వెండితెరను సుసంపన్నం చేసిన దాశరథి

చలన చిత్ర గీతానికి కావ్య ప్రతిష్ఠ తెచ్చిన సుప్రసిద్ధ కవులలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. ఆయన రచనలలో సున్నితమైన భావుకత, సౌకుమార్యం, శబ్ద సౌందర్యం లాంటి లక్షణాలు తొణికిసలాడతాయి. ఆ తరం కవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నట్లే దాశరథి తనకంటూ ఒక శైలిని ప్రవేశ పెట్టారు. అన్ని తరహా గీత రచన చేసిన అరుదైన కవులలో అగ్రగామి దాశరథి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో, నూతన పదబంధాలతో, ముఖ్యంగా అన్యదేశ పద ప్రయోగంతో చిత్రగీతాలను పరిపుష్టం చేసిన ఖ్యాతి దాశరథికే దక్కుతుంది. ఈ విషయాన్ని సోదాహరణగా, సోపపత్తికంగా నిరూపించిన విలక్షణ పరిశోధన గ్రంథం ‘దాశరథి చలన చిత్ర గీతాలు.
దాశరథి కృష్ణమాచార్యుల సినీగీతాలమీద ఇప్పటికే చాలామంది పరిశోధన చేశారు. అయినా ఆరవల్లి జగన్నాథస్వామి మళ్ళీ ‘దాశరథి చలన చిత్ర గీతాలు – విమర్శనాత్మక పరిశీలన’ అన్న సిద్ధాంత గ్రంథాన్ని రాసి, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. మళ్ళీ రాసేటప్పుడు కచ్చితంగా ఏదో ఒక నూతన విషయం కచ్చితంగా ఉండాలి. ఇప్పటికే ఇతర సిద్ధాంత గ్రంథాలను చదివిన వాళ్ళకు ఇందులోని విమర్శనాత్మక విధానం ఏమిటో తెలుస్తుంది, చదవనివాళ్ళకు దాశరథి పాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది.
ఈ సిద్ధాంతవ్యాసాన్ని చదివితే ముందుగా మనకు అర్థమయ్యేది ఇది పిహెచ్.డి. డిగ్రీకోసం రాసింది కాదు, దాశరథి మీద ఉన్న అభిమానంతో రాసింది, దాశరథి పాటలమీద ఉన్న అవగాహనతో రాసింది అన్న విషయాలు తెలుస్తాయి. పట్టా తీసుకోవడం అన్నది గౌణం. దాశరథి పాటల్ని విశ్లేషించడమన్నది ప్రథమ ప్రాధాన్యమయిన విషయం. అందుకే ఈ సిద్ధాంతవ్యాసం మంచి సిద్ధాంతవ్యాసంగా రూపొందింది.
ఏడు అధ్యాయాలతో కూడిన ఈ సిద్ధాంతవ్యాసం దాశరథి సినిమా పాటలకు సమగ్రమయిన అధ్యయనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుమించి డాక్టర్ జగన్నాథస్వామి రచనా విధానం పాఠకుల్ని చదివింపజేయడంలోనూ, పరిశోధకుల్ని ఆలోచింపజేయడంలోనూ అగ్రస్థానంలో ఉంది. దాశరథి సినిమా పాటల్ని గురించి చెబుతూనే సోపపత్తికంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ సినిమా సాహిత్యంపై ఆయనకున్న పట్టును నిరూపించుకున్నారు. దాశరథి గీతాలను వింగడించడంలోనూ, విశ్లేషించడంలోనూ జగన్నాథస్వామి ప్రతిభ కనిపిస్తుంది. గీతాల్లో కనిపించే వస్తువైవిధ్యం, ఔచిత్య పోషణ, కాల్పనికత అన్న అంశాలను ఎంతో లోతుగా అధ్యయనం చేశారు. భాషాపరంగా దాశరథి చేసిన ప్రయోగాలు, ఇతర భాషలనుంచి తెచ్చుకున్న ఆదానాలు, కవాలీ, గజల్, రుబాయి లాంటి ప్రభావంతో తెలుగులో సినిమాలోగిలిలో ప్రవేశపెట్టిన ప్రయోగాలు తరువాతి తరాలకు ఆదర్శాలు. వీటన్నిటి గురించి ఈ సిద్ధాంతవ్యాసంలో సమగ్రమయిన విశ్లేషణ చేయడం ద్వారా కొత్త పాఠకులకు, కొత్త పరిశోధకులకు జగన్నాథస్వామి అనేక నూతనాంశాలను అందించారు.
తెగిన తీగలాగా, శ్రుతిలేని వీణలాగా సాగే సిద్ధాంతవ్యాసాలమధ్య శ్రుతి ఉన్న వీణలాంటి ఈ సిద్ధాంతవ్యాసం మన మనసుల్ని ఆహ్లాదపరుస్తుంది, మన మేధస్సుకు పదును పెడుతుంది, భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. అందువల్ల జగన్నాథస్వామిని అభినందించకుండా ఉండడం సాధ్యమయ్యే పనికాదు.

-సంపత్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap