హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది!
కవిత్వం మూగవోయింది !
‘అమ్మ చెట్టు’ కూలిపోయింది!
‘గాలి రంగు’ మాయమైనది!
రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది!
నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు తుది శ్వాస విడిచారు. కవిత్వం నిశ్శబ్దమై పోయింది!
ఆయన అసలు పేరు ఖాజాహుస్సేన్ ! వయసు 71 సంవత్సరాలు ! ఉదయం పత్రిక లో వారు రాసిన కార్టూన్ రన్నింగ్ కామెంట్రీ అప్పటికి ఇప్పటికి సంచలనమే! నేను ఆంధ్రజ్యోతి, వార్త లో రాసే రాతలు ఆయనకు ఇష్టం! నాకు 1995 నుంచి పరిచయం! కథలు కవిత్వం రాయడం మానేశాననీ అప్పుడప్పుడు సుతిమెత్తగా కోప్పడే వారు! బ్రాహ్మణుల మధ్య తెలుగు సంస్కృతీ ని ప్రోత్సహిస్తూ బాగా రాణిస్తున్నావ్ అని మెచ్చుకునే వారు! హెచ్ఎం టీవీ లో వారితో కలసి సంవత్సరం పాటు పని చేసే అదృష్టం నాకు లభించింది! నేను సాంస్కృతిక మండలి లో చేరాక పట్టుబట్టి అధికారులను ఒప్పించి ప్రతిష్టాత్మక హంస అవార్డు వచ్చేలా చేశాను! రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఉగాది పురస్కారం ఇస్తున్నట్లు చెప్పి ఆహ్వానించమని నన్ను దేవిప్రియ గారి ఇంటికి పంపించారు! అప్పుడు వారి పుస్తకాలు సంతకం చేసి మరీ ఇచ్చారు! ఎప్పుడూ రాయమని ప్రోత్సహించే వారు!
2017లో వారు రాసిన గాలి రంగు కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది! అయన పైగంబర కవిగా ప్రసిద్ధులు! దేనికి చలించరు! ఉప్పొంగి పోవడం కుమిలి పోవడం నేను చూడలేదు! సోదరా, మిత్రమా అంటూ వయసు తారతమ్యం, ఏమాత్రం దర్పం లేకుండా పలకరిస్తారు! ఆప్యాయంగా మాట్లాడతారు!
వారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కొద్ది కాలం క్రితం కాలం చెందడం వారు తట్టుకోలేక పోయారు! షుగర్ కూడా బాగా ఇబ్బంది పెట్టింది! ఒంటరి తనం మరింతగా మెలిపెట్టింది! అమ్మాయి, అబ్బాయి వున్న వారి వారి జీవితాల్లో బిజీ! ఈ మధ్య షుగర్ ఎక్కువై గాంగ్రీన్ గా మారి ఎడమ కాలు తొడ భాగం వరకు తీసేసినట్లు తెలిసింది! వారు ముస్లిం అయినా తన చివరి కోరిక… ఎలెక్ట్రికల్ దహన వాటిక లో అంత్య క్రియలు నిర్వహించి, తన అస్థికలను కృష్ణా జలాల్లో కలపమని కోరారని తెలిసింది!
ఏది ఏమయినా గుంటూరు జిల్లా నుంచి ప్రస్థానం ప్రారంభించి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని ఒక కవితా సామ్రాజ్యానికి ఒక పాత్రికేయ రంగానికి తనదయిన శాశ్వత ముద్ర వేసుకుని వెళ్లిపోయారు! తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అయన చిరస్మరణీయుడే! ఎందుకంటే నేటి దేవిప్రియ నాటి శ్రీ శ్రీ, ఆరుద్ర లాంటి కవి వరేణ్యులు! వారికి అశ్రు నివాళి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి!
-మహ్మద్ రఫీ
నన్ను కాలమిస్టును చేసింది ఆయనే…!
వెళ్ళిపోయాడు ..దేవిప్రియ ఈ ఉదయం 7గంటలకు పై లోకానికి తరలి పోయాడు. తన కవితా రాజ్యలక్ష్మి సన్నిధికి చేరుకున్నాడు. గుంటూరు వడ్డెంపూడి హనుమంతరావు గారి ప్రజావాహిని పత్రిక కుర్ర ఎడిటర్ గా హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి పరిచయం. మీ సుధామను ఒక పత్రికా కాలమిస్టుగా చేసింది తానే ! ప్రజావాహిని లో మొదలుపెట్టి .. తాను ఉదయం లో చేసినా, హైదరాబాద్ మిర్రర్ లో చేసినా నా చేత కాలమ్ ఎదో ఒకటి నడిపింపచేసింది తానే ! “నాకు నచ్చిన బెస్టు కాలమిస్టు ” అని నా సం.సా.రా.లు గ్రంథానికి ముందుమాట రాసాడు. దానికే తెలుగు యూనివర్సిటీ సాహిత్యపురస్కారం వచ్చింది. ఎంత గొప్ప కవి.!! శివారెడ్డి, దేవిప్రియలతో కలసి ఎన్ని సాహిత్య సమావేశాలకు వెళ్ళామో లెక్కేలేదు. గుండె నిండుగా వుండిపోయే ఆత్మీయునికి కన్నీటి నివాళులు.
కవి దేవీప్రియ ఇహలోక యాత్ర చాలించారు
బెజవాడ లో వారిని నాలుగైదు సార్లు
కలుసుకున్నా…
ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం
వచ్చినప్పుడు
ఆయనను ఇంటర్వూ
చేశాను..
తెలుగులో అనేక సాహిత్య
ప్రక్రియలు ఉన్నాయి కదా
కవిత్వం ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగా
కవిత్వం కదిలిస్తుంది కదా
అన్నారు…
ఇది చాలు వారి అంతరంగం
తెలుసు కోవడానికి..
ఈనాడు లో దేవిప్రియ గారి కవితలు ఆలోచింప చేసేవి. గొప్ప కవి.వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను
ఒక ఆత్మీయుడు సెలవ్ అంటూ వెళ్ళిపోయాడు…
అయిదు దశాబ్దాలుగా దేవీప్రియగా తెలుగు సాహిత్య లోకానికి ఆత్మీయమైన మిత్రుడు షేక్ ఖాజా హుస్సేన్ ఈ ఉదయం మనల్ని వీడి వెళ్ళిపోయాడు.తెలుగు ఉర్దూ ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న దేవి ఎన్నో కవితా సంపుటాలు వెలువరించాడు. అభ్యుదయ సాహిత్య ప్రపంచం తమ వాడైనా ఒక మంచి మిత్రుణ్ణి ఈ క్లిష్ట సమయంలో కోల్పోయింది.
అమ్మ చెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాను తుమ్మెద, గాలి రంగు, గంధకుటి, గరీబు గీతాలు .. ఎన్నో కవితా సంపుటాలు వెలువరించాడు. చాలాకాలం జర్నలిస్టుగా పనిచేసిన దేవి రన్నింగ్ కామెంటరీ పేరిట మూడు సంపుటాల పొలిటికల్ కామెంటరీ గీతాలని వెలువరించాడు. ఎమర్జెన్సీ టైం లో శ్రీశ్రీ ఆత్మ చరిత్ర’ అనంతం’ ను తను నిర్వహించే ప్రజాతంత్ర పత్రికలో ప్రచురించాడు.
దేవీప్రియ రచనల సర్వస్వం(రన్నింగ్ కామెంటరీ మినహా) ని మిత్రుడు ఖాదర్ మొహిద్దీన్ వెలువరించే పనిలో ఉన్నాడు. అది దేవీకి మిత్రులు సమర్పించే చివరి వీడ్కోలు కానుక.
దేవీప్రియ పుట్టింది గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం. చివరి శ్వాస మహానగరం హైదెరాబాద్.
ప్రియమైన మిత్రమా దేవీ! మిగిలింది నీ జ్ఞాపకాలే. కన్నీటి నివాళి. దేవీ కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి.
ఏమిటీ 2020 బకాసురుడిలా తయారైంది? రోజుకో కవిని పొట్టన పెట్టుకుంటున్నది!
అస్త్ర సన్యాసం చేసి ఇంక జీవితాన్ని చాలించటం కోసమే బతికే వాళ్లు పోతే సగౌరవంగా స్మరించుకొని ఊరుకోవచ్చు. కానీ చివరి వరకు ఎంతో యాక్టీవ్ గా సృజన చేస్తున్న దేవీప్రియ వంటి వారి నిష్క్రమణ బాధాకరం. ఆయన వినోదినిగారితో “కాలి మీద పుండు చిన్న అగ్నిపర్వతం లాగా ఉందమ్మా” అన్నారట. బాధ నుండి కవిత్వం పుట్టడం అంటే అదే కదా!
నాకు ఎవరితో అయినా కొంత అభిమాన పూర్వక పరిచయాలే తప్ప సాన్నిహిత్యం వుండనందున ఆయనతోనూ దగ్గరతనం లేదు. కాకుంటే ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన మాటల్లో ఆప్యాయత తెలిసేది. సరళమైన పదాల్లో సాంద్రవంతమైన భావనా ప్రకంపనలు పుట్టించటం ఆయనకి తెలిసినట్లు మరొకరికి తెలియదేమో. కవిత్వంలో బ్రెవిటీ ఎంతలా మెయింటెయిన్ చేస్తారంటే ఏదో తూచి తూచి పదాలేసినట్లుంటుంది ఆయన కవిత్వం. ప్రజాపక్షపాతి అయిన ఆయన ఒక నిజమైన కవి. నాకు చాలా ఇష్టం.
ఆయనకి నా నివాళి.