దైవారాధక నటుడు ‘ధూళిపాళ’

(ఏప్రిల్ 13 న ధూళిపాళ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

“వంచనతో మంచిగా నటించి, ద్యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి, పాచికలాడించి, సర్వమూ హరించి, ఆచెనటి ద్రౌపదిని నీ కన్నులముందు నిండుకొలువులో, ఎల్లరూ గొల్లున నవ్వునటుల, దాని దురంకార మదమణుగు నటుల, వలువలూడదీసి, ప్రాణముతోనున్నను, చచ్చిన రీతిగా నిశ్చేష్టితగా నిలిపి… ఆహా నాటి పరాభావాగ్ని మరచిపోని, మా మామ శకుని చేసిన ప్రతీకారమిదా అని పదుగురూ సెహబాష్ అనునటుల, భారతేతిహాసమున నా చరిత్ర చిరస్థాయిగా, సువర్ణాక్షరములతో చిత్రింపబడునటుల పగతీర్చకపోతే, నేను గాంధార రాకుమారుడనే కాను… నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టినవాడనేగాదు” అని సుయోధనుడు, అతని తమ్ముల సమక్షంలో భీషణ ప్రతిజ్ఞ చేసే సమయంలో ఈ విలక్షణ నటుడు ఏకబిగిన పలికే సంభాషణలు, హావభావాలు, కళ్ళలో చూపే కసి చూసితీరవలసిందే. అలాగే “తండ్రీ మీ ఆజ్ఞ. ఇదే నా ప్రతిజ్ఞ. బ్రతిమాలిన శిలభత్యముగా మెసలిన ఈ ప్రతి అన్నపు మెతుకు ఒక్కొక్క విషగుళికయై నా నవనాడులలో ప్రవహించు రక్తమంతయు విరిగి, విషపూరితం కావించి, సహోదరి సంస్థానమన్న మమతా పాశమును తెంచి, తాత్కాలిక విజయ సూచిక మాయోపాయ సంఘటిత పరస్పర విశ్లేష భావ వ్యూహ రచనా సమర్ధమై, నీరంత కపటయోచన తరంగాలతో మతికి మత్తెక్కించి, అయినవారిని కానీయక, ఆప్యాయతతో కలసి మెలసి మననీయక ఒకటిగా కలియనీయక, కక్షలు రగిలించి, మనసులు మండించి, నా ప్రతీకార జ్వాలలతో ఈ కురువంశమంతయు మాడి మసై, నామరూపాలు లేకుండునట్లు చేయకపోతే… నేను గాంధార రాకుమారుడనే కాను..” అనే మరో సందర్భపు డైలాగులు అంత కఠినంగాను, ఖచ్చితంగానూ పలికించిన ఆ నేర్పరి ప్రముఖ రంగస్థల నటుడు, తదనంతరం తెలుగు సినిమాల్లో విలక్షణమైన నటన ప్రదర్శించిన ధూళిపాళ సీతారామ శాస్త్రి. మయసభలో పాంచాలి పరిహసించిందని ఆక్రోశంతో రారాజు ప్రతీకారం చేయాలని నిర్ణయిస్తే శకుని అడ్డుపడి అది తరుణం కాదని, మార్గం కాదని, మంచిగా తన పాచికలతో వంచించి, పరిహసించిన పాంచాలిని నిండుసభలో వలువలూడ్పించి వివస్త్రగా నిలిపి పరాభవిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇటువంటి భారత భాగవత ఘట్టాలను కూర్చి 1966లో ఎన్.టి. రామారావు ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ పేరుతో చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని సాధించారు. కురుసార్వభౌముడికి కుటిల నీతులు బోధించిన శకుని పాత్ర పోషించింది ప్రఖ్యాత రంగస్థల నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. అంతేకాదు అదే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ చిత్రంలో రామారావుకు సుయోధనుడి పాత్రలో డైలాగులు ఎలా వినూత్నంగా చెప్పాలో శిక్షణ ఇచ్చి ఆపాత్రలో రామారావును మెప్పింపజేసిన ఘనత కూడా ఆయనదే. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో శకుని పాత్ర పోషిస్తూ వంకర చూపులతో, తల ప్రక్కకు వంచి నర్మగర్భంగా మాట్లాడుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ధూళిపాళ ఇంటిపేరుతోనే ప్రసిద్ధుడు. రంగస్థల రారాజుగా జేజేలు అందుకుంటూ సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తనదైన శైలిలో డైలాగులు చెబుతూ రాణించిన ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్ 13 న జరుగుతున్న సందర్భంలో వారిని గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం…

పరిచయ భాగ్యం…

ధూళిపాళ జన్మించింది సెప్టెంబరు 24,1921 న గురజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో. వారి తల్లిదండ్రులు రత్నమ్మ, శంకరయ్య. దాచేపల్లి గ్రామంలోని వారి ఇంటి వెనక నాగులేరు ప్రవహిస్తూ వుండేది. పండ్లతోటలు, తమలపాకు తోటలతో ఆ గ్రామం కళకళలాడుతూ వుండేది. తండ్రి వేదాధ్యయనం చేసినా, యాభై ఎకరాల పొలంతో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకొని రైతుగా స్థిరపడ్డారు. శాస్త్రి కి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు తోబుట్టువులు. అంత పొలం వున్నా, మెట్టప్రాంతం కావడంతో వచ్చే ఫలసాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది. శాస్త్రి ప్రాధమిక విద్య దాచేపల్లిలోనే పూర్తి చేశారు. తరవాత వేదాధ్యయనం కోసం బాపట్ల వెళ్లి శాస్త్ర పాఠాలు అభ్యసించారు. అనంతరం గురజాల తిరిగివచ్చి ఒక న్యాయవాది వద్ద గుమాస్తాగా చేరారు. తను కూడా వకీలుగా రాణించాలనే ఆశవున్నా అది నెరవేరలేదు. గుమాస్తా గిరి వెలగబెడుతూ ఇంగ్లీషు భాషమీద పట్టు సాధించారు. సంగీతం మీద, నాటక కళల మీద ధూళిపాళకు మక్కువ ఉండడంతో గుంటూరు పట్టణానికి దగ్గరలో వున్న ఒక గ్రామంలో 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శన జరుగుతూ వుంటే అక్కడకు వెళ్లి అందులో సత్యభామ చెలికత్తె (నళిని)వేషం ధరించారు. అప్పుడు ధూళిపాళకు పదిహేనేళ్ళు. తరవాత వరసగా ధూళిపాళకు ఆడవేషాలు ధరించే పాత్రలు చాలా వచ్చాయి. అలా మూడేళ్ళవరకు ఆడపాత్రలే పోషిస్తూ వచ్చారు. వాటిలో చింతామణి నాటకంలో రాధ, బొబ్బిలియుద్ధం నాటకంలో మల్లమాంబ పాత్రలు ధూళిపాళ కు మంచి పేరుతెచ్చి పెట్టాయి. ఒకసారి ప్రముఖ రంగస్థల నటులు మాధవపెద్ది వెంకట్రామయ్య ధూళిపాళ నటన చూసి, ఆడవేషాలకు స్వస్తిపలకమని సలహా ఇచ్చారు. దాంతో ధూళిపాళ ఆయనవద్ద శిష్యరికం చేశారు. వెంకట్రామయ్య గారి శిక్షణలో దుర్యోధన పాత్ర పోషించడంలో మెళకువలు నేర్చుకొని, అఖిలాంధ్ర పాండవోద్యోగ నాటక పోటీలలో ప్రధమ బహుమతి పొందారు. తరవాత ఆంధ్రప్రదేశ్ నాటక కళాపరిషత్ నిర్వహించిన ఏకపాత్రాభినయ పోటీల్లో మయసభ సన్నివేశంలో దుర్యోధనుడిగా నటించి ప్రధమ బహుమతి స్వీకరించారు. ఆ తరవాత బ్రహ్మనాయుడు, యుగంధరుడు, బిల్వమంగళుడు, రంగరాయుడు పాత్రలు పోషించి మంచి రంగస్థల నటుడుగా పేరు తెచ్చుకున్నారు. గుంటూరులో ‘స్టార్ థియేటర్స్’ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి అనేక పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఆరోజుల్లో కురుక్షేత్రం నాటక ప్రదర్శన జరిగితే మొదటి కృష్ణుడుగా ఈలపాట రఘురామయ్య, రెండవ కృష్ణుడుగా పీసపాటి నరసింహమూర్తి, మూడవ కృష్ణుడుగా షణ్ముఖి ఆంజనేయరాజు నటిస్తే దుర్యోధన పాత్రను ధూళిపాళ పోషించేవారు.

రోషనార కోసం మద్రాసులో…

1959లో మద్రాసు నగరంలోని పచ్చియప్ప కళాశాలలో ‘రోషనార’ నాటకం ప్రదర్శించారు. అందులో రామసింహుడు గా ధూళిపాళ నటించారు. ఎ.వి. సుబ్బారావు అందులో శివాజీ పాత్ర పోషించారు. ఆ నాటకానికి ప్రసిద్ధ దర్శకనిర్మాత బి.ఎ. సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, జి. వరలక్ష్మి వంటి ఉద్దండులు విచ్చేసి ధూళిపాళ సంభాషణలు పలికే తీరును నిశితంగా గమనించారు. ప్రేక్షకులనుండి ధూళిపాళ సంభాషణలకు కరతాళ ధ్వనులు మ్రోగడం అతనికి లాభించింది. దాంతో ధూళిపాళ సినిమారంగ ప్రవేశానికి దారులు తెరచుకున్నాయి. బి.ఎ. సుబ్బారావు సినిమాలో నటించే అవకాశం కలిపిస్తానని మాట ఇచ్చారు. అయితే ధూళిపాళ కు నాటకాల మీద వున్న మోజు సినిమాలమీద లేదు. ఆయన పెద్దగా సినిమాలు చూసిందీలేదు. ఒకరోజు మద్రాసుకు రమ్మని బి.ఎ.ఎస్ ప్రొడక్షన్స్ అధిపతి బి.ఎ. సుబ్బారావు వద్దనుంచి ధూళిపాళ కు వుత్తరం వచ్చింది. ఆయన పెద్దన్నయ్య ప్రోద్బలంతో ధూళిపాళ తెనాలి వెళ్లి చెన్నై రైలెక్కారు. బి.ఎ. సుబ్బారావు ‘భీష్మ’ (1962) చిత్రాన్ని నిర్మిస్తూ అందులో దుర్యోధనుడి పాత్రను ధూళిపాళ కు ఇచ్చారు. తొలిరోజు షూటింగులో భీష్ముణ్ణి సర్వసైన్యాధ్యక్షునిగా దుర్యోధనుడు ప్రకటించే సన్నివేశం తీస్తున్నారు. ఎదురుగా భీష్ముని వేషంలో వున్నా నటరత్న ఎన్.టి. రామారావుకు దర్శకనిర్మాత సుబ్బారావు పరిచయం చేయగా రామారావు ధూళిపాళను మందహాసంతో స్వాగతించారు. తాపీ ధర్మారావు రాయగా ధూళిపాళ చెప్పిన డైలాగు తొలిషాట్ లోనే ఒకే అయింది. అలా రామారావుతో కలిగిన పరిచయం స్నేహంగా చిగురించి చిత్రసీమను వదిలేదాకా కొనసాగింది. ‘భీష్మ’చిత్రం విడుదలై ఘనవిజయం సాధించడంతో ధూళిపాళ కు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి.

With NTR

శ్రీక్రిష్ణ పాండవీయం తో పైపైకి…

నటుడనేవాడు తనని తాను మరచిపోకుండా తాత్కాలికోద్రేకంలో, సృజనాత్మక శక్తి కలిగినప్పుడు మాత్రమే తన భావ ప్రకటన ద్వారా రసోత్పత్తిని కలిగించగలుగుతాడు అనే సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటించినవారు ధూళిపాళ. అందుకు ప్రేరణ 1966లో రామకృష్ణ ఎన్.టి.ఆర్ కంబైన్స్ పతాకం మీద రామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ చిత్రంలో ధూళిపాళ నటన. ఈ చిత్రం ద్వారా భిన్న ప్రవృత్తులు గల శ్రీకృష్ణ, సుయోధన పాత్రలను తనే ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు రామారావు. భారత, భాగవత కథలను జల్లెడపట్టి, మరే సినిమాలోను చూపించని విధంగా శకుని జీవిత ఘట్టాలను ఇందులో పొందుపరచారు. ఇక శకుని పాత్ర ఎవరు ధరిస్తారా అనే మీమాంసకు తెరదించుతూ ఆ అవకాశాన్ని రామారావు ధూళిపాళకు ఇచ్చారు. అది ద్విభాషా చిత్రం కావడంతో తెలుగు, తమిళ వర్షన్లలో కూడా ధూళిపాళనే ఆపాత్ర పోషించాల్సిందని సూచించారు. అంతకుముందు శకుని పాత్రను సియ్యస్సార్ ఆంజనేయులు, ముదిగొండ లింగమూర్తి, నెల్లూరి నగరాజరావు పోషించి మెప్పించి వున్నారు. ఆపాత్రను ధూళిపాళ చాలెంజ్ గా తీసుకొని వాచకంలోనూ, అభినయంలోను భిన్న ప్రవృత్తిని కనపరుస్తూ సాధన చేశారు. సినిమాలో శకుని పాత్ర బాగా పండింది. సినిమా సూపర్ హిట్ కావడంతో ధూళిపాళ సినీ ‘శకుని మామ’ అయిపోయారు. తరవాత ‘బాలభారతం’ (1972), ‘దానవీరశూర కర్ణ’ (1977) సినిమాల్లో శకుని పాత్ర ధూళిపాళనే వరించింది. ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలో గయుడుగా, నర్తనశాలలో దుర్యోధనుడుగా, బొబ్బిలియుద్ధంలో నరస రాయలుగా, వీరాభిమన్యులో ధర్మరాజుగా, సీతాకల్యాణంలో వశిష్టుడుగా, మరికొన్ని సినిమాల్లో రావణాసురుడు, మైరావనుడుగా ధూళిపాళ నటించి మెప్పించారు. ధూళిపాళ బయట ఎక్కడైనా కనపడితే ‘శకుని మామ’ అని పిలిచేవారు. అలా ధూళిపాళ రెండు దశాబ్దాలపాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తూ వచ్చారు. సాంఘిక చిత్రాల్లో అటు దుష్టపాత్రలు, ఇటు సాత్విక పాత్రలు పోషించి మెప్పించారు. బాంధవ్యాలు, ఆత్మీయులు, బాలరాజు కథ, రెండు కుటుంబాల కథ, కలక్టర్ జానకి, మంచిమనుషులు, గుణవంతుడు, మహామంత్రి తిమ్మరుసు, కథానాయకుడు, ఆత్మగౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి 300 సినిమాల్లో ధూళిపాళ నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ వారు ధూళిపాళను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. తెలుగు యూనివర్సిటీ వారు ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాంధవ్యాలు చిత్రంలో నటనకు ధూళిపాళ కు నంది బహుమతి లభించింది. తమిళ పత్రికలు కూడా ధూళిపాళను ‘నడిప్పిళ్ పులి నడత్తల్ పశువు’ అంటూ కీర్తించాయి. అంటే ‘నటనలో పులి నడతలో గోవు’ అని అర్ధం. నిర్మాతల కోరికమీద ధూళిపాళ చివరిసారి మురారి, చూడాలని వుంది సినిమాల్లో నటించారు. ధూళిపాళ కు చిన్నతనంలోనే వరలక్ష్మమ్మ తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు వున్నారు.

సత్ప్రవర్తన తోడుగా…

నాటకాలు వేసేవాళ్ళు చెడిపోతార్రా అని ధూళిపాళను వారి తండ్రి హెచ్చరిస్తూ వుండేవారు. కారణం నాటకాల్లో వేషాలు వేసేవారు అధికశాతం వ్యసనాలకు బానిసలు కావడమే. తండ్రి చేసిన హెచ్చరికలు ధూళిపాళకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉండేవి. ఆ హెచ్చరికలను ధూళిపాళ జీవితాంతం గుర్తుపెట్టుకొనే మసలారు. మద్రాసులో షూటింగు జరిగితే ఇంటినుంచే భోజనం క్యారేజి వచ్చేది. అవుట్ డోర్ షూటింగుల్లో తప్ప నిర్మాతలు తెప్పించిన భోజనం ఆరగించిన రోజులు ధూళిపాళ చరిత్రలో లేవు. నిత్యకర్మ, ధూపదీప నైవేద్యాలు ధూళిపాళకు క్రమశిక్షణ నేర్పాయి. ప్రతియేటా సతీసమేతంగా వారణాసికి వెళ్లి రెండుమూడు నెలలపాటు అక్కడేవుండి కాశీనాథుని పూజించేవారు. అక్కడ నవగ్రహ ఆలయం లేకుండడంతో ఆలయ నిర్మాణం చేయాలని ప్రయత్నించి అనారోగ్య కారణాల వలన ఆ ప్రయత్నాన్ని విరమించారు. గుంటూరులో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించే అవకాశాలను వదలుకొని, మద్రాసులో వున్న ఆస్తుల్ని అమ్ముకొని గుంటూరు చేరి అత్యంత దీక్షతో మారుతీ నగర్ లో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. దాంతో ధూళిపాళ మనసు ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళింది. తను నిర్మించిన ఆలయాన్ని కంచి కామకోటి పీఠానికి సమర్పించారు. మానవజన్మ విశిష్టతను, మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకొని తరించాలని భావించి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ స్వాముల చేతులమీదుగా సన్యాసం స్వీకరించారు. తనపేరును ‘మారుతీ సేవేంద్ర సరస్వతి’ గా మార్చుకున్నారు. రామాయణం, సుందరకాండ గ్రంధాలను తెలుగులో రాసి ప్రచురించారు. ఒక ట్రస్టును ఏర్పాటుచేసి తద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూవచ్చారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి సుందరకాండను పారాయణంచేసి భక్తులను ఆశీర్వదించే వారు. గుంటూరులో ఒక కళావేదిక నిర్మించాలనే సత్సంకల్పంతో మూడుతరాల నటులతో నాటక ప్రదర్శన ఏర్పాటుచేసి నిధిని ప్రోగుచేసి కళాసేవకు తోడ్పడ్డారు. ఆ రంగస్థలం పైనే రెండులక్షల నిధి సమకూరడం ధూళిపాళ మీద ప్రజలకు వుండే గౌరవాన్ని సూచిస్తుంది. మానవశక్తిని బలీయమైన అతీంద్రియ శక్తి ఏదో నడిపిస్తుందని ధూళిపాళ నమ్మకం. కొంతకాలం ఊపిరితిత్తుల వ్యాధితో ధూళిపాళ బాధపడుతూ ఏప్రిల్ 13, 2007 న కాలంచేశారు. ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లేందుకు తన శేషజీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ.

శకునిగా అసాధారణ డైలాగులు, నటనా కౌసల్యం…

సుయోధనునితో శకుని….“అని గట్టిగా అనరాదు…వేరొకరు వినరాదు. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రిలోకం. ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు. పోయినచో స్వజనులమీది సమాదరణతో వచ్చినాడన్న మంచిపేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల… కురుసార్వభౌముడు మాననీయుడూ, మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో. ఆపైన….కొంచెపు వంచన పనులన్నిటికీ అయినవాణ్ణి, అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా”.

మరొక సన్నివేశంలో… “ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. కనుక హితపురోహిత ధృతవాక్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్యకళా వినోద మనోహరంబగు పరివారంబుతో, చతురంగ బలసమేతులై, శతసోదర సమన్వితులై శ్రీశ్రీశ్రీ గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే ….రాజసూయాన్ని సందర్శించ వలసిందే”.

ఈ డైలాగు చెబుతూ రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడి ‘పితుహూ’ అని అరుస్తూ, కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుతూ (ఇప్పుడు పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చేసింది అదే), ఎడమ కనుబొమను విల్లులా వంచుతూ కనీ కనిపించని ప్రతీకారేచ్చతో మిళితమైన క్రూరమైన నవ్వుతో కనిపిస్తాడు శకుని వేషంలో ధూళిపాళ. ఆయనదో అద్భుత కళ!

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “దైవారాధక నటుడు ‘ధూళిపాళ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap