దర్శకరత్న … ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరొక్కటే.. అదే దాసరి నారాయణరావు, డైరెక్టరే కాప్టన్ అఫ్ ద షిప్ అని నమ్మే వ్యక్తిగానూ, శక్తిగాను అయన సినిమాలతో ఎదిగారు. దాసరి నారాయణరావు అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి, ఒక వ్యవస్థ! తెలుగు పరిశ్రమలో సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు మరియు రాజకీయనాయకుడు. అన్ని రంగాల్లో సత్తా చాటిన అయన అంటే తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అయన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.
దాసరి నారాయణరావు 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. అత్యధిక చిత్రాల చేసిన దర్శకుడుగా గిన్నిస్ రికార్డ్ అందుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు, 53 సినిమాలు నిర్మించాడు. 250 పైగా చిత్రాలకు సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి పలు అవార్డులు రివార్డులు అందుకున్నారు. అతితక్కువ కాలంలో ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన సినీ పరిశ్రమే కాకుండ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు.
బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. దాసరి నటించిన సినిమాలు తాతా మనవడు. స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. తాతా మనవడు సినిమాకి గాను నంది అవార్డు అందుకున్నాడు. స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి తిసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి అనడం అతిశయోక్తి కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి తెలుగు సినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. దాసరి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండే దాసరి కార్మిక సంఘాలకు ఎంతో తోడ్పాటు అందించారు.
అయన పుట్టినరోజును దర్శకుల దినోత్సవంగా తెలుగు పరిశ్రమ జరుపుకోవడం విశేషం. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, లీడర్ గా భిన్నమైన పాత్రలు పోషించిన దాసరి తెలుగు సినిమాకు కేసరి లాంటి వారు. అలాంటి అయన తీవ్ర అనారోగ్యం కారణంగా సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు.
–సంతోష్