ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా ….

ఒకనాడు ఆంధ్ర చిత్రకళ ఉన్నత స్థానానికి చేరింది. అజంతా గుహలోని కుడ్య చిత్రాల్ని ఆంధ్ర చిత్రకళాకారులే చిత్రీకరించారు. ఆ క్షీణించిన చిత్రకళలకు ఆంధ్రదేశంలో ఆధునీకరణ తెచ్చిన కళాకారుడు దామెర్ల రామారావు, చిన్నతనం నుండి గీసిన గీతలు పిచ్చిగీతలు కావు అని, అతనిలోని చిత్రకారుడిని వెలికి తీసిన గురువు ఆస్వాల్ట్ జెన్నింగ్స్ కూల్డ్రే.
ఆయన సాన్నిహిత్యంలో చక్కని చిత్రకళా కారుడయ్యాడు. చిత్రకళకు సాంఘికంగా గౌరవమంతగా లేని రోజుల్లో రామారావు తల్లిదండ్రు లను ఒప్పించి బొంబాయిలోని జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రకళ అభ్యాసానికి రామారావుని పంపినవాడు ఆస్వాల్ట్ జెన్నింగ్స్ కూల్డ్రే.

ఆలా ఒక సాంప్రదాయ కుటుంబం కుర్రాడు 1916వ సంవత్సరంలో బొంబాయికి చేరాడు. నాటినుండి రామారావు జీవితమంతా చిత్రకళతో ముడిపడింది. చిన్నవయసులోనే పెళ్ళిచేశారు కుటుంబ పెద్దలు. భార్యను ఇంట వదిలి బైటకు వెళ్ళిన సిద్ధార్థుడు అయ్యాడు రామారావు, వ్యక్తిగత అనారోగ్యం , ఒంటరితనం వంటివి ఏవీ తన చిత్రకళకు అడ్డంకి కాకుండా చూసు కున్నాడు దామెర్ల రామారావు.
1919 వరకు గురువు కూల్డ్రే వెంట ఎన్నెన్నో ప్రాంతాలకు తిరిగాడు రామారావు. గోదావరి మన్య ప్రాంతంలో తిరిగే సమయంలో కీటకాల కాటుకు గురై కూల్డ్రేకి తీవ్ర అనారోగ్యం రావటంతో చికిత్సకై ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు.
కాని రామారావు చిత్రకళకు, చదువుకు ఎటు వంటి ఆటంకాలు కలుగకుండా ఏర్పాటుచేశాడు. 22 ఏళ్ళ వయసులో రామారావు మిత్రులతో – కలిసి గుజరాత్ వెళ్ళాడు. అక్కడి రాజవంశస్తుల చిత్రాల్ని అందంగా గీశాడు. అక్కడ కనిపించిన రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మగీసి ఆయన మెప్పు పొందాడు. శాంతినికేతన్ దర్శించమని ఠాగూర్ నుండి ఆహ్వానం అందుకున్నాడు.

బొంబాయిలో చిత్రకళ విద్య ముగిసిన తరు వాత రాజమండ్రి చేరి ‘ఆంధ్ర చిత్రకళా శైలి’ అనేదానిని సృష్టించి దానికి గొప్ప గుర్తింపు తేవా లన్నది రామారావు ఆశ. అందుకోసం రాజమండ్రికి చేరేముందుదేశ మంతా పర్యటించి వివిధ ప్రాంతాలలోని చిత్ర కళారీతులను, అందులోని లోటుపాట్లను అధ్య యనం చెయ్యాలనుకున్నాడు. అలా వెళ్ళిన చోటల్లా తన చిత్రాలను ప్రదర్శించాడు.

కలకత్తాలో దామెర్ల రామారావు వేసిన ‘రుష్యశృంగ బంధనం‘కి వైశ్రాయి ఆఫ్ ఇండియా అవార్డ్ రావటమే కాదు ఆ చిత్రాన్ని వైశ్రాయి లార్డ్ రీడింగ్ ముచ్చటపడి కొనుక్కున్నాడు. కుడ్యచిత్రాలు, రాజస్థాన్ మీనియేచర్ చిత్రాలు అధ్యయనంచేశాడు. కాంగ్రా చిత్రకళ గురించి, దాని క్షీణత గురించి చదివాడు.
భారతీయ కళలు పరాయిపాలనలో క్షీణించాయి కాబట్టి 20వ శతాబ్దంలో వాటిని పునరుద్ధరించాలని అందుకు ఆంధ్రుడిగా తనదైన ప్రత్యేక శైలిని సృష్టిం చాలన్న బలమైన కోరికతో రాజమండ్రి చేరాడు.

