‘అనుపమ’ తిలక్ ఆరంభ చిత్రం ముద్దుబిడ్డ

సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అలాంటి సినిమా సాధనం మానవ అభ్యుదయానికి, సమాజ ప్రగతికి దోహదపడాలనేది ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్ ఆశయం. అదే ధ్యేయంతో తిలక్ 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ముద్దుబిడ్డ సినిమా నిర్మించారు. ఎం.ఎల్.ఎ చిత్రం ద్వారా ప్రఖ్యాత గాయని ఎస్. జానకిని, హీరో రమణమూర్తిని, భూమికోసం సినిమా ద్వారా హీరోయిన్ జయప్రదను తెలుగు సినీరంగానికి పరిచయం చేసిన ఘనత కూడా తిలక్ దే. ముద్దుబిడ్డ సినిమా 1956 సెప్టెంబరు 6 న విడుదలై అఖండ విజయం సాధించింది. అరవై ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఆ ముద్దుబిడ్డ సినిమా విశేషాలు కొన్ని మీకోసం.

చిత్రసీమలో అనుపమ తిలక్ తొలి అడుగు
కొర్లిపర బాలగంగాధర తిలక్…ఆ పేరులోనే వుంది పవిత్రత. అతణ్ణి అందరూ పిలుచుకొనే పేరు తిలక్. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జన్మించిన తిలక్ ఒక గొప్ప మానవతావాది, పిన్న వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళిన సమరయోధుడు, మార్క్సిస్టు సిద్ధాంతాలను నమ్మి ప్రజానాట్యమండలిలో విప్లవ గీతాలాపనలతోబాటు, డప్పు వాయించటం, నాటకాలు వేయటం వంటి చురుకైన పాత్రలు పోషించినవాడు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకి… అన్నిటికీ మించి ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ కు మేనల్లుడు. రాజమండ్రి జైలునుంచి విడుదలకాగానే బొంబాయివెళ్లి ఎస్.ఎ.డాంగే సహకారంతో ఇండియన్ పీపుల్ థియేటర్ ఆర్ట్స్ ప్రముఖులు బల్రాజ్ సాహ్ని, రొమేష్ థాపర్ వంటివారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. మేనమామ ఎల్.వి.ప్రసాద్ సహకారంతో దర్శక నిర్మాత ఎస్.ఎం. యూసఫ్ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ సినీ నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. ఎల్.వి.ప్రసాద్ ‘గృహప్రవేశం’ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించేందుకు మద్రాసు చేరుకున్న కొన్ని రోజులకు తిలక్ కూడా మద్రాసులో అడుగుపెట్టి, కోవెలమూడి భాస్కరరావు, చల్లపల్లి రాజాకు చెందిన ప్రీమియర్ ఫిలిమ్స్ పంపిణీ సంస్థలో పనిచేస్తూ గృహప్రవేశం ఎడిటర్ ఎం.వి. రాజన్ కు దగ్గరై ఎడిటింగ్ లో పట్టుసాధించారు. ‘మనదేశం’ సినిమాకోసం ఎన్.టి.రామారావుకు స్క్రీన్ టెస్ట్ ఎడిట్ చేసి, ఎంపిక చేసినవారిలో రాజన్ తోబాటు తిలక్ కూడా వున్నారు. మనదేశం తరవాత 1951 నుంచి వరసగా ‘రాధిక’, ‘ధర్మాంగద’, ‘మంత్రదండం’, ‘సువర్ణమాల’, ‘రోజులుమారాయి’ సినిమాలకు రాజన్ తో కలిసి పనిచేసిన తిలక్ కు అనుకోకుండా దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చింది. 1954లో నవయుగ సంస్థ వారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి. శ్రీధర్ దర్శకత్వంలో జ్యోతి సినిమాను నిర్మించే సమయంలో అతడికి నిర్మాతతో మనస్పర్థలు పెరిగి తప్పుకోవటం తో ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తిలక్ కు దక్కింది. ఆ అనుభవంతో 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి చిత్రనిర్మాణానికి నడుంబిగించారు. 1913లో శరశ్చంద్ర చటర్జీ రచించిన ‘బిందూర్ ఛలే’ నవల ఆధారంగా సినిమా కథను మలిచే బాధ్యతను తాపీ ధర్మారావు, ఆరుద్రలకు అప్పగించారు. ఈ చిత్రకథకు ‘ముద్దుబిడ్డ’ అని నామకరణం చేశారు. అనుపమ వారి తొలిచిత్రం ఈ ముద్దుబిడ్డ. ఈ సినిమాను వీనస్ స్టూడియోలో నిర్మించారు. ముద్దుబిడ్డ చిత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

ముద్దుబిడ్డ కథలోకి వెళితే-
సంపన్న కుటుంబీకుడు గోపాలం (పెరుమాళ్ళు) కూతురు రాధ (జమున) అల్లారుముద్దుగా పెరిగింది. ఆమెకు అహంకారం మెండు. మనసు నొచ్చే విధంగా ఎవరైనా అంటే ఆమెకు ఫిట్స్ వచ్చేవి. పెళ్ళిచేస్తే జబ్బు నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో గోపాలం పెళ్లి ప్రయత్నాలు చేస్తాడు. అంపాపురం జమీందారు చిన్నికృష్ణమ్మ బహద్దూర్ (సి.ఎస్.ఆర్) గారి దివాణంలో పనిచేసే శేషయ్య(నాగయ్య)కు మధు (జగ్గయ్య) సవతి తమ్ముడు. అయినా ఇద్దరూ రామలక్ష్మణుల్లా వుంటారు. శేషయ్య కష్టపడి మధును చదివించి డాక్టర్ని చేశాడు. గోపాలం కూతురు సంబంధం నచ్చిన శేషయ్య మధుకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే, అన్న, వదినెలకు అమ్మాయి నచ్చితే తనకూ నచ్చినట్లేనని వారిమీది గౌరవంతో మధు రాధను చూడకుండానే పెళ్ళికి సంసిద్ధత తెలుపుతాడు. అలా రాధతో మధుకు వివాహం జరుగుతుంది. మధు పల్లెటూరిలోనే ప్రాక్టీసు పెడతాడు. పెళ్ళయ్యాక రాధకు ఫిట్స్ వస్తుంటాయని మధుకి తెలుస్తుంది. మధు పినతండ్రి కూతురు పేరమ్మ (సూర్యకాంతం) భర్త పరంధామయ్య(రమణారెడ్డి)తోబాటు శేషయ్య ఇంటిలో చేరి పుండుమీద కారం చల్లినట్లు, రాధ విషయంలో శేషయ్య మధుని మోసంచేసి పెళ్ళికి ఒప్పించినట్లు అనుమానబీజం నాటుతారు. శేషయ్య భార్య సీతమ్మ(లక్ష్మీరాజ్యం) వేణు(మాస్టర్ వెంకటేశ్వర్)అనే పిల్లవానికి జన్మనిస్తుంది. పేరమ్మను ఇంట్లోంచి పంపివేయడంతో కల్లోలం సద్దు మణుగుతుంది. తన ఏడాది బిడ్డ వేణుని సీతమ్మ రాధకు మచ్చిక చేయడంతో ఆమెకు మూర్చరోగం తగ్గుముఖం పడుతుంది. వేణు తనతల్లి రాధే అనుకొని ఆమెనే “అమ్మ” అని, అసలు తల్లిని “అక్కయ్య” అని పిలుస్తుంటాడు. వేణుకు ఆరేళ్ళు వచ్చాక పేరమ్మ తన కొడుకు నారాయణ (హేమంతకుమార్) చదువు మిషతో మరలా మధు ఇంటిలో అడుగు పెడుతుంది. నారాయణ చెడుసాంగత్యంలో వేణు పాడైపోతాడని భావించిన రాధ మధు చేత వేరు కాపురం పెట్టిస్తుంది. కలతలతో రాధకు మరలా మూర్చరోగం తిరగబెడుతుంది. ఇది ఆసరాగా తీసుకున్న పేరమ్మ, రాధను చూస్తే ఆమె చచ్చిపోతుందని వేణును నమ్మించి ఆ బాబుని రాధకు దూరం చేస్తుంది. రాధ మనోవేదనతో మంచంపట్టి మృత్యుముఖానికి చేరువౌతుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆ ఇంటి పరిస్థితులు చక్కబడి అంతా ఒకటౌటంతో సినిమా సుఖాంతమవుతుంది. చదలవాడ కుటుంబరావు, పేకేటి, రామలింగయ్య, టైగర్ జోగారావు, సురభి కమలాబాయి, విజయలక్ష్మి, డ్యాన్సర్స్ మీనాక్షి, కృష్ణజ్యోతి, ఇ.వి.సరోజ, కనకతప్పెట్ల కళాకారులు అమృతయ్య, గన్న యేసుదాసు ఇతర పాత్రల్లో నటించారు. ముద్దుబిడ్డ సినిమాకు లక్ష్మణ్ గోరె ఛాయాగ్రహణం, వేణుగోపాలస్వామి నృత్యదర్శకత్వం, ఎం.వి.రాజన్ కూర్పు, కె. బాపయ్య సహాయ దర్శకత్వం నిర్వహించారు.

పెండ్యాల ‘రా(నా)గే’స్వరాలు-
తిలక్-ఆరుద్ర-పెండ్యాల ముగ్గురూ ఏ శుభముహూర్తంలో కలిశారోగాని, ముద్దుబిడ్డ సినిమా తరవాత వచ్చిన ఎం.ఎల్.ఎ, అత్తా ఒకింటి కోడలే, ఈడూ-జోడూ, ఉయ్యాల-జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం మొదలైన సినిమాలు అనుపమ సంస్థ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి ఆ చిత్రాలను సంగీతభరిత సామాజిక సమస్యల కుటుంబ చిత్రాలుగా నిలిపారు. ముద్దుబిడ్డ సినిమాకు పాటలన్నీ ఆరుద్ర రాసినవే. “చిట్టిపొట్టి వరాలమూటా గుమ్మడిపండు గోగు పువ్వు” అనే పాటతో సినిమా మొదలవుతుంది. సుశీల పాడగా జమున అభినయించే ఈ పాటను పహాడి, యమన్ మిశ్రమ రాగచ్చాయల్లో పెండ్యాల స్వరపరచారు. రెండవ పాట ఒక నృత్యగీతం. “పదరా సరదాగా పోదాం పదరా బావ చిందేసుకుంటూ” అనే ఈ పాటను జిక్కి ఆలపించారు. ఈ పాటకో విశేషముంది. 1953లో రాజ్ కమల్ కళామందిర్ బ్యానర్ లో ప్రముఖ హిందీ దర్శక నిర్మాత వి. శాంతారాం నిర్మించిన ‘తీన్ బత్తి చార్ రాస్తా’ చిత్రంలో లక్ష్మి అనే తమిళ పాత్ర పోషించిన బొంబాయికి చెందిన మీనాక్షి ఈ పాటకు నృత్యం చేయటమే ఆ విశేషం. జమున-జగ్గయ్యల పెళ్లి సందర్భంగా వచ్చే నృత్యగీతమిది. మరొక విశేషమేవిటంటే ఈ పాటకోసం గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం నుంచి కనకతప్పెట్లు తెప్పించి పేరెన్నికగల ఆ తపెట్ల వాద్యకారులు అమృతయ్య, గన్న ఏసుదాసులను కృష్ణా జిల్లా నుంచి పిలిపించి, రికార్డింగు ముందు ఆ తప్పెట్లను వేడిచేయించి జానపద బాణీలో రికార్డు చేశారు. ఆ పాటలో అమృతయ్య, గన్న ఏసుదాసు కూడా నటించారు. ఇందులో పులివేషం డ్యాన్సు జొప్పించటం కూడా ఒక విశేషమని చెప్పాలి. ఈ పాట తరవాత నాగయ్య “ఇటులేల చేశావయా ఓ దేవదేవా” అంటూ చక్రవాక రాగంలో తన మొరవినమని వేడుకోవడం కొసమెరుపు. నీలాంబరి రాగచాయల్లో లీల చేత ఆలపింపజేసిన “ఎవరు కన్నారెవరు పెంచారు నవనీత చోరుని గోపాలబాలుని” అనే