తెలుగు నాటక రంగ పూర్వాపరాల-దర్శనం

దర్శనం (నాటక వ్యాసాలు) పేరుతో ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఈ గ్రంథాన్ని ప్రచురించింది.

సాహిత్య విమర్శ వ్యాసరచన, ప్రసంగాలు, వివిధ సెమినార్లలో పత్ర సమర్పణ కోసం పరిశోధనా ‌వ్యాసాలు రాయడం డాక్టర్ మల్లికార్జున రెడ్డికి తెలుగు సాహిత్యం అధ్యయనంతో నేర్చిన విద్య. అందువల్లనే ఇప్పటివరకు 17 గ్రంథాలను ముద్రించారు. 2015లో యుజిసి ప్రాజెక్టు ద్వారా రాయలసీమ నాటకం చారిత్రిక అధ్యయనం అనే అంశంపై విస్తృతమైన పరిశోధన చేశారు. రాయలసీమకు సంబంధించిన 500 నాటకాలు నాటికలు సేకరించి వాటిపై సంక్షిప్త విశ్లేషణ చేశారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత “రాయలసీమ నాటక వికాసం” అనే పేరుతో ఆ గ్రంథాన్ని 2022లో ముద్రించారు. ఈ గ్రంథానికి నంది అవార్డు లభించింది. తర్వాత నాటికలు రాయాలనే ఉత్సాహంతో ‘యమసభ’ అనే నాటికల సంపుటిని వెలువరించారు. ఇందులో యమసభ, నిత్యశంకితులు, అనురాగ స్పర్శ, విలువలు మారుతున్నాయ్’, అన్న నాలుగు నాటికలు ఉన్నాయి. ఈ నాటికలు అన్నింటిని యోగి వేమన విశ్వవిద్యాలయం రంగస్థల కళల విభాగం విద్యార్థులు విజయవంతంగా ప్రదర్శించారు.

తన పరిశోధనా కాలంలో, ఆ తరువాత నాటకంపై ఉన్న మక్కువతో అప్పుడప్పుడు కొన్ని నాటక సంబంధమైన వ్యాసాలు రాస్తూ వస్తున్నారు. వాటిలో కొన్నిటిని సదస్సుల కోసం మరికొన్నిటిని సాహిత్య మాసపత్రికల కోసం రాస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాసాలలో కొన్నింటిని దర్శనం అనే పేరుతో ప్రచురించారు. ఇందులో 14 చిన్న వ్యాసాలు మాత్రమే ఉన్నాయి.

చాట్ల శ్రీరాములు గారు అన్నట్లు “నాటక విమర్శ దీపం చిన్నది”. వెలుగులో గొప్ప సాహిత్య విమర్శకులున్నా.. విమర్శ- కవిత్వం నవల కథలపైనే ఎక్కువ సాగింది. విశ్వవిద్యాలయాల్లో నాటకాలపై పరిశోధనలు కూడా చాలా పరిమితంగా మాత్రమే జరుగుతుంటాయి. సామాన్య జనాన్ని సైతం రంజింప చేసి ఆలోచింపచేసి, కర్తవ్యోపదేశం చేయగల సాహిత్య ప్రక్రియలో నాటకమే ప్రధానమైంది. అందుకే ‘నాటకాంతం హి సాహిత్యం’ అన్నారు. నాటకం అత్యుత్తమ దృశ్య కావ్యం. జానపద కళలు విలసిల్లుతున్న రోజుల్లో రాచరిక పరిపాలనా కాలంలోనే ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ- నాటకం.

165 సంవత్సరాల తెలుగు నాటక చరిత్రలో గొప్ప కవులు పండితులు మాత్రమే నాటక రచనకు పూనుకోవడం విశేషం. మనకు లభ్యమవుతున్న మొదటి తెలుగు రూపకం క్రీడాభిరామం. వినుకొండ వల్లభ రాయుడు 15వ శతాబ్దంలో రాశారు ఇది సంస్కృత దశరూపకాల్లో ‘వీధి’ అనే రూపక శాఖకు చెందింది.ఆ రూపకం తర్వాత 1860 వరకు తెలుగులో నాటక రచన జరగలేదు. కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860లో సంస్కృత నాటక లక్షణాలతో తెలుగులో రాసిన స్వతంత్ర నాటకం “మంజరీ మధుకరీయం”. 1880 లో వీరేశలింగం పంతులుగారు రాసిన వ్యవహార ధర్మ బోధిని బ్రహ్మవివాహం నాటకాలను మొదటిసారిగా రంగస్థలంపై ప్రదర్శించారు. తర్వాత కాలంలో కొక్కొండ వెంకటరత్నం, పరవస్తు వెంకటరంగాచార్యులు వావిలాల వాసుదేవశాస్త్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు కోలాచలం శ్రీనివాసరావు చిలకమర్తి లక్ష్మీనరసింహం తిరుపతి వెంకట కవులు ముత్తరాజు సుబ్బారావు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాదెండ్ల పురుషోత్తమ కవి పానుగంటి లక్ష్మీనరసింహం కాళ్లకూరి నారాయణరావు గారు అనేక పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలు రచించి తెలుగు నాటకానికి ఎనలేని కీర్తి తెచ్చారు.

1892లో గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం తెలుగు నాటక చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. అభ్యుదయ నాటక సాహిత్యానికి పునాది కన్యాశుల్కమే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత కాలంలో వైవిద్య భరితమైన సామాజికాంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని అనేక నాటికలు నాటకాలు రాశారు, రాస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా రాస్తూనే ఉంటారు రచయితలు.

తెలుగు నాటక రచనా కాలం నుండి వస్తు సేకరణలో భాషా ప్రయోగంలో శైలి విధానంలో రూపక నిర్మాణంలో నూతన ప్రయోగాలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. నాటకాలు నిత్య నూతనంగా ఉండాలంటే ఇలాంటి ప్రయోగాల అవసరమే !

ఇప్పటి “దర్శనం” వ్యాస సంపుటిలోని మొదటి వ్యాసం చూస్తే,.. ‘తెలుగులో నాటక రచన పరిణామం’. 1960లో ప్రారంభమైన నాటక రచన రెండు వేల సంవత్సరం వరకు.. ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులను చేసిన ప్రయోగాలను చెప్పి కొన్ని ప్రసిద్ధ నాటకాలు, నాటికలను పరిచయం చేస్తారు డాక్టర్ మూల. తొలి తెలుగు వీధి నాటకం క్రీడాభిరామం వ్యాసం ద్వారా కృతికర్త నిర్ణయం రూపక లక్షణాలు,లక్షణ సమన్వయం కథ నాటి ప్రజాజీవనం తదితర అంశాలు చర్చించడం ఈ వ్యాసానికి సాహిత్య లోతును విలువలను సమకూర్చింది.

తెలుగు నాటక రంగ చరిత్రలో ‘సురభి’ నాటక సంస్థలు సువర్ణాక్షరాలతో లిఖించగలిగినవి. నాటకమే జీవితంగా నాటకమే ప్రపంచంగా నాటకమే శ్వాసగా ధ్యాసగా జీవిస్తున్నారు సురభి నాటక సంస్థ కళాకారులు. అటువంటి సుప్రసిద్ధమైన సురభి ప్రస్థానం కడప జిల్లాలోనే మొదలైంది. ఆ సంస్థ కళాకారుల పూర్వ నేపథ్యం వారు దేశ విదేశాల్లో విజయవంతంగా ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు చేసిన ప్రయోగాలు ఎదుర్కొన్న సమస్యలు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు “సురభి నాటకం”లో విశదపరిచారు. ఇది సురభి సంస్థ అనే కొండను అద్దంలో చూపించడమే!

మూఢనమ్మకాలతో అంధవిశ్వాసాలతో మగ్గిపోతున్న కాలంలో వెలుగు చుక్కలా ప్రవేశించి నాటి సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన కందుకూరి వీరేశలింగం గారి నాటకాలను “కందుకూరి నాటకాలు” అన్న వ్యాసంలో విశ్లేషించారు మూల. ఇందులో కందుకూరి వారి నాటకాలను ప్రహసనాలను సంస్కృత అనువాదాలు స్వతంత్ర నాటకాలుగా, విభజించి వాటి ద్వారా ఆయన చేసిన సంఘ సంస్కరణను విస్పష్టంగా పాఠకులకు అర్థమయ్యే రీతిలో రచించారు. వావిలాల సుబ్బారావు గారు రూపకల్పన చేసిన ఏకైక నాటకం సుభద్ర విజయం ఈ నాటకం రాయడానికి కారణాలు.
మూలకథలో చేసిన మార్పులు కథా వివరణ పాత్రలు పాత్ర స్వభావాలు సన్నివేశాల రూపకల్పన పద్య నిర్మాణం రచన శైలి సుభద్ర పాత్ర ద్వారా స్త్రీలకు ఇచ్చిన సందేశం.. మొదలైన విషయాలను కూలంకషంగా పరిశీలించారు డాక్టర్ మూల, సుభద్ర విజయం నాటక పరిశీలనా వ్యాసంలో.

తెలుగు నాటక సాహిత్యంలో వెలకట్టలేని వజ్రం కన్యాశుల్కం నాటకం. సమాజంలో బూజుపట్టిన ఛాందస భావాలను దులపడానికి గురజాడ కన్యాశుల్కం నాటకం రాశారు. ఇది ఒక సంచలన నాటకం. సంప్రదాయ వాదుల గుండెల్లో గుబులు పుట్టించిన నాటకం. కన్యాశుల్కంపై వచ్చినన్ని విమర్శలు తెలుగులో ఇంతవరకు ఏ గ్రంథం పైన రాలేదని చెప్పడం అత్యుక్తి కాబోదు. నాటకాన్ని ఆకాశానికెత్తి అభినందించిన వాళ్లు కోకొల్లలు. కొద్ది మంది విమర్శించిన వాళ్లకు కూడా చివరకు జ్ఞానోదయమై కన్యాశుల్కం గొప్ప నాటకమని ప్రశంసించారు. ఈ వివరాలన్నీ మనకు ‘కన్యాశుల్కం పై విమర్శలు’ పరిశీలనా వ్యాసంలో కనబడతాయి.

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవిగా అందరికీ సుపరిచితులే. ఆయన కవిత్వీకరించిన, అమృతం కురిసిన రాత్రి ప్రసిద్ధమైన రచన. ఆయన చాలా నాటకాలు రాశారు. అందులో ఇరుగుపొరుగు, పొగ అనే రెండు నాటికలను- “తిలక్ నాటకాలు- సామాజిక నేపథ్యం” అనే వ్యాసంలో ఈ వ్యాస రచయిత పరిచయం చేయడం,ఈ సంపుటి లోని అపురూపమైన వ్యాసాలలో ఇది ఒకటి. నాటక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రచనల్లో ప్రత్యేక ధోరణిని ప్రతిబింబ చేయడం తిలక్ ప్రత్యేకత. దీన్ని సింబాలిజం అన్నారు ఇరుగుపొరుగు నాటిక ఈ నేపథ్యంలో రాయబడింది. మానవుని ఆంతరంగిక వ్యక్తిత్వానికి దర్పణం పడుతూ ‘పొగ’ నాటకం తిలక్ రాశారు.

ఆధునిక సాహిత్యంలో కొలకలూరి ఇనాక్ గారు తెలియని వారు ఉండరు. ఆయన అగ్రవర్ణాల అధిపత్యానికి ప్రత్యామ్నాయ సాహితీ కర్తగా ఎదిగారు. కథ నవల నాటకం పరిశోధనా విమర్శ వీటన్నిటిలో ఆయనది అందె వేసిన చేయి. 2014లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. ఆయన రాసిన నాటకాలు అనేకం దళిత చైతన్యానికి ప్రతిరూపాలు. ఆ నాటకాలు అన్నింటిపై విహంగ వీక్షణం చేసి ‘ఇనాక్ నాటక సాహిత్యం- దళిత స్పృహ’ అన్న వ్యాసంలో క్రోడీకరించారు ఆచార్య మూల.

డాక్టర్ రాసాని వెంకట్రామయ్య గారు నటునిగా నాటక కర్తగా నాటక ప్రయోక్తగా నవలా కారునిగా కథా రచయితగా విమర్శకునిగా ఆయనపై ఒక ప్రత్యేక సంచిక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల వారు తీసుకొస్తున్న సందర్భంగా డాక్టర్ మూల రాసిన “రాసాని నాటకాలు నాటికలు- విశ్లేషణ” అనే వ్యాసం ఇందులోనూ చోటు చేసుకుంది. తరిగొండ వెంగమాంబ కాటమరాజు యుద్ధం అనే రెండు చారిత్రక నాటకాలు తప్ప ఆయన ఎక్కువగా సాంఘిక నాటకాలు, నాటికలే రాశారు ముఖ్యంగా రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితిలే ఆయన నాటకాల కథా వస్తువులు. ఈ నాటకాలు నాటికలు నేటి సమాజానికి ఇచ్చే సందేశాన్ని సుస్పష్టం చేస్తూ రాసిన వ్యాసం ఇది.

“రాయలసీమ సంప్రదాయ. నాటకం” అనే వ్యాసంలో సీమలో నాటక రచన ప్రారంభం నుంచి వచ్చిన నాటకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ.. ప్రధానంగా ధర్మవరం కోలాచలం గార్లు నాటక రంగానికి చేసిన కృషిని ఈ వ్యాసంలో హైలెట్ చేశారు. అలాగే రాయలసీమ నుండి వచ్చిన నాటకాల్లో ప్రవేశ పెట్టిన మూఢ విశ్వాసాలు స్త్రీ విద్య స్త్రీ పునర్వివాహ ఆవశ్యకత బాల్య వృద్ధ వివాహాలు వరకట్నం, స్త్రీ స్వాతంత్రం వేశ్య సంస్కరణ సర్వమత సమన్వయం జాతీయోద్యమం స్వాతంత్ర్యానంతర దేశభక్తి విశ్వశాంతి విద్య మద్యపాన నిషేధం లాంటి ఎన్నో విషయాలని చర్చించడం ద్వారా ఈ వ్యాసం ఎంతో గాంభీర్యాన్ని, ఆనాటి సాంఘిక పరిస్థితుల లోతుపాతులను దుర్భిణిలో పెట్టి ఈ వ్యాసంలో పాఠకులకు చూపిస్తారు.

తొలి సాంఘిక నాటకం వావిలాల వాసుదేవ శాస్త్రి గారి ‘నందక రాజ్యం’ ఆనాటి సాంఘిక సమస్యలను ప్రతిపాదిస్తూ రాసిన నాటకం. అలాగే కందుకూరి వారి వ్యవహార ధర్మ బోధిని తెలుగు తొలి తెలుగు ప్రదర్శిత నాటకం. ఆయన ఈ నాటకంలో గట్టు పుట్ట తగాదాలు, అన్నదమ్ముల వైరాలు కోర్టు వ్యవహారాలు తదితర సామాజిక అంశాలను కళ్ళ ముందు ఉంచారు. ఆనాటి నుండి నేటి వరకు వస్తున్న సాంఘిక నాటకాలు నాటికలు స్పృశించని సామాజిక అంశం లేదు. ఈ నేపథ్యంతోనే రాయలసీమ నుండి వెలువడిన సాంఘిక నాటకాలను తీసుకొని “రాయలసీమ సాంఘిక నాటకం- సామాజిక స్పృహ” అన్న వ్యాసం బహుశా డాక్టర్ మూల లాంటి రాయలసీమ నుండి వచ్చిన విద్యావేత్త మాత్రమే రాయగలిగిన వ్యాసం. “తెలుగు నాటక సాహిత్యంలో విద్యా విధానం” అనే వ్యాసం.. మరింత ప్రత్యేకించి చెప్పుకోదగ్గ వ్యాసం- ఈ వ్యాస సంపుటిలో. నాటక రచన కాలం నుండి వచ్చిన నాటకాలు నాటికల్లో ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు విద్యా విధానంలో వచ్చిన మార్పులను ప్రతిపాదించిన తీరు తెన్నులు విశ్లేషించారు డాక్టర్ మూల. తల్లిదండ్రులు గురువులు విమర్శకులు ఈ ముగ్గురు బాధ్యతలు తెలియజెప్పి సంస్కారవంతమైన సమాజానికి విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటో నాటకాల ద్వారా చాటి చెప్పిన వైనం ఈ వ్యాసంలో ప్రస్ఫుటమవుతుంది.

వైయస్సార్ కడప జిల్లా నుండి వచ్చిన పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలను పేర్కొని, ఆ నాటకాలు నాటికల్లో సమకాలీన సామాజిక వాస్తవాలను ఎలా ప్రతిబింబింప చేశారో “వైయస్సార్ కడప జిల్లా నాటక వికాసం”లో పొందుపరిచారు ఆచార్య మూల.

చివరగా, బళ్ళారి రాఘవ నటనా వైద్యుష్యాన్ని, ఆయన నాటక రంగం కోసం చేసిన కృషిని, ప్రవేశపెట్టిన ఆవిష్కరణలను తెలియజేసి ఆయన వ్యక్తిత్వాన్ని పలువురు ప్రశంసించిన వైనాన్ని పేర్కొనడం ద్వారా రాయలసీమకు చెందిన చిరస్మరణీయమైన,విస్మరించడానికి వీలు లేని కళా ప్రపూర్ణ బళ్ళారి రాఘవ గురించి చెప్పిన అంశాలు భూత వర్తమాన భవిష్య కాలాలలో అవశ్యం నిరంతరం స్మరణీయమైనవి.

ఇలా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, రాయలసీమ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ విశేషించి నాటక సాహిత్యం పట్ల అభిరుచిని కలగజేసుకొని యుజిసి ప్రాజెక్టు నేపథ్యంలో సేకరించిన అమూల్యమైన సమాచారాన్ని తన వ్యక్తిగత గ్రంథాలయంలో భద్రపరుచుకుని అందునుండి ఎంపిక చేసుకున్న ఈ పధ్నాలుగు వ్యాసాలు ఎంతో సమాచార నిక్షిప్తంగా ఉంచుకున్న తెలుగు నాటక రంగ విశేషాలను నిండుకుండలా గర్భీకరించుకున్న విలువైన లఘు వ్యాస సంపుటి ఇది. ఇన్ని వ్యాసాలలో ఏ వ్యాసలోని ఏ పేరా లో కూడా తొలగించ తగిన వాక్యం ఒకటి కూడా కనబడదు. కాలనాళికలో భద్రపరచడానికా అన్నట్లు విశేషాలు అన్నిటిని ఏర్చి కూర్చి తయారు చేసిన విషయం నిష్ఠ నాటక రంగ కాగడా ఈ ‘దర్శనం’

మల్లేశ్వర రావు ఆకుల (7981872655)
ప్రతులకు:
వెల వంద రూపాయలు. పేజీలు 125, ప్రతులకు: 77000 03399.

Share via
Copy link
Powered by Social Snap