పద్మశ్రీ వరించిన పద్మజారెడ్డికి అభినందన సభ

పద్మశ్రీ పద్మజారెడ్డి ని ఘనంగా సత్కరించిన దోహా ఖతార్ తెలుగు కళాసమితి

దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు. తెలుగు కళాసమితి, దోహా – ఖతార్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ (5-02-2022) జింఖానా క్లబ్ లో పద్మశ్రీ పురస్కార ప్రకటిత డాక్టర్ పద్మజా రెడ్డి కి ఆత్మీయ అభినందన సత్కారం కనుల పండువగా జరిగింది.

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎల్.వి.గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ కళారంగానికి జీవితం అంకితం చేయడంలో శాశ్వత ఆనందం ఉందన్నారు. నాట్యం అభ్యసించి పరిశోధించి విశ్వ విఖ్యాతమై మహోన్నత లక్ష్యంతో ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దిన పద్మజా రెడ్డి కి పద్మశ్రీ లభించడం సముచితం ఔన్నత్యం అని, తెలుగు జాతికి గర్వకారణం అని ప్రశంసించారు. నేను పుట్టిన కృష్ణా జిల్లాలోనే పద్మజా రెడ్డి గారు కూడా పుట్టడం గర్వంగా వుందన్నారు. కూచిపూడిలో ప్రారంభమైన వారి నాట్య ప్రస్థానం నేడు దేశవ్యాప్తంగా శోభిస్తుదన్నారు.

With Rafee

డాక్టర్ పద్మజా రెడ్డి స్పందిస్తూ ఐదు దశాబ్దాల తన కృషి ఫలించిందని, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ ప్రకటించడం జన్మ ధన్యమైనదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని, గురువు దివంగత శోభానాయుడుకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగు కళాసమితి అధ్యక్షులు ఉసిరికల తాతాజీ అధ్యక్షత వహించిన సభలో సీనియర్ పాత్రికేయులు ఎ.ప్రభు, అమెరికా ఆటా ప్రతినిధులు కె.సత్యనారాయణ రెడ్డి, జి.రామచంద్రారెడ్డి, యాంకర్ మాధవి సిద్ధం, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు కథక్ పండిట్ అంజుబాబు, కలయిక ఫౌండేషన్ చేరాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గజల్ గాయని స్వరూప రెడ్డి వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. విశాఖ దయా హాస్పిటల్స్ డైరెక్టర్ వి.ఆర్.ఆర్. పద్మజ, డాక్టర్ మహ్మద్ రఫీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap