“విశ్వమోహిని” యామిని కృష్ణమూర్తి ఇకలేరు

సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! మువ్వల సవ్వడి ఆగిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. ఆమె వయసు 83. వృద్ధాప్య ఇబ్బందులతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి నాట్యాలలో ఢిల్లీ కేంద్రంగా ఎన్నో ప్రయోగాలు చేశారు. కర్ణాటక సంగీతంలోనూ రాణించారు. పాడుతూ నృత్యం చేయడంలో ఆమెకు ఆమె సాటిగా గణతికెక్కారు. వీణ వైణికురాలుగానూ ప్రదర్శనలు ఇచ్చారు.

నాట్యం కోసం ఆమె వివాహం కూడా చేసుకోలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఆమె సొంతూరు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితులు. యామిని కి నాట్యం నేర్పించడానికి ఆయన చిదంబరం కు మకాం మార్చారు. తొలుత చెన్నై లోని రుక్మిణి అరుండేల్ శిక్షణాలయం లో భరతనాట్యం కోసం చేర్పించారు. అప్పుడామె వయసు ఐదేళ్లు. అక్కడ నుంచి చిదంబరం షిఫ్ట్ అయ్యారు. తన 17వ యేట తొలి ప్రదర్శన ఇచ్చారు. వేదాంతం లక్ష్మీనారాయణ శర్మ, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడ ఒడిస్సి నేర్చుకున్నారు. 1968లోనే ఆమెను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1977లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ ఆమెను వరించాయి.

పద్మభూషణ్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో ఆమె ప్రదర్శించిన క్షీరసాగర మథనం నృత్య రూపకం ఆమెకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో పోషించిన విశ్వమోహిని పాత్ర ఆమె పేరుకు ముందు వచ్చి చేరింది.

యామిని కృష్ణమూర్తి కేవలం నాట్యం కోసమే పుట్టారనిపిస్తుంది. ఆమె అందం, ఆమె నటన, ఆమె నృత్యం, ఆమె హావభావాలు ఒక నర్తకీమణికి ఉండాల్సిన సమస్త సుగుణాలతోనే జన్మించారనిపిస్తుంది. ఆమెతో మాట్లాడుతుంటే నాట్యంలో ఆమె చేసిన సాధన, ఆమెకు నాట్యంలో వున్న పట్టు ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఎంత ఒదిగి ఉంటుందో అంత పొగరుగానూ కనిపిస్తుంది. నాట్య ప్రతిభ తెచ్చిపెట్టిన అందం వహ్వా అనిపిస్తుంది. ఆమె కనులు నాట్యం కోసమే చెక్కినట్లుగా కనిపిస్తాయి. నిజంగా నాట్యానికే ఆమె గొప్ప వరం.

24 ఏళ్ళుగా ఆమెతో నాకు మంచి అనుబంధం వుంది. ఆమె హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నేనే ఇంటర్వ్యూ చేయాలనే ఆమె నిబంధన కొనసాగించాను. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు సిద్దేంద్రయోగి పురస్కారం ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆమెతో కలసి కూచిపూడి గ్రామానికి వెళ్లిన పర్యటన గొప్ప అనుభూతి. అలాగే 2012 లో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలు ఏర్పాటు చేసినప్పుడు, తిరుపతిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు ఆమెతో చాలా దగ్గర సాన్నిహిత్యం కలిగింది. అప్పటినుంచి నాట్యరంగంలో మార్పులు గురించి అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెబుతుండే వారు. ఇక్కడి సమాచారం తెలుసుకుంటుండే వారు. ఢిల్లీ లోని వారి ఇంటిని పలు మార్లు సందర్శించి ఆమె అతిధ్యం అందుకున్న అదృష్టవంతుడ్ని. ఆమె రచించిన ఎ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ గ్రంథాన్ని ప్రత్యేకంగా నన్ను ఢిల్లీకి ఆహ్వానించి నాకు బహూకరించడం మరచిపోలేని ఆనందం. ఆమె చివరి శ్వాస వరకు నాట్యం కోసమే జీవించారు. నాట్యం కోసం తపించారు. నాట్య రాజకీయాలనూ ధైర్యంగా ఎదుర్కొన్నారు. తనదైన గొప్ప గుర్తింపు పొందారు. నాట్యం ఉన్నంత కాలం ఆమె జీవించే ఉంటారు శాశ్వతంగా. యామిని కృష్ణమూర్తి గారికి అశ్రు నివాళి.

(ఇవాళ అపోలో ఆసుపత్రిలోనే ఆమె భౌతికకాయం. రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు చాణక్యపురి సత్యమార్గ్ లో వున్న ఆమె ఇంటికి తరలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని మేనేజర్ గణేష్ తెలిపారు )

  • డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap