అదేంటో..
రాసుకున్న ప్రతీమాట
మీ వాయిలోనే వినిపిస్తుంది..
ఒక్క పాటేంటి…
ప్రతీ వాక్యం , కథా, నవల ఏదైనా సరే…
వాటి గొంతు మాత్రం మీదే…
అంతలా మాలో అంతర్భాగమైపోయింది…
మీ గాత్రం .
మీ పాటలు వింటూనో…
మీ రాగాలు హమ్ చేస్తూనో…
మీ గాత్ర మాధుర్యం గురించి చర్చిస్తూనో…
ఎన్నో గంటలు… కాదు….
రోజులు… సంవత్సరాలు బ్రతికేశాం… బ్రతికేస్తాం..
ఆ రోజులన్నీ మీవే కదా…
మీరు మాతో గడిపినవే కదా…
అంటే ఒకే రోజు కొన్ని కోట్ల రోజులు బ్రతకగల నైపుణ్యం మీది…
ఇంక మీకు మరణం ఏంటి???
మరణం పిచ్చిది…
పాపం తనొచ్చాక మీరుండరని అనుకుంది…
ఇలా వచ్చి….
అలా చేయి పట్టుకుని తీసుకెళ్లిపోవచ్చు అనుకుంది.
కానీ ఎక్కడ చూసినా మీరే.
ఎక్కడ విన్నా మీ పాటే…
మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే..
మా హృదయాలలో…
మా అంతరంగాలలో,
అజరామరమైన మిమ్మల్ని….
ఎలా తీసుకెళ్లాలో దానికర్థం కాలేదు…
మిమ్మల్ని తీసుకెళ్లడమంటే….
ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికర్థమైంది…
మొదటిసారి మరణం ఒంటరైంది
ఏం చేయాలో తెలియక, బిత్తరచూపులు చూస్తోంది…
దిక్కుతోచక భోరున ఏడుస్తోంది…
‘మృతిలో తలదాచుకున్న బ్రతుకు…
శ్రుతిలో కలిపింది నిన్ను జతకు’
మళ్లీ మీ పాటే దానికి ఓదార్పు…
పోన్లెండి బాలూ సర్…
ఈసారికి దాన్ని క్షమించేయండి…
ఇంకెప్పుడూ రాదులేండి.
(“మరణంతో నిజమయ్యే ఈ బతుకు.. ఒక కలయేలే… కల నిజాల సంధిరేఖ కలిసిపోవు నీలోనే…” ఎప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తిస్తున్నాయి. అది కూడా మీ గొంతుతోనే.)
-సుకుమార్, చలనచిత్ర దర్శకుడు