ఆంధ్రాసొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ని స్థాపించి ద్విగుణీకృతమైన తపనతో చిత్రరచన చేయటం మొదలు పెట్టాడు. ఉదయం వ్యాయామం, పన్నెండు గంటల వరకు చిత్రరచన, భోజనం, ఒక గంట విశ్రాంతి, తిరిగి సాయంత్రం వరకు చిత్రరచన, గోదావరి తీర విహారం, సాయం వ్యాయామం, భోజనం, గ్రంథపఠనం ఇది రామారావు దినచర్య. ఎటువంటి దుర్వ్యసనాలు లేవు. నిరాడంబర జీవితం. .
అయితే దామెర్ల రామారావు ఆరోగ్యం చిన్నతనం నుండి అంత బాగుండేది కాదు. బక్క పలచని శరీరం. ఏదేదో తెలియని నలత వస్తుండేది. అయినా కళను వదలలేదు. పుట్టిన కొడుకు ఆరునెలలు తిరగకుండానే మరణించటం, చిత్రకారుడయిన మిత్రుడి అకాల మరణం రామారావును ఆందోళనకు గురిచేసింది. అయినా కళమీదే దృష్టి పెట్టాడు.
1923, 24 సంవత్సరాలు వరుసగా రాజమండ్రిలో జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహించి ఆ పట్టణానికి విశేష గుర్తింపు తెచ్చాడు. ఆయన చిత్రీ కరించిన ‘కృష్ణలీలలు‘ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారతదేశం నుండి లండన్ ఇంపీరియల్ మ్యూజియంకి ఎంపికైన 12 చిత్రాలలో అది ఒకటి.

ఆ కాలంలోనే ఆయన నగ్నచిత్రాలను గీశాడు. స్థానిక స్త్రీలను మోడల్‌గా నిలబెట్టుకుని గీయటం 90 ఏళ్ళ క్రితమే రామారావు చేసిన ప్రయోగం. 1924 నాటికి రామారావు గీసిన చిత్రాలు అమెరికా, కెనడాల ప్రదర్శనల్లో చేరి మెప్పుపొందాయి.
గురువు కూల్డ్రే గతంలో ఎన్నో దేవాలయాలను సందర్శించి అక్కడి చిత్రకళను చిత్రీకరించే యత్నం చెయ్యటం, రామారావు మనసుకు గుర్తుంది. గురువు కోర్కెను తీర్చాలనుకున్నాడు. 1925 ప్రారంభంలో తన చిత్రకళా సరంజామా అంతా తీసుకుని, భార్య సత్యవాణితో కలిసి తిరుపతి వెళ్ళాడు.

Damerla Ramarao Art Gallery Rajah.

తాను తీసుకువెళ్ళిన స్కెచ్ బుక్ నిండా నల్లమలై కొండలమీద వున్న అడవుల ప్రకృతి, తిరుమల కొండలు, వాటి శోభ పుష్కరిణి, దేవాలయ స్తంభాలు, శిల్పాలు ఇలా ఒకటేమిటి మొత్తం తిరుమల సౌందర్యాలన్నీ పుస్తకంలో చిత్రీకరించాడు.
మహదానందంతో ఎప్పుడెప్పుడు రాజమండ్రి చేరదామా…తాను గీసిన స్కెలను రంగురంగుల చిత్రాలుగా మార్చి తిరుమల అందాలను ప్రపంచానికి అందిద్దామా అన్న ఆలోచన ఆయన మదిలో ఉంది..
కాని నాటి బెజవాడ చేరేసరికి రామారావుకి జ్వరం మొదలయింది. ఆ జ్వరం తోనే రాజమండ్రి చేరాడు. సాదాసీదా జ్వరమే కదా కొద్దిరోజులలో తగ్గుతుంది. కోలుకున్న తరువాత తన చిత్రకళలోకి దిగవచ్చను కున్నాడు. ఒకటి, రెండు రోజులు గడిచినా తగ్గుముఖం పట్టని జ్వరం సాదాసీదా జ్వరం కాదు. అది మసూచి జ్వరం అని తెలుసుకునేసరికి ఆలస్యమైంది..

ఆ రోజుల్లో మసూచికి తగిన మందులు లేవు. ఒక్కసారిగా షాక్. అప్పటికి ఆయన వయసు కేవలం 28 సంవత్సరాలే. అంత చిన్నవయసులోనే జీవిత చరమాంకంలోకి చేరుతున్నానన్న వాస్తవం మనసును కుదిపేసింది. రామారావు కన్న కలలు తీరలేదు.
తాను పెట్టుకున్న ఆంధ్ర చిత్రకళా ధ్యేయం పూర్తిగా నెరవేరలేదు. కట్టుకున్న భార్యకు 16 ఏళ్ళు కూడా నిండలేదు. తాను విదేశాలలో ప్రదర్శనకు పంపిన చిత్రాలు తిరిగి రాజమండ్రి రాలేదు. “

కాలం ఎవరికోసం, దేనికోసం ఆగదన్న వాస్తవాన్ని మరొక్కమారు గుర్తుచేస్తూ విధి దామెర్ల రామారావు జీవితాన్ని నిండుయవ్వనంలో వుండగానే 1925 ఫిబ్రవరి 6న కబళించింది. ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతారగా నిలిచిపోయాడు రామారావు.

-దుగ్గరాజు

3 thoughts on “ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

  1. ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారవు గారి జీవితచరిత్ర గురించి ఎన్నో కొత్త విషయాలు పరిచయం చేసిన రచియిత శ్రీ దుగ్గరాజు గారికి..
    మరియు.. పబ్లిష్ చేసిన మిత్రులు కళాసాగర్ గారికి…ధన్యవాదములతో…

    అంజి ఆకొండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap