ఒక డాన్స్ స్కూల్ వార్షికోత్సవం అంటే ఎలా ఉంటుంది? ఒక్కో ఐటెం లో 30 మందిని నిలబెట్టి ఏదో చేసేశారు అనిపిస్తారు. డ్రెస్ రెంట్ కు తెచ్చేసి వేయిస్తారు. అది సరిపోయిందో లేదో పట్టించుకోరు. మేకప్ అయితే ఏదో అద్ది రుద్దేసి మొత్తానికి మమ అనిపిస్తారు. రవీంద్రభారతి లాంటి పెద్ద వేదికల్లో సైతం ఇదే తంతు గత పాతికేళ్లుగా చూస్తున్నా. కానీ, శనివారం(7-5-22) రాత్రి ఉప్పల్ శిల్పారామంలో లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ వార్షికోత్సవానికి గెస్ట్ గా హాజరయ్యాను. ఆశ్చర్యపోయాను !
ఆహార్యం నుంచి ఐటమ్స్ ప్రదర్శన వరకు చూస్తే…వార్షికోత్సవ హంగామా అనిపించలేదు. ఒక కార్పొరేట్ ఈవెంట్ పరిణత ప్రదర్శన అనిపించింది. చక్కని సమన్వయంతో ప్రదర్శించిన అన్ని అంశాలూ అద్భుతం అని చెప్పాలి. నాట్యం పట్ల అంకితభావం, నాట్యమే ధ్యాస శ్వాస అయిన గురువు నడిపించే స్కూల్ ఇలా ఉంటుంది. లాస్యాంగ ఆర్టిస్టిక్ డైరెక్టర్ నాట్య గురువు శ్రీమతి రోహిణి కందాల నిజంగా అభినందనీయురాలు. డాన్స్ స్కూల్ వార్షికోత్సవం ఇలా నాణ్యంగా నిర్వహించాలని చాటి చెప్పారు. ఏదో ఆడియో ఐటమ్స్ కాకుండా పది మంది లైవ్ ఆర్కెస్ట్రా తో స్వయంగా రెండున్నర గంటలపాటు నట్టువాంగం చేస్తూ విద్యార్థులను కను సైగలతో ప్రదర్శనలు చేయించి శ్రీమతి రోహిణి గొప్ప స్పూర్తిని అందించారు.
శాస్త్రీయ నాట్యంతో క్రమశిక్షణ ఏకాగ్రత పెంపొందుతాయని, మనో వికాసానికి నాట్యం అద్భుతంగా పని చేస్తుందని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఆంధ్ర నాట్యం గురువు కళాకృష్ణ తెలిపారు. శనివారం ఉప్పల్ శిల్పారామంలో లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన కళాకృష్ణ జ్యోతి ప్రకాశనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారిలో, సాంకేతిక కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో అధిక శాతం మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వారే ఉన్నారని సర్వేలో వెల్లడైనదని ఆయన వివరించారు. సభాధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ నాట్యంలో రాణించాలంటే మంచి గురువును ఎంపిక చేసుకోవాలని, అలాంటి మేటి గురువుల్లో ఒకరిగా రోహిణి కందాల గుర్తింపు పొందారని అభినందించారు.
తెలుగు విశ్వ విద్యాలయం నృత్య విభాగాధిపతి డాక్టర్ వనజా ఉదయ్, నాట్య గురువు పి.ఉమామహేశ్వర పాత్రుడు, సమాజ సేవకురాలు శ్రీమతి పద్మావతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా లాస్యాంగ సంస్థ ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక నర్తన ప్రతిభా పురస్కారం తో యువ నర్తకుడు సురేంద్రనాధ్ ను సత్కరించారు. ఈ పురస్కారం కింద నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందించారు. 29 మంది విద్యార్థులు ప్రదర్శించిన ఆయా కూచిపూడి నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.
గురు శ్రీమతి రోహిణి కందాల నట్టువాంగం చేయగా, గాత్రంతో మంథా శ్రీనివాస్, మృదంగంతో ఎస్.నాగేశ్వరరావు, వయోలిన్ తో కె. అనిల్ కుమార్, వేణువుతో సాయి భరద్వాజ, ఘటంతో శ్రీహర్ష వాద్య సహకారం అందించి రక్తి కట్టించారు. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహూకరించారు. లాస్యాంగ ఆర్టిస్టిక్ డైరెక్టర్ శ్రీమతి రోహిణి కందాల అన్నీ తానై పర్యవేక్షించారు.
–మహ్మద్ రఫీ