ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు(90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! ఇది సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద దెబ్బ! నిజంగా విచారకరం, దురదృష్టకరం! ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీ స్థాపించి వేలాది గొప్ప కార్యక్రమాలు నిర్వహించేవారు ! కేంద్ర మంత్రులను కేవలం ఫోన్ ద్వారా ఆహ్వానించే ఏకయిక ఆర్గనైజర్! అటు అమెరికా లో ఇటు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఎందరికో అవార్డులు ఇచ్చి ప్రోత్సహించిన నాగరాజు గారి లేని లోటు ఎన్నటికీ తీరనిది! ఒక సాంస్కృతిక యోధుడ్ని కోల్పోయాం! వారికీ అశ్రు నివాళి.

2004లో నన్ను వారి ఖర్చులతో ఢిల్లీ తీసుకు వెళ్లి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ను, తెలుగు వెలుగు పురస్కారాన్ని అప్పటి కేంద్రమంత్రుల ద్వారా ఇప్పించి సత్కరించి గొప్ప ఆతిధ్యమిచ్చి పంపించారు! అంతకు ముందున్న పరిచయం ఇంకాస్త బలపడి మంచి మిత్రుడు గా కలసి పోయారు! చాలా సార్లు ఢిల్లీ తీసుకెళ్లారు! ఆతిధ్యం ఇవ్వడం లో గొప్ప స్నేహితుడు! గత 20 ఏళ్లుగా వారి కార్యక్రమాలను ప్రమోట్ చేస్తూ వచ్చాను! ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా గారు స్థాపించిన వారధి ఫౌండేషన్ కార్యక్రమాల లోను నాగరాజు గారు నన్ను కలుపుకున్నారు! అనేక ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసే అవకాశం నాకు కల్పించారు! స్నేహానికి విలువనిస్తూ ఎంతో ప్రేమగా పలకరిస్తారు! ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా ఇంకా చేయాలనీ తపించే వారు ! బాలు గారు ఆసుపత్రి లో వున్నప్పుడు వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచంలోని ప్రముఖ తెలుగు సంఘాలు అన్నిటిని కలుపుకుని ప్రార్ధనలు చేయించారు! ఫోన్ లో కరోనాను ఎలా ఎదుర్కోవాలో చెప్పి, చివరకు వారే కరోనా తో కన్నుమూయడం హృదయం భారమై పోయింది! నాకే కాదు, తోటి సాంస్కృతిక నిర్వాహకులు, కల్చరల్ అంబాసిడర్లు, పురస్కారాలు అందుకున్న పారిశ్రామిక వేత్తలు, కళా పోషకులు, సినిమా నటులు, గాయకులూ అందరూ నమ్మలేక పోతున్నారు !

నాగరాజు గారు పుట్టింది 1951 లో, స్వస్థలం కళింగాంధ్ర లోని దత్తివలస గ్రామం. జమీందారీ కుటుంబం. వీరి పూర్తి పేరు నేమాని వెంకట లక్ష్మీ నాగరాజు. విజయనగరం కాలేజీ విద్యార్థి సంఘ నాయకుడిగా తొలి అనుభవం. 1917 లో ఢిల్లీ వెళ్ళి కాస్ట్ అకౌంట్స్ లో ఉన్నత విద్య అభ్యసించాక, అక్కడే ఇఫ్కో లో చేరి అకౌంట్స్ విభాగంలో ఉన్నతాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అదే కంపెనీకి చెందిన ఇఫ్కో టోక్యో ఇన్సూరెన్స్ సంస్థకు ఆర్ధిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

డిల్లీలోని తెలుగువారికి మనోవికాసానికి దోహదం చేసే పంచామృతాల్లాంటి కళలైన సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం, సినిమాలని చవి చూపించాలన్న ఆలోచననతో డిటిఏ మొదట్లో ఢిల్లీలోనే ఏర్పడ్డా, కాలక్రమాన కార్యకలాపాలను పలు ప్రాంతాలకు విస్తరింపజేసింది. ఉత్తమస్తాయి కళాప్రదర్శనలకి దర్పణంగా నిలిచి, సాంస్కృతికరంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. తెలుగు ప్రభుత్వాల గుర్తింపు పొందింది. ఇంట గెలవటమే కాదు, రచ్చ కూడా గెలిచింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంగీత విభావరులని నిర్వహించి అక్కడి సంగీతాభిమానుల్ని ఆకర్షించింది.

1975 నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు: దత్తివలస గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు. 1977 నుంచి ’89 వరకు ఆంధ్రా ఫిల్మ్ సొసైటీ, 1989 నుంచి ఢిల్లీ తెలుగు అకాడమీ.. ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ తెలుగు స్కూల్, ఢిల్లీ భాషా, నృత్య, సంగీత శిక్షణాలయం.. ఇలా పలు సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చారు.
-మహ్మద్ రఫీ

4 thoughts on “ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

  1. వారి మృతి కళారంగానికి తీరని లోటు….ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ…. ఆరాధ్యుల కన్న,
    అద్దేపల్లి లక్ష్మణ్ శాస్త్రి….
    సూపర్ స్టార్ కృష్ణ చిల్డ్రన్ అకాడెమీ(బాలల నాటికలు పరిషత్)తెనాలి

  2. అశ్రునివాళి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సాంస్కృతిక దిగ్గజం నాగరాజు గారు మనమధ్య లేరు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఢిల్లీలో మాదంపతులకు కేంద్ర మంత్రులు ద్వారా విశ్వభారతి పురస్కారాన్ని అందజేశారు.

  3. Chala Vishadakaramaina vaartha.. Inka enni maranalu chudalo…karuna leni corona.. Eppatiki antamoutundo..

  4. ఇది నాకు నమ్మశక్యంగాని దుర్వార్త….
    మంచి కళా పిపాస మిత్రుడు, ఢిల్లీ కళాభిమానులకు అశనిపాతం – దురద్రుష్టం ఆతని ఆత్మ శాంతిని పొందుగాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap