విలక్షణ దర్శకుడు “ కోడూరిపాటి”

(నటుడు, దర్శకుడు, రచయిత, కోడూరి పాటి సరస్వతి రామారావుగారి వర్ధంతి 28-1-2021)

తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్ కోడూరిపాటి సరస్వతి రామారావుగారు ఈనాటి కళాకారులికి ఆదర్శప్రాయుడు. ఆయన నాటకరచయిత, నటుడు, దర్శకుడు. ఆయన ఎన్నో విప్లవాత్మకమయిన రచనలు చేసారు. ఆయన రాసిన నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శిస్తే ప్రేక్షకులు ఉత్తేజితులయ్యేవారు.
స్వీయ దర్శకత్వం చేసి, ఎక్కువ నాటకాల్లో తానే నటుడిగా పాల్గొని ఆ నాటకాన్ని విజయవంతం చేసిన ఘనుడు. వీరు రచించిన ‘రంగూన్ రౌడి” నాటకం, ఆంధ్రదేశమంతా అనేక ప్రదర్శనలను ఇచ్చినప్పుడు, అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలని అందుకున్నారు.
నవరసాలను ఒకే పాత్రలో సృష్టించుకోవాలనే ఆలోచనతో కష్టపడి, కృషి చేసి, సాహసించి ‘సాని సంసారి’ అనే నాటకం రూపొందించారు. ఈ నాటకం బాగా విజయవంతమయినప్పటి నుండి నాటకరంగంలో ఆయన ప్రేక్షకునికి ఆరాధ్యదైవమయ్యారు. కొన్ని నెలల పాటు ఈ నాటకాన్ని రిహార్సల్స్ చేసి, తన తోటి నటి నటవర్గంతో ఆంధ్రదేశంలో నలుమూలలోనే కాకుండా బెంగాల్, ఒరిస్సా, తెలంగాణా మొదలయిన ప్రాంతాలలోనూ ప్రదర్శించి, ప్రేక్షకుల్ని ఓలలాడించారు. ఈ నాటకంలో కోడూరిపాటి వారి నటనా వైశిష్ట్యానికి ముగ్ధులయి, ఆయనకు ఎన్నో విలువైన కానుకలు సమర్పించిన సంఘటనలు కోలొల్లలు. ఆయన ఎంత గొప్ప రచయితో, అంతే గొప్పనటుడు మరియు అంతే గొప్ప దర్శకుడు, అదృష్టవశాత్తు ఆ మహానుభావుడు స్వయంగా రచించి దర్శకత్వం వహించిన “వీర పాండ్య కట్ట బ్రహ్మన్న” నాటకంలో నేను కూడా ఒక మంచి పాత్ర వేసే అవకాశం దొరికింది.

నేను 1972, ఏప్రియల్ 16న, బదిలీ మీద విజయవాడలో చేరాను. అక్కడ చేరగానే, గతంలోనా పరిచయస్తులైన కోకా సంజీవరావు, యం. వాసుదేవమూర్తి కలిసారు. వాళ్ళతో బాటు పేరి కామేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా వీళ్ళు ఆకాశవాణి కళాకారులైనా, మంచి రంగస్థల నటులు. నేను విజయవాడకు చేరగానే “వీర పాండ్య కట్టబ్రహ్మన్న” నాటకం రిహార్సల్స్ జరుగుతోందని చెప్పి నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఈ నాటకానికి రచన, దర్శకత్వం కోడూరుపాటి సరస్వతి రామారావుగారు. నన్ను నా మిత్రులు ఆయనకి పరిచయం చేసారు. నన్ను చూడగానే ఆయన, ఈ నాటకంలో ఒకపాత్ర వుంది వేస్తావా? అని అడిగారు. ఆయన్ని చూడ్డం అదే మొదటిసారి. అంత గొప్పవారు, తన దర్శకత్వంలో వేషం వెయ్యమని అడగ్గానే నాకు ఎంతో సంతోషం వేసింది.

ఈ నాటకంలో నా పాత్ర పేరు మహేశ్ నా సహాధ్యాయి మృగేశ్. ఈ పాత్రని కోడూరుపాటి వారి ప్రియశిష్యుడు ఎ.వి.రమణ్ జి ధరించాడు. మేమిద్దరం ఆస్థాన గూఢచారులం, నేను ఇందులో ఇంగ్లీష్ దొరసానిగా కూడా కనిపిస్తాను. ఈ నాటకం ద్వారా అనేకమంది రంగస్థల నటులు సాంకేతిక నిపుణులు పరిచయమయ్యారు. మహారాజు సుపుత్రుడిగా అప్పటి బాలనటుడు, ఇప్పటి సినీనేపధ్య గాయకుడు నాగూరుబాబు ఈ నాటకంలో మాతోబాటు ఒక పాత్ర వేశాడు.
ఈ నాటకంలో పాల్గొనడం ద్వారా, నేను ఆయన వ్యక్తిత్వాన్ని, దర్శకత్వ మెళకువలని గమనించేవాడ్ని. ఆయన ఇతర దర్శకుల్లాగా కాకుండా, తన నటనా శైలిని ప్రతి నటుడికి నేర్పించేవారు. నటుడి ముఖంలో కళ్ళు, Expression ముఖ్యం అని చెప్పేవారు. ఆయన స్వయంగా నటుడవడం వల్ల, తనే నటించి చూపించేవారు. మంచి నటుడికి హావభావాలు, తోటి పాత్రలతో ఎలా మెలగాలో విశదంగా చెప్పేవారు.
“నటుడు భటుడు కాడు, నారాయణాంశ సంభూతుడు” అని నటుల్ని గౌరవించేవారు. నటుడ్ని నటరాజు రూపంగా పరిగణించేవారు.

ఆంధ్రనాటక కళాపరిషత్ లో ఆయన నటన చూసి ముగ్ధుడైన వంగర వెంకటసుబ్బయ్య గారు కోడూరు పాటి వారికి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యడం, ఆయన నటజీవితంలో మర్చిపోలేని రోజు. గుర్రం జాషువా గారు ఆయన్ని “సంగీత, సాహిత్య నటసార్వభౌమ అన్న బిరుదుతో గౌరవించారు.
ప్రముఖ సంగీత విద్వాన్ మహావాది వెంకటప్పయ్య శాస్త్రిగారు ఆయన నట శిక్షణకు మెచ్చి “ప్రొఫెసర్” అని సంభోదించారు. 1909లో జన్మించిన సరస్వతి రామారావుగారు 1982, జనవరి, 28న నటరాజులో ఐక్యమైనారు. వారి సంపూర్ణ జీవితాన్ని తెలుగు నాటకాభివృద్ధికి అంకితం చేసి, నాటకం కోసం అహర్నిశలు శ్రమించిన కళాపిపాసి వారు. ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దిన మహామనీషి.
ఆయన జీవితం ఈనాటి యువతరానికి స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల అనుభవాలే తెలుగు నాటకానికి దిక్సూచి. ఫ్రెఫెసర్ కోడూరిపాటి సరస్వతిరామారావు గారి వర్ధంతి సందర్భంగా అశ్రునివాళి.

-పి.పాండురంగ, మాజీ సంచాలకులు, ఆకాశవాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap