హాస్యం గురించి జంధ్యాల ఇలా అనేవాడు: “నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం”
తెలుగు తెరకు శ్రుతిమించని హాస్యంతో చక్కలిగిలి పెట్టి, ప్రేక్షకుల హృదయాలలో గిలిగింతలు రేపిన ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల! ‘‘మాటలు రాయడమంటే మాటలు కాదు’’ అని నమ్మి, హాస్యానికీ... అపహాస్యానికి మధ్య ఉన్న సున్నితమైన రేఖను గమనించి సంభాషణాశ్రయ హాస్యాన్ని సృష్టించడంలో పేరుపొందిన పదహారణాల తెలుగు రచయిత, దర్శకుడు జంధ్యాల!
సిరిసిరిమువ్వ సినిమాతో మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన జంధ్యాల, 1983లో 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాసి ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. అతి తక్కువ సమయంలో, ఒక సినిమాకు సంపూర్ణంగా సంభాషణలు సమకూర్చగలిగిన మాటకారి జంధ్యాల. తెలుగు సాహిత్యం మీదా, వాడుక భాషమీదా ఉన్న విశేషమైన పట్టుతో ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభోదయం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘అడవిరాముడు’, ‘వేటగాడు’, ‘సీతాకోకచిలుక’, ‘శుభలేఖ’, ‘సాగరసంగమం’, ‘అనందభైరవి’, ‘పడమటి సంధ్యారాగం’, ‘ఆపద్భాంధవుడు’, ‘రెండు రెళ్లు ఆరు’, ‘వివాహభోజనంబు’, ‘ముద్దమందారం’ చిత్రాలకు జంధ్యాల రాసిన సందర్భోచితమైన సంభాషణలు విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ఆయన కలం హాస్యరసాన్ని ఎంత బాగా పండించగలదో, లోతైన భావాలతో కూడిన, కరుణ రసాత్మక సంభాషణల్నీ అంత హృద్యంగానూ సమ కూర్చగలదు. సంభాషణా రచయితగా దాదాపు 350 చిత్రాలకు రాసిన సంభాషణలు, అద్భుత కథా కథనాలతో దర్శకునిగా తీర్చిదిద్దిన 39 చిత్రాలు జంధ్యాల సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలు.
1989సంవత్సరంలో మద్రాసు, కాందార్ నగర్లో సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశ ఆహ్వానాన్ని తను అప్పటివరకు తీసిన సినిమా పేర్లు వచ్చేటట్లు ‘ప్రేమలేఖ ‘ రూపొందించారు. క్రింది ఆహ్వానపత్రాన్ని గమనిస్తే ఇందులో 14సినిమా పేర్లు మనకు కనిపిస్తాయి. అప్పట్లో చేతిరాతతో ఆహ్వానపత్రాలను ప్రింట్ చేయడం ఒక ట్రెండ్. ఈ ఆహ్వానపత్రం ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్ డా. భువన్ గారు మనకు అందించి 64కళలు ద్వారా మీరు చూసే అవకాశం కల్గించారు.
beautiful and innovative invitation. Thanks Buvan garu