తెలుగు సినిమాల కీర్తి… ఆదుర్తి

(డిసెంబర్  16 న ఆదుర్తి గారి జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం)

సినీ దర్శక ప్రయోగశీలి ఆదుర్తి సుబ్బారావు పుట్టింది 16 డిసెంబర్ 1912న రాజమహేంద్రవరంలో. సుబ్బారావు తండ్రి సత్తెన్న పంతులు ఆ ఊరి తహసీల్దారు. సుబ్బారావు తల్లి రాజ్యలక్ష్మి. ఇద్దరు ఆడ సంతానం తరవాత పుట్టినవాడు కావడంతో గారాబంగా పెరిగాడు. పద్నాలుగో ఏటనే స్కూలు ఫైనల్ పాసై కాకినాడ పిఠాపురం రాజా కాలేజిలో ఇంటర్మీడియట్ చేరాడు. కానీ సుబ్బారావుకు చదువుమీదకన్నా ఫోటోగ్రఫీ, గ్రంధపఠనం మీద ఆసక్తి మెండు. తమ్ముడు, అక్కలను వెంటపెట్టుకొని గోదావరి గట్టున కూర్చోబెట్టి వివిధ భంగిమల్లో ఫోటోలు తీసేవాడు. సినిమాలు చూస్తూ తనుకూడా గొప్ప కెమెరామన్ కావాలని కలలు కన్నాడు. కవిత్వం రాయడం మొదలెట్టి ‘వనరాణి’, ‘మంగళసూత్రం’, ‘సర్కస్ రాజు’ వంటి కొన్ని తెలుగు సినిమాలకు పాటలు, మాటలు రాశాడు. 175 రూపాయల నెలజీతానికి పనిచేశాడు. బందరులో వున్న డాక్టర్ మర్రిపాటి హనుమంతరావు కుమార్తె కామేశ్వరీ బాలను ఆదుర్తి వివాహం చేసుకున్నాడు. సుబ్బారావు చురుకుదనం గమనించి స్టూడియో వాళ్ళు ‘పారిజాతాపహరణం’ అనే తమిళ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం తన తమ్ముడు ఆదుర్తి నరసింహమూర్తి నిర్వహించే ‘హారతి’ పత్రికకు ఎడిటర్ గా సుబ్బారావు వ్యవహరించారు. ఈ సృజనాత్మక దర్శకుడు, అద్భుత నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గురించి కొన్ని విశేషాలు.

బొంబాయిలో సినిమా నిర్మాణపు తొలి పాఠాలు

ఆదుర్తి సుబ్బారావుకు రాజమండ్రిలో చదువుకునే రోజుల్నుండే సినిమాలంటే చాలాఇష్టం. ఫోటోగ్రఫీ అంటే మరింత ఇష్టం. తండ్రి సత్తెన్న పంతులు కొనిచ్చిన చిన్న కెమెరాతో ఫోటోలు తీస్తూ కొత్తదనాన్ని కెమెరాలో ఎలా బంధించాలి అని ఆలోచిస్తూ ప్రయోగాలు చేస్తుండేవాడు. రాజమండ్రి పి.ఆర్. కళాశాలలో ప్రీయూనివర్సిటీ కోర్సు చదువుతుండగా అనారోగ్యంపాలై చదువుకు కొంతకాలం దూరంగా వున్నరోజుల్లో, స్నేహితులు చెప్పిన మాటలు వంటబట్టి ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువుకు స్వస్తిచెప్పి తండ్రి వారిస్తున్నా వినకుండా బొంబాయి పయనమయ్యాడు. ఆతను బొంబాయి వెళ్లడం తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టంలేదు. బొంబాయిలో వుండాలంటే తననుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందవని తండ్రి హెచ్చరించినా ఆదుర్తి లెక్ఖ చెయ్యలేదు. తన ధ్యేయమొక్కటే.. మంచి ఫోటోగ్రాఫర్ కావడం. అలా బొంబాయిలో సెయింట్ జేవియర్ కాలేజీ ఆఫ్‌ సినిమాటోగ్రఫీ కోర్సులో స్టూడెంట్‌గా చేరారు. అక్కడ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్పించే విధానం నచ్చక, బయటకు వచ్చేశారు. బొంబాయి ఫిలిం లేబరేటరీలో ఫిలిం ప్రాసెసింగ్, ఫిలిం ప్రింటింగ్ విభాగాల్లో శిక్షణ పొంది సినిమాల్లో అవకాశాలకోసం బొంబాయిలోవుండే సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఎంతోమంది పెద్దవాళ్ళను కలిశారు. చివరకు విజయభట్ నిర్మించిన ‘రామరాజ్య’’ (1943) అనే హిందీ సినిమాకు కెమెరా అసిస్టెంటుగా పనిచేసే అవకాశం వచ్చింది. మహాత్మా గాంధీ తన జీవితం మొత్తంమీద చూసిన ఏకైక చిత్రం యీ ‘రామరాజ్య’. ఆదుర్తి ఈ చిత్రానికి ఎంతో ప్రతిభావంతంగా పనిచేసినా తన సీనియర్ల చేతుల్లో వేధింపులు తప్పలేదు. దాంతో విరక్తి చెందిన ఆదుర్తి సినిమాటోగ్రఫి శాఖకు ఉద్వాసన చెప్పారు. తర్వాత ఫిలిం ప్రాసెసింగ్‌ విభాగంలో చేరారు. అందులో కూడా ఇమడలేకపోయారు. కొంతమంది మిత్రుల సూచనల మేరకు ఎడిటింగ్‌ శాఖపై దృష్టి పెట్టారు. దీనా నార్వేకర్‌ అనే ఎడిటర్‌ దగ్గర అసిస్టెంటుగా చేరి ఆయన ప్రశంసలు చూరగొన్నారు. ప్రఖ్యాత నాట్యాచార్యుడు పద్మవిభూషణ్ ఉదయశంకర్‌ (పండిట్ రవిశంకర్ సోదరుడు) ఆదుర్తి ప్రతిభను గుర్తించి, తానే స్వయంగా నటిస్తూ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘కల్పన'(1948) చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌ గా పనిచేసే అవకాశం కల్పించారు. చిత్రనిర్మాణ సమయంలో అనేక విషయాలమీద ఆదుర్తి ఇచ్చిన సలహాలను ఉదయశంకర్ కూలంకషంగా చర్చించి వాటిని పాటించారు. ఈ సినిమా ఒక నాట్య ప్రధాన దృశ్యకావ్యం. ఈ చిత్రం విదేశీ విమర్శకుల మన్ననలు అందుకుంది.

Director Adurthi Subbarao

మద్రాసు నగరంలో ఆదుర్తి…

‘కల్పన’ చిత్ర నిర్మాణం పూర్తయ్యాక, మద్రాసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఊపందుకుంటున్న దశలో ఆదుర్తి మద్రాసులో తొలిఅడుగులు వేశారు. మద్రాసు వచ్చిన తరవాత పూర్తి స్థాయి ఎడిటర్‌గా ‘పారిజాతాపహరణం’ అనే తమిళ చిత్రానికి పని చేశారు. అదుర్తికి మంచి సాహిత్య ప్రతిభ ఉండడంతో పాట రచన, మాట రచన మీద కూడా దృష్టి పెట్టారు. ‘మంగళసూత్రం’, ‘ఒకరోజు రాజు’, ‘సర్కస్‌రాజు’ వంటి కొన్ని సినిమాలకు మంచి పాటలు రాశారు. అందుకే ఆదుర్తి తీసే సినిమాల్లో మంచి పాటలు ఆవిష్కరింపబడతాయి. కొంతకాలం తన తమ్ముడు ఆదుర్తి నరసింహమూర్తి నిర్వహించే ‘హారతి’ పత్రికకు ఆదుర్తి సుబ్బారావు ఎడిటర్ గా కూడా వ్యవహరించారు. తరవాత కొంతకాలానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ‘దీక్ష’ (1951) చిత్రాన్ని నిర్మిస్తూ ఆదుర్తిని సహాయదర్శకుడిగా తీసుకున్నారు. ఆదుర్తి పనితనానికి ప్రశంసలు రాగా 1953 లో ప్రకాశరావు నిర్మించిన ‘కన్నతల్లి’, ఈస్ట్ ఇండియా వారు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘సంక్రాంతి’ (1952) చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి ఆదుర్తి తన పనితనాన్ని నిరూపించుకున్నారు. అప్పట్లో ప్రకాష్ స్టూడియోలో డి.బి. నారాయణ జనరల్ మేనేజర్ గా, ఎస్. భావనారాయణ ప్రొడక్షన్ ఎక్ష్జిక్యూటివ్ గా పనిచేవారు. వారిద్దరూ రాజమండ్రి వాసులే కావడంతో వారితో ఆదుర్తికి స్నేహం కుదిరింది. ముగ్గురూ కలిసి 1953లో ఒక శుభముహూర్తాన ‘అమరసందేశం’ (1954) సినిమా తీయాలని నిర్ణయించారు. వీరి పట్టుదల తెలిసిన నవయుగ శ్రీనివాసరావు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. సాహిణీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమా గొప్పగా ఆడకపోయినా దర్శకుడిగా ఆదుర్తి కి మంచి సమర్ధవంతమైన దర్శకుడనే పేరొచ్చింది. రెండవ ప్రయత్నంగా ‘పాండురంగ మహాత్మ్యం’ తీదామనుకున్నారు. అయితే ఎన్.టి. రామారావు అదే ప్రయత్నంలో వున్నారని తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పుడే అన్నపూర్ణావారు ‘దొంగరాముడు’ సినిమా తరవాత రెండవ చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుక్కిపాటి మధుసూదనరావు, భావనారాయణ సలహామీద ‘అమర సందేశం’ చూసి దర్శకుని ప్రతిభకు ఆకర్షితుడై అన్నపూర్ణా బ్యానర్ మీద తాము నిర్మించబోతున్న రెండవచిత్రం ‘తోడికోడళ్ళు’ (1957) కు ఆదుర్తిని దర్శకునిగా తీసుకున్నారు. బెంగాలి నవల ‘నిష్కృతి’ ఆధారంగా నిర్మించిన ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఉత్తమ చలనచిత్ర బహుమతి కూడా అందుకుంది. కుటుంబ కథలను సినిమాలుగా మలచడంలో ఆదుర్తి ప్రవీణుడు. ఆయన సినిమాల్లో సమాజానికి చేటు చేసే సన్నివేశాలు లేశమాత్రమైనా కనిపించవు. ప్రేక్షకులకు నచ్చేలా కుటుంబకథా చిత్రాలను నిర్మించి అద్భుత విజయాలను అందుకున్న మేధావి ఆదుర్తి. ‘తోడికోడళ్ళు’ చిత్రాన్ని ‘ఎంగవీట్టు’ మహాలక్ష్మి’ గా తమిళంలో నిర్మిస్తే అక్కడకూడా ఆ సినిమా స్మాష్ హిట్ గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆదుర్తే నిర్వహించారు. తరవాత యర్రా నారాయణ స్వామి కి ‘ఆడపెత్తనం’ (1958) సినిమా చేశారు. అన్నపూర్ణా సంస్థ కు బెంగాలి నవల అగ్ని పరీక్ష ఆధారంగా నిర్మించిన ‘మాంగల్యబలం’ (1959), దాని తమిళ వర్షన్ ‘మంజల్ మహిమై’ రెండూ సూపర్ హిట్లయ్యాయి. ఫిలింఫేర్ బహుమతి తో బాటు ప్రాంతీయ ఉత్తమ చిత్ర బహుమతి కూడా ఈ చిత్రం అందుకుంది. తరవాత అదే సంస్థకు ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, పూలరంగడు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. బాబూ మూవీస్ పతాకం మీద సి.సుందరం నిర్మించిన మంచిమనసులు, మూగమనసులు, అందరూ కొత్త తారలతో తేనెమనసులు, కన్నెమనసులు చిత్రాలను ఆదుర్తి సొంతసినిమాలుగానెంచి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. సుడిగుండాలు లఘు బడ్జట్ చిత్రానికి కూడా నంది బహుమతి లభించింది. జాతీయ స్థాయిలో సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి, మూగమనసులు, నమ్మినబంటు, మాంగల్యబలం, తోడికోడళ్ళు చిత్రాలు ప్రశంసలు అందుకున్నాయి. మూగమనసులు చిత్రాన్ని ‘మిలన్’ పేరుతో హిందీలో నిర్మించి నూతన్ కు ఉత్తమనటి గా జాతీయ బహుమతిని ఇప్పించగలిగారు. తరవాత తేనెమనసులు చిత్రాన్నిహిందీలో ‘మన్ కా మీత్’ గా నిర్మించారు. ఇవి కాక డోలి, దర్పన్, మస్తానా, రఖ్ వాలా, జీత్, ఇన్సాఫ్, జ్వర్ భాటా వంటి హిందీ సినిమాలు నిర్మించారు. మాయదారి మల్లిగాడు, గాజుల కిష్టయ్య మరచిపోని ఆదుర్తి సినిమాలు.

ఆదుర్తి హిందీ చిత్రాల విశేషాలు

ఆదుర్తి హిందీ చలనచిత్ర దర్శకత్వ ప్రస్థానం 1967లో ‘మిలన్’ చిత్రంతో మొదలై 1975లో హతాన్మరణం పొందేదాకా 10 చిత్రాల వరకు (అంటే ‘సున్హేరా సంసార్’) సాగింది. ఆదుర్తి సారధ్యం వహించిన హిందీ చిత్రాలు వరసగా మిలన్ (1967), మన్ కా మీత్ (1968), డోలీ (1969), దర్పణ్ (1970), మస్తానా (1970), రఖ్ వాలా (1971), జీత్ (1972), ఇన్సాఫ్ (1973), జ్వర్ భాటా (1973), సున్హేరా సంసార్ (1975). తెలుగులో బాబూ మూవీస్ సంస్థ, ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన ‘మూగ మనసులు’(1963) చిత్రానికి రీమేక్ ‘మిలన్’ చిత్రం. ప్రసాద్ ప్రొడక్షన్స్ సారధి ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం లో సునీల్ దత్, నూతన్, జమున ముఖ్యపాత్రలు ధరించారు. లక్ష్మికాంత్ ప్యారేలాల్ వీనులవిందైన సంగీతం ప్రేక్షకుల్ని అలరించింది. ఇది ఒక అపురూపమైన ప్రేమకథ. పూర్వజన్మపరిజ్ఞానం కలిగిన ప్రేమికుల యదార్దగాధ ఆధారంగా తెలుగులో నిర్మించిన మూగమనసులు చిత్రం లాగే మిలన్ చిత్రంకూడా నడుస్తుంది. చావు, పుట్టుక అనేవి దేహానికేగాని, ఆత్మకు కావని ఈ చిత్రం చెబుతుంది. ఆదుర్తి శిష్యుడు, ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఎడిటర్ గా రెండు బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహించాడు. పి.ఎల్. రాయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆనంద్ బక్షి గేయరచయితగా వ్యవహరించిన ఈ చిత్రానికి పాటలు ముఖేష్, లతాజీ పాడారు. ఈ చిత్రాన్ని గంగానది మీద, దాని తీర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పల్లెటూరి పడవ నడిపే యువకునిగా సునీల్ దత్ నటన చాలా బాగుంటుంది. జమున నటన ‘గంగా జమున’ చిత్రంలో వైజయంతిమాల నటనను గుర్తుకు తెస్తుంది. ఈ చిత్రానికి మూడు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. నూతన్ కి ఉత్తమ నటి బహుమతి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కి ఉత్తమ సంగీత దర్శకుని బహుమతి, జమునకు ఉత్తమ సహాయనటి బహుమతి లభించాయి. ‘మిలన్’ చిత్రాన్ని బెంగాలీ భాషలోకి తర్జుమా చేసారు. ఈ చిత్రం దర్శకునిగా ఆదుర్తికి మొదటి హిందీ చిత్రం కాగా హిందీ చిత్రసీమలో నిలదొక్కుకొనే అవకాశాన్ని కల్పించింది.

మరిన్ని ముగింపు విశేషాలు

వైవిధ్య భరితమైన కథలతో, నవ్యతకుపట్టం గడుతూ, వినూత్న రీతిలో దర్శకత్వ ప్రతిభను చాటుకున్న ఆదుర్తి సుబ్బారావు ఎక్కువగా తెలుగులో తీర్చి దిద్దిన చిత్రాలనే హిందీలో పునర్నిర్మించారు. అందుచేత ఆదుర్తి దర్శకత్వ ప్రతిభకు తెలుగులో ముందే పట్టం కట్టటం జరిగింది. హిందీలో చిత్రాల్ని నిర్మించేటప్పుడు స్థానిక సంప్రదాయాలను, కట్టుబాట్లు, అలవాట్లను దృష్టిలో వుంచుకొని చిత్రాలు నిర్మించారు. అర్ధాంతరంగా అనారోగ్యంతో 01-10-1975 న కాలం చెయ్యకుండా వుండి వుంటే ఇంకా మంచి చిత్రాలు ఆదుర్తి మనకు అందించేవారేమో! ఆదుర్తి తన జీవన ప్రస్థానంలో 26 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు, 10 హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో తాతినేని ప్రకాశరావు, ఎల్.వి. ప్రసాద్ వంటి మేధావుల సరసన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హిందీలో కూడా విజయవంత మైన చిత్రాలు నిర్మించి, తాతినేని రామారావు, బాపయ్య, లక్ష్మి దీపక్ వంటి తరవాత తరం దర్శకులకు ఆదుర్తి మార్గదర్శకుడైనారు. ముఖ్యంగా నటశేఖర కృష్ణకు తేనెమనసులు చిత్రంలో హీరో పాత్రనిచ్చి కన్నెమనసులు, మాయదారి మల్లిగాడు, గాజులకిష్టయ్య వంటి మంచి చిత్రాల్లో అవకాశం కల్పించి సాహసవంతమైన నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తీర్చిదిద్దిన ఘనత ఆదుర్తి సుబ్బారావుదే!!

ఆచారం షణ్ముఖాచారి
(9929 54256)

1 thought on “తెలుగు సినిమాల కీర్తి… ఆదుర్తి

  1. Very detailed article. Thanks. I just want to mention that Akkineni Nageswara Rao acted in 16 of Adurthi’s movies. Savitri acted in 10 movies.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap