పవిత్ర గోదావరీ నదీమతల్లి ఉరుకుల, పరుగులతో సాగే పుణ్యక్షేత్రం రాజమండ్రి. అటు ప్రాచ్యకళా సాంప్రదాయాలనూ, ఇటు పాశ్చాత్య కళారీతులనూ పుణికిపుచ్చుకుని చిత్రకళలో “ఆంధ్రసాంప్రదాయాని”కి నాందీ పలికిన దామెర్ల రామారావు జన్మస్థలం రాజమహేంద్రవరమే. వందేళ్ళ క్రితమే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ తెలుగు చిత్రకారుడిని ఇప్పుడు తలచుకునే సమయం మరోసారి వచ్చింది. దశాబ్దకాలం తర్వాత మరోమారు దామెర్ల రామారావుగారి కళా ప్రాంగణం సందర్శించే అవకాశం గత సంవత్సరం అక్టోబర్ 24న కలిగింది నాకు.
ఒక వివాహ నిమిత్తం రాజమండ్రి వెళ్ళిన నాకు దామెర్ల రామారావు గ్యాలరీ చూద్దామన్న కోరికతో గోదావరి రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడకు రెండు వందల మీటర్ల దూరంలో వున్న దామెర్ల రామారావు గ్యాలరీకి వెళ్ళాను.
నేను వెళ్ళేటప్పటికి సమయం ఉదయం పదిన్నర గంటలు అయ్యింది.
గ్యాలరీ అరుగు మీద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు.
గ్యాలరీ తలుపులు మూసివున్నాయి…!
ఆ వ్యక్తులను అడిగాను గ్యాలరీ ఎప్పుడు తెలుస్తారని ..?
అందులో ఒక వ్యక్తి మీరు చూస్తానంటే తెరుస్తా అన్నాడు.
అప్పుడు తెలిసింది అతనే గ్యాలరీ క్యూరేటర్ అని…
తలుపులు తెరిచి రిజిస్టర్ లో నన్ను సంతకం పెట్టమని చెప్పి … తన సీటులో కూర్చొన్నాడు.
సంతకం పెట్టడానికి రిజిస్టర్ దగ్గరకు వెళ్ళిన నన్ను అక్కడే వుంచిన దామెర్ల గారి మూర్తి చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. (అదే పైన వున్న దామెర్ల వారి చిత్రం)
ఇక నేను గ్యాలరీలో వున్న చిత్రాలను చూస్తూ ముందుకు కదిలాను. దామెర్ల గారి బొమ్మలను చూస్తున్న నాకు మనసు కలచివేసింది. ఎందుకంటే ఏ బొమ్మలను చూసినా వెలిసిపోయిన రంగులతో, అస్పష్టంగా వున్నాయి. దాదాపుగా చిత్రాలన్నీ అలానే వున్నాయి. అందుకు కారణం ప్రభుత్వ అలసత్వం, గ్యాలరీ క్యూరేటర్ల నిర్లక్ష్య వైఖరే. గ్యాలరీ క్యూరేటర్ పోస్ట్ లో వున్న అతనికి దామెర్ల గురించి గాని, దామెర్ల చిత్రాల గురించిగాని ఏమీ తెలియదు, కనీస అవగాహన కూడా లేదని అర్థమయ్యింది అతనితో మాట్లాడిన తర్వాత. వేరే డిపార్ట్మెంట్ నుండి అతన్ని ఇక్కడ నియమించారు. (ఇక్కడ గ్యాలరీలో కుక్క పడుకున్న విషయం ఫోటోలో గమనించగలరు.)
ఇది ఓల్డ్ బిల్డింగ్ పరిస్థితి,…
ఇక పక్క నున్న కొత్త నూతన గ్యాలరీ చూస్తారా ? అని అడిగాడు.
చూస్తానన్నా…!
ఈ గ్యాలరీని క్లోజ్ చేస్తున్నాడు.
క్లోజ్ చేస్తున్నారెందుకు అని అడిగా ?
కోతులు వచ్చి ఫ్రేములు పాడుచేస్తాయి అన్నాడు.
ఒక్కడినే వుండడం వలన రెండు గ్యాలరీలు చూసుకోలేక పోతున్నా అన్నాడు. !
అతని మాటల్లో కూడా సత్యం వుందనిపించింది…!
ఎందుకంటే రెండు వేర్వేరు భవనాల్లో వున్న బొమ్మలను ఒక వ్యక్తి ఎలా సంరక్షించగలడు..?
ఇక నూతన భవనంలో వున్న గ్యాలరీనీ కూడా సందర్శించి సుమారు 50 చిత్రాలను చూసాను.
కాని…. ఇంకా నాలో ఏదో అసంతృప్తి ….!
1923 లో అంటే..! వందేళ్ళ క్రితమే రాజమండ్రిలో జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించి ఆంద్ర ప్రదేశ్ లో కూడా చిత్రకారులున్నారా ..? అని
దేశం మొత్తం రాజమహేద్రవరం వైపు చూసేటట్టు చేసిన మహనీయునికి మన మిచ్చే గౌరవం ఇదేనా?.
భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన ఆధునికుల్లో అగ్రగణ్యుడికిచ్చే విలువ ఇదేనా?.
తెలుగు జాతి గర్వించే మహా చిత్రకారుని 125 వ జయంతికి మన స్పందన ఇదేనా ….?
ఇది నా ఆవేదన మాత్రమే కాదు…! అచేతనం కూడా …!
తెలుగు చిత్రకళ వెలుగు – దామెర్ల
1897 మార్చి 8వ తేదీన దామెర్ల వెంకటరమణ, మహాలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. ఏకాగ్రత, సునిశిత పరిశీలన చిన్ననాటినుంచే ఆయన సొత్తు అయ్యాయి. రేభావిన్యాసాలతోనే ఆయన పెరిగి పెద్దయ్యారు. చిత్రలేఖనంలో దామెర్ల రామారావుకు వున్న శ్రద్ధాసక్తులను గమనించిన రాజుమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఓ.జె. కూల్డ్రే దొర ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన “కుంచెలు కుంచెలు“గా పైకి ఎదిగారు.
1919లో కూల్డ్రే దొర సాయంతో దామెర్ల రామారావు బొంబాయికి వెళ్ళి, అక్కడ జె.జె. స్కూలు ఆఫ్ ఆర్ట్స్ లో చేరి చిత్రకళను అభ్యసించారు. ఆయనకు మేయో పతకం కూడా లభించింది.
బొంబాయిలో వున్నప్పుడే అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా, కార్లీ, నాసిక్ క్షేత్రాలను దర్శించి, అక్కడి కళారీతులను అభ్య సించారు. 1921లో కలకత్తా వెళ్ళి సుప్రసిద్ధ చిత్రకళాచార్యులు అవనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ తో చిత్రకళలోని వినూత్న పోకడలను, మెలకువలను తెలుసుకున్నారు. వంగకళాతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు.
కలకత్తా నగరంలో దామెర్ల ప్రదర్శించిన “రుష్యశృంగుని బంధనం” చిత్రం బహుమతినీ, పలువురి ప్రశంసలనూ అందుకొంది. వెంబ్లేలో జరిగిన ఎంపైర్ చిత్రకళా ప్రదర్శనలో ఆయన కాన్వాస్ చిత్రాలు రసజ్ఞుల ప్రశంసలందుకున్నాయి. వెంబ్లే ప్రదర్శనకు దామెర్ల చిత్రాలు మూడు ఎంపికకాగా, శాంతినికేతన్ నుంచి ఒక్క చిత్రం మాత్రమే ఎంపికైంది.
1921లో బొంబాయిలో అమ్ముడు పోయిన “సరోవరం”కలకత్తాలో వైస్రాయి రీడింగ్ ముచ్చటపడి కొనుక్కున్న “గోదావరి కనుమ” చిత్రాలద్వారా దామెర్ల రామారావు ప్రకృతి చిత్రాలలోనూ, మానవకృతి చిత్రాలలోనూ నిష్ణాతుడని ప్రశంస పొందారు. 1920లో భావనగర్ రాకుమారుల చిత్రాలను గీయడానికి వెళ్ళినప్పుడు, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ దామెర్ల కలుసుకున్నారు. టాగోర్ రూపురేఖల్ని పది నిమిషాల్లో గీసి ఇచ్చి ప్రశంసలందుకున్నారు.
1920 సంవత్సరాంతంలో ఆయన రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చి సత్యవాణిని వివాహమాడారు. సత్యవాణి కేవలం అర్ధాంగేకాదు, చిత్రకారిణి కూడా. ఆ తర్వాత దామెర్ల సృష్టించిన అనేక కళారూపాల్లో సుందరీమణుల ముఖారవిందాల్లో ఆయన శ్రీమతి పోలికలు కనిపిస్తాయి.
రాజమండ్రిలోని దామెర్ల ఆర్ట్ గేలరీలో ఇప్పుడు కనిపించే అనేక చిత్రాల్లో యువతుల ముఖాలన్నింటిలోనూ దామెర్ల శ్రీమతి సత్యవాణి గారి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ తదితర శరీర సౌష్టవం అంతా మరొకరిదిలా వుంటుంది. దీనికి కారణాన్ని అడిగితే దామెర్ల రామారావు అన్నగారి కుమారుడు దామెర్ల వీరభద్రరావు ఆసక్తి కలిగించే సంఘటన ఒకటి చెప్పారు. దామెర్ల తన చిత్రాలకు ఓ అందాల రాశిని మోడల్ గర్ల్ గా ఎంపిక చేయాలనుకున్నారట. అందాల రాశి కోసం ఆయన అన్వేషణ ప్రారంభించా అనేక కళాఖండాలు సృష్టించారట.
1922లో “ఆంధ్ర భారతీయ చిత్రకళా పరిషత్తు”ను స్థాపించి, యువకులకు, బాలలకు చిత్రకళ నేర్పించారు. అనేకులు ఆయన ఒరవడిలో చిత్రకారులయ్యారు. టోరంటో నగరంలో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో చోటుచేసుకున్న దామెర్ల వారి “సిద్ధార్థుని రాగోదయం” నిపుణుల ప్రశంసలందుకుంది.
అజంతా గుహలు, పద్మ భక్షకులు, తాజ్ మహల్, గోదావరి, అభిమన్యుడు, రాజుకుమారుల విలువిద్య, దమయంతి, అర్జునుడు-ఊర్వశి చిత్రాలను బొంబాయి, అహ్మదాబాద్, మద్రాసు, ఢిల్లీ నగరాల్లోని కళాపిపాసులు కొనుక్కున్నారు. పాశ్చాత్యులారాధించే ప్రకృతి, ప్రాచ్యులు ప్రాధాన్యమిచ్చే భావావిష్కృతి రెండింటినీ తన కుంచెలో ఇనుమడింపచేసిన రామారావు మృత్యువు పాలుకావడం కళాసరస్వతి కంటనీరు తొణికిసలాడడానికి కారణం అయ్యింది.
1920–22 సంవత్సరాల మధ్య దామెర్ల చిత్రాలకు మోడల్ గా వెలిగిన సౌందర్య రాశి నూకాలు, దామెర్ల మరణంతో మానసిక వ్యధతో కలకత్తా వెళ్ళి పోలీసు శాఖలో చేరింది. దామెర్ల రామారావు సహధర్మచారిణి 1992 డిశంబరులో హైదరాబాద్ లో మరణించారు.
-కళాసాగర్
Good article on Kamerla sir
దామెర్ల రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు కళా సాగర్ గారు.
దామెర్ల అకాల మరణం తెలుగు జాతికి తీరని శాపం. ఆయన జ్ఞాపకాలను కూడా పదిలపర్చుకోలేక పోడం మన అసహాయతకు నిదర్శనం. మీ ప్రయత్నం అభినందనీయం.