మరొకపాట ఒక నేపథ్యగీతంగా సాగుతుంది. ఈ పాటను విని మల్లాది రామకృష్ణశాస్త్రి ఆరుద్రను ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది “అంతలోనె తెల్లవారె అయ్యో ఏమి సేతునే, కాంతుని మనసెంత నొచ్చెనో” అంటూ సుశీల ఆలపించిన జావళి. తొలుత “తేలు కుట్టిందోయ్ బాబు తేలు కుట్టింది” అంటూ వైదేహి కంఠంతో ఈ పాట మొదలవుతుంది. రమణారెడ్డి జోక్యంతో “తేలు కుట్టిందోయ్”కి మంగళంపాడి సభికుల కోరికమీద ఒక జావళి రూపంలో భోగంమేళపు పాటగా ఇది రూపాంతరం చెందుతుంది. ఆరోజుల్లో ఉభయగోదావరి జిల్లాలు భోగంమేళ పాటలకు ప్రసిద్ధి. అదే సంప్రదాయాన్ని గౌరవిస్తూ జావళి రూపంలో అద్భుతమైన పాటగా దీనిని ప్రదర్శించారు. ఈ పాటకు కృష్ణజ్యోతి నృత్యం చేయగా మేళకర్తగా సురభి కమలాబాయి వ్యవహరించటం గొప్పవిషయం. కమాచ్ రాగంలో ఒదిగిన ఈ నృత్యగీతంలో మృదంగం, హార్మోనియం, వాయులీనం, గంటలు వంటి వాద్యపరికరాల వాడుకను చూపుతూ భోగంమేళ సంప్రదాయాన్ని గుర్తుచేయడం తిలక్ గొప్పతనమనే చెప్పాలి. “జయమంగళ గౌరీ దేవీ దయజూడుము చల్లని తల్లీ” అనే పాట అనునిత్యమూ ప్రతి ఇంటిలో జరిగే పూజాకార్యక్రమంలో మహిళలు పాడుకొనేది. పీలూ రాగంలో స్వరపరచిన ఈ పాటను లక్ష్మీరాజ్యం మీద చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రేక్షకుల మదిని దోచుకున్నమరొక పాట “చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది” అనే సుశీల పాడిన గీతం. ఈ పాటను మాస్టర్ వెంకటేశ్వర్ మీద చిత్రీకరించారు. చిన్నపిల్లలు మాట్లాడుకునే పదాలతోనే ఈ పాటను రచించటం ఆరుద్ర రచనాపటిమకు నిదర్శనం. పడిశం పట్టిన కారణంగా సుశీల ఈ పాటను తర్వాత పాడుతానంటే ఫరవాలేదంటూ పెండ్యాల అలాగే పాడించి రికార్డు చేశారు. ఆ పాట బాగా పాపులర్ అయింది. ఇక చివరిగా ఇ.వి.సరోజ, వేణుగోపాల్ నర్తిస్తూ వచ్చే పాట “ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ” ను పిఠాపురం, వైదేహి ఆలపించారు.

మరిన్ని విశేషాలు-
ముద్దుబిడ్డ సినిమాలో సీతమ్మ పాత్రకు జి.వరలక్ష్మిని ఎంపికచేసి ఆమెతో ఎనిమిది రీళ్ల సినిమాను తిలక్ చిత్రీకరించారు. అప్పట్లో మంచి డిమాండ్ లో వున్న వరలక్ష్మి కొన్ని సంభాషణలను మార్చమని తిలక్ కు సూచించారు. తిలక్ కు దర్శక నిర్మాతగా ఇది తొలిచిత్రం కావడంతో వరలక్ష్మి తన సూచన ప్రకారం సంభాషణలు మారుస్తారని భావించింది. కానీ తిలక్ పద్ధతే వేరు. జి.వరలక్ష్మి కి ఝలక్ ఇచ్చి, ఆమెతో తీసిన ఎనిమిది రీళ్ళను తొలగించి, లక్ష్మీరాజ్యం చేత సీతమ్మ పాత్రను పోషింపజేసి సినిమా పూర్తిచేశారు. ఊహించని ఈ పరిణామానికి వరలక్ష్మి విస్తుపోయింది.

“అంతలోనే తెల్లవారే” అనే జావళికి నృత్యం చేసిన కృష్ణజ్యోతి క్యారక్టర్ నటుడు పి.జె.శర్మ భార్య, ప్రముఖ నటుడు సాయికుమార్ తల్లి. పూర్వకాలంలో దేవదాసీలు ప్రదర్శించే ఈ నృత్యరీతులను కృష్ణజ్యోతి చేసిన జావళితో పోలుస్తూ కెనడాకు చెందిన దేవేష్ సోనేజీ అనే చరిత్రకారుడు ఏకంగా ఒక పుస్తకాన్నే ముద్రించారు. ఈ పాటను తొలుత రావు బాలసరస్వతీదేవి చేత పాడించి రికార్డు చేశారు. కారణాలు తెలియదుగానీ, తరవాత సుశీల చేత పాడించి సినిమాలో చిత్రీకరణ జరిపారు.

1952లో భారతలక్ష్మీ ప్రొడక్షన్స్ వారి ప్రియురాలు సినిమాలో జగ్గయ్యను తొలిసారి హీరోగా వెండితెరకు పరిచయం చేసిన ప్రముఖ రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జగ్గయ్యను తిలక్ కు పరిచయం చేశారు. ఆ పరిచయంతోనే జగ్గయ్యను తిలక్ ముద్దుబిడ్డలో హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకి ముందు జగ్గయ్య బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో బంగారుపాప, పి.పుల్లయ్య దర్శకత్వంలో అర్థాంగి, కె.వి.రెడ్డి దర్శకత్వం లో దొంగరాముడులో సహాయ పాత్రలు పోషించారు. అయితే జగ్గయ్య పూర్తిస్థాయి హీరోగా శతదినోత్సవం జరుపుకున్న మొదటి చిత్రం ముద్దుబిడ్డ.
1971లో సీరు దర్యాని హిందీలో ముద్దుబిడ్డ సినిమాని తిలక్ దర్శకత్వంలోనే ‘ఛోటి బహు’ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో రాజేష్ ఖన్నా, షర్మీలా టాగూర్ జంటగా నటించగా, నిరూపరాయ్, ఐ.ఎస్. జోహార్, జైరాజ్ ఇతరపాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. షర్మీలాకు ముందు సైరాబానుతో ఒక పాటకూడా చిత్రీకరించారు. అనారోగ్యంతో సైరాబాను తప్పుకోవటం తో ఆ స్థానం షర్మీలా టాగూర్ కు దక్కింది. ఛోటి బహు లో ముద్దుబిడ్డ పాత్రను ప్రముఖ నటి సారిక పోషించింది. హిందీ సినిమా షూటింగు మొత్తం హైదరాబాదు హయత్ నగర్ లోని ఎల్.వి. ప్రసాద్ కు చెందిన చిత్రపురి అనే స్టూడియోలో జరిగింది.

1973లో ముద్దుబిడ్డ మాతృక ‘బిందూర్ ఛలే’ నవలను బెంగాలీలో గురు బాగ్చి, 2006లో బంగ్లా భాషలో ఎం.ఆర్. గుల్జార్ సినిమాలుగా నిర్మించారు.

ముద్దుబిడ్డలో “ఎవరు కన్నారెవరు పెంచారు” అనేది నేపథ్య గీతం. అదేపాటను ఛోటి బహు లో “కిస్ కొ కహేగా” అంటూ ఒక హరిదాసు పాడుతున్న విధంగా చిత్రీకరించారు. ఆ పాత్రను పోషించింది తెలుగు నటుడు వల్లం నరసింహరావు. అలాగే రాజేష్ ఖన్నాకు “ఏ రాత్ హై ప్యాసీ ప్యాసీ” అనే పాటను పెట్టారు. తెలుగులో జగ్గయ్యకు ఒక్క పాట కూడా లేదు.
-ఆచారం షణ్ముఖాచారి
(9492954256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap