దేవదాసు నవలను తెలుగులోకి చక్రపాణి అనువదించి ఉండకపోతే…. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని అలరించి వుండేదే కాదు. విశ్వజనీనత మూర్తీభవించే ఆవేదన నింపిన ఒక సజీవ పాత్ర దేవదాసు. అక్కినేని నటజీవితాన్ని మలుపు తిప్పిన అపురూప మహత్తర పాత్ర…. దేవదాసు. 26 జూన్ 1953న విడుదలై న దేవదాసు సినిమా 400 రోజులు పైగా ఆడి వజ్రోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం విడుదలై 70 వ పడిలో అడుగిడుతున్న సందర్భంగా ఆ చిత్రంలోని కొన్ని అపూర్వ సంఘటనలను మననం చేసుకుందాం.
దేవదాసు చిత్రనిర్మాత డి.ఎల్. నారాయణ ఇందులో హీరోయిన్ పార్వతి పాత్రకు భానుమతికి మొదట ఆహ్వానం పలికారు. భరణీ స్టూడియోలో డి.ఎల్. నారాయణ గతంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి ఉండడంతో, ఆయన తీసే సినిమాలో నటించడం అసమంజసంగా భావించి భానుమతి ఆపాత్రను తిరస్కరించింది. తర్వాత ఆ పాత్రకు జానకిని బుక్ చేశారు. సముద్రాలగారు ఆమె ఇంటికి వచ్చి ‘’షావుకారు సినిమాలో పాత్రలాగే దేవదాసు చిత్రంలో పార్వతిది సుకుమారమైన వైదిద్యభరిత పాత్ర. పైగా నీకు అద్భుతమైన వాయిస్ కల్చర్ వుంది. అందుకే నిన్ను పార్వతి పాత్రకు బుక్ చేశారు’’ అని చెప్పడం జరిగింది. కాస్ట్యూములు తయారు చేయించారు. పదిరోజులపాటు రిహార్సల్స్ జరిపారు. స్టిల్స్ తీశారు. ‘ఓ దేవదా, చదువూ ఇదేనా, మనవాసీ వదిలేసీ అసలూ దొరల్లే సూటు బూటా’’ అనే పాట రిహార్సల్స్ కూడా జరిగాయి. రేపు షూటింగ్ జరుగుతుంది ఆనగా ఆమెను తొలగిస్తూ ఇంటికి ఉత్తరం పంపారు. అందులో “యువర్ సర్వీసెస్ ఆర్ టెర్మినేటెడ్. యు ఆర్ నాట్ ఇన్ ది మూవీ’’ అంటూ ఇంగ్లిష్ లో సందేశం ఉంది. కారణం చెప్పకుండా తొలగించినందుకు జానకి పదిరోజులపాటు చాలా బాధపడింది. చివరికి డి.ఎల్. నారాయణ దేవదాసు చిత్రానికి ముందు నిర్మించిన ‘శాంతి’ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన సావిత్రిని పార్వతి పాత్రకు ఖరారు చేశారు. సావిత్రికి ఈ పాత్ర ఒక ఛాలెంజ్ గా మారడంతో ఆమె చక్రపాణి నవలని అనేక సార్లు చదివి పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని నటనకు సిద్ధమైంది. సముద్రాల కూర్చిన సంభాషణలు పాత్రల హృదయాంతరాల్లోంచి వచ్చినట్లుంటాయేగాని, నాటకీయమనిపించవు. ఈ చిత్రంలో లీనమై నటించిన సావిత్రి విషాద ఘట్టాల చిత్రీకరణలో కనీసం గ్లిసరిన్ కూడా వాడలేదు. పార్వతి పాత్రను తలచుకుంటూ నటిస్తుంటే ఆమెకు కన్నీళ్లు వాటంతట అవే కారిపోయేవి. షాట్ పూర్తయ్యాక దర్శకునితో సహా అందరూ చాలాసేపు అదే మూడ్ లో వుండిపోయేవారు. సముద్రాల స్క్రిప్ట్ అంత గొప్పగా రూపొందించారు.
ఈ చిత్రం చివర్లో దర్శకుడు ఒక విన్నపాన్ని జోడించారు. ఆ విన్నపం నేపథ్యంలో వినిపిస్తుంది. దేవదాసు లాంటి దిక్కులేని చావు పగవారికైనా వద్దు. మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పర్శ నుదుట సోకాలి. కనికరించి తనకోసం కన్నీరు నించే ఒక్క ముఖమైనా తాను చూడాలి. అంతకంటే పెద్ద కోరిక అనవసరం. ఎప్పుడైనా దేవదాసు వంటి భగ్నజీవులు మీకు కనిపిస్తే వారిని ఏవగించకండి…కనికరించండి సినిమా చూసినవాళ్ళకు ఈ విజ్ఞాపన గుర్తుండిపోతుంది.
సముద్రాల సంభాషణల్లో సాధారణంగా నిడివి ఎక్కువగా వుంటుంది. కానీ దేవదాసు చిత్ర సంభాషణలు కఠిన పదాలు లేకుండా మన వ్యావహారిక భాషలోనే నడుస్తాయి. అంచేత దేవదాసు కథ తెలుగునాటే జరిగిందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. దేవదాసు సంభాషణలు తన సంస్కారానికి అద్దం పడతాయి.
ఈ చిత్రంలోని కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటే…
తాగిన మైకంలోవున్న దేవదాసుని నౌఖరు ధర్మన్న, చంద్రముఖి కలిసి తన ఇంటికి తీసుకొనివస్తారు. అక్కడ దేవదాసు నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం లేవగానే కాఫీ ఇచ్చిన చంద్రముఖితో మొదటిసారి దేవదాసు సుదీర్ఘంగా మాట్లాడుతాడు. “నీ పేరు చిన్నది చేసి అమ్మీ అని పిలుస్తాను” అంటాడు. “రాత్రి నాకు పరిచర్యలు చెయ్యడం గుర్తించాను. ఈ పట్నంలో నువ్వుతప్ప నాకీ సేవ ఎవరు చేస్తారా అనుకున్నాను. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నేను నీకు ఎవరిని అమ్మీ” అంటాడు. “ఇహానికీ పరానికీ మీరే నా దేముడు” అంటుంది చంద్రముఖి. “పార్వతి, నేను ప్రేమించుకున్నాం. దాని వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాం. నన్ను నమ్ముకుంటే నువ్వూ బాధలు పడతావు సుమా” అంటూ చంద్రముఖిని దేవదాసు హెచ్చరిస్తాడు. “ఆ బాధలే నాకు ఆనందం” అని చంద్రముఖి అంటే “ఈ విషయంలో నువ్వు, పార్వతి ఒక్కటే! కాని ఆమెను అందరూ పూజిస్తారు. నిన్ను యేవగిస్తారు. పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకు యేమి శిక్ష విధిస్తాడో తెలియదు గానీ, మళ్లీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మీ” అంటాడు.
పతాక సన్నివేశంలో, దేవదాసు ఆరోగ్యపరిస్థితిని చూడవచ్చిన డాక్టరు, చంద్రముఖితో దేవదాసు ఆట్టే రోజులు బతకడని, అయినవారిని రప్పించడం గానీ, లేదా వారున్న చోటికి వెంటనే పంపమని సలహా ఇస్తాడు. డాక్టరు వెళ్లిపోయిన తరవాత దేవదాసు చంద్రముఖితో “డాక్టరు యేమన్నా”డని ప్రశ్నిస్తాడు. “గాలి మార్పు కావాలి అన్నారు. మీ వూరికి పదండి. నేనూ తోడుగా వస్తాను” అంటుంది చంద్రముఖి. దేవదాసు చంద్రముఖిని అనునయిస్తాడు. “వద్దమ్మీ. అది మనిద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది. నిన్ను హీనంగా చూస్తుంది. ఆ మాట వింటే పార్వతి కుంగిపోతుంది” అంటూ ధర్మన్న తీసుకొనివచ్చిన డబ్బుకట్టను ఆమె చేతుల్లో పెడతాడు. చంద్రముఖి వద్దంటుంది. అప్పుడు “మానవ దేహాలు స్థిరం కావమ్మీ. చివరకు యెటూ కాకుండా పోతావేమో! ఉంచుకో” అంటూ వేదాంతం చెబుతాడు. దేవదాసు ఎంతటి సంస్కారవంతుడో అనే విషయాన్ని ఈ సంఘటనలు గుర్తుచేస్తాయి.
మరో సంఘటనలో, దేవదాసు తన వూరి పొలిమేరలలో వున్న నీలాలరేవు నుండి కొందరు స్త్రీలు మంచినీళ్లు తీసుకొని వస్తుండగా మద్యం మత్తులో “పారూ.. పారూ” అంటూ పార్వతి స్నేహితురాలు మనోరమ వెంట పడతాడు. ఆమె కేక వెయ్యడంతో మనోరమను దేవదాసు గుర్తుపడతాడు. అప్పుడు “నువ్వా చెల్లీ! పొరపడ్డాను. మన్నించు”అంటాడు. ఆ విషయం మనోరమ వుత్తరం ద్వారా పార్వతికి తెలియజేస్తుంది. వెంటనే పార్వతి దేవదాసుని తనతో తీసుకువెళ్లాలని తనవూరికి ప్రయాణం కడుతుంది. అదేసమయంలో మనసు వికటించిన దేవదాసు పట్నం బయలుదేరుతాడు. పార్వతి ప్రయాణించే మేనా, దేవదాసు ప్రయాణించే జట్కా ప్రక్కప్రక్క నుండి వెళ్తాయి. అదే విధి విలాసం అంటే.. అనుకోనిది జరగడం అంటే యెలా వుంటుందో ఈ సన్నివేశంలో దర్శకుడు చూపిస్తాడు. ఈ సన్నివేశం ప్రేక్షకుడిని కంట తడిపెట్టిస్తుంది.
తండ్రి యెదుట పార్వతిని వివాహమాడుతానని ధైర్యంగా చెప్పలేక పట్నం వెళ్లిపోయిన దేవదాసు, మళ్లీ రావులపల్లి వచ్చి పార్వతిని కలిసి ఎలాగైనా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి తరచూ వాళ్లు కలుసుకొనే తోటలోకి వస్తాడు.“నీ కోసమే వచ్చాను పారూ.. అప్పుడు ఇంతదూరం ఆలోచించలేకపోయాను. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మని, నాన్నని పెళ్ళికి ఒప్పిస్తాను” అంటాడు. స్వాతిశయంతో పార్వతి “నీకేనా అమ్మా, నాన్న వున్నది. నాకు లేరా.” అంటుంది. ముసలి జమిందారు భుజంగరావుతో పెళ్ళికి సంకేతమిచ్చిన పార్వతితో “నాకు ఆలోచన తక్కువని, ఆవేశం ఎక్కువని నీకు తెలియదా పారూ” అంటాడు. “ఆ తెలియకేం. చిన్నతనంనుండీ నువ్వంటే భయపడుతూ వచ్చానని బెదిరించడానికి వచ్చావా” అంటుంది పార్వతి. “నేనంటే నీకు భయమే కానీ, మరేమీ లేదా పారూ” అంటాడు దేవదాసు. పార్వతి “లేదు” అని జవాబిస్తూ “అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించానని అపవాదు వేస్తావ్. అంతేగా” అనడంతో తెప్పరిల్లిన దేవదాసు “నేనంత నీచుడినా” అంటూ ఆవేశంలో పొన్నుకర్రతో పార్వతి నుదిటిమీద కొడతాడు. పార్వతి నుదుటి నుంచి రక్తం స్రవిస్తుంది. వెంటనే తన చొక్కా చించి, దగ్గరలో వున్న నీటి గుంటలో ముంచి పార్వతికి కట్టు కడతాడు దేవదాసు. “అబ్బా…ఎప్పటికీ మన చిన్నతనం మరపురాకుండా ఇది గుర్తు” అంటుంది పార్వతి. ఈ సంఘటనలన్నీ దేవదాసు మనస్తత్వానికి అడ్డం పడతాయి.
పెళ్ళయిన పార్వతి పుట్టింటికి వచ్చి దేవదాసు వున్నాడని తెలిసి వారి ఇంటిలోకి అడుగు పెడుతూ వుండగా, మేడ మెట్లు దిగుతూ నౌకరు ధర్మన్న తారసపడి ’’ఎవరది. పార్వతమ్మా. నిన్నుచూసి యెంతకాలమయింది తల్లీ. అంతా బాగున్నారా అమ్మా” అని పలుకరిస్తాడు. దేవదాసు యేంచేస్తున్నాడని పార్వతి అడుగుతుంది. “ఇల్లు, వాకిలీ, తిండీ తిప్పలూ లేవు కదా. రేత్రింబగలూ ఒకటే తాగుడు. పండంటి వళ్ళు పాడైపోయింది. ఈ ఇంటిలో యెవ్వరి మాటా వినడు. ఇక చెప్పినా, వినిపించినా నువ్వు ఒక్కదానివే. అమ్మా…. నువ్వు అడ్డుపడకపోతే బాబుగారు మనకు దక్కడు’’ అంటాడు ధర్మన్న. ‘’నామాట దక్కిస్తే అదృష్టవంతురాలినే. చెప్పిచూస్తాను తాతా” అంటూ దేవదాసు గదిలోకి వెళ్తుంది పార్వతి. ఆమెను చూసిన దేవదాసు నిర్లిప్తంగా “పారూ… నాకు యేమీ పాలుపోవడంలేదు. కానీ, నీవే నా పక్కన వుంటే, ఈ గొడవలన్నీ నీకు అప్పగించి, జీవితం అలా హాయిగా గడిపేవాణ్ణి” అంటాడు దేవదాసు. పార్వతి ఆ మాటలు విని యేడుస్తుంది. “ఏమిటి పారూ ఏడుస్తున్నావా? అయితే నా బాధలేవీ నీతో చెప్పనులే” అంటాడు. “అహోరాత్రులు తాగుతున్న మాట నిజమేనా” అని అడుగుతుంది పార్వతి. అసహనంగా లేచి నిలబడి ‘’ధర్మన్న చెప్పాడా” అంటూ నిజం ఒప్పుకుంటాడు దేవదాసు. “ఆ భయంకర పాన పిశాచానికి దాసులై యెందరో మానప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవదా! ఇకనైనా తాగనని నాకు మాటివ్వు” అంటూ పార్వతి చేయి చాపుతుంది. “సరే నువ్వు నన్ను యెప్పుడూ తలుచుకోనని మాటివ్వు” అంటాడు దేవదాసు. “ఊహూ…. నావల్లకాదు” అంటుంది పార్వతి. ‘’అదే నా సమాధానం” అంటాడు. ‘’కాదు. తలచుకుంటే నువ్వు యేపనైనా చేయగలవ్” అంటుంది పార్వతి. ‘’అలాగా… అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా’’ అంటాడు దేవదాసు. “ఆ”’’ అంటూ పార్వతి తన గుండెమీద చేయి వేసుకుంటుంది. అప్పుడు దేవదాసు “హు… అది ఎంత సాధ్యమో ఇదీ అంతే!” అంటాడు దేవదాసు. ఈ సంభాషణలు ఎంత సున్నితంగా హృదయాన్ని కదిలించేలా వుంటాయో సినిమా చూచినప్పుడు అనిపిస్తుంది.
సినిమా క్లైమాక్సులో దుర్గాపురం రోడ్డులో రైలు దిగి దుర్గాపురం వెళ్ళేందుకు బండి కట్టమంటాడు దేవదాసు.. కానీ యే బండివాడూ రానంటాడు. ఇంకో ఎడ్లబండివాడు (సీతారాం) దేవదాసు పరిస్థితి చూసి “అవసరంగా వెళ్లాలా బాబూ” అని ఎడ్లబండిని సిద్ధం చేస్తాడు. గతుకుల బాటలో బండి వెళ్తుండగా దేవదాసు “ఎంతదూరం వుంటుంది ఊరు” ఆని అడుగుతాడు. “ఆరు కోసులుంటుంది బాబూ’’ అంటాడు బండివాడు. “బండి చేరేసరికి నడిజాము దాటుతుం’’దని చెప్తాడు బండివాడు. అప్పుడే ఆకాశాన మబ్బులు దట్టంగా కమ్ముకొని వర్షం మొదలవుతుంది.. మహాప్రస్థాన పథయాత్ర సాగుతుండగా దేవదాసు ఉధృతంగా దగ్గుతూ రక్తం కక్కుకుంటాడు. బండి దుర్గాపురం చేరుతుంది. కానీ దేవదాసుకు మాట పడిపోతుంది. ఎవరింటికి వెళ్లాలో చెప్పలేకపోతాడు. దేవదాసు గుండె మెల్లగా కొట్టుకుంటూవుంటుంది. జేబులోంచి వందరూపాయల నోటు తీసి బండివాడికి ఇస్తాడు. అతని ప్రాణం యెవరికోసమో కొట్టుకులాడుతోందని గ్రహించి ఆ బండివాడు, వూరి అరుగుమీద గడ్డి పరచి దేవదాసుని ఒక చెట్టు అరుగుమీద పడుకోబెడతాడు. ఆ ప్రదేశం పార్వతి నివసించే బంగాళా ప్రక్కనే వుంటుంది. మాట పడిపోయిన స్థితిలో ఆ అరుగుమీదే దేవదాసు ప్రాణాలు విడుస్తాడు. తమ భవంతిలో పార్వతి దేవుడికి హారతి ఇస్తుంటే దీపం ఆరిపోతుంది. కీడు శంకించిన పార్వతి మేడ దిగివస్తుంది. విషయం తెలుసుకున్న పార్వతి తన పెద్దకుమారుడు, భర్త అడ్డగిస్తున్నా దేవదాసుని చూసేందుకు పరుగెట్టుకుంటూ వస్తూ మూసిన తలుపును ఢీకొని తనుకూడా మరణిస్తుంది. ఇక ఆ చివరి ఘట్టాన్ని వర్ణించేకన్నా…. సినిమాలో చూస్తే ఆ అనుభూతి వేరు!
బి.ఎస్ రంగా చాయాగ్రహణ పనితనం ఈ చిత్రానికి హై లైట్. ఈ చిత్రం లోని తాగుడు దృశ్యాలు 50 రాత్రుళ్లు ఏకబిగిన చిత్రీకరించారు. నాగేశ్వరరావు ఆ షూటింగు జరిగిన 50 రోజుల్లో రాత్రిళ్ళు మీగడ పెరుగుతో భోజనం ఆరగించి నిద్రమత్తులో అరమోడ్పు కన్నులు గోచరించేలా మూడ్ వచ్చేదాకా ఆగి అర్ధరాత్రిళ్ళు తాగుడు సన్నివేశాలలో నటించారు. దాంతో చాలా ముడిఫిలిం వృధా అయ్యింది. కానీ డి.ఎల్. నారాయణ బాధ పడలేదు సరియకదా సన్నివేశాలు బాగా పండాలని మాత్రమే ఆశించారు. మేకప్ మన్ మంగయ్య అక్కినేనిని అద్భుతంగా రూపు దిద్దాడు. చేతులమీద నరాలు, బొమికలు చిక్కినట్టు కనిపించేందుకు చేతివేళ్ళ సందుల్లోకూడా రంగులు అద్దేవాడు. దర్శకుడు రాఘవయ్య సెట్లో సరంజామాని తనే సర్దేవారు. కొన్నిసార్లు అక్కినేనే స్వయంగా ఫిల్ములు మోసుకెళ్లి షూటింగ్ లో అందజేసేవారు. అంతా ఒక బృందంగా పనిచెయ్యడం వల్లే చిత్రం ఆద్యంతం అద్భుతంగా అమరింది. తాగుడు పాటలు పాడేటప్పుడు ఐస్ ముక్కలు నోట్లో పెట్టుకుని ఘంటసాలను పాడమన్నారు దర్శకుడు రాఘవయ్య. దానివల్ల శ్రుతి తప్పిపోయే స్థితి రావడంతో ఆ ప్రయోగం మానుకున్నారు. స్వయంగా నృత్యదర్శకుడు కావడంతో ఇందులో పాటల చిత్రీకరణ బాగా కుదిరింది. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. మదురై లో ఈ చిత్రం 65 వారాలు ఆడి రికార్డు సృష్టించింది.
ఇక సహాయ పాత్రల విషయానికొస్తే భగవాన్ (పేకేటి) దేవదాసుకి ధైర్యం నూరిపోస్తాడు. కలత చెందిన మిత్రునికి ఆనందాన్ని పంచాలని మాత్రమే చంద్రముఖి వద్దకు తీసుకు వెళ్తాడు. దేవదాసుకు నిద్ర రావడానికి బ్రాంది అందిస్తాడు. అనూహ్యంగా అది దేవదాసుకి అలవాటుగా మారుతుంది. అయితే చివర్లో భగవాన్ తన తప్పు తెలుసుకొని చింతిస్తాడు. అతనిలో పరివర్తన కలుగుతుంది. నౌకరు ధర్మన్నపాత్ర నమ్మినబంటు వంటిది. నత్తి మాటలతో దొరస్వామి పార్వతి తండ్రిగా ప్రత్యేకత చాటారు. తొలితరం నటి సురభి కమలాబాయి సనాతన సంప్రదాయాలను గౌరవించే బామ్మగా రక్తి కట్టించింది. ఒక క్లాస్ సినిమా మాస్ స్థాయిని కూడా ఛేదించి 18 కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవడం ఒక అద్భుతమే!
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)