కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారం స్వీకరించిన సందర్భం ఆమె గురించి ప్రత్యేక కథనం!
సింహనందినిలో ఘనాపాఠీ కూచిపూడిలో కళారత్న, నాట్యగురు రంగమణి వోలేటి!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇటీవల ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారాలు అందుకున్న వారిలో నన్ను అమితంగా ఆకట్టుకున్న నాట్యగురు శ్రీమతి వోలేటి రంగమణి గారు! ఆమెకు ఈ పురస్కారం ఇప్పుడు రావడం ఏమిటి? ఎప్పుడో ఇవ్వాలి కదా ఆ పురస్కారం అనిపించింది! అయినా ఇన్నాళ్లకు ఆ గుర్తింపు ఇచ్చి అకాడమి అధ్యక్షురాలు డా. సంధ్య పునేచ గొప్ప పని చేశారనిపించింది. ఏ మాటకు ఆమాటగా నిజం చెప్పుకోవాలంటే… ఆమె చేతుల్లోకి ఆ అవార్డు వచ్చాక ఆ పురస్కారానికే మరింత గౌరవం పెరిగిందని అనిపించింది.
రెండేళ్ల క్రితమే రంగమణి వోలేటి గారు తన “అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమీ” 50 ఏళ్ల స్వర్ణోత్సవ పండుగ రవీంద్రభారతిలో శిష్య ప్రశిష్యుల మధ్య వైభవంగా జరుపుకున్నారు. అప్పుడు నేనే సాక్ష్యం. నాట్య రంగంలో 70 ఏళ్ల జీవితం, నృత్యాలయం స్థాపించి 50 ఏళ్ళు… అంటే మాటలు కాదు! తమిళనాదులో 80 ఏళ్ళుగా నాట్య రంగంలో కొనసాగుతున్న గురువులు చాలా మంది ఉన్నారు. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొంతమందిలో ఆరుదైన విలక్షణ విశిష్టమైన నాట్య గురు రంగమణి వోలేటి గారు. ఆమె తండ్రి శ్రీమాన్ సి.ఆర్. ఆచార్యులు గారి నాట్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. కూచిపూడి నాట్య రంగంలో వేలాది శిష్యులను తీర్చిదిద్దారు. కుమార్తె శ్రీరేఖ ధన్వంతరిని మంచి నాట్య కళాకారిణిగా తీర్చిదిద్ది ఘనమైన సాంప్రదాయ నాట్య వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఆమె కేవలం కూచిపూడి నాట్యానికే పరిమితం కాకుండా తన తండ్రి వారసత్వపు ప్రాచీన ఆలయ సింహనందిని, మహాలక్ష్మి ఉద్భవం లాంటి అరుదైన అద్భుత నృత్య కళాప్రక్రియలను పరిశీలించి పరిశోధించి పునరుద్దరించి ఎందరికో నేర్పించి ప్రదర్శనలు చేయిస్తూ పరిరక్షిస్తున్నారు. మరో వైపు సింహనందిని చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద వృద్ధ కళాకారులను ఆదుకుంటూ నాట్యరంగంలో సామాజిక సేవ చేస్తూ తన ప్రత్యేకతను ఔదార్యతను చాటుకుంటున్నారు.
ప్రాచీన ఆలయ నృత్య రీతి సింహనందిని పునరుద్ధరణలో ఆమె చేసిన పరిశోధన తరతరాలకు మార్గదర్శకం అవుతుంది. వేదికపై తెల్లని వస్త్రాన్ని పరచి దానిపై ముగ్గు పొడి లేదా రంగు చల్లి, నర్తకి నాట్యం చేస్తూ దుర్గాదేవి వాహనం (సింహం) చిత్ర పటం ఆవిష్కరించడమే సింహనందిని నాట్యం. అలాగే పాద ముద్రలతో చిత్ర నృత్య రీతులతో కూచిపూడి సంప్రదాయంలో మయూర కౌత్వం (నెమలి), లక్ష్మిదేవి ఆసనం తామర పుష్పం (మహాలక్ష్మి ఉద్భవం) రూపొందించడంలో ఆమె ఘనాపాఠీ. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి ప్రాచీన దేవదాసి కళావంతుల సంస్కృతి వారి నృత్య జీవితాలపై పరిశోధన చేశారు. తన తండ్రి సి.ఆర్. ఆచార్యులు గారి నాట్య సేవలను ప్రపంచానికి తెలియజేస్తూ నృత్య సంహిత గ్రంథం రచించారు. ఇదే పుస్తకాన్ని “His Life and His Art’ పేరిట ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.
రంగమణి గారితో నాకు మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తారు! ఎంతో ఉత్సాహంగా ఆమె నాట్య రంగంలో చేస్తున్న సేవల గురించి చెబుతుంటారు. ఎంతో ఘనమైన నాట్య గురువుగా పేరు తెచ్చుకున్నప్పటికి ఏమాత్రం దర్పం ప్రదర్శించరు. ఎంతో సింపుల్ గా ఉంటారు. మరెంతో ఒదిగి ఉంటారు. మానవతా దృక్పధం, ప్రేమ ఆత్మీయతల సమ్మేళనం, అసామాన్య ప్రతిభ ఆమె సొంతం! తన ధ్యాస తన శ్వాస నాట్యమే అని చెబుతుంటారు. ప్రాచీన సాంప్రదాయ నాట్యం కాపాడుకోవాలని తపిస్తుంటారు! వయసు పైబడినా ఇంకా నాట్యం కోసం ఏదో చేయాలని, సంప్రదాయాన్ని క్రమశిక్షణను భావితరానికి అందించాలని ఆమె చేస్తున్న కృషి అ తరానికి ఈతరానికి రానున్న తరానికి గొప్ప ఆదర్శం.
నాట్యకళ వ్యాపారమయం అయిపోయిందని, సరిగ్గా నేర్చుకోకుండానే ప్రదర్శనలు ఇచ్చేస్తున్నారని, ఏమీ రాకుండానే గురువులు అయిపోతున్నారని ఈ పరిణామం మంచిది కాదని, ప్రాచీన కూచిపూడి నాట్య సంప్రదాయం చెదరకూడదని రంగమణి వోలేటి గారు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక హంస / కళారత్న అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన రంగమణి గారిని ఇన్నేళ్లకైనా కేంద్రం గుర్తించడం సంతోషదాయకం. అభినందనలు శుభాకాంక్షలు రంగమణి గారు.
-డా. మహ్మద్ రఫీ
