
ఆంధ్ర చిత్రకళకు ఆద్యుడిగా పేరు గడించిన దామెర్ల రామారావు 128 వ జయంతి వేడుక మాదేటి రాజాజీ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం దామెర్ల రామారావు స్మారక చిత్రకళా మందిరంలో ఎంతో ఘనంగా జరిగింది.
ప్రముఖ చిత్రకారిణి ‘భగీరధి ఆర్ట్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఎన్ వి.పి.ఎస్. లక్ష్మి గారు వేదిక పైకి అతిదులను ఆహ్వనించిన తదుపరి జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిధులు అందరూ దామెర్ల చిత్రపటానికి పుష్పమాలలు వేసి, ఆ మహా చిత్రకారునికి నివాళులర్పించారు. అనంతరం సి.పి. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన ప్రారంభమైన సభా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు దామెర్లకు పుష్పాంజలి ఘటిస్తూ రాష్ట్రంలోని ఎందరో చిత్రకారులను తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని చిత్రకారులు పరిరక్షించే బాధ్యత నుంచీ ప్రభుత్వం పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని మద్దూరి కోరారు. ‘రాజాజీ అకాడమీ’ అధ్యక్షులు మాదేటి రవి ప్రకాష్ మాట్లాడుతూ వరదా వెంకట రత్నం, మాదేటి రాజాజీల చొరవతోనే దామెర్ల ఆర్ట్ గ్యాలరీ స్ధాపితమైందని తెలిపారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీ చరిత్రలో నిలిచిపోయే సంస్ధ అని ‘మద్దూరి అన్నపూర్ణయ్య సమితి’ వ్యవస్ధాపకుడు బెజవాడ రంగారావు అన్నారు.
గోదావరి పుష్కరాల నాటికి దామెర్ల ఆర్ట్ గ్యాలరీని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నందున ఆర్ట్ గ్యాలరీ పరిస్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, వారంతా ఆవేదన చెందారు. ప్రముఖ చిత్రకారుడు జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చిత్రకారుడు గిరిధర్ గౌడ్ తన పర్యటనలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీ దుస్థితిని చూసి చలించిన తరువాత చిత్రకారులంతా ఏకమవడంతో ఆర్ట్ గ్యాలరీ రూపు మారిందని చెప్పారు. దామెర్ల గీసిన కొన్ని నగ్న చిత్రాలను, మానవ దేహ పరిశోధనా చిత్రాలుగా పరిగణించాలని మరో ప్రముఖ చిత్రకారుడు డా. ఎన్.ఎస్. శర్మ సూచించారు.
64 కళలు.కాం పత్రిక చిత్రకళా రచయితనైన నేను ఒక అత్యవసర పనిపై నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఖమ్మం నుండి మా ఊరు కందులపాలెం వెళ్తూ మార్గమధ్యలో ఉన్న రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గేలరీ సందర్శించిన మమ్ము రాజాజీ అకాడమి వ్యవస్తాపకులు శ్రీ రవి ప్రకాష్ గారు, రవికాంత్ గారు చిత్రకారులు తారా నగేష్, ఎన్.ఎస్.శర్మ, పి.ఎస్. ఆచారి, భాగీరధి లక్ష్మి గారు మరియు గాలరీ సంరక్షకులుగా ఉన్న వీర భద్రరావు గారు తదితరులు సాదరంగా ఆహ్వానించడం ఎంతో సంతోషమయ్యింది. అనంతరం ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాసం నాకు దక్కింది. ముందుగా దామెర్ల రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన చిత్రాలలో ఒక ప్రముఖచిత్రమైన సిద్దార్ధ రాగోదయం విశిష్టత గురించి కొందరు మిత్రులతో చర్చించడం జరిగింది. దామెర్ల బొంబాయి నందలి ప్రఖ్యాత జే.జే. స్కూల్ అఫ్ ఆర్ట్ లో తన చిత్రకళాభ్యాసం ముగించుకున్న తదుపరి తన చిత్రాలతో ఉత్తరభారతంలో పర్యటిస్తున్న సమయంలో కలకత్తా నందలి శాంతినికేతన్ ను దర్శించి, అక్కడ చిత్రకారులని కలిసే ప్రయత్నం చేయగా ఆనాటికి తామే గోప్పచిత్రకారులమన్న భావనతో ఉన్న బెంగాల్ చిత్రకారులు వయసులో చిన్నవాడైన దామేర్లను తక్కువగా అంచనా వేసి ఆయన చిత్రాలను సరిగా పరిశీలించకుండానే సిద్దార్ధ రాగోదయం చిత్రంలో బుద్దుడు ఎడమ చేతితో బహుమతి వేయడాన్ని వంక పెట్టి విమర్శ చేయడం జరిగిందని వయసులో చిన్నవాడైనా చిత్రశిల్ప కళలను గురించి మన పూర్వీకులు అందించిన శాస్త్ర ప్రమాణాలను మరియు రాజులు చక్రవర్తులను చిత్రీకరించే సందర్భాలలో తీసుకోవలసిన లక్షణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మన రామారావు ఆ ప్రమాణాలకు అనుగుణంగానే రాజులు పారితోషికాలను ఎడమ చేత్తో వేసే విధంగాను, రాజులు చక్రవర్తులు ఏ క్షణమైనా తమను తాము రక్షించుకునేందుకు అనుగుణంగా తమ కుడి చేయిని తమ మొలకు కట్టిన ఖడ్గం పైనే ఉండాలన్న నిభందనకు అనుగునంగానే ఆ చిత్రంలో సిద్ధార్ధుడు తన ఎడమ చేత్తో బహుమతులు ఇస్తున్నట్టుగా చిత్రించిన విషయాన్ని అక్కడ కొందరు మిత్రులతో పంచుకున్నాను.

ఈ సందర్భంగా స్థానిక చిత్రకారులు తారా నగేష్, గువ్వల కెనడి, గువ్వల పద్మ, ఎన్.వి.పి.ఎస్.యస్. లక్ష్మి, పట్నాల రాధారాణి, రాజు, వానపల్లి, కరణం నూకరాజు, దుర్గారావు తదితర చిత్రకారులు తమ చిత్రాలను గేలరీలో ప్రదర్శించినారు. దామెర్ల రామారావు చిత్రాలతో బాటు ఈ రోజు స్థానిక చిత్రకారులు ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు అందరం దర్శించడం జరిగింది. అంతే గాక దామెర్ల చిత్రశాల ప్రాంగణంలో రాజాజీ అకాడమి ఆధ్వర్యంలో ఇటీవల ప్రతిష్టించిన వరదావెంకట రత్నం గారి విగ్రహం వద్ద రవిప్రకాష్, రవికాంత్ మరియు ఇతర చిత్రకారులతో కలిసి కొన్ని ఫోటోలు దిగాము. ఆ విగ్రహం కి రెండువైపులా నిర్మించిన స్థూపాల గురించి రవిప్రకాష్ గారిని అడుగగా అవి కూల్ద్రేయ్, మరియు రాజాజిల కోసం నిర్మించామని ఆ మహా కళాకారుల శిల్పాలను కూడా వాటిపై ప్రతిష్టించాలని వాటిని నిర్మించామని కాని సరైన సహకారం లేక మూడు ఏక కాలంలో సాధ్యం కాలేదని త్వరలో వాటిని సాకారం చేస్తామని చెప్పుకొచ్చారు. వారి కల నెరవేరి ఆ ప్రాంగణానికి పరిపూర్ణత తీసుకు రావాలని కోరుకున్నాము.
మధ్యాహ్నం భోజనాల అనంతరం తారనగేష్ గారు గేలరీ ఎదుట గల పరిసరాలను నీటి రంగుల్లో చిత్రించి చూపారు. అనంతరం రామారావు గారి చిత్రాలకు నకలులు తయారు చేసిన బుచ్చిబాబు గారు, శ్యాం సుందర్ గారు, బి. శ్రీనివాస్, శ్రీమతి పట్నాల రాధారాణి గారు భాస్కర కుమారిగారు, గువ్వల పద్మ గార్లకు మేమెంటో మరియు సెర్తిఫికెట్లు బహుకరించారు. అనంతరం చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసిన చిత్రకారులకు అతిధులకు జ్ఞాపికలు బహూకరించడం జరిగింది. చివరిగా శ్రీ వై.ఎస్. రవికాంత్ గారి వందన సమర్పణతో కార్యక్రమం సభ సంపూర్ణ మయ్యింది.
–వెంటపల్లి సత్యనారాయణ
చిత్రకారుడు, చిత్రకళా రచయిత