డప్పు చప్పుడు ఆగింది…

డప్పు రమేష్ గా జనంలో ప్రాచుర్యం పొందిన జననాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ కొద్ది సేపటి క్రితం విజయవాడ ఆంధ్రాహాస్పటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం తెనాలి దగ్గర అంగలకుదురు గ్రామం. 1982 ప్రాంతాల్లో… తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి రాడికల్ యువజన సంఘం కార్యదర్శి వర్ధనరావుగారి ప్రభావంతో రాడికల్ విద్యార్ధి సంఘంలో చేరారు రమేష్.

దరువు వేయడంలోని ఆ ఈజ్ చూడండి. ఆ పరవశం చూడండి. అదే డప్పు రమేష్ ని లెజెండ్ గా నిలిపింది. ‘గొంతు బాగుంటే సరిపోదు.దరువెమ్మటే పాడటం తెలియాలి బాబూ’ అని నాకు చురకులు బెట్టేవాడు. అన్నతో కలిసి 40 ఏళ్ల నాడు గుంటూరు జిల్లా గ్రామాల్లో ‘భూభాగోతం’ ముమ్మరంగా ఆడాం. అందులోని దాదాపు అన్ని పాటల్నీ పాడే అవకాశం నాకు దక్కింది. అప్పట్లో ఈ అన్నపేరు ఎలియేజర్. తెనాలి ఐతానగర్ లో మా రాజకీయ గురువు వర్ధన్ రావుగారింట్లోనే మా ప్రాక్టీస్ నడిచేది. నాకు తాళ బద్ధంగా పాడటం నేర్పింది రమేషన్నే.

రమేష్ ముఖంలో చెరగని చిరు నవ్వు ఉండేది.ఆ నవ్వులో చిలిపితనం మెరిసేది. ఆయన గుర్తుకొస్తే ముందు ఆయన నవ్వుముఖం కళ్ళముందు మెదిలి ఆ తరువాతే మొత్తం రూపం గుర్తొచ్చేది. ఏదో యౌవ్వనోత్సాహం ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనపడేది. తన వాయిస్ లో గంభీరత ఎక్కువ.బేస్ లోనూ పీక్ లోనూ అలవోకగా పాడగలిగే ఫ్లెక్సీబిలిటీ ఉన్న గాయకుడు.గాయకుడిగా, డప్పు కళాకారుడిగా సినిమాల్లో బాగా రాణించి ఉండేవాడు. కోట గోడల మీద జెండగా అతను తల వూపదలచలేదు. తన ప్రతిభను అటువైపుకు మళ్లించకుండా విప్లవోద్యమ అడుగుల్లో పాడుకుంటూ నడిచాడు. దండకారణ్య ఉద్యమంలో చిరస్మరణీయ పాత్రను నిర్వర్తించాడు. సమస్యలలోనే బ్రతికి పొరులోనే ఊపిరి పీల్చి యోధుడిగానే కన్ను మూశాడు.
అందరం పోవాల్సిన వాళ్ళమే. మనకంటే ముందే పోతున్న మన ఆత్మీయుల స్పృహ తెచ్చే దుక్ఖం ఎక్కడ దాచగలం. అయినా దాచడమెందుకు.

గుంటూరు జననాట్యమండలి బాధ్యుడుగా పని చేసిన ఏసు అలియాస్ సత్యం తొంభై దశకంలో నల్లమల అడవుల్లో జరిగిన చంద్రవంక దిబ్బ ఎన్ కౌంటర్ లో కన్నుమూశారు. దివాకర్ నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో అమరులైనారు.
ఇప్పుడు డప్పు రమేష్ తీవ్రమైన అనారోగ్యంతో గత పదిరోజులుగా విజయవాడ ఆంధ్రా హాస్పటల్ లో చికిత్స పొందుతూ అమరులైనారు.
డప్పు రమేష్ అంత్యక్రియలు విప్లవాభిమానుల సమక్షంలో… 19వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలో జరుగుతాయి.

జోహార్ కామ్రేడ్ డప్పు రమేష్
జోహార్ జోహార్
లక్ష్మి నరసయ్య

SA: