“వాడియడుకొక్కు” అనే తమిళ మూల హైకూ కవితల పుస్తకం, ప్రసిద్ధ తమిళ కవి అబ్దుల్ రెహ్మాన్ సంస్మరణ కవితల పోటీలో 8 వేల పైచిలుకు హైకూ కవితలు వస్తే, మూడు దశలలో వడపోత తర్వాత 55 మేలి కవితలను పుస్తకంగా తెచ్చారు దర్శకుడు లింగుస్వామి. ఈ సంకలనాన్ని చదివిన గిడ్డకింద మాణిక్యం వాటిని తెలుగులోకి అనువాదము అనిపించని తన ఇంటి భాషలోకి అనువదించాడు, చిత్రకారుడు సంపాదకుడు అయిన వడియప్పన్ సహకారంతో. జీవన తాత్వికతకు సామాజిక వాస్తవికతకు అద్దం పట్టే ఇందులోని 55 హైకూలలో ఒక్కొక్క కవిది ఒక్కొక్క దృక్పథం. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒకేలా కుదురుగా ఉండవు. ఎవరి అనుభవాలు వారివి. జీవితపు అనుభవాల సానరాయి మీద అరిగిపోతూ పదును తేలిన మాటగా పదంగా వ్యక్తం అవుతున్న కాలంగుండెచప్పుడు, వెదురు వనాల గుబురు పాటల, గుబులు ఊటల ప్రవాహపు అలలు ఇందులో వినిపిస్తుంటాయి. ఆ అలికిడిని రెక్కల్లో మోసుకుని ‘దిగులు కొంగ’ ఒకటి కావేరీ తీరం నుంచి అరుణా నది ఒడ్డుకి చేరి పలకరిస్తోంది” అంటారు పల్లెపట్టు నాగరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లెపట్టు నాగరాజు.
అనువాదం చదివేటప్పుడు హృదయాన్ని తాకడం ప్రధానమైన విషయం. అది అనువాదకుడి శ్రద్ధను పట్టిస్తుంది. అది అనువాదకుడి సామర్ధ్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క పరిమళం.. ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ప్రతి పువ్వులోని ప్రత్యేకతని అనువాదంలోకి తీసుకురావడానికి గిడ్డకింది మాణిక్యం చేసిన కృషి హర్షనీయం.. అంటారు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి, శాఖా అధ్యక్షులు తెలుగు అధ్యయన శాఖ బెంగళూరు విశ్వవిద్యాలయం వారు.
ఇక తన మాటగా ‘బార్డరోడి మాట’లో తన స్వీయ పరిచయాన్ని ఇస్తూ, తమిళనాడు- ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పుత్తూరు పక్కన నారాయణవనం నా స్వస్థలం. అక్కడ తమిళం, తెలుగు, మట్టి-వానపాములా కలిసే ఉంటాయి. అక్కడ భాష మాత్రమే కాదు ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు కూడా అలానే కలిసే ఉంటాయి. బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకుని తమిళనాడుకు పోతే వీళ్ళని ‘ఆంధ్ర గొల్టీలు’ అని.. చదువు కోసం విశ్వవిద్యాలయాల వైపు వస్తే అరమోళ్ళు, బార్డరోళ్ళు అని మిత్రులే ఎగతాళి చేస్తుంటారట. అయితే అందుకు నొచ్చుకుని కుంగి పోక ఆగిపోక, రెండు భాషలు వచ్చును అని కుశాలపడే దానికన్నా ముందు, ఎటూ కాకుండా పోయినామనే బాధని మనసులో నొక్కి పెట్టి, ప్రస్తుతం జీవశాస్త్ర పరిశోధక విద్యార్థి, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన మాణిక్యం పదో తరగతి, అలాగే డిగ్రీలో కూడా ఉత్తమ విద్యార్థి పురస్కారాన్ని అందుకున్న చురుకైన విద్యార్థి. డిగ్రీలో ఉండగానే తన అధ్యాపకురాలు డాక్టర్ స్వాతితో కలిసి ‘స్థానిక సాలీడుల జీవవైవిద్యాన్ని తెలియపరిచే సింగిరి కోన సాలీడులు’ అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సంయుక్తంగా వెలువరించారు.
సామాజిక వాస్తవికతలను జీవన తాత్వికతలను తన సొంత భాషైన తొండనాడు ప్రాంత మాండలికంలో కథలు కవితలు వ్యాసాలు రాస్తున్నాడు మాణిక్యం. ఈ దిగులు కొంగ ఇతని తొలి అనువాద పుస్తకం- అంటే నమ్మబుద్ధి కాదు. అలాంటి అనువాద హైకూల్లో అనువాద సామర్ధ్యంతో పాటు మూలకవుల అభివ్యక్తి వైవిధ్యం సున్నితమైన జీవన పార్శ్వాలను మనసుకు హత్తుకునేలా దిగులుకొంగ పాఠకులను అలరిస్తాయి. తమిళ మూలంలోని భావ సౌందర్యాన్ని చెక్కుచెదరకుండా అనువదించిన అనువాదకుడిని అభినందిస్తూ ఇందులోని కొన్ని హైకూల అనువాదాలను మచ్చుకు పరిశీలిద్దాం.
“గాలంలో చిక్కిన/ చేప కళ్ళలో/ నది పారుతుంది/ అన్నా, బుడ్డలమ్మేటోళ్ళ/ ఊపిరి వెల/ పది రూపాయలు/ అన్నా, మనలాగే/ నటిస్తోంది/ మన నీడ కూడా/ అన్నా, స్మశానానికి/ జీవం పోసింది/ ఓ శవం/.. ఇట్లాంటి భావసాంద్రత,గాఢత కలిగిన కవితలు పుస్తకం నిండా కనిపిస్తాయి. అమ్మకానికొచ్చిన/ చేప కళ్ళల్లో/ ఎండిన సముద్రాన్ని చూస్తున్నా’ అంటాడు ఒక మూల తమిళ కవి. కనిపించే దానికన్నా కళ్ళల్లో, గుండెల్లో దాగిన బాధను గుర్తుపట్టడం, సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కవి అయినవాడు పట్టుకునే భావుకపూర్ణ సంపద ఈ హైకూలలో మనం చూస్తాం. వృద్ధాశ్రమంలోని/ తల్లిదండ్రులు/ ఇంటికొచ్చారు చిత్రపటంలో/ “ఎండిన మానుల్లో/ పచ్చని ఆకుల్లా/ రామచిలుకలు/ అన్న హైకూలను చదివి జీవితపు అనుభవాల సానరాయి మీద అరిగిపోతూ పదును తేలిన మాటగా పదంగా వ్యక్తమవుతున్న కాలంగుండెచప్పుడు ఈ సంపుటిలో మనకు అడుగడుగునా వినిపిస్తుంది. వాక్యాల నిడివిలో క్లుప్తతే కాదు వాస్తవాల వాడి, వేడి తడి సడి జడి దడి.. ఈ పుస్తకం మన అనుభవంలోకి తెస్తుంది” అన్న పల్లిపట్టు నాగరాజు మాట అక్షర సత్యం.
లారీ నిండుగా చెట్లు/ తిండి గింజలతో/ గూడును వెతుకుతూ తల్లి పక్షి/ కవి కూడా గూడులేని దేశదిమ్మరి అయిన పక్షే! ఎక్కడ దిగులు కనిపిస్తుందో అక్కడ నిలిచిపోతాడు. ఆశావహుడైన కవే, పగిలిన/ మట్టి కుండలోనూ/ కొంచెం నీళ్లు.. అనగలుగుతాడు. నదులను/ కలిపాయి/ చిరు చినుకులు/ అనడం.. సమూహ ఐక్యతా బలాన్ని సూచిస్తుంది పరోక్షంగా. “పత్తి గింజ కాన్పులో/ పుట్టేది/ చీరనో? పంచెనో ?/. ఈ హైకూ మర్రి విత్తనంలో దాగి ఉన్న విశాల వృక్షాన్ని దర్శించడం లాగా కనిపిస్తుంది. గాలీ! నిదానించు/ ఎగరడానికి నేర్చుకుంటోంది/ చిన్ని సీతాకోకచిలుక/ హైకూలో మనం స్వచ్ఛమైన మానవ జీవ జంతు పశు పక్ష్యాదుల పట్ల ప్రేమను గమనించవచ్చు. నీళ్లకొళాయి దగ్గర/ గొడవలు/ నిండి పొర్లుతున్నాయి మాటలు/ హృదయం ఉండాలే గాని జీబ్రిష్ భాషలో కూడా స్పష్టమైన అర్థసంకేతాలు అందుకోగలుగుతాడు హృదయ సంవేదన తెలిసిన కవి. ఎండిన చెట్టునూ/ పచ్చగా చేస్తూ/ ముళ్ళ తీగ/. మరొక ఆశావహ కవిత ‘కాకి గూట్లో/ సంగీతం కాసుకోనుంది/ కోయిల గుడ్డులో/ కవి హృదయం కనిపించని దాన్ని కూడా స్పష్టంగా గుర్తు పడుతుంది మరి. కుబేర మూల/ గోడ నిండుగా/ అప్పు లెక్కలు/ వ్యంగ్యానికి, చతురోక్తికి కూడా కాదేదీ అనర్హం. ‘ఊదు బుర్ర ఊపుదుతూ/ అమ్మ/ నాట్యమాడుతూ నిప్పు/ ఒక పసి హృదయంలో నాటుకుపోయిన భావం హైకుగా నివురుగప్పిన నిప్పులా ఉండి బయటపడిన క్షణం అది. చెట్టు నీడలో/ మాట్లాడుతున్నారు/ నరికే రోజు గురించి/ వ్యాపారికి కృతజ్ఞత మానవత్వపు ఊహే ఉండదు మరి. గోడ లేకున్నా/ బొమ్మ గీస్తున్నాడు/ మూగ చిత్రకారుడు/ అక్కడ ఇక్కడ ఉన్నది లేమే కానీ, ఆ లేమి సృష్టించిన సంపద ఇది. చేప తొట్టెలో/ ఈదుతూ/ సముద్రాన్ని వెతుకుతున్నాయి చేపలు/ హైకూలో, కవి చేపలోను, తొట్టెలోనూ సముద్రంతో ఐక్యం కావడం కనిపిస్తుంది. ఏనుగు/ పాదముద్రల్లో/ వినాయకుడి గుడి/ ఆస్తికుడి దృష్టికి ఇదొక నిదర్శనమైన హైకూ. ఊరంతా స్మశానం/ కులం మాత్రం/ కాలనే లేదు/ సమానత్వాన్ని శ్వాసించే కవి చూపు ఇందులో కనబడుతుంది. రైలు గుద్దిన/ ఏనుగు అరుపులో/ అడవి లేదనే బాధ వినబడుతోంది/ దృశ్యంలోనే కాదు శబ్దంలో కూడా మూగ బాధను వినగలిగేవాడే కవి. ఆకలి ఎవరికైనా ఒకటే! అన్న భావం.. చెరుకు గడలు/ ఏనుగుకే కాదు/ చీమలకూ రుచిస్తుంది/ అనడంలో కనిపిస్తుంది. పీకేసిన చెట్టు/ వేర్లతోనే/ తల్లి మట్టి/ మాతృ మమకారమూర్తి చెట్టు వేర్లలో కూడా కవి అయిన వాడు గమనిస్తాడు. ఇసుక దొంగకీ/ ఓ యేరు కావాలి/ వాడి అస్థికలు కలిపే దినానికి/ అనే జీవనతత్వం, వాడికి బతికుండగానే.. బోధపడేది అన్నాడో మరి. బుడ్డలమ్మే బిడ్డలకూ/ బుడ్డలు/ కొనే వయసే/ అనడంలో మానవత్వం కనికరాల మేళవింపు కనిపిస్తుంది.
ఈ విధంగా ఈ 55 హైకూలలోని మూల తమిళ కవులది, ఒక్కొక్కరిది ఒక్కో చూపు, ఒక్కో దృక్పథం. జీవితం అందరికీ ఒకేలా ఉందదు మరి! ఒకేలా కుదురుగాను ఉండదు. ఎవరి అనుభవాలు వారివి. ‘నేను ఇంకో మనిషితో పంచుకోవడం ద్వారానే తృప్తి పడుతుంటాను. అలా చేయకుండా ఉండలేను కాబట్టే రాస్తుంటాను. మనిషి మనిషితో పంచుకోకపోతే ఎందుకు ఈ బ్రతుకు? అనే మాటలలో ఈ యువ కవి ఉదాత్త భావన.. అతడి నుంచి మరెన్నో సామాజిక స్పృహ కలిగిన ఆలోచింపచేసే చిక్కని సాహిత్య సృజనను మనము ఇంకా ముందు కూడా ఆశించవచ్చు.
–మల్లేశ్వరరావు ఆకుల (7981872655)
