అన్నమయ్య పద కోకిల, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. గతంలోనూ ఆమె టిటిడి అస్థాన సంగీత గాయనిగా, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ సలహాదారులుగా సేవలు అందించారు.
గత నాలుగు దశాబ్దాలుగా అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిలో ఆమె తరిస్తున్నారు! అన్నమాచార్య కీర్తనలను ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత శోభారాజు ది! గతంలో పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులుగా చేశారు. భారతరత్న లత మంగేష్కర్ గతంలో ఆస్థాన గాయనిగా వున్నారు. తిరుపతిలో సంగీత కళాశాలలో సంగీత కోర్సు చేసి టీటీడీ ఫెలోషిప్ పొందిన శోభారాజు అక్కడే ఆస్థాన గాయనిగా, ఇప్పుడు ఆస్థాన విద్వాంసురాలిగా నియమించబడటం గొప్ప విశేషం! ఇది ఆ స్వామి వారి కృప కటాక్షమే అంటారు శోభారాజు.
శోభారాజు అన్నమాచార్య భావనావాహిని సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. అన్నమయ్య కీర్తనలను వెలుగులోకి తెచ్చారు. ఆమె కృషికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీలో కొంత స్థలం కేటాయించారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించి విశేష సేవలు అందిస్తున్నారు పద్మశ్రీ శోభారాజు.
సంగీత ప్రస్థానం: శోభారాజు 30 నవంబర్ 1957 లో, చిత్తూరు జిల్లా వాయల్పాడు లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీ ఆర్.జి. నారాయణ రాజు. ఆమెకు తొలి సంగీత గురువు ఆమె తల్లిగారే. ఆమె తండ్రి ఆర్.జి. నారాయణరాజు టిటిడి ప్రధాన ఆలయ అధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. పాఠశాల స్థాయి నుంచే అన్నమయ్య కీర్తనలు పాడటం ప్రారంభించిన ఆమె, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందారు. ఇంకా శ్రీ పుల్లయ్య, శ్రీ సుబ్బన్న, శ్రీ శేషగిరి రావు, శ్రీ పాకాల మునిరత్నం వంటి ప్రముఖుల వద్ద కూడా శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాల నుండి సంగీతం ప్రధానాంశంగా బి.ఏ. (B.A. in Music) పట్టా పొందారు. సంగీత రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను ‘గౌరవ డాక్టరేట్’ తో సత్కరించింది. ఆమె స్వరం ఎంతో మధురం. సినిమా అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ కీర్తనల ప్రాచుర్యానికే జీవితం అంకితం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో లీనమయ్యారు.
అవార్డులు: 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కళలు, భక్తి సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2010లో ఆమెను అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాస్ తెలుగు అకాడమీ వారి ‘ఉగాది పురస్కారం’, తానా (TANA) వారి పురస్కారం వంటి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.
స్వామి వారికి చేస్తున్న సేవను గుర్తించి 1978లోనే టీటీడీ ఆమెకు స్కాలర్ షిప్ ప్రకటించింది! పలు మార్లు ఆస్థాన గాయనిగా నియమించి గుర్తింపు ఇచ్చింది! అన్నమాచార్య ప్రాజెక్ట్ గౌరవ సలహాదారులుగా నియమించింది. మళ్ళీ ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు గత వారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. అభినందనలు శోభారాజు గారు.
–కళాసాగర్
