దాసుభాషితం పబ్లిషింగ్ సేవల ప్రారంభం, సీపీ బ్రౌన్ తెలుగుపోటీ 2019 విజేతల బహుమతి ప్రదానం.
ఇప్పటివరకూ తన యాప్ ద్వారా తెలుగులో శ్రవణ పుస్తకాలను పాడ్ కాస్ట్స్ నూ అందిస్తున్న దాసుభాషితం, సాహిత్య, సంగీత లలిత కళా వేదిక, ప్రచురణ రంగంలో విప్లవాత్మకమైన, వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఏకీకృత ప్రచురణ సేవల పేరిట ఏదైనా ఒక పుస్తకాన్ని ముద్రణ రూపంతో పాటు, ‘ఈ-బుక్, శ్రవణ రూపాల్లో కూడా రూపొందించి సాహిత్యాభిలాషులకు ఒకే వేదిక నుంచి అందుబాటులో ఉంచడం, అదే సమయంలో ఆయా రచయితల ఆర్ధిక స్తోమతలకనుగుణంగా వారు కోరుకున్నంత మంది పాఠకులు, శ్రోతల చెంతకు ఆ రూపాలను చేర్చే మార్కెటింగ్, ప్రచారమూ, అమ్మకాలూ కూడా నిర్వహించడం ఈ విధానం ప్రత్యేకత.
14-12-19, శనివారం సాయంత్రం సికిందరాబాదు, సన్ షైన్ హాస్పిటల్ భవనంలోని శాంతా ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో దాసుభాషితం వ్యవస్థాపకులు శ్రీ కొండూరు తులసీదాస్ రచించిన ‘భారత దేశ తీర్థ విహార యాత్రలు” గ్రంధం ముద్రణ రూపాన్ని సభకు అధ్యక్షత వహించిన శ్రీ రావి కొండలరావు ఆవిష్కరించగా, ‘ఈ బుక్కు’ను ఆంద్రజ్యోతి సంపాదకులు శ్రీ కె.శ్రీనివాస్, ఆడియో రూపాన్ని డాక్టర్ గురవారెడ్డి ఆవిష్కరించారు. ఒక భారతీయ భాషలో ముఖ్యంగా తెలుగులో మూడు రూపాల్లో ఒకే సంస్థ ద్వారా వెలువడిన మొదటి పుస్తకంగా ఈ ‘భారత దేశ తీర్థ విహార యాత్రలు” చరిత్రలో నిలవనుంది.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన, శ్రీ కె. శ్రీనివాస్, ‘ఈ బుక్’ ప్రచురణకు సంబంధించి తెలుగు ఫాంటుల కొరత, యూనికోడ్ ఫైళ్లు, కొన్ని కంప్యూటర్లలో పనిచేయడం మరికొన్నిటిలో పనిచేయక పోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. అన్ని రకాల కంప్యూటర్లలో సమంగా వినియోగ్యమైన సాఫ్ట్ వేర్ ఆవశ్యకతను పేర్కొంటూ, ఈ విషయం మీద, ఆ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజేషను చేసే కృషిలో నిమగ్నమై ఉన్న ‘దాసుభాషితం’ వంటి సంస్థలు దృష్టి సారించి తగు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. అలాగే ఆడియో బుక్సుకు సంబంధించి గళ కళాకారుల వ్యక్తిగత నేపధ్యానికి చెందిన ఉచ్చారణ ప్రభావం, గ్రంధం యొక్క మూల స్వభావం మీద పడకుండా చూడాలని సూచించారు. ఆడియో బుక్కును ఆవిష్కరించిన దాసుభాషితం సలహాదారు డాక్టర్ గురువారెడ్డి, మాట్లాడుతూ అనేకమంది, తెలుగు భాషాభిమానులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు అభినందనపూర్వక ప్రోత్సాహమిస్తున్నారని, అలాగే వారు ‘దాసుభాషితం’ చేస్తున్న కృషికి, యథాశక్తి ఆర్ధిక చేయూత కూడా ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీ రావి కొండలరావు, గ్రామీణ స్త్రీలు కూడా తమ వంటిళ్లలో సాధారణ పదాలైన ‘అన్నం’ ‘కూరలు’, ‘నూనె’, వంటి పదాలకు కూడా రైస్, వెజిటబుల్స్, కర్రీస్, ‘ఆయిల్’, వంటి ఆంగ్ల పదాలను వాడటం వల్ల ఏ ఇంటి వాతావరణంలోనైతే పిల్లలు చక్కటి తెలుగు మాట్లాడటం ప్రారంభించాలో అక్కడే వారు ఆ అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాసుభాషితం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ, కేవలం శ్రవణ పుస్తకాలే కాకుండా, గతంలో తను వరల్డ్ స్పేస్ రేడియోను నిర్వహించిన అనుభవంతో, వైవిధ్యభరితమైన కార్యక్రమాల రూపకల్పనలో ‘దాసుభాషితం’కు తనవంతు సహకారం ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త దాసుభాషితం మరో సలహాదారు, డాక్టర్ మృణాళిని అన్నారు.
ఏ కాలంలోనైనా ఒక రచయిత తన రచన సాధ్యమైనంత ఎక్కువమందికి చేరాలని కోరుకుంటారు. అయితే చాలా సందర్భాలలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రచురింపబడిన పుస్తకాలు పూర్తిగా అమ్ముడు కాక కాపీలు మిగిలిపోతూ ఉంటాయి. ఈ సమస్యను ‘దాసుభాషితం ఏకీకృత పబ్లిషింగ్’ విధానం ఎలా పరిష్కరించగలదో ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, శ్రీ కె.కిరణ్ కుమార్ వివరించారు. తమ పుస్తకాలకు అతి తక్కువ పెట్టుబడితో ఏ విధంగా ప్రచారం కల్పించవచ్చో, తద్వారా దేశ, ప్రాంత కాల పరిమితులకు అతీతంగా, ప్రపంచంలో మారుమూల దేశాలలోనున్న తెలుగు సాహిత్యాభిమానులు అత్యధిక మంది చెంతకు వాటిని సత్వరంగా ఎలా చేర్చవచ్చో, అందువలన రచయితలకు కలిగే ప్రయోజనాలేమిటో పవర్ పాయింట్ ద్వారా కిరణ్ కుమార్ సోదాహరణంగా వివరించారు. ఈ ఏకీకృత సేవలు వివిధ ప్యాకేజీలుగా ఉంటాయనీ, ఆసక్తి ఉన్నవారు 99520 29498 నంబరుకు ‘DIPS’ అని వాట్సాప్ సందేశం పంపి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.
అనంతరం దాసుభాషితం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదవ తరగతి విద్యార్థులకు గత నెల నిర్వహించిన సి.పీ బ్రౌన్ తెలుగు పోటీలో విజేతలైన తెలంగాణాకు సంబంధించి ఖమ్మం, న్యూ ఎరా హైస్కూల్ అధిపతి శ్రీ రమణారావుగారిని జ్ఞాపిక. సత్కారాలతోనూ, తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి యద్దనపూడి రాజేశ్వరి, ప్రసూనాంబ గారినీ, ఆంద్రప్రదేశ్ కు సంబంధించి భీమవరం, చింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఎయిడెడ్ హైస్కూల్ తెలుగు పండితులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీ కలిగొట్ల గోపాలశర్మ గారినీ సన్మానించి, నగదు బహుమతులూ, ప్రశంశా పత్రాలూ, జ్ఞాపికలూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
కార్యక్రమ ప్రారంభంలో, దాసుభాషితం వ్యవస్థాపకులు శ్రీ కొండూరు తులసీదాస్, పది సంవత్సరాల క్రితం సంస్థ ప్రారంభమైన తీరు, ముఖ్యోద్దేశం, స్వరూప స్వభావాల గురించి తమ స్వాగతోపన్యాసంలో వివరించారు.