అభినయాల వేదిక.. విక్రమ్ కుమార్ ప్రజ్ఞాపాటవం

సాంస్కృతిక దిగ్గజం.. నాట్య విక్రమార్కుడు: విక్రమ్ కుమార్ కళా ప్రస్థానం

మారుతున్న కాలంతో పాటు ఆధునిక జీవనశైలి ఎంత వేగంగా దూసుకుపోతున్నా, మన సంస్కృతి, సంప్రదాయాలను, పరంపరాగత శాస్త్రీయ కళలను కాపాడుకోవడం ఒక యజ్ఞం లాంటిది. అటువంటి పవిత్రమైన సాంస్కృతిక రక్షణ యజ్ఞానికి కంకణం కట్టుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, విశాఖకు చెందిన బత్తిన విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్). ఆయన కేవలం కూచిపూడి నర్తకుడే కాదు.. నాటక దర్శకుడు, అంతర్జాతీయ నృత్యోత్సవాల నిర్వాహకుడు, పత్రికా సంపాదకుడు కూడా. చతుర్విధ అభినయాలతో ఆయన సాగిస్తున్న కళా ప్రస్థానం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

నాట్య సాధన, నాటక రంగంలో చెరగని ముద్ర
బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో గజ్జెకట్టిన విక్రమ్ కుమార్ బత్తిన.. పాఠశాల స్థాయి నుంచే నాట్యంపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) నుంచి కూచిపూడిలో అత్యుత్తమ ప్రతిభతో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ.) పూర్తి చేశారు. ఏయూలో ప్రత్యేకంగా ‘నృత్య విభాగం’ ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఎం.ఏ. చదివే రోజుల్లోనే “కూచిపూడిలో శివతాండవం-సప్త తాండవాలు” అనే అంశంపై ఆయన చేసిన లోతైన పరిశోధనకు ఏయూ నుంచి నూరు శాతం ఆమోదం (Full Approval) లభించడం ఆయన పాండిత్యానికి నిదర్శనం.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నటన, దర్శకత్వంలో డిప్లొమాలు పూర్తి చేసిన విక్రమ్ కుమార్, దశాబ్ద కాలం పాటు థియేటర్ ఆర్ట్స్ విభాగానికి సేవలందించారు. కన్యాశుల్కం, సత్య హరిశ్చంద్ర, బొబ్బిలి యుద్ధం వంటి నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ఆయన ప్రదర్శించిన “వందేమాతరం” నాటకం విమర్శకుల విశేష ప్రశంసలు పొందింది. ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారిని సైతం మెప్పించాయి.

సంస్థాగత నిర్మాణం, ఉత్సవాల నిర్వహణ
సాంస్కృతిక రంగానికి సంస్థాగత రూపం ఇవ్వాలనే సంకల్పంతో 2000వ సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా ‘నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ’ (NMDA) ను స్థాపించారు. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న ఈ అకాడమీ ISO 9001:2008 గుర్తింపుతో పాటు, యునెస్కో (UNESCO) ఆధ్వర్యంలోని ‘ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్’ (CID) గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లోని తొలి అకాడమీగా రికార్డు సృష్టించింది. ఈ అకాడమీ ద్వారా ఆయన ఏటా పలు ప్రతిష్టాత్మక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు:

*వైశాఖి నృత్యోత్సవ్: అఖిల భారత స్థాయిలో శాస్త్రీయ నృత్యకళాకారులను ఒకే వేదికపైకి తెచ్చే ఉత్సవం.

*భారత్ నృత్యోత్సవ్: నగర వాసులకు అంతర్జాతీయ స్థాయి నృత్యానుభవాన్ని అందించే వేదిక.

*నటరాజ్ నృత్యోత్సవ్: నాట్య రంగంలో పురుష నర్తకుల (Male Dancers) ప్రోత్సాహానికే ప్రత్యేకంగా కేటాయించిన అరుదైన నృత్యోత్సవం.

*సత్యభామ యువ నృత్యోత్సవ్: నాట్య రంగంలోకి అడుగుపెడుతున్న యువతీయువకులను ప్రోత్సహించే వేదిక.

*జతీస్ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్: శాస్త్రీయ కళలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లే సంచార నృత్యోత్సవం.

*నాట్య తరంగ్: నెలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల పరంపర.

చారిత్రక డాక్యుమెంటేషన్
ఆధునిక సమాజంలో గురు-శిష్య పరంపర తగ్గిపోతున్న తరుణంలో, భావి తరాలకు ప్రాచీన కళలు, మహనీయుల చరిత్రను అందించేందుకు విక్రమ్ కుమార్ చీఫ్ ఎడిటర్‌గా ‘ది డ్యాన్స్ ఇండియా’ (The Dance India) ఆంగ్ల మాసపత్రికను ప్రారంభించి, పద్మ పురస్కార గ్రహీతల జీవిత చరిత్రలు, పరిశోధనా వ్యాసాలు, ఎందరో కళాకారుల పరిచయాలు ఇందులో ప్రచుచారు. ఎనిమిదేళ్ళ పాటు ఎంతో కష్టపడి, కళారంజకంగా నడిపినపిన విక్రమ్ కుమార్ గారు ఆర్థిక భారం మోయలేక పత్రికకు స్వస్తిపలికారు. కూచిపూడి నాట్య వ్యవస్థాపకులు డాక్టర్ వేదాంతం చినసత్యం జీవిత వికాసాన్ని డాక్యుమెంట్ చేస్తూ ‘కూచిపూడి వైతాళికుడు’ (తెలుగు), ‘ది రీఫార్మర్’ (ఇంగ్లీష్) గ్రంథాలను రచించి, పదివేల ప్రతులను ఉచితంగా పంపిణీ చేశారు.

2026 భవిష్యత్ ప్రణాళికలు, పురస్కారాలు
సంస్కృతి రక్షణలో విక్రమ్ కుమార్ గారి కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంది. 2026 లో ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ వారి ‘ఉగాది పురస్కారం‘ ముఖమంత్రి చంద్రబాబు బాబు నాయుడి గారి చేతుల మీదుగా అందుకున్నారు. 2026 సంవత్సరానికి గాను ఆయన నేతృత్వంలో పలు బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు:

17వ వైశాఖి నృత్యోత్సవ్ (సెప్టెంబర్ 2026): విశాఖపట్నం వేదికగా సెప్టెంబర్ 26, 27 తేదీలలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నటరాజ రామకృష్ణ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ (ఆగస్టు 2026): హైదరాబాద్‌లో జరగనున్న ఈ జాతీయ నృత్యోత్సవానికి విక్రమ్ కుమార్ ఫెస్టివల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

శ్రీ ముద్ర నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ (అక్టోబర్ 2026): చిత్రా ఆర్ట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఉత్సవ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

కళారంగానికి ఆయన చేసిన నిరంతర సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వ ‘గణతంత్ర దినోత్సవ ఉత్తమ పురస్కారం’, ఒడిస్సా గవర్నర్ చేతుల మీదుగా ‘ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ఎక్సలెన్సీ అవార్డు’, కేంద్ర న్యాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ‘రాష్ట్రీయ కళాపోషక్ సమ్మాన్’ తో పాటు PRSI వారి ‘బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ ఇండియన్ కల్చర్’ వంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి.

విక్రమ్ కుమార్ బి.ఆర్. కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు; ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేసిన విప్లవాత్మక శక్తి. సంప్రదాయ పవిత్రతను కాపాడుతూనే, దానికి అంతర్జాతీయ వేదికలను కల్పిస్తున్న ఈ నాట్య విక్రమార్కుడి కృషి చిరస్మరణీయం, అభినందనీయం.

-కళాసాగర్ యల్లపు

Share via
Copy link
Powered by Social Snap