రేరణ నిచ్చేది. వీరి శ్రీమతి వీరి కళాకృషికేమాత్రం ఆటంకం కలుగనివ్వని విధంగా సంసార జీవితంలో సహకరిస్తూ తానుకూడా చిత్రరచన నేర్చి, సాధన చేస్తూ కొన్ని చిత్రాలకు మోడలుగా సహకరించేవారు. రామారావుకు ఆమె ఆదర్శ స్త్రీ. ఆమెను అనేక భంగిమల్లో చిత్రించిన భావచిత్రాల్లో, నాయికకు ఆమె రూపాన్నే ఇచ్చేవారు.
1925 సం. రామారావు తిరుపతి యాత్రలో నల్లమల కొండల శోభకు, దేవాలయ శిల్పకళకు పులకించి ఎన్నో స్కెచ్ లతో పెద్దపుస్తకాన్నే నింపేసారు. ఆలోచనా తరంగ మానసంలో నిర్దేశితమైన భావి కార్యక్రమ పరిపూర్తికై భావనా స్రవంతిలో వోలలాడుతూ తిరుగుప్రయాణం అయ్యారు. బెజవాడ సమీపిస్తుండగా స్వల్ప జ్వరం మొదలయింది. రాజమండ్రి చేరే సరికి మశూచిగా పరిణమించగా రామారావు నిర్వేదంతో క్రుంగిపోయారు.
నియమబద్ధ జీవనం చేస్తున్న సౌందర్యారాధకునికి ఈ భయంకర మహమ్మారి? తను కన్న కలలు ఫలించలేదు. తన సహచారిణికి పదహారేండ్లయినా నిండలేదు. ఫిబ్రవరి 6వ తేదీన నిండుయవ్వనంతో 28 ఏండ్లు నిండకనే అఖండమయిన చిత్రకళా పారంగధరుడయిన దామెర్ల రామారావు తుదిశ్వాస విడిచారు.
ఏ దివ్య హస్తాలు అద్భుత దృశ్యాలను కళ్ళకు కట్టేలా సృష్టించాయే ఆ చేతులు కనుమరుగయ్యాయి.
ఏ నేత్రద్వయం సృష్టిని ఆశ్వాదిస్తూ అపూర్వ కళాఖండాల సృష్టికి దోహదం చేశాయో అవి శాశ్వతంగా నిద్రించాయి.
నిద్రిస్తున్న ఆంధ్ర చిత్రకళను చైతన్య పరచిన ఆ కారణజన్ముడు కాల గర్భంలో కలిసిపోయారు.
తన సంపూర్ణ కళాప్రాజ్ఞవాన్ని విధి ఇచ్చిన అల్పాయుష్షుకు బలి ఇచ్చిన కళాప్రపూర్ణుడు. జీవించినకాలం అల్పం అయినా అనల్పకృషిని తన చిరునామాగా మిగిల్చివెళ్ళారు. తన ప్రియతమ శిష్యుడు ఇక లేడన్న వార్త తెలుసుకొన్న కూల్డ్రే దు:ఖానికి అవధులు లేవు. తను పెంచిన మొక్క మహావృక్షమయి ఫలించే వేళకు…
ఇది మానవ జాతికే తీరని నష్టం, ఆంధ్ర కళామతల్లి దురదృష్టం. పరపాలన పీడన నుండి స్వపరిపాలనా సౌభాగ్యాన్ని అనుభవానికొచ్చి ఇన్నేళ్ళు గడిచినా “ఆంధ్ర చిత్రకళా” నవయుగ వైతాళికునికి చనిపోయి వందేళ్ళు అవుతున్న సరిఅయిన నివాళి ఇప్పటికీ లభించలేదు.
రాజమండ్రి పట్టణం- గోదావరీ తటతీరం. ఆ ప్రక్కనే దామెర్ల రామరాయుని చిత్రకళామందిరం – దర్శించిన ఆంధ్రులెందరు?!
అసంఖ్యాక చిత్రాలను కళా ప్రేమికులు సొంతం చేసుకోగా మరికొందరికి బహుమతివ్వగా, కొన్ని చెదిరిపోగా మనకొరకే అన్నట్లు మిగిలిన 34 తైలవర్ణ, 129 నీటిరంగు చిత్రపటాలను 250 పెన్సిల్ స్కెచ్లను ప్రదర్శనకు ఉంచగా, 28 స్కెచ్ బుక్కులు, ట్రేసులను రాజమండ్రి దామెర్ల రామరాయ ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీలో బద్రపరిచారు. గాంధీ చేతులమీదుగా ప్రారంభింపచేశారు.
విదేశీయులు ఎల్లలు మరచి ప్రశంసించేలా – స్వదేశీయులు ఉల్లములు మరచి మురిసేలా చేసిన ఆ అపార కళాసంపదను జాతికిచ్చి, చిత్రకళోద్యమ జ్యోతిని మన చేతికిచ్చి అమరుడైనాడా కళాతపస్వి. మనలందరికి ఆ కళాకృతులతో పారలౌకికానందాన్ని పంచిన యశస్వి.
–ఆత్మకూరు రామకృష్ణ MFA , కవిచిత్రకారుడు
కళలను, కళా కార్యక్రమాలను 64 కళలు.కామ్ ద్వారా బుధజన సమక్షానికి తీసుకెళుతున్న సంపాదకులు కళాసాగర్ గారికి కృతజ్ఞతలు
అజరామరులు దామెర్ల రామునికి శిరసా నమామి.
అక్షర నివాళులు ఇచ్చిన ఆత్మకూరు రామునికి….ప్రచురించిన కళా సాగరునికీ..
అభినందనాళి.