వెలుగుల కాంతుల్ని పంచే దీపావళి

మన భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో సంస్కృతికి ప్రతిబింబంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహం, ఉల్లాసంతో సర్వమత సమ్మేళనాన్ని పాటిస్తూ అందరూ కలిసిమెలిసి వెలుగు తోరణాలతో వేడుకగా చేసుకుంటారు. ఇలా మానవ స్వభావంలోనే వెలుగు రవ్వలు ఉత్సాహానికి సంకేతం అని తెలుస్తుంది. కొన్ని యుగాల క్రితం ఈ వెలుగులు విరజిమ్మే వేడుకను దివ్యత్వంగాను, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ప్రతిష్టించారు. ఈ పండుగ ఒక వేడుకగా కాకుండా దేవతల అనుగ్రహం పొందే పూజా విధానం అందర్నీ ఆనందపరిచే విధంగా పూర్వీకుల పట్ల, పెద్దలపట్ల ప్రేమ ఆప్యాయతలు… ఇవన్నీ కూడా ఈ దీపావళి పండుగతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ దీపావళి రోజున అందరూ కలిసిమెలిసి ప్రేమను పంచుకుంటూ ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటారు.

ఈ పండుగ ఆశ్వీయుజ మాసంలో అమావాస్య రోజున వస్తుంది. చివరి మూడు రోజులు అంటే త్రయోదశి, చతుర్థి, అమావాస్య అలాగే కార్తీక మాసం మొదటి రెండు రోజులు పాడ్యమి, విధియ ఈ ఐదు రోజులు ఒక పండుగలా జరుపుకుంటారు. మన భారతీయులు ఇలా జరుపుకునే ఈ దీపావళి పండుగ వెనుక అనేక పురాణ గాధలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని సంహరించడం, బలి చక్రవర్తి వామనుడికి సామ్రాజ్యాన్ని దానం చేయడం, శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత పట్టాభిషిక్తుడవడం, నరక విముక్తి కొరకు యమ ప్రార్ధన, విక్రమాదిత్యుని పట్టాభిషేకం,… ఇలా ఇవన్నీ కూడా దీపావళి రోజునే జరిగాయి.

ఇలా ఈ పండుగలు కాలంతో వచ్చే రుతువుల మార్పులు అంటే ఒక్కొక్క కాలంలో ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు ఖగోళంలో కూడా వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఋషులు ఈ పర్వదినాలని మనకు శోభయమానంగా ఏర్పాటు చేశారు. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకతతో ఒక్కో పండుగకి ఒక్కో దేవతను ఆరాధిస్తాం. ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ఈ పండుగలు శరన్నరాత్రులతో మొదలుపెట్టి అమ్మవారిని ఆరాధిస్తాము శుక్లపక్షంలో. అలాగే కృష్ణపక్షంలో చివరికి అమావాస్య వస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి ఆరాధనతోనే పూజని పరిపూర్ణం చేసుకుంటాము.

ఈ నరక చతుర్దశి రోజు ఉషోదయానికి గంట ముందు చిన్న చిన్న జలాశయాల నుంచి సముద్రం వరకు అన్నింట గంగాదేవి ఉంటుంది. అలాగే నువ్వుల నూనెలో ఈ ఒక్కరోజు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తెల్లవారుజామున మాడుకి, ఒంటికి నువ్వులు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి. ఈరోజు సూర్యోదయానికి ఒక గంట ముందే దేవతలకు, పెద్దలకు తల్లిదండ్రులకు హారతులిచ్చి వారి దీవెనలను పొందితే మనకు శుభం కలుగుతుంది. తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకు తిరిగి “సీత లోష్ట సమాయుక్త/ సంకట దళాన్విత హరపాప/ మపామార బ్రహ్మ మాన్య పునః పునః/” అంటూ శ్లోకం చదివి ఉత్తరేణి మొక్కను తల చుట్టూ మూడుసార్లు ఎవరికి వారే తిప్పుకొని ఆ తర్వాత ఉత్తర దిక్కుకు తిరిగి నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తల స్నానం చేస్తారు. తదుపరి అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నువ్వుల నూనె అంటి నుదుట కుంకుమ బొట్టు పెట్టి మంగళ హారతులిచ్చి తల స్నానం చేయించి మరల మంగళహారతులు ఇవ్వాలి. ఇలా చేస్తే తోబుట్టువుల మధ్య అనుబంధం పది కాలాలపాటు పచ్చగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు మంగళప్రదంగా ఉండాలని చెప్పి హారతులు అందుకొని తోబుట్టువులు బహుమతులు ఇస్తారు. ఇలాంటి సంప్రదాయాల్ని ఆచరించడంలో మన దేశం సంస్కృతికి పెద్దపీట వేసిందనే చెప్పాలి.

చాలామంది అనేక ప్రాంతాల్లో ఐదు రోజులు పూజలు చేస్తారు. ఈ ఐదు రోజుల పూజలో కుబేర లక్ష్మిపూజ చేస్తూ అన్నం ఒక కుండలాగా ఏర్పాటు చేసి దాని మీద దీపం పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. నరక చతుర్దశి నాడు యమధర్మ మహారాజుకు తర్పణాలు చెయ్యాలి. అలాగే పితృతర్పణాలతో పెద్దలను తలచుకుని పూర్వికులపై భక్తిని ప్రకటిస్తారు. భాద్రపద కృష్ణ పక్షపు మహలాయ దినాలలో ఆరాధించిన పితరులకు అశ్వియుజ అమావాస్య వీడ్కోలు తెలుపుతుందని ఋషులు పండితులు చెబుతారు. అలాగే తీపి పదార్థం, మినుములతో చేసిన ఏదైనా పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ధన త్రయోదశి రోజు సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని ఉద్దేశించి దీపదారణ చెయ్యాలి. నరక చతుర్దశి నాడు యముణ్ణి ఉద్దేశించి దీపదారణ చెయ్యాలి. ఈ విధంగా యముణ్ణి ఉద్దేశించి దీపదారణ చేస్తే నరక ప్రాప్తి ఉండదని పెద్దలు పండితుల ఉవాచ.

ఈ పండుగను ఉత్తర భారత దేశంలో లక్ష్మీ పూజగా, బెంగాలీ వాసులు కాళీ పూజగా, తెలుగు నాట దీపావళిగా, జైనులు మహావీర నిర్వాణ లక్ష్మి, ఇంద్రభూతిజ్ఞా లక్ష్మీ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇలా ఏ రూపంలో కొలిచినా ఎవరు దీపాలు పెడతారో వారి పితృదేవతలు నరకం నుంచి విముక్తులై స్వర్గ ప్రాప్తి పొందుతారు. ఈ దీపాలని ఇంటి వాకిళ్ళలో, తులసి కోట వద్ద, గుమ్మాలలో, గోశాలలో, దేవాలయాల్లో దీప మాలికలను వెలిగిస్తారు. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు వృషభాలను, గోమాతను అలంకరించి పూజిస్తారు. దీనిని గోలక్ష్మి పూజ అంటారు. ఇలా చేయడం వల్ల మనం ప్రకృతిని కూడా ఆరాధిస్తున్నట్లే. ఇలా సాయంత్రం ఇంట్లో పూజ చేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించి “త్రయంబకం ఆవాహయామి!” లేదా “దామోదరం ఆవాహయామి!’ అని నమస్కరించాలి. ఆ తర్వాత టపాసులు కాల్చి నైవేద్యంగా పెట్టిన తీపి పదార్థం తినాలి.

ఈ దీపాలని మట్టి ప్రమిదల లో వెలిగిస్తే మంచిది. మన సంప్రదాయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం ఆచరించాల్సిన పద్ధతులు, తినాల్సిన ఆహారం నిర్ణయించడం ద్వారా ఆయా కాలాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలన్న గొప్ప సంకల్పంతో మన పెద్దలు ఈ సాంప్రదాయాల్ని పాటించాలని చెప్పారు. శరత్, హేమంత రుతువుల్లో చలి పెరుగుతుంది కాబట్టి హృదయం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో దీపాలను వెలిగిస్తే వాటి నుంచి వచ్చే కాంతి వాయువుల ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే టపాకాయల్ని కాల్చడం ద్వారా వచ్చే పొగ వాతావరణ కాలుష్య నివారణకు, వర్షాల వల్ల వచ్చే క్రిమి కీటకాలు, దోమల నివారణకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వేదన కలిగించే స్థితికి “నరకం” అని నిర్వచనం, ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చి సంతోష కాంతి సాధన ఈ “దీపావళి పర్వదినం”. ఇంటింటా ఆనందాల పండుగ అయిన దీపావళి అందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ… స్నేహితులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు రచయిత్రి (ఫ్రీ లాన్స్ జర్నలిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap